విభజన వ్యూహాలు ప్రమాదకరం

15 Dec, 2019 00:05 IST|Sakshi

జాతిహితం

ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత, పాకిస్తాన్‌ అవలక్షణాలుగా చెబుతున్న అంశాల నుంచి తనను తాను వేరుచేసుకోవడానికి భారత్‌కు 25 ఏళ్లు పట్టింది. కానీ ఇన్నేళ్లుగా దేశం సాధించిన ప్రయోజనాలన్నింటినీ దేశీయ ప్రయోజనాల పేరిట మోదీ, అమిత్‌ షాలు వృథా చేసేశారు. భారత్‌ గురించి పాకిస్తాన్‌లో పెంచిపోషిస్తూ వచ్చిన అభద్రతా భావం, వైరభావం, ఉన్మాద ప్రచారం వంటివి మన దేశంలో ప్రస్తుతం కొన్ని చర్చల్లో కనిపించడం ఆశ్చర్యకరం. దేశీయ రాజకీయాల్లో తనకు ఉపయోగపడే సాధనంగా పాకిస్తాన్‌ను భారత్‌ ఇప్పుడు కొత్తగా కనుగొంటోంది. మత ప్రాధాన్యమైన, జాతీయ భద్రతా రాజ్యాన్ని నిర్మించుకోవడంలో పాక్‌ చేసిన ప్రయోగాలను భారత్‌ ఇప్పుడు చేపట్టాలనుకోవడం వేర్పాటువాదంలోకి మనకు మనం కూరుకుపోయేలా చేస్తుంది. నిజానికి ఈ విభజన తత్వం మనం అధిగమించాల్సిన విషాదం మాత్రమే.

జాతీయ భద్రత కలిగిన దేశాన్ని మనం ఎలా నిర్వచించాలి? మన పొరుగునే ఉంటున్న పాకిస్తాన్‌ నుంచి దీనికి ఉదాహరణలను చూద్దాం. జాతీయ భద్రత లేక అభద్రత అనే భావం చుట్టూతానే పాకిస్తాన్‌కి సంబంధించిన ప్రతి విషయం నిర్మాణమవుతూ వచ్చింది. అందుకే పాక్‌ సైన్యం దేశ అధికార చట్రంలో శాశ్వతమైన, ప్రత్యేక హోదాను కలిగి ఉంది. దాని నిఘా సంస్థ అయిన ఐఎస్‌ఐకి ఎవరికీ లేనంత సంస్థాగత స్వయం ప్రతిపత్తిని కట్టబెట్టారు. పాకిస్తాన్‌లోని 21 కోట్ల మందికి పైగా ప్రజలను ఎవరైనా ఎలా భ్రమల్లో పెట్టగలరు? అంటే ఒక ప్రమాదకరమైన దెయ్యాన్ని చూపించడం ద్వారా ఇన్ని కోట్ల మందిని భయపెడుతూ పాక్‌ తన పబ్బం గడుపుకుంటూ వచ్చింది. జాతీయ భద్రత కలిగిన దేశ నిర్మాణం అంటూ సమర్థించుకోవాలంటే ముందుగా మీరు ప్రజల్లో భయాన్ని పాదుకొల్పాలి. పాక్‌ ప్రజల పాలిట భయంకరమైన రాక్షసిగా భారత్‌ని పాక్‌ విజయవంతంగా చిత్రిస్తూ వచ్చింది. భారత్‌ బూచిని చూపించడం ద్వారానే పాక్‌ ప్రభుత్వాలు సైన్యంపై అంత ఖర్చు పెట్టగలిగాయి. పాక్‌ గురించి నేను సందర్భానుసారం రాస్తూవచ్చిన అనేక కథనాల్లో ఒక దాంట్లో ఇలా పేర్కొన్నాను. ‘వాఘా బోర్డర్‌ వద్ద మీ పాస్‌పోర్టులో స్టాంప్‌ వేస్తున్న ఇమిగ్రేషన్‌ అధికారి తలపై ఒక నోటీసు వేలాడుతూ ఉంటుంది. ఆ నోటీసులో ఇలా రాసి ఉంటుంది. మేం అందరినీ గౌరవిస్తాం. అందరినీ అనుమానిస్తాం’.

దీనర్థం ఏమిటంటే జాతీయ భద్రతా ప్రభుత్వం అంటేనే అనుమానాస్పదమైన ప్రభుత్వం అనే. పైగా, ఈ కారణం వల్లే పాక్‌ అంత అస్తవ్యస్తతలో ఉంటోంది. దివాలా తీసిన, రుణాల కోసం సాగిలబడుతున్న ఆర్థిక వ్యవస్థ, విచ్ఛిన్నమైపోయిన సమాజం, పతనమవుతున్న సామాజిక సూచికలు, జాతీయ సంపదలను టోకున అమ్మిపడేయడం, పొరుగునున్న ‘అంకుల్‌ చైనా’కు  రక్షణ ఫీజుల కింద దేశ భూభాగాన్నే అప్పగించేయడం, జిహాద్‌ యూనివర్సిటీ, ప్రపంచ వలస సరఫరా కేంద్రం వంటి వాటికి పేరొందడం ఇవీ పాక్‌ లక్షణాలు. ప్రత్యేకించి పొరుగుదేశాలు పాక్‌ నుంచి నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఏమిటంటే.. ‘నాలాగా ఎవరూ ఉండవద్దు’ అనే.
ప్రస్తుత భారతదేశం సరిగ్గా దీనికి సాక్ష్యాధారంగా నిలబడుతోంది. ఎందుకంటే పాక్‌ ఇస్తున్న పై సందేశరూపంలోని హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవద్దని మనం నిర్ణయించుకున్నాం. మరోవైపున, 2015 తదుపరి పాకిస్తాన్‌ చిక్కుకున్న స్వీయ భావావరోధంలో మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. 2014 నాటికి పాకిస్తాన్‌ మన బహిరంగ ప్రసంగాలు, చర్చల్లో కనిపించకుండా పోయింది. పరుగుపందెంలో భారత్, పాక్‌ కంటే ఎంతో ముందుకెళ్లింది. పాక్‌ చికాకు కలిగించే రాజ్యంగా దిగజారిపోయింది.

తాజాగా పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ, జార్ఖండ్‌ ఎన్నికల ప్రచార సందర్భంగా పాక్‌ గురించి గత వారం  పాకిస్తాన్‌ పేరును పదే పదే చర్చిస్తూ వచ్చారు. సర్జికల్‌ దాడులు, బాలాకోట్‌ వైమానిక దాడి సమయంలో కాంగ్రెస్‌ వైఖరి సరిగ్గా పాకిస్తాన్‌ వైఖరితో ఎలా సరిపోలిందంటూ హోంమంత్రి అమిత్‌ షా ప్రశ్నించారు. ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఇదే వైఖరిని ప్రతిబింబించారు. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌ ఇప్పుడు పాక్‌ పేరును తరచుగా ప్రస్తావిస్తూ వస్తోందన్న విషయం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పుల్వామా ఘటన నేపథ్యంలో మీరు మా వైపు ఉంటారా లేక పాక్‌ వైపు ఉంటారా అనే అంశం చుట్టూనే 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం నడిచింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర వంటి నాలుగు రాష్ట్రాల్లో జరిపిన బహిరంగ సభల్లో మోదీ పాక్‌ పేరును 90 సార్లు ప్రస్తావించారు. తర్వాత హరియాణా, మహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఇది కొనసాగింది. చాలా కాలం తర్వాత  మన బహిరంగ చర్చల్లో, మన రోజువారీ జీవి తంలో కూడా పాకిస్తాన్‌ పేరును ప్రస్తావిస్తున్నాము. 

ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చ మొత్తంగా పాకిస్తాన్, దేశ విభజన ప్రాతిపదికపైనే నడిచింది. పాకిస్తాన్‌లో మైనారిటీలతో వ్యవహరిస్తున్న తీరు మనకు చర్చనీయాంశమైంది. అందుచేత పాకిస్తాన్‌లోని ముస్లిమేతర మైనారిటీల క్షేమాన్ని పట్టించుకోవలసిన ప్రత్యేక బాధ్యత భారత్‌పై పడినట్లుగా ఉంది. పాకిస్తాన్‌ని సహజంగానే ముస్లింల నివాస స్థలంగా ఎలా పరిగణిస్తూ వస్తున్నారో భారత్‌ కూడా ఇప్పుడు హిందువుల నివాసస్థలంగా ఉండాలనే వాతావరణం దేశంలో బలపడుతోంది. భారత్‌ గురించి పాకిస్తాన్‌లో పెంచిపోషిస్తూ వచ్చిన అభద్రతా భావం, వైరభావం, ఉన్మాద ప్రచారం వంటివి మన దేశంలో ప్రస్తుతం కొన్ని చర్చల్లో కనిపించడం ఆశ్చర్యకరం. రాజకీయ చర్చలను దేశ విభజన వద్దకు తీసుకుపోవడం, విభజన నాటి తప్పులను సరిదిద్దుతామని హామీ ఇవ్వడం, అతిపెద్ద శత్రువును అప్పట్లో ఊరికే వదిలేశామని విమర్శలు చేయడం.. వంటి పరిణామాలను చూస్తుంటే పాకిస్తాన్‌ను భారత్‌ కొత్తగా కనిపెడుతున్నట్లు కనిపిస్తోంది. 

భారత్, పాకిస్తాన్‌ దేశాల మధ్య అంతరం ఎంత దూరం పోయిందంటే ప్రపంచంలో ఏ ఒక్కరూ చివరకు చైనాతో సహా మన రెండు దేశాలను ఒకే వైఖరితో చూడడం లేదు. భారత్‌–పాక్‌ మధ్య ఉన్న హైపనేషన్‌ ఇప్పుడు పూర్తిగా చెరిగిపోయింది. అంటే భారత్, పాక్‌లను కలిపి చూసే పరిస్థితి మాయమైపోయిందని అర్థం. ఒకప్పుడు పాక్‌ అవలంబించిన వైఖరిని ఇప్పుడు మనం తవ్వి తలకెత్తుకుంటున్నామా అనిపిస్తోంది. ఎందుకంటే మొదట అభద్రతా భావాన్ని పెంచిపోషించకుంటే మీరు జాతీయ భద్రతా రాజ్యాన్ని ఎలా నిర్మించగలరు? అందుకే ఈ అవసరం కోసం మీకు భయపెట్టే శత్రువు అవసరం. అది పాకిస్తానే మరి. ఇప్పటికి అది అంత భయపెట్టకపోవచ్చు కానీ పాన్‌ ఇస్లామిజం అనే పెద్ద ప్రమాదాన్ని చూసినప్పుడు అది భయంకర రాక్షసిగా మారక తప్పదు. అదే ఇప్పుడు అనుమానాన్ని కలిగిస్తుండగా, భారత్‌లోని 20 కోట్ల మంది ముస్లింలకేసి చూస్తే అతిపెద్ద ఉపద్రవంలాగే కనిపిస్తారు మరి.

1947లో రెండు దేశాలు కొత్త చరిత్ర దిశగా అడుగులేయడం ప్రారంభించిన నాటి పరిస్థితిని సమీక్షిద్దాం. మన రెండు దేశాలూ విభిన్నమైన మార్గాలను ఎంచుకున్నాయి. ఒకటి ఉదారవాద రాజ్యాంగ గణతంత్ర రాజ్యంగా మారగా, మరొకటి మెజారిటీవాద, మతతత్వ, సైనిక రాజ్యంగా మారింది. ఒకటి అలీన రాజ్యంగా మారగా, మరొకటి ఆయా కాలాల్లో ప్రాబల్యంలోకి వచ్చిన సైనిక కూటములలో చేరింది. కేవలం 25 సంవత్సరాలలోపే, మతప్రాధాన్య రాజ్యంగా తనను తాను పేర్కొన్న పాకిస్తాన్‌ తన భూభాగంలో సగానికి పైగా జారవిడుచుకుంది, మరో కొత్త దేశం బంగ్లాదేశ్‌ రూపంలో ఉనికిలోకి వచ్చింది. చివరకు ఆ కొత్త దేశం కూడా తన మాతృదేశం నమూనాలోకే వెళ్లిపోయి, ఇస్లాంని తన మెజారిటీ వాద భావజాలంగా ఎంచుకునేసింది. దానికి తోడుగా మిలిటరీ పాలకులూ పుట్టుకొచ్చారు. రెండు దశాబ్దాలకుపైగా అప్పులను యాచిం చడం, దారిద్య్రంలో కూరుకుపోవడం జరిగాక, అనేక మూడో ప్రపంచ దేశాల చెడు లక్షణాలకు బంగ్లాదేశ్‌ ఒక నమూనాగా నిలిచిపోయింది. అధిక జనాభా, దారిద్య్రం అనే సాంక్రమిక వ్యాధుల దేశంగా దానికి పేరుపడిపోయింది. ‘ఆల్‌ ది ట్రబుల్‌ ఇన్‌ ది వరల్డ్‌’ అనే తన సంకలనంలో అమెరికన్‌ ప్రముఖ రచయిత పీజే ఓ రూర్కే అధిక జనాభాతో వచ్చే సమస్యలకు బంగ్లాదేశ్‌నే ఉదాహరణగా పేర్కొనడం భావోద్వేగాలను రెచ్చగొట్టింది. పైగా అది ఒక అసందర్భ వ్యాఖ్య కూడా. కానీ అంత దూకుడు రచనలో కూడా రూర్కే ఒక వాస్తవాన్ని పదునైన వాక్యంలో చెప్పాడు. ‘తినడానికి తగినంత ఆహారం లేని దేశం, పండకముందే పంటను వాసన చూస్తున్న దేశం ఎలా మనగలుగుతుంది?‘ 

కానీ, చాలా త్వరలోనే ఆ కొత్త దేశం భారత్‌ వంటి దేశాన్ని పోలిన లౌకిక, ఆధునిక ఆదర్శ రాజ్య నమూనావైపు నడక మార్చుకుంది. మరో రెండు దశాబ్దాలలోపే, బంగ్లాదేశ్‌ ప్రతి సామాజిక, ఆర్థిక సూచికలోనూ పాక్‌కంటే ఎంతో ముందుకు సాగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 48 ఏళ్లక్రితం పాక్‌ పీడన నుంచి తన విముక్తిలో సహాయం చేసిన భారత్‌నే అది ఇప్పుడు వెనుకకు నెడుతోంది. ఆకలిదప్పులకు, బహిరంగ మలవిసర్జనకు నమూనాగా రూర్కే వ్యాఖ్యానించిన ఆ బంగ్లాదేశ్‌ ఇప్పుడు ఈ రెండు శాపాలను భూస్థాపితం చేసిపడేసింది. బంగ్లాదేశ్‌ ఇప్పుడు బహిరంగ మల విసర్జన నుంచి దాదాపుగా బయటపడింది. దాని జనాభా వృద్ధి రేటు గణనీయంగా అంటే భారత వృద్ధి రేటు స్థాయికి.. ఒక్కశాతానికి పడిపోయింది.  పాకిస్తాన్‌ నుంచి కొని తెచ్చుకున్న భావజాల వైరస్‌ను తుంగలో తొక్కి బయటపడిన దాని ఫలితమే ఇదంతా మరి.
1985లో పాకిస్తాన్‌కు మొట్టమొదటి సారిగా సందర్శించినప్పుడు అదెంత మెరుగైన స్థితిలో ఉండేదో చూసి ఆశ్చర్యపోయాను. ఆనాటికి దాని తలసరి ఆదాయం భారత్‌ కంటే 65 శాతం ఎక్కువగా నమోదయ్యింది. కానీ 2019లో భారత్‌ తలసరి ఆదాయం పాక్‌ కంటే 60 శాతం ఎక్కువగా నమోదైంది. ఇదెలా జరిగింది? పాకిస్తాన్‌ సామాజిక–ఆర్థిక వృద్ధి సూచికలు ఎంతగా కుప్పగూలిపోయాయంటే ఐఎమ్‌ఎఫ్‌ నుంచి ఆ దేశం 13వసారి ఉద్దీపన ప్యాకేజీని అందుకోవాల్సి వచ్చింది.

ఇక పాక్‌ జనాభా వృద్ది రేటు భారత్, బంగ్లాదేశ్‌ల కంటే రెట్టింపు పెరిగింది. కాని ఇప్పటికీ అది జాతీయ భద్రతా రాజ్యంగా సైనికాధిపత్యంతోనే ఉంటోంది. ఎంతలా అంటే పాక్‌ ప్రధాని తన ఆర్మీ చీఫ్‌కు సలామ్‌ చేసేంతగా. భారత్‌ కంటే ఏ రంగంలో అయినా పాక్‌ ముందుందంటే బహుశా అణ్వాయుధాల సంఖ్యలోనే కావచ్చు. కానీ భారతీయ వ్యూహాత్మక అధ్యయనాల నిపుణుడు దివంగత కె. సుబ్రహ్మణ్యం తరచుగా ఒక మాట చెప్పేవారు, నీ దేశ రక్షణకు తక్కువ ఆయుధాలు అవసరమైనప్పుడు ఎందుకు ఎక్కువ ఆయుధాలకోసం వెంపర్లాడతావు? కాగా, దేశీయ రాజకీయాల్లో తనకు ఉపయోగపడే సాధనంగా పాక్‌ను భారత్‌ ఇప్పుడు కొత్తగా కనుగొంటోంది. నిజానికి ఇది పేలవమైన ఎంపిక. ఇప్పుడు పాక్‌తో మనల్ని మనం పోల్చుకోవాలంటే భారత్‌ తన కాళ్లు నెప్పి పెట్టేలా ముందుకు వంగాల్సి ఉంటుంది. మరోమాటలో చెప్పాలంటే.. మత ప్రాధాన్యమైన, జాతీయ భద్రతా రాజ్యాన్ని నిర్మించుకోవడంలో పాక్‌ చేసిన ప్రయోగాలను భారత్‌ ఇప్పుడు చేపట్టాలనుకోవడం వేర్పాటువాదంలోకి మనకు మనం కూరుకుపోయేలా చేస్తుంది. నిజానికి ఇది మనం అధిగమించాల్సిన విషాదం మాత్రమే.


శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

>
మరిన్ని వార్తలు