రాజ ద్రోహమా? రాజ్యాంగ ద్రోహమా?

14 Feb, 2020 04:54 IST|Sakshi

విశ్లేషణ

మాకు జీతాలు పెంచండి అని అడిగారు ఇద్దరు కర్ణాటక పోలీసులు. కర్నాటక రాష్ట్రంలో అఖిల కర్ణాటక పోలీసు మహాసంఘ నాయకుడు శశిధర్‌ గోపాల్‌ పైన, కోలార్‌ కానిస్టేబుల్‌ బసవరాజ్‌ పైన 124ఎ కింద జూన్‌ 4, 2016న రాజద్రోహం కేసులను నమోదు చేశారు.  ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసింది. ఇటువంటి పాలకులుంటే భారత్‌ ముక్కలవుతుంది అని నినాదాలు చేసినందుకు కన్హయ్యా కుమార్‌ మీద రాజద్రోహం కేసు పెట్టారు. క్రికెట్‌ మ్యాచ్‌ నడుస్తూ ఉంటే పాకి స్తాన్‌ జట్టుకు మద్దతుగా మాట్లాడినందుకు రాజద్రోహం కేసును వాడారు. పాకిస్తాన్‌ క్రికెట్‌ క్రీడాకారుడిని పెళ్లాడిన భారతీయ మహిళపై రాజద్రోహం కేసు పెట్టనందుకు సంతోషించాలి.

2020 ఫిబ్రవరి 6న ఉత్తరప్రదేశ్‌లోని అజం ఘర్‌లో పౌరసత్వ చట్టం సవరణ సీఏఏను విమర్శించినందుకు 135 మంది మీద రాజద్రోహం కేసులుపెట్టారు. 20 మందిని అరెస్టు చేశారు. ఫిర్యా దులో పేర్కొన్న 35 మంది మీద, ఎవరో తెలియని 100 మంది మీద ఈ క్రిమినల్‌ కేసులుపెట్టడం విచిత్రం. రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు అనుసరించడం, భారత రాజ్యాంగ విలువలను తిలోదకాలిచ్చే చట్టాలు చేయడం,  భారత ప్రజాస్వామ్య మౌలిక లక్షణాలను భంగపరిచే చట్టాలు తేవడాన్ని విమ ర్శిస్తే రాజ్య ద్రోహమంటున్నారు. రాజ్యాంగానికి ద్రోహం చేయడం రాజ ద్రోహం అవుతుంది కాని పాలకులను విమర్శిస్తే రాజ ద్రోహమా? వేలాది మందిపై కుప్పలుతెప్పలుగా కేసులు పెట్టేస్తున్నారు.

ఈ చట్టంలో లోపాలను, అన్యాయాలను ఎండగట్టే వారిని జాతి వ్యతిరేకులంటున్నారు. దేశ ద్రోహులంటున్నారు. ఆర్టికల్‌ 19(1)(ఎ)లో చెప్పిన వాక్‌ స్వాతంత్య్రం కీలకమైనది. అది దేశద్రోహమా? రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను నిరసించకపోవడమే దేశద్రోహం. అసలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసేవారే రాజ్యాంగ ద్రోహులు. అదీ రాజకీయం కోసం, ఓట్ల కోసం చేసేవారు స్వచ్ఛమైన రాజకీయాలకు కూడా ద్రోహం చేసినట్టే. జార్ఖండ్‌లో పదివేలమంది మీద ఒకసారి, మరో సారి 3వేల మందిపై రాజ ద్రోహం కేసులు పెట్టారు. ప్రభుత్వం మారడం మంచిదైంది. లేకపోతే వేలమంది ప్రజలు దేశ ద్రోహనేర నిందితులుగా కోర్టుల చుట్టూతిరుగుతూ అన్యాయమైపోయేవారు.

బీదర్‌ పాఠశాలలో సీఏఏకు వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించారు. ఏబీవీపీ కార్యకర్త పోలీసు స్టేషన్‌లో రాజ ద్రోహం కేసు పెట్టారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపె ట్టారు. హెడ్‌ మిసెస్‌ను అరెస్టు చేశారు. చిన్న పిల్ల లను గంటలకొద్దీ విచారించారు. తొమ్మిదేళ్ల అమ్మాయి తల్లిని అరెస్టు చేశారు. ఆ కూతురు పక్కింటి వారి దగ్గర తలదాచుకుంటున్నది. కోర్టు బెయిల్‌ ఇవ్వలేదు. పదిహేనురోజుల పైబడి వారికి జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. పౌరసత్వం వివరాలు అడిగితే చెప్పు చూపండి, అని ఆ నాటకంలో ఒక డైలాగ్‌ ఉందట. ప్రధాని చిత్రాన్ని చెప్పుతో కొట్టారనీ ఆరోపించారు. ఒకవేళ ఆవిధంగా జరిగితే ఖండించవలసిందే. కానీ మూడేళ్ల జైలు నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించేంత ఘోరమైన రాజ ద్రోహ నేరమా? బాలలను అయిదారుగంటలపాటు పోలీసులు తమ ఖాకీ యూనిఫాంలో విచా రించడం, బాలల విషయంలో బాలల సంక్షేమ కమిటీని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం తీవ్ర మైన ఉల్లంఘనలని కర్ణాటక బాలల హక్కుల కమిషన్‌ విమర్శించింది.

రెండు వందల ఏళ్ల కిందట దిష్టి బొమ్మను తగులబెట్టడం పెద్ద పరువునష్టంగా భావించి క్రిమినల్‌ కేసు పెట్టేవారు. ముర్దాబాద్‌ డౌన్‌ డౌన్‌ నినాదాలు చేస్తే క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసులు పెట్టి జైలుకు పంపేవారు. ఆ కాలం మారింది. తీవ్రమైన అబద్ధపు విమర్శలు చేసినప్పుడే క్రిమినల్‌ కేసులు పెట్టాలని తరువాత తీర్పులు వివరిస్తున్నాయి. చీటికీమాటికీ వ్యతిరేకుల మీద, ఉద్యమకా రుల మీద రాజ ద్రోహం కేసులు పెట్టడం అన్యాయ మనీ, ఈ దుర్వినియోగాన్ని నిరోధించాలని ఎన్జీవో కామన్‌ కాజ్‌ పిల్‌ దాఖలు చేసింది. దీనిపై తీర్పు చెబుతూ ‘భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతిపదం ఇప్పటికీ చెల్లుతుంది, ఏదీ మారలేదు, మారకూడద’ని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా పేర్కొన్నారు. విమర్శకులమీద రాజకీయ వ్యతిరేకుల మీద ప్రభుత్వాలు రాజ ద్రోహం కేసు పెట్టకూడదని దీపక్‌ మిశ్రా 2016లో తీర్పుచెప్పారు.

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు