మండల్, మందిర్‌లకు చెల్లుచీటీ!

25 May, 2019 00:16 IST|Sakshi

జాతిహితం 

గత మూడుదశాబ్దాలలో మండల్‌ ప్రాతిపదికన ఏర్పడుతూ వచ్చిన ఓటు బ్యాంకులను విచ్ఛిన్నపర్చిన క్రమంలోనే నరేంద్రమోదీ పూర్తి మెజారిటీ సాధించిన భారతదేశ ప్రప్రథమ ఓబీసీ ప్రధానిగా చరిత్రకెక్కారు. అటు మండల్, ఇటు మందిర్‌ రెండింటినుంచి మోదీ రాజదండాన్ని కైవశం చేసుకున్నారు. అడ్వాణీ, ఆయన తరం ఊహించని స్థితికి బీజేపీని మోదీ, షా తీసుకొచ్చారు. ఓబీసీలను, దళితులను చేరుకోవడంలో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, ములాయం ఓటు బ్యాంకులోకి చొరబడి, వారిని జాతవ, యాదవ కులాలకే పరిమితం చేశారు. ఇప్పటికే ఆ పార్టీకి హిందూ జాతీయ అగ్రకుల ఓటు బ్యాంకు ఉండటంతో, అదనంగా చేరిన కులాల సంఖ్య అనూహ్యమైన శక్తినిచ్చింది.  మండల్, మందిర్‌ శకం ముగిసింది. కొత్త రాజకీయాలను ఎవరు ఎలా నిర్మించాలనేది ఇప్పుడు ప్రశ్న.

సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయింది. నూతన శకం ప్రారంభమైంది కూడా. నెహ్రూ–గాంధీ రాజవంశం పతనమైందని, నరేంద్రమోదీ వికాసదశ మొదలైందని, ఇదే నేటి ఏకైక నూతన శకమని నిర్దిష్టంగా మనం చర్చించబోవడం లేదు. భారత్‌లో విస్పష్టమైన రాజకీయ పరివర్తనను అర్థం చేసుకోవడానికి అలాంటి చర్చ సంకుచిత అర్థాన్నే అందిస్తుంది. మనం ఇప్పుడు మండల్‌–మందిర్‌ రాజకీయాలకు ముగింపు పలుకుతూ మోదీ శకాన్ని ఆవిష్కరించబోతున్నాం. 

రాజీవ్‌ గాంధీ హయాంలో 1984లో లోక్‌సభలో రెండు స్థానాలకు కుంచించుకుపోయిన బీజేపీ తర్వాత 1989లో తిరిగి పుంజుకునే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. రాజీవ్‌ విశ్వసనీయుడు, నాటి రక్షణ మంత్రి వీపీ సింగ్‌ తిరుగుబాటు చేశారు. రాజీవ్‌ స్థానంలో ఒక సహజనేతను కూర్చోబెట్టడానికి వీపీ సింగ్‌ ప్రయత్నించారు కానీ బీజేపీ మద్ధతు లేకుండా వీపీసింగ్‌ దాన్ని సాకారం చేసుకోలేకపోయారు. ఆనాడు బీజేపీ అతి సమర్థనేత అయిన ఎల్‌కే అడ్వాణీ అధికారాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడలేదు. పైగా బీజేపీ స్వయంగా అధికారంలోకి రావాలన్నదే ఆయన ఆకాంక్ష. దీని కోసం ఆరోజు కీలక సమస్యతో ముడిపడిన అజెండా బీజేపీకి అవసరమైంది. అదేమిటంటే అవినీతిపరుడైన రాజీవ్‌ని ఓడించడం. దాంట్లో భాగంగానే హిందూ పునరుద్ధరణతో కూడిన దూకుడు జాతీయవాదాన్ని మిళితం చేస్తూ అడ్వాణీ అయోధ్య సమస్యను ఎంచుకున్నారు. ఇది అడ్వాణీ మందిర్‌ సిద్ధాంతమైంది. రాజీవ్‌ ప్రాభవాన్ని తగ్గించి ప్రతిపక్షం బలపడటంలో అద్వాణీ సహకరించారు. హిందీ ప్రాబల్యప్రాంతంలోనే అధికంగా 143 ఎంపీ స్థానాలను గెలుచుకున్న జనతాదళ్‌ అధినేత వీపీసింగ్‌ నూతనంగా ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ కూటమి తరపున ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 272 స్థానాల మ్యాజిక్‌ ఫిగర్‌కి జనతాదళ్‌ సాధించిన సీట్లు చాలా తక్కువే. అందుకే దానికి రెండు అనూహ్య శక్తుల మద్దతు అవసరమైంది. అవి వామపక్షాలు, బీజేపీ. అయితే భావజాలపరంగా పూర్తి విరుధ్దమైన శక్తులు రెండూ ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం ఐక్యం కావడం అదే తొలిసారి కాదు. చివరిసారీ కాదు.

జనతాదళ్‌ దాని చిన్న చిన్న కూటమి పార్టీలు సాధించిన స్థానాల్లో అధికభాగం పాత సోషలిస్టులు,  కాంగ్రెస్‌ తిరుగుబాటుదారుల నుంచి వచ్చాయి. సాధారణంగా వీరికి బీజేపీ అంటే ఏహ్యభావం. ప్రత్యేకించి వీపీ సింగ్‌ మంత్రివర్గంలో హోంమంత్రిగా పనిచేసి కశ్మీర్‌ రాజకీయ నేత ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ కుమార్తె రుబియా సయీద్‌ను కశ్మీర్‌ వేర్పాటువాదులు అపహరించి డబ్బుకోసం బెదిరించినప్పుడు కేంద్రప్రభుత్వం చేష్టలుడిగిపోయిన నేపథ్యంలో కశ్మీర్‌లో కొత్త రకం తీవ్రవాదంతో వ్యవహరించే అంశంపై అధికార పక్షంలో పరస్పర విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో వీపీ సింగ్, అయన వెన్నంటి నిలిచిన సోషలిస్టు, లోహియా వర్గాలకు చెందిన మేధోవర్గం ఆనాటి రాజకీయ కలయిక నిలకడతో కూడుకున్నది కాదని గ్రహించింది. అందుకే బీజీపీ, కాంగ్రెస్‌ రెండింటినీ వ్యతిరేకిస్తూ నూతన రాజకీయాలను ఆవిష్కరించే అంశంపై అది కృషి చేసింది. ఈ క్రమంలోనే అప్పటికి పదేళ్ల క్రితమే ఓబీసీలకు రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ మండల్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను ముందుకు తీసుకొచ్చి, దాన్ని వక్రరీతిలో అమలు చేశారు. 
అప్పటికే షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ఇస్తున్న 22.5 శాతం రిజర్వేషన్ల పట్ల కుపితులై ఉన్న అగ్రవర్ణాలు వీపీ సింగ్‌పై యుద్ధం ప్రకటిం చాయి. దీంతో దేశవ్యాప్తంగా హింసాత్మక చర్యలు పెచ్చరిల్లాయి. సామాజిక అశాంతి నేపథ్యంలో 159 మంది అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు ఆత్మహత్యలకు ప్రయత్నించారు. వీరిలో 63 మంది దురదృష్టవశాత్తూ చనిపోయారు. హిందూ జనాభాలో ఒక కుల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో వీపీ సింగ్‌ ఆయన సోషలిస్టు మిత్రులు సరికొత్త ఓబీసీ ఓటు బ్యాంకును నిర్మించుకున్నారు. దేశజనాభాను హిందూ–ముస్లి ప్రాతిపదికన విభజించాలని ప్రయత్నిస్తున్న అడ్వాణీకి ఈ పరిణామం హిందూ ఓటును విభజించే కార్యక్రమంగా భీతి కలిగించింది. 

ఈ నేపథ్యంలోనే వీపీ సింగ్‌ మండల్‌ వ్యూహాన్ని అడ్వానీ మందిర్‌ రాజకీయాలు ఢీకొన్నాయి. ఆనాటి నుంచి మండల్‌ వర్సెస్‌ మందిర్‌ రాజకీయాలు భారత రాజకీయాలను నిర్వచిస్తూ ఘర్షణలను రేపెట్టాయి. కులాల మధ్య విభజన ద్వారా మత విశ్వాసం ద్వారా దేశాన్ని మీరు ఐక్యం చేయగలరా అనే ప్రశ్న తలెత్తింది. మతవిశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను ఐక్యం చేయడం అనేది సాధ్యపడినప్పుడు బీజేపీ తరచుగా కాకున్నా, అధికారంలోకి వచ్చింది. కానీ చాలావారకు హిందీ ప్రాబల్య ప్రాంతంలోని పాతతరం నేతలు తమ సొంత కులాలకు చెందిన ఓటు బ్యాంకులను నిర్మించుకోవడం ద్వారా బలపడుతూ వచ్చారు. ఈ క్రమంలో దళితులను తమవైపునకు తిప్పుకోవడం ద్వారా కాన్షీరామ్, మాయావతి కులరాజకీయాల్లో మిళతమయ్యారు. ఈ కులబృందాల శక్తిని ముస్లిలు హెచ్చించేవారు. ఈ రెండింటి కలయికతో వారు హిందీ ప్రాబల్యప్రాంతంలో బీజేపీని తరచుగా ఓడించేవారు.  బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చూసేందుకు వీళ్లు కాంగ్రెస్‌తో అవాంఛిత పొత్తులను కూడా పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. 

ఈ మొత్తం క్రమానికి 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రకటించిన తీర్పు మంగళవాక్యం పలికింది. మండల్‌పై మందిర్‌ విజయం సాధించిందని చెబితే అది అసలు విషయాన్ని పక్కనబెట్టినట్లే అవుతుంది. మోదీ, అమిత్‌ షాల హయాంలో మండల్‌ రాజకీయాలు తలొంచేశాయి. గత మూడుదశాబ్దాలలో మండల్‌ ప్రాతిపదికన ఓటు బ్యాంకులను విచ్ఛిన్నపర్చిన నేపథ్యంలోనే నరేంద్రమోదీ భారతదేశ పూర్తి మెజారిటీ సాధించిన  ప్రప్రథమ ఓబీసీ ప్రధానిగా చరిత్రకెక్కారు. అటు మండల్, ఇటు మందిర్‌ రెండింటినుంచి మోదీ రాజ దండాన్ని కైవశం చేసుకున్నారు. భౌగోళిక రాజకీయాల వ్యూహం ప్రకారం చూస్తే ఇది భూకంపం మాత్రమే కాదు. ఒక భూఖండం పూర్తిగా స్థానం మార్చుకున్న స్థాయికి ఇది సూచిక. ఇదెలా సాధ్యమైంది? దీని పర్యవసానాలేమిటి? ఇది భారత రాజకీయాల్లో కొత్త శకాన్ని ఎలా ఆవిష్కరించనుంది? 

ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి సాయంత్రం పార్టీ కార్యకర్తల ముందు నరేంద్రమోదీ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని చూడండి. మోదీ రెండు అంశాలను ప్రస్తావించారు. భారత్‌లో ఇప్పుడు రెండు కులాలే ఉన్నాయని మోదీ చెప్పారు. పేదలు, ఆ పేదలకు సహకరించే వనరులను సృష్టించగలిగిన సమర్థులు ఒక అంశం. రెండు. సెక్యులర్‌ ముసుగు ధరించిన వారు పరాజయం పాలయ్యారు. అంటే కులం ప్రాతిపదికన హిందువులను విభజిస్తూ, వారిని ముస్లిం ఓటర్లతో మిళితం చేస్తూ అధికారంలోకి వచ్చే నేతల శకం ముగిసిపోయిందన్నదే మోదీ ప్రసంగం ఇస్తున్న రాజకీయ సందేశం. ఈ సరికొత్త పరిణామాన్ని సాధ్యం చేసిన ఏకైక కారణం మోదీనే. ప్రతిపక్షాన్ని అవమానించాల్సిన పనిలేదు. ఒక భావజాలంతో లేక ఒక పార్టీతో మీరు తలపడుతున్నప్పుడు ఎన్నికల ముందస్తు పొత్తులు పనిచేస్తాయి. కానీ ఒక మూర్తిమత్వంతో ప్రత్యేకించి నేటి మోదీ, 1971 నాటి ఇందిరా గాంధీ వంటి ప్రజారంజక నేతలతో తలపడుతున్నప్పుడు ఇలాంటి పొత్తులు ఏమాత్రం పనిచేయవు. అడ్వాణీ, ఆయన తరం ఊహించని స్థితికి బీజేపీని మోదీ, షా తీసుకొచ్చారు. మోదీ, షాలు ఓబీసీలను, దళితులను చేరుకోవడంలో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, ములాయం ఓటు బ్యాంకులోకి చొరబడి, వారిని జాతవ, యాదవ కులాలకే పరిమితం చేశారు. మిగిలినవారంతా బీజేపీ వైపే ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీకి హిందూ జాతీయ అగ్రకుల ఓటు బ్యాంకు ఉండటంతో, అదనంగా చేరిన కులాల సంఖ్య అనూహ్యమైన శక్తినిచ్చింది. బీజేపీయేతర ఓబీసీ నాయకుడైన నితీష్‌ కుమార్‌కు బీహార్‌ అప్పగించారు. శక్తివంతమైన దళిత వర్గానికి చెందిన రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు కూడా చోటు కల్పించారు. రెండు దశాబ్దాలుగా బీజేపీని అధికారానికి దూరంగా ఉంచిన మండల్‌ వ్యవహారాన్ని 2019లో తుంగలో తొక్కేశారు. 

ఇప్పుడు మోదీకి తన స్వంత వ్యూహ రచన చేసుకునే అవకాశం దక్కింది. ఎందుకంటే, ఇప్పటికే అగ్రవర్ణ అభిమానం ఆయనకు అయాచితంగా లభించింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో అనేకమంది ఓబీసీ, దళిత నాయకుల మద్దతు పొందారు. బీహార్‌లో ఆయన ఇప్పటికే బలమైన యాదవ్‌ నేతల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంజయ్‌ పాశ్వాన్‌ లాంటి వారు యూపీలోనూ ప్రముఖంగా ఉన్నారు. దీంతో దేశంలో రాజకీయాలు అంతరించినట్టు భావించనక్కర్లేదు. మండల్, మందిర్‌ శకం ముగిసినట్టే అని మాత్రమే దీనర్థం. కొత్త రాజకీయ అంశాలను కనుగొనడమే మోదీ తర్వాత సవాల్‌. ఏ విశ్వాసమైతే ఐక్యం చేసిందో దాన్ని కులం మరోసారి విడగొడుతుందని కొందరు ఇంకా ఆశపెట్టుకుంటున్నారు. కొన ఊపిరితో ఉన్న ఆ ఆలోచన 2014లోనే చచ్చిపోయింది. ఏమైనా మిగిలివుంటే ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. కొత్త రాజకీయాలను ఎలా నిర్మించాలి? ఎవరు? ఎన్నికల ఫలితాల్లో ఒక స్థాయి కిందకు చూస్తే బీజేపీకి కనిపించే 303 స్థానాల కింద కాంగ్రెస్‌కు ఎదురుగా కనిపించే 52 అనే రెండు సంఖ్యలు ముఖ్యమైనవి. 2014లో 17.1కోట్ల మేరకు ఉన్న బీజేపీ ఓట్లు ఇప్పుడు 22.6కు పెరిగాయి. 10.69 కోట్ల నుంచి 11.86 కోట్లకు కాంగ్రెస్‌ ఓట్లు పెరిగాయి. పెరుగుతున్న ఓట్లు, ఇతర స్థానిక శక్తులు జాతీయ పార్టీలకు అండగా నిలబడుతున్నాయి. అందుకే మనం కాంగ్రెస్‌ పార్టీని తీసుకున్నంత తేలికగా, మోదీ, షాలు తీసుకోరు.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు