భన్సాలీ రాయని డైరీ

12 Nov, 2017 03:11 IST|Sakshi

డిసెంబర్‌ 1కి ‘పద్మావతి’ రిలీజ్‌ పెట్టుకున్నాం. డిసెంబర్‌ 9కి, 14కి బీజేపీ గుజరాత్‌ ఎన్నికల్ని పెట్టుకుంది. అవి అయ్యేవరకు ‘పద్మావతి’ రిలీజ్‌ అయ్యేలా లేదు!
‘మా డేటు మాది, మీ డేట్‌లు మీవి. మా సినిమా మాది. మీ ఎన్నికలు మీవి’ అని మా  వాళ్లు అంటే.. ఆ పార్టీ వాళ్లకు కోపం వచ్చింది!
‘‘సినిమాల్లో మీవీ మావీ అని ఉంటాయి కానీ, ఎన్నికలు ప్రతి భారతీయ పౌరుడివి. గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతుంటే, మహారాష్ట్ర వాళ్లు అవి మావి కాదు అనుకోవడం దేశద్రోహం’’ అన్నాడు గుప్తా.
 ‘‘ఎవరు సార్‌ ఈ  గుప్తా?’’ అన్నాడు మా ప్రొడక్షన్‌ మేనేజర్‌.
‘‘నాకూ తెలీదు’’ అన్నాను.

‘‘ఎక్కడ ఎన్నికలు జరిగినా అవి ప్రతి భారతీయుడివీ అన్నాడంటే’’ తప్పకుండా అతను బీజేపీ లీడరే అయి ఉంటాడు సార్‌’’ అన్నాడు.
మా మేనేజర్‌ లాజిక్‌ నాకు నచ్చింది. ఆ గుప్తా అనే ఆయన ఆల్రెడీ సెంటర్‌కి లెటర్‌ కూడా పెట్టేశాడు.. ‘రాజ్‌నాథ్‌జీ.. ఆ పద్మావతి సంగతేంటో చూడండి’ అని!
పద్మావతిని చూస్తే సంగతేంటో తెలుస్తుంది కానీ, పద్మావతిని చూడనివ్వకుండా చేస్తే సంగతేంటో తెలుస్తుందా!
తలకు గుడ్డ చుట్టుకున్న వాళ్లెవరో కొన్నాళ్లుగా మా ఇంటికి వస్తున్నారు. సినిమా రిలీజ్‌ చెయ్యడానికి వీల్లేదని చెప్పి వెళ్తున్నారు.
‘‘మీరు రాజ్‌పుట్‌లా?’’ అని అడిగాను. ‘‘కాదు భారతీయులం’’ అన్నారు!
‘‘ఇదీ భారతీయుల సినిమానే కదా’’ అన్నాను. ‘‘కాదు, నువ్వు తీసింది రాజ్‌పుట్‌ల సినిమా’’ అన్నారు! వచ్చినవాళ్లెవరో నాకు అర్థమైంది.  

పిక్చర్‌లో రాణీ పద్మావతి ఉంటుంది. ఆమె భర్త రతన్‌సింగ్‌ ఉంటాడు. వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. రాజులు, రాణుల కథలో రాజూ రాణీ ఇద్దరే ఉంటారా! వాళ్లదొక్క రాజ్యమే ఉంటుందా! ‘పద్మావతి’లో అల్లాఉద్దీన్‌ ఖిల్జీ కూడా ఉంటాడు. అతడి భార్య ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య మౌనం ఉంటుంది.
ఖిల్జీ తన భార్యతో ఎప్పుడూ మౌనంగా ఉంటాడు కాబట్టి, రాణీ పద్మావతితో ఎప్పుడైనా ప్రేమలో పడతాడేమోనని వీళ్ల భయం. ఎప్పుడూ ప్రేమలో మునిగి ఉండే పద్మావతి.. ఖిల్జీ మౌనాన్ని ఇష్టపడుతుందేమోనని ఇంకో భయం.

‘‘అలాంటిదేమీ లేదు. ఊరికే.. రాణిగారి నగలు, రాజుగారి కత్తులు చూపించి ఇంటికి పంపించేస్తాను’’ అని చెప్పినా నమ్మట్లేదు మా ఇంటికి వస్తున్న భారతీయులు.
‘‘వాళ్లిద్దర్నే చూపిస్తున్నప్పుడు మధ్యలో ఆ ఖిల్జీ ఎందుకు?’’ అన్నారు.
‘‘చిన్న ఫైట్‌ సీను పెట్టుకున్నాను’’ అని చెప్పాను.

‘‘ఒక రాజు ఇంకో రాజుతో ఫైట్‌ చెయ్యడం ఆ రాజు భార్య కోసమే కదా’’ అన్నారు!!
‘‘నమ్మండి. మీక్కావలసినవేమీ ఇందులో లేవు’’ అన్నాను.

- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు