మరో అయోధ్య కానున్న ‘పౌరసత్వం’

10 Dec, 2019 00:46 IST|Sakshi

జాతిహితం

ఆర్థిక కారణాలతో అస్సాంలోకి ముస్లింల వలస ప్రారంభం కాగా, విభజన తర్వాత హిందువుల వలస దానికి తోడైంది. 1947కి ముందే వచ్చిన ముస్లింలు చాలావరకు అస్సాంలోనే ఉండిపోగా, తర్వాత హిందువులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేరారు. దీంతో మొత్తం భూభాగంలోని జాతుల సమతూకం మారిపోయింది. జాతీయ పౌర పట్టిక ప్రకారం అనర్హులుగా తేలిన 19 లక్షలమందిలో 60 శాతం వరకు ముస్లిమేతరులే.

ఈ చిక్కుముడిని విప్పడం కష్టమే కాబట్టి పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ ప్రజ లను విభజించే ఎత్తుగడతో తీసుకొస్తోంది. ప్రత్యర్థులు వెంటనే ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తారు. ముస్లింలను బుజ్జగిస్తున్నవారిగా బీజేపీ వారిపై ఆరోపణలకు దిగుతుంది. అంటే వచ్చే మూడు దశాబ్దాల్లో పౌరసత్వ సవరణ అంశం మరొక రామ మందిరం, లేక ఆర్టికల్‌ 370గా మారిపోతుంది. దీని వెనుక ఉన్న విభజన రాజకీయాలివే.

గత కొన్ని రోజులుగా పౌరసత్వ చట్టం, 1955 లేక పౌరసత్వ సవరణ బిల్లు, 2019 (సీఏబీ)కు తాజా సవరణలపై అనేకమంది మద్దతిస్తూ దేశవిభజనను తిరిగి సమీక్షించాలని కోరుతున్నారు. పూర్తికాని వ్యవహారాన్ని మళ్లీ సమీక్షించాలి అనే మాట చెప్పనప్పటికీ, పూర్తి న్యాయం, ముగింపు, ముస్లిమేతర మైనారిటీలకు న్యాయం చేయడం అని చెప్పడంలో వీరు వెనుకాడటం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని మైనారిటీలకు చేసిన వాగ్దానాన్ని పౌరసత్వ సవరణ బిల్లు నెరవేరుస్తుందని వీరు నొక్కి చెబుతున్నారు. ఆ వాగ్దానం చర్చనీయాంశమే.

ఉపఖండంలోని ముస్లింలకు మాతృభూమి కావాలనే ఊహను ప్రతిపాదించి, దాని కోసం పోరాడి, చివరకు పాకిస్తాన్‌ని సాధించడంలో విజయం పొందారనడంలో సందేహమే లేదు. విభజనకాలంలో మతపరంగా ప్రజలను అటూ ఇటూ మార్పిడి చేసుకున్నారన్నదీ వాస్తవమే. అయితే ప్రజల మార్పిడి ప్రక్రియ రక్తపాతంతో, మారణ కాండతో, అత్యాచారాలతో సాగింది. కొన్నేళ్లలోపే ఉపఖండం పశ్చిమప్రాంతంలో ఈ ప్రజల మార్పిడి ప్రక్రియ పూర్తయింది, దాదాపు ముగిసిపోయింది. భారత్‌ భూభాగంలోని పంజాబ్‌లో, ముస్లింలు, పాకిస్తాన్‌ భూభాగంలో హిందువులు, సిక్కులు చాలా తక్కువమంది మాత్రమే ఉండిపోయారు. 

1960ల మధ్య వరకు విభజనకు సంబంధించి కొన్ని వింత ఘటనలు కొనసాగాయి. పాకిస్తాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్‌ అసిఫ్‌ ఇక్బాల్‌ 1961లో మాత్రమే పాకిస్తాన్‌కు వలస వెళ్లాడు. అప్పటివరకు అతడు హైదరాబాద్‌ జట్టు తరపున ఆడేవాడు. 1965 యుద్ధ కాలంలో చిన్న అలజడి చెలరేగింది కానీ త్వరలోనే అది ముగిసిపోయింది. కానీ తూర్పు భారత్‌లో విభిన్న చిత్రం చోటు చేసుకుంది. అనేక సంక్లిష్ట కారణాల రీత్యా తూర్పు పాకిస్తాన్, భారత్‌కి చెందిన పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురల మధ్య జనాభా మార్పిడి పూర్తి కాలేదు. బెంగాల్‌లోని అనేక వర్గాలకు చెందిన ముస్లింలు.. అలాగే తూర్పు బెంగాల్‌(పాకిస్తాన్‌)లోని హిందువులు భారత్‌లోనే ఉండిపోయారు. కానీ ఎత్తుకు పైఎత్తులు చోటు చేసుకోవడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగాయి. 

అందుకే ఇలాంటి ఘటనలను నిలిపివేయడానికి 1950లోనే జవహర్‌లాల్‌ నెహ్రూ, నాటి పాకిస్తాన్‌ ప్రధాని లియాఖత్‌ ఆలి ఖాన్‌ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే చారిత్రాత్మకమైన నెహ్రూ–లియాఖత్‌ ఒప్పందం. ఈ ఒప్పందంలో అయిదు ప్రధాన అంశాలున్నాయి
1. ఇరుదేశాలూ తమ భూభాగంలోని మైనారిటీలను పరిరక్షిస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాలు, సాయుధ బలగాల్లో చేర్చుకోవడంతోపాటు అన్ని హక్కులు, స్వేచ్ఛలను వారికి కల్పిం చాలి.
2. దాడుల కారణంగా తాత్కాలికంగా గూడు కోల్పోయి, వలసపోయినప్పటికీ, తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని భావిస్తున్నవారికి ఇరుదేశాలూ ఆశ్రయం కల్పించి, పరిరక్షించాలి.
3. అలా వెనక్కు తిరిగి రాని వారిని రెండు దేశాలూ తమతమ పౌరులుగానే భావిం చాలి.
4. ఈలోగా, ఇరు దేశాల్లో ఉండిపోయిన వారు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు, ఇప్పటికీ తామున్న దేశం నుంచి మరొక దేశంలోకి వలస వెళ్లాలని కోరుకుంటున్నవారికి ఇరుదేశాలూ రక్షణ కల్పించి సహకరించాలి.
5. ఇరుదేశాలు శాంతిభద్రతలను కాపాడటానికి నిజాయితీగా ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే ప్రజలు తాము కోరుకున్న భూభాగాలపై సురక్షితంగా ఉన్నట్లు భావించగలరు.

ఈ ఒప్పంద సూత్రాలను బట్టే, భారత్‌ తన జనాభా గణనను చేపట్టి, 1951లో ప్రథమ జాతీయ పౌర పట్టికను (ఎన్‌ఆర్సీ) రూపొం దించింది. భారత్‌లో ముస్లిం జనాభా శాతం.. హిందువులు, సిక్కుల జనాభా కంటే కాస్త అధికంగానే పెరుగుతూవచ్చిందని, అదే సమయంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉంటున్న హిందువుల జనాభా వేగంగా తగ్గుతూ వచ్చిందని ఇరుదేశాల జనగణన డేటా సూచిస్తోంది. అంటే హిందూ మైనారిటీలు పాక్‌ను, బంగ్లాదేశ్‌ను వదిలిపెట్టి భారత్‌లో స్థిరపడ్డారని చెప్పవచ్చు.

దేశవిభజన సమయంలో పూర్తి చేయని కర్తవ్యానికి సమాధానంగా పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడానికి కారణం ఇదేనని బీజేపీ చెబుతుండవచ్చు. పాకిస్తాన్‌ నెహ్రూ–లియాఖత్‌ ఒడంబడికలోని సూత్రాలను పాటించి గౌరవించడంలో విఫలమైందని, దీంతో భారత్‌ మైనారిటీల సహజ నిలయంగా మారిందని పాక్‌లో మైనారిటీలను నేటికీ పీడిస్తున్నారని బీజేపీ వాదన. ఇక్కడే మనం సంక్లిష్టతల్లోకి కూరుకుపోవడం ప్రారంభిస్తాం. మొదట, భారత్‌ నిర్మాతలు తమ లౌకిక రిపబ్లిక్‌ ఇలా ఉండాలని కోరుకున్న చట్రంలో జిన్నా రెండు దేశాల థియరీ ఇమడలేదు. రెండు, ఏ దశవద్ద పాత చరిత్ర ముగిసి కొత్త చరిత్ర ప్రారంభం కావాలి? ఇక మూడోది, దేశీయతతో కూడిన జాతీయ సమానార్థకమైనది ఏది? మతం జాతి, భాషతో సమానమైనదా?

తూర్పు భారత్‌లో ప్రత్యేకించి అస్సాంలో వలసల స్వభావం, సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని దశాబ్దాల వెనక్కు వెళ్లడం అవసరం. అస్సాం  సాపేక్షికంగా తక్కువ జనసాంద్రత కలి గిన విశాలమైన సారవంతమైన భూములతో, సమృద్ధిగా జలవనరులతో కూడిన ప్రాంతం. అందుకే ఈ రాష్ట్రంలోకి 20వ శతాబ్దిలో తూర్పు బెంగాల్‌ నుంచి తొలి దశ వలసలకు దారితీసింది. వీరిలో చాలామంది ఆర్థిక కారణాలతో వచ్చినవారే. భూములకోసం, మంచి జీవితం కోసం వీరొచ్చారు. ఇలా మన దేశంపైకి వలసరూపంలో చేసిన ఆక్రమణ గురించి ప్రస్తావించిన తొలి వ్యక్తి బ్రిటిష్‌ సూపరెంటెండెంట్‌ సీఎస్‌ ముల్లన్‌. 1931లో అస్సాంలో జనగణన కార్యకలాపాలను ఈయనే పర్యవేక్షించారు. తన మాటల్లోనే చెప్పాలంటే..

‘బహుశా, గత 25 ఏళ్లలో అస్సాం ప్రావిన్స్‌లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘటన, అస్సామీయుల సంస్కృతి, నాగరికతలను పూర్తిగా ధ్వంసం చేసి అస్సాం భవిష్యత్తునే శాశ్వతంగా మార్చివేయగలిగిన ఘటన ఏమిటంటే, తూర్పు బెంగాల్‌ జిల్లాల నుంచి ప్రత్యేకించి మైమెన్‌సింగ్‌ జిల్లా నుంచి భూదాహంతో వలసవచ్చిన ముస్లింల భూ ఆక్రమణే’ అని సీఎస్‌ ముల్లాన్‌ పేర్కొన్నారు. ‘ఎక్కడ శవాలు ఉంటే అక్కడికి రాబందులు వచ్చి కూడతాయి. ఎక్కడ బీడు భూములుంటే అక్కడికల్లా మైమెన్‌సింగ్‌ జిల్లా నుంచి వలస వచ్చినవారు గుమికూడతార’ని ఆయన ముగించారు. మరి అస్సాం ప్రజల జాతి, భాషా పరమైన ఆందోళనలు దీన్ని చూస్తే ఏమౌతాయో మరి. 

ఆర్థిక కారణాలతో అస్సాంలోకి ముస్లింల వలస ప్రారంభంలోనే సమస్య కాగా, విభజన తర్వాత హిందువుల వలన దానికి మరింత తోడైంది. కాగా 1947కి ముందే వచ్చిన మైమెన్‌సింగ్‌ జిల్లాకు చెందిన ముస్లింలు చాలావరకు అస్సాంలోనే ఉండిపోగా, తర్వాత హిందువులు కూడా గుంపులు గుంపులుగా వచ్చి చేరారు. దీంతో మొత్తం భూభాగంలోని జాతుల సమతూకం మారిపోయింది. ఇదే సమస్యకు ప్రధాన కారణం. అస్సాం ఆందోళనలకు సమాధానం ఇవ్వడంలో పౌరసత్వ సవరణ చట్టం విఫలమవుతుండటానికి ఇదే ప్రధాన కారణం.

మతంపై కాకుండా, జాతి, సంస్కృతి, భాష, రాజకీయ అధికారం వంటి అంశాల్లోనే అక్కడ అధిక ఆందోళనలు చోటుచేసుకుం టున్నాయి. గత మూడు దశాబ్దాలుగా దీన్ని మార్చడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తూ వచ్చాయి. పైగా ముస్లిం వలసప్రజలు దేశ విభజనకు ముందే వచ్చారు వీరికి పౌరసత్వాన్ని నిరాకరించలేరు. బెంగాలీ హిందువులు ఇటీవలి కాలంలో వచ్చినవారు. అందుకే జాతీయ పౌర పట్టిక ప్రకారం అనర్హులుగా తేలిన 19 లక్షలమందిలో 60 శాతం వరకు ముస్లిమేతరులే ఉండటం ఈ నిజాన్ని సూచిస్తోంది.

ఇక్కడే బీజేపీ ఇరుక్కుపోతోంది. పౌరసత్వ చట్టాన్ని అమలు చేసినట్లయితే, ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా దేశం నుంచి పంపించేయాల్సి ఉంటుంది. తాజా పౌరసత్వ సవరణ చట్టంతో దీన్ని పరిష్కరించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ దీనికి అస్సామీయులు అంగీకరించడం లేదు. తాజాగా తీసుకొస్తున్న జాతీయవ్యాప్త పౌరసత్వ సవరణ పట్టికతో పౌరసత్వ చట్టాన్ని కలిపినట్లయితే ప్రారంభంలోనే అది చచ్చి ఊరుకుంటుందని బీజేపీకి తెలుసు.

అందుకే దీన్ని ప్రజలను విడదీసే సాధనంగా బీజేపీ ఎక్కుపెట్టింది. ప్రత్యర్థులు వెంటనే ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తారు. ముస్లింలను బుజ్జగిస్తున్నవారిగా వారిపై బీజేపీ ఆరోపణలకు దిగుతుంది. అప్పుడేం జరుగుతుంది? వచ్చే మూడు దశాబ్దాల్లో జాతీయ పౌరసత్వ సవరణ అంశం మరొక రామ మందిరం, లేక ఆర్టికల్‌ 370గా మారిపోతుంది. ఈ అంశం వెనుక దాగిన విభజన రాజకీయాలు ఇవే మరి.


వ్యాసకర్త,
శేఖర్‌ గుప్తా, 
ద ప్రింట్‌ చైర్మన్,

twitter@shekargupta

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా