గెలుపు గుర్రాలే కీలకం

23 Mar, 2019 00:16 IST|Sakshi

జాతిహితం

ఏ రాజకీయ పార్టీకైనా సరే.. ఎన్నికల్లో గెలవడం అనే ఒకే ఒక లక్ష్య ప్రకటన ఉంటుంది. గెలిస్తే అపారమైన రివార్డులు లభిస్తాయి. ఓడిపోతే దారుణంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కూడా. కానీ, కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యంగా రాహుల్‌ కోటరీలో ప్రతిభావంతులు ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీ ఎన్నికల్లో పార్టీని గెలిపించే సామర్థ్యం లేదు. మరోవైపున కాంగ్రెస్‌ గత ప్రభుత్వాల విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుని ముందుకు సాగిపోతున్న మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడటంలో రాహుల్‌ పార్టీ ఏమేరకు విజయం సాధిస్తుందనేదే గడ్డు ప్రశ్న. పైగా సెల్ఫ్‌ గోల్‌ వేసుకోవడం నుంచి బయటపడకపోతే కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే.

సార్వత్రిక ఎన్నికల తొలి దశ ఓటింగ్‌ జరగడానికి రెండు వారాల సమయం మాత్రమే ఉన్న స్థితిలో కాంగ్రెస్‌ సమర సన్నాహం స్థితీ గతి ఏమిటి? దాని సేనాధిపతులూ, సైనికుల్లో ఉత్సాహం ఏ మేరకు ఉంటోంది? మోదీ ప్రభుత్వం అత్యంత అవినీతికరమైనదనీ, అసమర్థమైనదనీ, ప్రజలను విడదీస్తోందని, దేశచరిత్రలోనే అది అత్యంత విధ్వం సకరమైనదని కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండటం మనకు తెలుసు. కానీ ఈ ఆరోపణలను రుజువు చేయడానికి తాను ఎలా సంసిద్ధమవుతున్నదీ ఆ పార్టీ చెప్పడం లేదు. ఈ వేసవిలో ప్రతి ఓటరుకు ముఖ్యమైన కీలక సమస్యలైన ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, జాతీయవాదం, సామాజిక ఐకమత్య సాధన వంటి అంశాలపై దాని వైఖరి ఎలా ఉంటోంది? 

ఈ సందర్భంలో నన్ను మరొక ప్రశ్న సంధించనివ్వండి. కాంగ్రెస్‌ ఈరోజు ఏ స్థితిలో ఉంటోందని మీరు భావిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా అది జీవన్మరణ యుద్ధంవైపు సాగుతోందా? లేక తన పని తాను చేసుకుపోతూ ఆ పని తనకుతానుగా ప్రపంచ వ్యవహారాలను మెరుగుపరుస్తుందని ఆశిస్తూ ఉండే ఎన్జీఓలాగా ఉండబోతోందా? ఇలా ప్రశ్నిస్తే పలువురు కాంగ్రెస్‌ అభిమానులు ఆగ్రహపడవచ్చు. కానీ వారు తమ ఆగ్రహాన్ని మరోవైపునకు మరల్చాల్సి ఉంది. గత అయిదేళ్లుగా మీ ప్రత్యర్థి మిమ్మల్ని దాదాపుగా చాపచుట్టేశాడు. పైగా చివరి దెబ్బ తీయడానికి గొడ్డలిని వాడిగా సానబెట్టుకుంటున్నాడు. ఇలాంటి స్థితిలో కాంగ్రెస్‌ మళ్లీ పేలవ ప్రదర్శనే చేసినట్లయితే, ఇప్పటికే నిరాశా నిస్పృహలకు లోనై, నైతిక ధృతిని కోల్పోయి ఉన్న దాని సభ్యులు చాలామంది పార్టీకి దూరమవుతారు. కాంగ్రెస్‌ కొత్తగా అధికారంలోకి వచ్చిన రెండు ముఖ్యమైన రాష్ట్రాలు కర్ణాటక (సంకీర్ణం), మధ్యప్రదేశ్‌ చేజారే అవకాశం కూడా ఉంది. రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం మనుగడ సాగించాలంటే అదృష్టాన్ని నమ్ముకోవలసిందే. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎలా ఉండబోతోంది? ఇది ఎప్పటిలాగే పాత పార్టీ నిర్మాణంతోనే ఉండవచ్చు. లేక ఎన్నికల్లో ఎన్నడూ విజయం సాధించలేని, ఎన్నికల్లో అసలు పోటీ చేయలేని కొత్త తరహా స్వయం ప్రకటిత కౌటిల్యులు, మాకియవెల్లీలు, స్వయం ప్రకటిత మహామేధావులతో అది నిండిపోవచ్చు. లేక తమ బాధ్యతలను కూడా వారు కోల్పోవచ్చు. ఏ రాజకీయ పార్టీకైనా సరే ఒకే ఒక లక్ష్య ప్రకటన ఉంటుంది. అదేమిటంటే ఎన్నికల్లో గెలవడం. దీనికి తీవ్రమైన కృషి, నిబద్ధత అవసరం. గెలిస్తే అపారమైన రివార్డులు లభిస్తాయి. ఓడిపోతే దారుణంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కూడా. ఈ పరిస్థితిని ఒక్క మాటలో చెవ్పవచ్చు: జవాబుదారీతనం. చివరకు కాంగ్రెస్‌కు లభించబోయేది ఇదే అని మీరు భావిస్తున్నారా? మీ సమాధానం కాదు అయినట్లయితే, ఆ పార్టీ ఎన్జీవో లాగా ఎందుకు కనిపిస్తోందన్నది నేను వివరిస్తాను. ఎన్జీవోలు కూడా తీవ్రంగా శ్రమిస్తాయి. కానీ వారి లక్ష్యాలు, దృష్టికోణం సీజ న్‌ను బట్టి లేదా వాటి మార్కెట్‌ అవకాశాలను బట్టి మారిపోతుంటాయి.

గడచిన కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ మరింత ఫ్యూడల్‌ తత్వంతోనూ, తక్కువ ప్రతిభాతత్వంతో తయారైంది. ఆ పార్టీలో చాలా తక్కువమంది మాత్రమే సమరశీలతను, ఎలక్టోరల్‌ సామర్థ్యతను కలిగి ఉంటున్నారు. గాంధీలతో సహా దాని పాత రాజవంశం మునిగిపోతున్న దాని ప్యూడల్‌ కోటలను నిలిపి ఉంచలేకపోతోంది. తమ తమ ప్రాబల్య ప్రాంతాల్లో వీరు పార్టీని విస్తరించలేకపోతున్నారు. పైగా కొత్తగా పస్తున్న ప్రతిభకు వీరు చోటు కేటాయించలేకపోతున్నారు. ఈ పార్టీలో ఉన్న యువ, అద్భుత వ్యాఖ్యాతలు, ప్రతినిధులు చాలా గొప్పవారే. కానీ వీరెవరూ ఎన్నికల పోరాటం చేయలేరు. తమ ప్రతిభలను, సంపదలను ఎన్నికల్లో పణంగా పెట్టలేరు. పైగా వేసవి ఎండను ఎదుర్కోలేరు. దేశం మొత్తం మీద దేనికైనా సిద్ధంగా ఉండే 50 మంది కాంగ్రెస్‌ నేతల జాబితా తయారు చేయండి మరి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలోని అసంబద్ధతను, వైపరీత్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలం.

తద్భిన్నంగా చెంచాలు, భజనపరులు పార్టీలో అనేక విపత్తులను తట్టుకుని నిలబడుతుంటారు. మోహన్‌ ప్రకాష్‌ అనే వ్యక్తి గురించి మీకు గుర్తుండకపోవచ్చు. ఇతను పాత సోషలిస్టు రాహుల్‌ గాంధీలా వెలిగిపోయాడు. ఒకదాని వెనుక ఒకటిగా కీలక రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను ఈయనకే కట్టబెడుతూ వచ్చారు. వాటిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ కూడా ఉన్నాయని గుర్తించాలి. తన బాధ్యతలతో ఈయన చాలా ప్రముఖుడైపోయారు. పార్టీ నాయకత్వానికి ఇష్టుడిగా కూడా మారారు. మొదట్లో ఈయన రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌ పార్టీ జయప్రకాష్‌ నారాయణ్‌గా కూడా వర్ణిస్తూ వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే అతడి గురించి ఒక విషయం మీరు చెప్పవచ్చు. అదేమంటే అతడు నిలకడగా ఉండేవాడు. వైఫల్యాల్లో మాత్రమే అని చేర్చుకోవాలి. కాంగ్రెస్‌ కార్యకర్తలను అతడి గురించి అడగండి. అమీర్‌ఖాన్‌ని 3 ఇడియట్స్‌ నుంచి ఒక చరణాన్ని మీకు పాడి వినిపిస్తారు. కహాన్‌ సే ఆయా థా వో, కహాన్‌ గయా ఉసే ధూన్‌ధో.. (అతడు ఎక్కడినుంచి వచ్చాడు, ఇప్పుడు అతడిని మనం ఎక్కడ కనుగొనగలం!) అయితే అతడొక్కడే కాదు. రాహుల్‌ గాంధీ చిరకాల ఇష్టుడు సీపీ జోషీని చూడండి. తాను ముట్టిందల్లా మట్టి అయిపోయంది. తాజా ఉదంతంగా ఈశాన్య భారత్‌లో అతడి వ్యవహారాల గురించి చెప్పవచ్చు.

రాహుల్‌ గాంధీ ఏ టీమ్‌ని ఎలా పిలవచ్చనే అలోచనను నా సహోద్యోగి, ది ప్రింట్‌ పొలిటికల్‌ ఎడిటర్‌ డి.కె. సింగ్‌ కలిగించారు. అదొక పరాజితుల స్వర్గం. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఉనికే లేకుండా పోయినప్పటికీ రాజ్‌ బబ్బర్‌ యూపీసీసీ చీఫ్‌గా కొనసాగుతూనే ఉంటారు. అశోక్‌ తన్వార్‌ అనే రాహుల్‌ యువ దళిత్‌ స్టార్‌ విషయం చూడండి. హర్యానాలో గత లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపోయినప్పటికీ హర్యానా కాంగ్రెస్‌ చీఫ్‌గా తన్వార్‌ కొనసాగుతూనే ఉన్నారు. హర్యానాలో పార్టీ మీడియా చీఫ్‌ రణదీప్‌ సింగ్‌ సుర్జీవాలా ఇటీవలి ఉప ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఇక మధ్యప్రదేశ్‌లో ఒక్కసారి కూడా పోటీ చేయని దీపక్‌ బబారియా ఆ రాష్ట్ర పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఇక ఆనంద్‌ శర్మ, జైరామ్‌ రమేష్‌ గురించి చెప్పపని లేదు. 

ప్రస్తుతం రాహుల్‌ జట్టులోని కీలకమైన సలహాదారులు అత్యంత చురుకైన, ఉన్నత విద్యావంతులు. విశ్వసనీయ సలహాదారు కనిష్కా సింగ్, సమర్థుడైన ట్వీట్‌ రచయిత నిఖిల్‌ అల్వా, మాజీ ఉన్నతోద్యోగి కె. రాజు, దళిత శాస్త్రజ్ఞుడు ప్రవీణ్‌ చక్రవర్తి, సైద్ధాంతిక వ్యవహారాల శిక్షకుడు సచిన్‌ రావ్, మాజీ బ్యాంకర్‌ అలంకార్‌ సవాయ్, సోషల్‌ మీడియా హెడ్‌ దివ్యస్పందన తదితరులను చూడండి. వీరిలో ఉమ్మడి లక్షణం మీరు చూడగలరా? దివ్యస్పందన తప్పితే మిగతా వారెవరూ రాజకీయనేతలు కారు. ఈ నవరత్నాలలో తరచుగా దర్శనమిస్తుండే సందీప్‌ సింగ్‌ జేఎన్‌యూకి చెందిన మాజీ కార్యకర్త, అతివాద వామపక్ష విద్యార్థి సంస్థ ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ నాయకుడు. ఇతడు రాహుల్‌ ఉపన్యాసాలను రాసి ఇస్తుంటారు. ప్రధాన కార్యదర్శులు, కోర్‌ గ్రూప్, రాహుల్‌ కీలక సలహాదారుల విషయానికి వస్తే పిడికెడుమందికే రాజ కీయ అవగాహన ఉంది. వీరిలో కీలకమైన అహ్మద్‌ పటేల్‌ పక్కకు తప్పుకున్నారు. అమిత్‌ షాతో తలపడగలిగే ధైర్యం, ఎత్తులు తెలిసిన ఏకైక కాంగ్రెస్‌ నేత ఆయన అని మర్చిపోకూడదు. ఎన్నికల సంఘంతో అర్ధరాత్రి వరకూ తలపడి షా స్వంత రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాన్ని ఆయన చేజిక్కించుకున్నారు.

గతంలో మనం చెప్పుకున్న మూడు కీలక అంశాల్లో కాంగ్రెస్‌ పార్టీ దృక్పథం కనీసం మనకు తెలుసు. ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవ సాయ సంక్షోభంపై అది దాడిని కొనసాగిస్తూనే ఉంటుంది. అయితే, ఈ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయో మనం చెప్పలేం. జాతీయత, భద్రత, ఉగ్రవాదంపై పోరు, విదేశాంగ విధానంపై శామ్‌ పిట్రోడా కలుగజేసుకునే వరకూ కాంగ్రెస్‌ మొద్దు నిద్దర పోయింది. మిరాజ్‌లు, సుఖోయ్‌లతో సహా వారు పోరాడుతున్న ప్రతి ఆయుధ వ్యవస్థా తమ ప్రభుత్వాల హయాల్లోనే కొనుగోలు చేసిన వాస్తవాలను కాంగ్రెస్‌ వారు చెప్పలేరు. మరోవైపు, సులువుగా దొరికిపోయే అంశాలను రాహుల్‌తో చెప్పిస్తున్నారు. ఈ మిరాజ్‌లను తయారు చేసినది హాల్‌ అనడం అటు వంటిదే. హాల్‌ ఎప్పుడూ మిరాజ్‌ని తయారు చేయలేదు. దస్సాల్ట్‌ వాటిని రూపొందించింది. ఇప్పుడు మనం వాడుతున్న వాటిని 1982లో రాహుల్‌ నానమ్మ తెప్పించినవే. బాస్‌ చేసిన దాన్ని రీట్వీట్‌ చేయడం కంటే, రాజకీయాలకు చాలా కఠోర పరిశ్రమ అవసరం. మూడో అంశం సామాజిక సంబంధాలకు ఉండాల్సిన సహనశీలతపై బాగానే మాట్లాడు తున్నారు. కానీ, శబరిమల, ట్రిపుల్‌ తలాక్, రామ మందిరంపై బీజేపీ అభిప్రాయాలనే మీరూ కలిగివుంటే, మీ ప్రత్యేకత ఏముంది? 

టి.ఎన్‌.నైనన్‌ తన వారాంతపు సమీక్షలో యూపీఏ ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన విజయాలను పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి, మౌలిక వసతులపై ఖర్చు చేయడం, ఆధార్‌ వంటివి ఇందులో ఉన్నాయని అంటూ కాంగ్రెస్‌ వీటి గురించి ఎందుకు మాట్లాడదని ప్రశ్నించాడు. వీటన్నిటినీ తానే సొంతం చేసుకోవడంతో పాటు భారత్‌లో కనబడుతున్న ఏ మంచైనా తన ఐదేళ్ల పాలనలోనే వచ్చినట్టు మోదీ చెప్పుకుంటున్నారు. వీటన్నిటినీ కాంగ్రెస్‌ ఎదుర్కో వలసి ఉంది. ఆ పని చేయకపోతే అది ఒక రాజకీయ పార్టీయా లేక ఎన్‌జీవోనా అని మీరు అడగవచ్చు. ఎన్‌జీఓలు కూడా ప్రభుత్వ వ్యతిరేక తతోనే ఉంటాయని భావిస్తుంటారు. దశాబ్దంపాటూ మీరూ ప్రభు త్వంలో ఉన్నారు కదా.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు