కశ్మీర్‌ భవితే ఇప్పుడు కీలకం!

17 Aug, 2019 01:20 IST|Sakshi

జాతి హితం

మోదీని మీరు ఇష్టపడండి లేక తిరస్కరించండి. కానీ సిమ్లా ఒప్పందం అనంతర యథాతథ స్థితిని ఆయన ఇప్పుడు చెరిపివేశారు. కశ్మీర్‌లో పాక్‌ ఉప–సైనిక  విన్యాసాలకు ఇక తావులేదు. ఆర్టికల్‌ 370 రద్దు గురించి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించడం లేదు. దాని పద్ధతినే అవి వ్యతిరేకిస్తున్నాయి. కశ్మీర్‌లో ప్రస్తుతం సరికొత్త యథాస్థితి ఏర్పడింది. కానీ కశ్మీర్‌ సమస్య ప్రజాగ్రహం, పరాయీకరణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘన వంటి అంశాలతో ముడిపడి ఉంది. వీటిని తప్పక పరిష్కరించాలి. ఇరుదేశాల మధ్య సరిహద్దులు ఇక శాశ్వతం అన్న వాస్తవాన్ని అంగీకరించాలి. రక్తం పారించి కశ్మీర్‌ రీజియన్‌లో మ్యాప్‌లను తిరగరాయలేమని సలహా చెప్పడానికి మనం ఇప్పుడు బిల్‌ క్లింటన్‌ను మళ్లీ రప్పించాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ వాస్తవాన్ని ఆమోదించిన తర్వాత మీరు భవిష్యత్తు గురించి చర్చించవచ్చు.

కశ్మీర్‌లో సిమ్లా ఒప్పందం అనంతర యథాతథ స్థితిని ప్రధాని మోదీ చెరిపివేశారు. కశ్మీర్‌ తన సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన గతం నుంచి బయటపడి కొత్త వాస్తవికతను అంగీకరించవలసి ఉంది. కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం వెదికేముందుగా మనం ఆ సమస్యను సరిగా అవగాహన చేసుకోవలసి ఉంది. వాస్తవికతను అర్థం చేసుకోకుండా పరిష్కారాలతో ముందుకు దుమికితే చిక్కులు తప్పవు. నకిలీ వైద్యులు (లేదా భూతవైద్యులు కావచ్చు) మాత్రమే సరైన రోగ నిర్దారణ చేయకుం డానే దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధాలను సూచించగలరు. ఇలాంటి మూడురకాలకు చెందిన భూతవైద్యుల నుంచి నేడు కశ్మీర్‌ సమస్యకు మూడు రకాల పరిష్కారాలను మనం చూడవచ్చు. 

వీటిలో మొదటిది భారత పాలకవర్గ దృక్పథానికి సంబంధిం చింది. కశ్మీర్‌లో అసలు సమస్య పాకిస్తానే అని, రైఫిళ్లతో, రాకెట్‌ లాంఛర్లతో, ఆర్డీఎక్స్‌తో ఆ దేశం ఎగుమతి చేస్తున్న రాడికల్‌ ఇస్లాం మాత్రమే భారత్‌ అసలు సమస్య అని భారత పాలక వ్యవస్థ ప్రదర్శిస్తున్న దృక్పథానికి విస్తృత ప్రజానీకం మద్ధతు లభిస్తోంది. పాకిస్తానీయుల బెడద లేకుండా చేసుకున్నట్లయితే, మీరు దాల్‌ సరస్సులో ‘కశ్మీర్‌ కీ కలి’సీక్వెల్‌కి షూటింగ్‌ చేయవచ్చు. 

ఇక రెండో కేటగిరీ పాకిస్తాన్‌ పాలనా వ్యవస్థ భ్రమలకు చెందింది. భారతీయులను కెలకడం, గిల్లడం, రక్తాలు కారేలా చేయడం ద్వారా వారిని పారదోలుదాం. మనం అప్గానిస్తాన్‌లో సోవియట్లను, అమెరికన్లనే ఓడించాం. భారత్‌ మనకో లెక్కా? భారత్‌ను అలా పారదోలిన తర్వాత కశ్మీర్‌ని మొత్తంగా పాకిస్తాన్‌కి చెందిన ఆరో ప్రాదేశిక ప్రాంతంగా కలిపేసుకుందాం.

ఇక మూడో కేటగిరీ ఏమిటంటే మనం ఇవ్వాళ చేస్తున్న విశ్లేషణే. ఇది చిన్నదే అయినప్పటికీ భారతీయ ఉదారవాదులకు సంబంధిం చింది. భారత్‌లో కశ్మీర్‌ విలీనం అంతిమం కాదు, కశ్మీరీల మనోబలం అపారమైనది, అది ఇంకా ప్రదర్శితం కాలేదు. అంతవరకు ప్రజాభి ప్రాయ సేకరణ, స్వయంప్రతిపత్తి, చివరకు స్వాతంత్య్రం వంటి వారి మౌలిక డిమాండ్లు చట్టబద్ధమైనవిగానే ఉంటాయి. రాజ్యవ్యవస్థను, సైనిక శక్తిని ఉపయోగించి వారిని భారత్‌లో కొనసాగేలా చేయలేరు.

తాత్వికంగా చూస్తే ఈ వైఖరితో వాదించడం కష్టం. భారతదేశం పలు రాష్ట్రాల స్వచ్చంద సమాఖ్యగా ఉంటోంది. ప్రజలు మీతో కలిసి ఉండాలని కోరుకోనప్పుడు మాతోనే కొనసాగాలంటూ మీరు వారిని ఎలా ఒత్తిడికి గురిచేయగలరు? ఉదారవాదుల అభిప్రాయంతో  వాదించడం ద్వారా కలిగే చిక్కులను నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఈ వైఖరి వారిని అత్యున్నత నైతిక శిఖరంపై ఉంచు తోంది. కానీ మనం ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నాం.

ప్రస్తుతం మనదేశంలోని ఉదారవాదుల స్థాయిని అయిదు ప్రాథమిక భాగాలుగా వేరు చేసి పరిశీలిద్దాం.
1. భారతదేశం 1947–48లలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో, కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు కట్టుబడతానని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని అది ఎందుకు ఉల్లంఘించినట్లు?
వాస్తవమేమిటంటే, భారత్, పాకిస్తాన్‌ రెండూ కశ్మీర్‌లో ప్లెబిసైట్‌కి హామీ పడ్డాయి. కానీ రెండు దేశాలు దాన్ని ఉల్లంఘించాయి. ఆనాటి ఐరాస తీర్మాన పాఠంలోని మూడు దశల్లో మొదటి అంశం ఏదంటే, పాకిస్తాన్‌ తన బలగాలన్నింటినీ కశ్మీర్‌ నుంచి ఉపసంహరించు కోవాలి, ఇతరులు కూడా (వీరిని జిహాదీలు అంటున్నాం) కశ్మీర్‌కు దూరం జరగాలి. కానీ ఇది ఎన్నడూ జరగలేదు. ఇక రెండో అంశం.. కశ్మీర్‌లో కనీస స్థాయిలో మాత్రమే సైనికబలగాలను భారత్‌ ఉంచాలి. తర్వాత అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పర్చాలి. తర్వాత ఐక్యరాజ్యసమితి నియమించే గవర్నర్‌ నేతృత్వంలో ప్లెబిసైట్‌ నిర్వహిం చాలి. ఈ మూడింట్లో మొదటి దాన్ని పాకిస్తాన్‌ చేపట్టలేదు. దీంతో భారత్‌ మిగిలిన రెండు అంశాలను గౌరవించలేదు.

2. కశ్మీరీలలో చాలామంది భారత్, పాకిస్తాన్‌ రెండింటినీ కోరుకోవడం లేదు. వారు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నాను. అలాంటప్పుడు వారికి దాన్ని ఇవ్వకుండా ఎలా తిరస్కరించగలరు? 
మరోసారి కశ్మీర్‌పై ఐరాస తీర్మానాలు చూడండి. కశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని లేక అజాదీని ఒక ఐచ్ఛికంగా ఇవి పేర్కొనలేదు. భారత్‌ లేక పాక్‌ రెండు దేశాల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోమని ఆ తీర్మానాలు చెబుతున్నాయి. ఇకపోతే కశ్మీర్‌ అజాదీ (స్వాతంత్య్రం)కి పాక్‌ ఇస్తున్నట్లు చెప్పుకుంటున్న మద్దతు వంచనాత్మకమైనది. అయితే పాకిస్తానీ యులు కశ్మీరీల స్వాతంత్య్రం కోసం మద్దతు పలుకుతున్నారన్న కృత్రిమ ప్రచారంతో పాక్‌ మద్దతు ఒకమేరకు గ్లోబెల్‌ తరహా విజ యాన్ని పొంది ఉంది. తన ఆక్రమణలో ఉన్న పీఓకేని అజాద్‌ కశ్మీర్‌ అని పిలవడం ద్వారా పాకిస్తాన్‌ గత 70 ఏళ్లుగా ఈ అభిప్రాయాన్ని విజయవంతంగా నిర్మిస్తూవచ్చింది. అయితే అజాద్‌ కశ్మీర్‌ కాల్పనిక భ్రమను పాకిస్తాన్‌ పీవోకేలో పెంచి పోషించగలదేమో కానీ తతిమ్మా భారత్‌లో దాని పప్పులుడకవు.

3. సైనిక శక్తితో ఒక భూభాగాన్ని, ప్రజలను నిలిపి ఉంచగలరా?
తిరుగు ప్రశ్నే ఈ ప్రశ్నకు సమాధానమవుతుంది. సైనిక శక్తిద్వారా మీరు మరొక దేశం నుంచి ఒక భూభాగాన్ని, ప్రజలను స్వాధీనం చేసుకోగలరా? పాకిస్తాన్‌ దీనికే సుదీర్ఘకాలం ప్రయత్నించింది. 1947–48లో 1965లో ప్రత్యక్ష సైనిక దాడి ద్వారా రెండు సార్లు, 1989 నుంచి పరోక్ష యుద్ధం ద్వారా దీనికోసం పాక్‌ ప్రయత్నించింది. మధ్యలో కార్గిల్‌ వంటి ఉన్మాద చర్యలు కూడా ఉన్నాయి.ఇవి నిజాలు. అందుకే 1953 మధ్య కాలంలో ఐరాస తీర్మానాలనుంచి నెహ్రూ వైదొలగడాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రచ్ఛన్నయుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడం, భౌగోళికంగా కశ్మీర్‌ వ్యూహాత్మక ప్రాధాన్యత పెరిగిపోవడం వంటి పరిణామాలతో భవిష్యత్తులో ఎదురవనున్న చిక్కులను ముందుగానే పసిగట్టి షేక్‌ అబ్దుల్లాను అరెస్టు చేయడం ద్వారా నెహ్రూ 1953లో కశ్మీర్‌ని భారత్‌లో కలిపేసుకునేం దుకు చర్యలు చేపట్టారు. ఆ తర్వాతి దశాబ్దమంతా అమెరికా మద్దతుతో పాక్‌ సైనిక సమతుల్యతా పరంగా ముందజ వేసింది. అందుకే నెహ్రూ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యే కశ్మీర్‌ని సైనిక ఆక్రమణ నుంచి కాపాడిందన్నది వాస్తవం. సైనికపరంగా ముందంజ వేశామని, 1962 చైనాతో యుద్ధంలో భారత్‌ సైనికంగా పతనమైందని, నెహ్రూ మృతి, ఆహార ధాన్యాల కొరతతో భారత్‌ వెనుకపట్టు పట్టిం దని గ్రహించి కశ్మీర్‌ ఆక్రమణకు అమెరికా ఆయుధాలు, శిక్షణ దన్నుతో పాక్‌ తీవ్రంగా ప్రయత్నించింది కానీ ఆ ప్రయత్నంలో అది ఓడిపోయింది.

4. సిమ్లా ఒప్పందం ప్రకారం కశ్మీర్‌ సమస్యను మోదీ ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదు?
సిమ్లా ఒప్పందాన్ని మరోసారి చదువుకోండి. భారత్‌–పాక్‌ సమస్యలన్నీ ఇప్పుడు ద్వైపాక్షిక సమస్యలుగా మారాయి. అంటే ఐరాస తీర్మానాలు పనిచేయవన్నమాట. అంటే ఈ రెండు దేశాల్లో ఏ ఒక్కటీ ఏ భూభాగాన్నీ బలప్రయోగంతో ఆక్రమించలేవు. అందుకే కాల్పుల విరమణ రేఖను ఆధీన రేఖగా పేరు మార్చుకున్నారు. ఇదే ఇరుదేశాల మధ్య సరిహద్దుగా తమతమ ప్రజలు ఆమోదించడంపై ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ 1971 యుద్ధంలో పట్టుబడిన పాక్‌ సైనికులను భారత్‌ విడుదల చేశాక ఈ కొత్త ఒడంబడిక స్ఫూర్తికి భంగం కలిగింది. జుల్ఫికర్‌ ఆలీ భుట్టో తన దేశాన్ని ఇస్లామీకరించడం ప్రారంభించారు. ఇస్లామిక్‌ బాంబు తయారీ కోసం నిధుల సేకరణకు కూడా ఒడిగట్టారు. అలా పాకిస్తాన్‌ అణుబాంబు ప్రయోగాలు ఫలిం చిన తర్వాత సిమ్లా ఒప్పందానికి తూట్లు పడింది. కానీ ప్రత్యక్ష యుద్ధానికి తలపడితే ఓటమి తప్పదని పాక్‌ గ్రహించింది. ఆ విధంగా సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్‌ మాత్రమే.

5. కశ్మీరీలు మీతో కలిసి ఉండాలనుకోలేదు.. మీరేం చేయగలరు?
దీనికి కూడా తిరుగు ప్రశ్నే సమాధానం. కశ్మీరీలు ఎవరు? పది జిల్లాలతో కూడిన కశ్మీర్‌ లోయ మొత్తం రాష్ట్రం తరపున మాట్లాడలేదని చెప్పడం ద్వారా మితవాద జాతీయవాదులు సూక్ష్మార్థాన్ని గ్రహిం చడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలోని మెజారిటీ జనాభాకు ఈ పది జిల్లాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక ఉదారవాద వాదన మరింత లోపభూయిష్టంగా ఉంది. లోయలోని ముస్లిం మెజారిటీ అభిప్రాయం రాష్ట్రంలోని మైనారిటీ అభిప్రాయాన్ని కలుపుకోనట్లయితే, భారత్‌ లోని మిగతా 99.5 శాతం మంది అభిప్రాయాన్ని మనం ఎలా చూడాలి? ఒక చోట మెజారిటీ అభిప్రాయాన్ని లెక్కించడం, మరొక చోట లెక్కించకపోవడంలో తర్కం ఏమైనా ఉందా?

వ్యాసకర్త : శేఖర్‌ గుప్తా,  ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు