వివక్షను జయించిన జగ్జీవన్‌

5 Apr, 2020 00:50 IST|Sakshi

ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజ కీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌. జగ్జీవన్‌ బిహార్‌లోని షాబాద్‌ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్‌ 5న శోభిరామ్, బసంతి దేవిలకు జన్మించారు. ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవిం చాడు. పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు. అయితే జగ్జీవన్‌ రామ్‌ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు.

ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశాడు. జగ్జీవన్‌ రామ్‌ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్‌ రామ్‌ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతివైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.

జగ్జీవన్‌ రామ్‌ జీవిత కాలంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు. అంతటి కష్టకాలంలో కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లింది.  52 ఏళ్లపాటు పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం. విద్యార్థి దశలోనే గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షితుడు అయి 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్‌ పోలీసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డ నాటి స్వాతంత్య్ర సమరయోధుడు.

వివక్షను ఎదుర్కొంటూ ఉపప్రధాని స్థాయికి రావడం జగ్జీవన్‌రామ్‌ అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన 1986 జూలై 6న పరమపదించారు. దళితుల హక్కులను రాజ్యాం గంలో అంబేడ్కర్‌ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి ఎప్పటికీ  మరిచిపోలేనిది. అలాగే తెలం గాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఆయన వారసురాలు మీరాకుమార్‌ పార్లమెంటులో నిర్వహించిన పాత్ర సైతం ఎంతో గొప్పది.  అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న నిజమైన దేశ నాయకుడు జగ్జీవన్‌రామ్‌. 
 (నేడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ 113వ జయంతి) 

-సంపత్‌ గడ్డం, తెలంగాణ మాదిగ జేఏసీ
అధ్యక్షుడు, కామారెడ్డి జిల్లా ‘ 78933 03516 

మరిన్ని వార్తలు