నైతిక పతనం దిశగా ఐపీఎస్‌

15 Sep, 2019 01:15 IST|Sakshi

జాతిహితం

ఈ వారం చర్చనీ యాంశం.. భారత్‌ పోలీసు రాజ్యంగా ఉంటోందా? ఈ ప్రశ్నకు మూడు సత్వర స్పందనలు ఇలా ఉండవచ్చు: ‘కాకపోవచ్చు’, ‘అవును’ లేదా ‘ఇంకా కాదు’. దీనికి మీరు మరికొన్ని ప్రశ్నలను కూడా సంధించవచ్చు. ‘ఎందుకు’, ‘ఎలా’, ‘ఎప్పుడు’. ఈ స్పందనలను దాటి చూస్తే  ఇండియన్‌ పోలీసు సర్వీస్‌.. ఇండియన్‌ పొలిటికల్‌ సర్వీసుగా రూపాంతరం చెందిందనేదే వాస్తవం. మన దేశంలో పోలీసు–రాజకీయనేతల మధ్య సంబంధం కొత్తదేమీ కాదు. కానీ ఇది నాటకీయంగా మరింత హీనస్థితికి చేరుకుంది. ఒక్కమాటలో  చెప్పాలంటే ఐపీఎస్‌ ఇప్పుడు తన నైతిక, వృత్తిగతమైన ధృతిని కోల్పోయింది. పోలీసు రాజ్యం (పోలీస్‌ స్టేట్‌)కి ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో మరింత కఠినమైన అర్థం ఉంది. రాజకీయ, పోలీసు బలగాలచే తన పౌరుల కార్యకలాపాలపై రహస్యంగా నిఘా పెట్టి, పర్యవేక్షించే నిరంకుశ రాజ్యం అని దీనర్థం. మనమయితే ఇంకా ఆ దశకు చేరలేదు. భారత్‌ ఒక పోలీసు రాజ్యంగా ఇంకా మారి ఉండకపోవచ్చు కానీ పోలీసులు చట్టంగా ఉంటున్న దేశంగా మారుతోంది.

ప్రస్తుతం పోలీసులు– రాజకీయనేతల మధ్య బంధం ఐఏఎస్‌లు, న్యాయవ్యవస్థను కూడా తోసిరాజంటోంది. దీనికి కొన్ని ఉదాహరణలను చూపించవచ్చు.1. తబ్రెజ్‌ అన్సారీ కేసు. జార్ఖండ్‌ వాసి అయిన 24 ఏళ్ల తబ్రెజ్‌ను సైకిల్‌ దొంగతనం చేశాడనే అనుమానంతో మూక చచ్చేంతవరకు చావబాదింది. కానీ ఆ రాష్ట్ర పోలీసులు మాత్రం మూక హింస వల్ల కాకుండా, గుండెపోటు వల్ల అతడు చనిపోయినట్లుగా కేసు తీవ్రతను తగ్గించి చూపారు. కానీ చైతన్యవంతులైన వైద్యుల బృందం దీన్ని తప్పుడు కేసుగా ఆరోపించింది.2. రాజస్తాన్‌లో పెహ్లూ ఖాన్‌ కేసు. గోమాంసాన్ని ఇంట్లో ఉంచుకున్నాడనే ఆరోపణతో మూక తనను చావబాది చంపినట్లు కెమెరా సాక్ష్యం ఉన్నప్పటికీ దాన్ని పోలీసులు సాక్ష్యంగా సమర్పించలేదు. దీంతో కోర్టు ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిం చింది. 3. ఉన్నావో అత్యాచార ఘటన. యూపీలోని ఉన్నావో నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని దళిత యువతి ఆరోపిస్తే ఆమెకు న్యాయం చేయడానికి బదులుగా పోలీసులు ఆమె తండ్రిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టగా ఆయన కస్టడీలోనే చనిపోయాడు. పైగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడంటూ తనపైనే పోలీసులు కేసుపెట్టారు. తర్వాత బాధితురాలిపై, ఆమె లాయర్‌పై జరిగిన హత్యాప్రయత్నం ప్రజాగ్రహానికి దారి తీయడంతో సీబీఐ ఈ కేసులో ముగ్గురు పోలీసులపైనా నేరారోపణ చేసింది.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఢిల్లీ పోలీసులు కశ్మీర్‌ పౌర హక్కుల కార్యకర్త, రాజకీయనేత అయిన షెహ్లా రషీద్‌పై తాజాగా రాజద్రోహం కేసు పెట్టారు. ఒక వ్యక్తి చేసిన ఆరోపణ దీనికి మూలం. ప్రభుత్వం కాకుండా ప్రైవేట్‌ వ్యక్తుల ఆరోపణలు ఆధారంగా దేశద్రోహ కేసులను నమోదు చేయడం కన్నా మించిన న్యాయ పరిహాసం మరొకటి ఉండదు. దీంతో సంబంధిత పౌరులను తీవ్రంగా వేధించవచ్చు, విచారణ పేరుతో ఆర్థికంగా కుంగదీయవచ్చు. పైగా కన్హయ కుమార్‌ ఉదంతంలోవలే విచారణ లేకుండానే నెలల తరబడి జైలులో గడపవలసి రావచ్చు. ప్రభుత్వంపై, ఉన్నతాధికారులపై, సాయుధ బలగాలపై విమర్శ చేసినంత మాత్రాన దేశద్రోహం కిందికిరాదంటూ ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ గుప్తా స్పష్టం చేసిన వారంలోనే షెహ్లా రషీద్‌పై దేశద్రోహ కేసు పెట్టడం గమనార్హం. దశాబ్దాలుగా మన రాజ కీయ వర్గం పార్టీ భేదాలు లేకుండా పోలీసులను యూనిఫాంలోని మాఫియాలాగా వాడుకుంటూ, వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వస్తోంది. అయితే దీనికి రాజకీయనేతలను మాత్రమే తప్పు పట్టాలా లేక పోలీసు శాఖను నియంత్రిస్తున్న ఐపీఎస్‌కు దీంట్లో భాగం లేదా? 

నిజాయితీని అంటిపెట్టుకుని ఉన్న ఏ సీనియర్‌ పోలీసు అధికారి అయినా కాస్త బుర్రను ఉపయోగించినట్లయితే, పైన పేర్కొన్న కేసులు ఇంత దరిద్రమైన ముగింపునకు చేరుకోవన్నది వాస్తవం. న్యాయాన్ని ప్రసాదించాల్సింది కోర్టులు మాత్రమే అని నటించడం కంటే నేరచర్య మరొకటి ఉండదు. న్యాయప్రక్రియ తనంతటతాను శిక్షగా మారిపోతున్నందున దేశంలో ఏ పౌరుడైనా, తగిన వనరులున్న వారైనా సరే సంవత్సరాల తరబడి కేసుల్లో భాగంగా బాధపడాల్సి వస్తోంది. అవినీతి కేసులనుంచి మూక హింస ఘటనల దాకా రాజకీయనాయకులు ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్రంగా పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించగలిగిన పక్షంలో న్యాయస్థానాలు అసంఖ్యాకమైన కేసుల విచారణ భారంతో నలిగిపోయే పరిస్థితే ఉండేది కాదు. అధికారంలో ఉన్న నేతల అభీష్టం మేరకు అమాయకులపై కేసులు మోపటం, వారు మద్దతిస్తున్న పార్టీలను వీడి అధికార పార్టీలోకి చేరేంతవరకు వారిని వేధిం చడం వంటి చర్యలు తప్పు అనీ, అలాంటి చర్యలకు నాయకత్వం పాల్పడవద్దని చెప్పగల దమ్ము ప్రస్తుతం ఐపీఎస్‌లో పూర్తిగా కొరవడినట్లే కనిపిస్తోంది. దీనికి భిన్నంగా గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎస్‌ దేశంలోని రాజకీయ యజమానుల సేవకే నిబద్ధత చూపుతున్న సర్వీసుగా మారిపోయింది. నేతల ఒత్తిళ్ల ఫలితంగా పోలీసులు ఇప్పుడు దేన్నయినా తమ్మిని బమ్మిని చేసే స్థితికి పతనమయ్యారు.

అవినీతి కేసులను తారుమారు చేయగలరు. మూకహత్యలో చనిపోయిన వ్యక్తిది గుండెపోటు మరణంగా మార్చేయగలరు. అత్యాచార బాధితురాలి నిరుపేద తండ్రిని కరడుగట్టిన నేరస్థుడిగా ముద్రవేసి భూమ్మీదే లేకుండా చేయగలరు. ప్రైవేట్‌ కంప్లయింటును కూడా రాజద్రోహ కేసుగా తారుమారు చేసేయగలరు. పీవీ నరసింహారావు తన ప్రత్యర్థుల పనిపట్టడానికి ప్రయోగించిన జైన్‌ హవాలా కేసుల నుంచి సీబీఐ తదితర నిఘా సంస్థల వృత్తిపర క్షీణత తొలి సంకేతాలు మొదలయ్యాయి. ప్రముఖ రాజకీయనేతలు, ఉన్నతాధికారులు, అమాయకుల వ్యక్తిత్వ హననం ఆనాటినుంచే మొదలై ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. అనేకమంది యువ ఐపీఎస్‌ అధికారులు ఆదర్శవాదాన్ని రంగరించుకుని సర్వీసులోకి చేరుతుంటారు కానీ కాలక్రమంలో వారు ఆ లక్షణాన్ని పోగొట్టుకుని రాజీపడిపోవడం సహజమైపోతోంది. దీంతో సింహంలా ఉండాలనుకునేవాళ్లు చివరికి క్యారికేచర్లుగా మారిపోతున్నారు.

శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
 

మరిన్ని వార్తలు