దేశ రక్షణనూ వదలని జూదక్రీడ

29 Sep, 2018 00:35 IST|Sakshi

జాతిహితం

మన రక్షణ కొనుగోళ్లలో కచ్చితంగా భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లే మరి. మనం దేన్నీ కొనలేని అసమర్థులం. దీనికి బలయ్యేది మాత్రం మన సాయుధ బలగాలే. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్‌ రంగ ఉత్పత్తిదారులు రక్షణ రంగంలో బలంగా పాదం మోపుతున్నప్పటికీ భారత్‌ మాత్రం వ్యతిరేకత తెలుపుతూ సొంత యుద్ధవిమానం తయారీ విషయంలో వెనుకంజ వేస్తోంది. మనది మూర్ఖుల దేశం అంటూ జస్టిస్‌ మార్కండేయ ఖట్జూ కొన్ని సందర్భాల్లో చెప్పినది నిజమే అని భావించవచ్చు. భారత్‌లో ఆయుధాల తయారీకి మనం ప్రైవేట్‌ రంగాన్ని అనుమతించం. అదే సమయంలో ప్రపంచ ప్రైవేట్‌ రంగం నుంచి అవే ఆయుధాలను కొనడానికి వెంపర్లాడతాం.

ఈ కథనం 1998 ఆరం భానికి సంబంధించినది. అప్పుడే జార్జి ఫెర్నాం డెజ్‌ అటల్‌ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఇది ఎవరూ ఊహించని విషయమేగాదు, ఆయన అసలేం చేస్తా రనే ప్రశ్న తలెత్తింది. నలిగిన కుర్తా, పైజామా, మామూలు చెప్పులు ధరించే ఈ వింత పోకడల కార్మిక నాయకుడు సాదాసీదాగా నడిచే భారత రక్షణ శాఖను ఎలా నడుపుతారని పలువురు ప్రశ్నించారు. ఫెర్నాండెజ్‌ మాత్రం చాలా వేగంగా తనదైన మార్గంలో బాగా పనిచేస్తూ మనల్ని ఆశ్చర్యపరి చారు. ‘నేనేమీ చేయను–మిమ్మల్నేమీ చేయనీయను’ అనే ధోరణి ఉన్న ఉన్నత ఉద్యోగవర్గంతో నిండిన విషవలయాన్ని మొదట ఛేదించడం ఆయనకు తొలి సవాలు అయింది. నాస్తికుడైన ఫెర్నాండెజ్‌కు సియా చిన్‌ గ్లేసియర్‌ ప్రాంతం ఇష్టమైన పుణ్యతీర్థమైంది. ‘భారత రక్షణశాఖలో వారు(అధికారులు) అవునని గాని, లేదనిగాని చెప్పరు. వారు ఫైళ్లను ఓ కక్ష్యలో పడేస్తారు. మనం దాని వెంటపడతూ ఉండాల్సిందే. ఈ లోగా యుద్ధాలొస్తాయి, పోతాయి. వాటిని గెల వచ్చు, గెలవకపోవచ్చు. ఫైల్లోని విషయం మాత్రం తేలదు. ఇది నేను గుర్తించిన చిరాకుపుట్టించే వాస్త వం’ అని సియాచిన్‌లో నాకిచ్చిన ఇంటర్వ్యూలో జార్జి చెప్పారు.

సియాచిన్‌ మంచుకొండల్లో వేగంగా కదలడానికి సైనిక దళాలకు విదేశీ స్నోమొబైల్‌ ఫోన్లు, స్కూటర్లు అత్యవసరమని ఆయన ఈ ప్రాంతానికి వెళ్లిన ఓ సందర్బంలో గుర్తించారు. ఇవి కొనుగోలు చేయడానికి పంపిన ఫైలు కూడా పైన చెప్పినట్టు కక్ష్యలో తిరుగుతూనే ఉంది. రాజధానికి తిరిగి వచ్చాక ఈ ఫైలు ముందుకు జరగకుండా తొక్కిపట్టిన ఉన్నతాధికారులెవరో జార్జి గుర్తించారు. వెంటనే సియాచిన్‌కు వెళ్లాలని వారిని ఆదేశించారు. సైనికులకు ఈ స్కూటర్ల అవసరం ఎంత ఉందో తెలుసుకునే వరకూ వారు అక్కడే గడపాలని కూడా మంత్రి కోరారు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఇలాంటి విషయాలపై ఆయన మాట్లాడే స్థితిలో లేరు. అందుకే, రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగో లుకు సంబంధించిన ఫైలుపై తమ అసమ్మతి తెలుపుతూ తమ వ్యాఖ్యలు రాసిన రక్షణశాఖలోని జాయింట్‌ సెక్రెటరీ గురించి మనం అంచనాలకే పరిమితం కాకతప్పదు. ఈ అధికారి నోట్‌ను ఫెర్నాం డెజ్‌ చదివితే, వెంటనే ఆయనను ‘అత్యంత నైపుణ్య మున్న రాకెట్‌ సైంటిస్టు’గా ప్రకటించేవారు! ఎందు కంటే ఎంతో అవసరమైన రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలును కూడా ముందుకు సాగనీయకుండా అడ్డుపడడం మామూలు విషయం కాదు. ఇది రక్షణ శాఖ ఉన్నతాధికారుల నైజం. 

ఒక్క రాఫెల్‌తో ఆరు సుఖోయీ విమానాలా!
ఈ సందర్భంగా ఈ రక్షణశాఖ అధికారి తెలివితేట లను ప్రశ్నించే సాహసం చేస్తున్నాను. 36 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు ఫ్రెంచ్‌ కంపెనీ డాసోకు చెల్లించే సొమ్ముతో హెచ్‌ఏఎల్‌ నుంచి మరెన్నో సుఖోయి యుద్ధవిమానాలు కొనవచ్చని సూచిస్తూ ఆయన ఇచ్చిన నివేదిక నన్నెంతో ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకు లభించేపక్షంలో హెచ్‌ఏఎల్‌ నిర్మించే సుఖోయి విమానాలు మనకు సరిపోతే మనం విదే శాల నుంచి ఎందుకు యుద్ధవిమానాలు కొనుగోలు చేయాలి? ‘‘ఒక రాఫెల్‌ విమానానికి చెల్లించే ధరతో హెచ్‌ఏఎల్‌ నుంచి ఆరు మిగ్‌–21 విమానాలు ఎందుకు కొనకూడదు?’’ అని ఫెర్నాండెజ్‌ ఈ అధికా రిని ప్రశ్నించేవారే! అంతేకాదు, మిగ్‌ విమానాలపై శిక్షణ ఇచ్చే కేంద్రానికి ఆయనను బదిలీచేసేవారు. అంతటితో ఆగకుండా, రోజూ ఉదయం మిగ్‌ విమా నంలో పైలట్‌ వెనుక (బెల్టుతో కటి)్ట ఈ అధికారిని కూర్చుని విహరించాలని కూడా ఆదేశించేవారు! ఒక రాఫెల్‌ ధరకు మరెన్నో సుఖోయి విమానాలొస్తా యని భావించే ఉన్నతాధికారి(సివిల్‌ సర్వెంట్‌) ఎవ రైనా ఆయనకు ఇలాంటి ‘శిక్షణ’ అవసరం. సైనిక సంబంధ విషయాలపై నైపుణ్యంలేని ఇలాంటి సివిల్‌ సర్వెంట్లపై సైనికాధికారులకు అపనమ్మకం ఎక్కువ.

ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన ఏ కుంభ కోణంలోనూ ఎవరికీ ఏ కోర్టులో శిక్షలు పడినట్టు నేను వినలేదు. బోఫోర్స్‌ శతఘ్నుల కుంభకోణం చూసిన ఆ తరం ప్రముఖులు నేనీ మాటలు అన్నం దుకు నన్ను నిందిస్తారని తెలుసు. అయితే, ఆయు ధాల లావాదేవీల్లో చేతులు మారిన ముడుపుల సొమ్ము ఏదీ ఇండియాకు రాలేదనేది వాస్తవం. బోఫోర్స్‌ కుంభకోణం నాటి రాజీవ్‌గాంధీ తర్వాత అధికారంలోకి వచ్చిన వీపీ సింగ్, వాజ్‌పేయీ ప్రభు త్వాలు సైతం శతఘ్నుల కొనుగోలు వ్యవహారంలో దళారులుండరని హామీ ఇచ్చిన స్వీడన్‌ సర్కారును సైతం మాట నిలబెట్టుకోవాలని ఒత్తిడి చేయలేక పోయారు. అంటే, బోఫోర్స్‌లో కుంభకోణం ఏదీ లేదనుకోకూడదు. ఈ కుంభకోణానికి ముగింపు పల కకుండా దాన్ని ఎన్నికల్లో వాడుకుని ఓట్లు సంపాదిం చుకోవాలనే ఆలోచనే దాన్ని ఇంకా బతికిస్తోంది. ఈ కుంభకోణంలో ముడుపులు తీసుకున్నవారి నుంచి సొమ్ము రాబట్టి, కొందరు దోషులను జైలుకు పంపా లనే ఆసక్తి ఎవరికీ లేదు. 

బోఫోర్స్‌ దెబ్బతో నిలిచిపోయిన కొనుగోళ్లు!
బోఫోర్స్‌ కుంభకోణం ఫలితంగా రష్యా మినహా ఇతర దేశాల నుంచి మన ఆయుధాల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయి. 1982లో ఇందిరా గాంధీ మిరాజ్‌–2000 విమానాల కొనుగోలుకు ఆదేశాలు జారీచేశాక, మళ్లీ ఇన్నేళ్లకు రష్యా మినహా ఇతర దేశాల నుంచి కొంటున్న తొలి యుద్ధవిమానం రాఫెల్‌ మాత్రమే. కొత్త ఆయుధాల కొనుగోలుకు ఏమాత్రం చొరవ చూపకుండా అడ్డుకట్ట వేసే రక్షణ శాఖ ‘సంప్రదాయాని’కి రాఫెల్‌ ఒప్పందం కూడా బలి అయితే ఇది నిజంగా విషాదమే అవుతుంది. 20 ఏళ్ల తర్జనభర్జన తర్వాత అత్యంత అవసరమైన ఆధు నిక యుద్ధవిమానం(రాఫెల్‌) కొనుగోలుకు నిర్ణయం తీసుకోగానే కొన్ని వదంతులు వ్యాపించాయి. ఈ వివాదం కారణంగా నేతలు ఒకరినొకరు ‘నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ’ అని దూషించుకుంటు న్నారు. ఈ ఒప్పందం వ్యవహారంలో దోషులుగా ఎవరూ పట్టుపడలేదు.

ఏమీ జరగనే లేదు. కాని అంతులేని గోల. ఫలితంగా, రాఫెల్‌ విమానాల కొనుగోలుకు మొదటి ఆర్డరు తర్వాత మళ్లీ ఇవి కావాలని ఏ ప్రభుత్వం కూడా ఫ్రెంచి కంపెనీని అడిగే ధైర్యం చేయకపోవచ్చు. దీంతో మన రక్షణ బలగాలు అవసరమైన యుద్దవిమానాలు లేక ఇబ్బం దులు పడకతప్పదు. ఈ గొడవ కారణంగా రాఫెల్‌ విమానాల కొనుగోలు కూడా ముందుకు సాగదు. తగినన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధవిమానాలు లేక వైమానిక దళం అల్లాడిపోక తప్పదేమో! రాఫెల్‌ వివాదం ఫలితంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశంలో ప్రభుత్వరంగ సంస్థ హిందూస్తాన్‌ ఏరోనా టిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)కు ఎనలేని ప్రచారం, గౌరవం దక్కడం అత్యంత ఆసక్తికరమైన అంశం. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌–ఆడాగ్‌ సంస్థతో పోల్చితే నేడు హెచ్‌ఏఎల్‌ గొప్ప కంపెనీగా కనిపిస్తుందని నేను అంగీకరిస్తాను. కాని, ఈ అత్యంత భారీ భారత సర్కారీ ఆయుధాల కంపెనీ ఏం చేస్తోందో చూద్దాం.

ప్రపంచంలోనే  నాలుగో అతి పెద్ద సైనిక దళం ఇండియాకుంది. 75 శాతం వైమానికి దళం, నూరు శాతం ఆర్మీ, 66 శాతం నౌకాదళం, నూరు శాతం కోస్ట్‌ గార్డ్‌ దళాల వైమానికి సంబంధ అవసరాలను హెచ్‌ఏఎల్‌ తీరుస్తోంది. వాటికి అవసరమైనవాటిని తయారుచేసి సరఫరా చేస్తోంది. అయితే, వ్యాపారం విలువ ఎంతో చూద్దాం. దీని టర్నోవర్‌ రూ. 18,000 కోట్లు. అంటే దేశంలో అతి పెద్ద లారీ తయారీ కంపెనీల్లో ఒకటైన అశోక్‌ లేలాండ్‌ టర్నోవర్‌లో సగమే. ఇండిగో ఎయిర్‌ లైన్స్, హిందూజాల యాజమాన్యంలోని చిన్న బ్యాంకు ఇండస్‌ఇండ్‌ టర్నోవర్‌ల కన్నా తక్కువే. బడా కంపెనీలకు స్థానం లభించే ఫార్చ్యూన్‌ 500 ఇండియా జాబితాలో హెచ్‌ఏఎల్‌ పేరు ఎక్కడో వెనుక ఉంటుంది. తన రంగంలో పూర్తి గుత్తాధి పత్యంతోపాటు తన దగ్గర మాత్రమే ఉత్పత్తులను తప్పక కొనుగోలు చేసే ఖాతాదారులన్న ఈ ప్రభుత్వ రంగం పనితీరు ఇంత గొప్పగా ఉంది.

దీని వార్షిక ఎగుమతులు రూ. 300 కోట్లు దాటవు. మీర్జాపూర్, పానిపట్‌లోని కొందరు చేనేతదారులు అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేస్తున్నారు. ఇప్ప టికి హెచ్‌ఏఎల్‌ నాలుగు వేలకు పైగా విమానాలు తయారుచేసింది. అవన్నీ కూడా ఇతర దేశాల నుంచి లైసెన్స్‌తో విదేశీ కంపెనీల విమానాలను చూసి తయారుచేసినవే. ఇంకా ఇండియా పూర్తిగా దేశంలో నిర్మించే హెచ్‌ఫ్‌–24 మారుత్‌ విమానాలు దాదాపు 150 వరకూ హెచ్‌ఏఎల్‌ నిర్మించింది. అయితే, ఈ విమానం విఫలమైంది. ఈ కంపెనీ అతి సునాయా సమైన పద్ధతిలో పనిచేస్తోంది. ప్రభుత్వ ఓ విదేశీ యుద్ధవిమానాన్ని కొనుగోలు చేస్తుంది. ఆ విదేశీ కంపెనీతో కలిసి దీన్ని దేశంలో తయారు చేయడానికి ఒప్పందం చేసుకుని ఆ పని హెచ్‌ఏఎల్‌కు అప్పగి స్తుంది. ఈ ప్రభుత్వ కంపెనీ ఇన్నేళ్లుగా ఇలాగే నెట్టుకొస్తోంది. మన రక్షణ కొనుగోళ్లలో కచ్చితంగా భారీ కుంభ కోణం చోటు చేసుకున్నట్లే మరి.

మనం దేన్నీ కొన లేని అసమర్థులం. దీనికి బలయ్యేది మాత్రం మన సాయుధ బలగాలే. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్‌ రంగ ఉత్పత్తిదారులు రక్షణ రంగంలో బలంగా పాదం మోపుతున్నప్పటికీ భారత్‌ మాత్రం వ్యతిరేకత తెలు పుతూ సొంత యుద్ధవిమానం తయారీ విషయంలో వెనుకంజ వేస్తోంది. భారత్‌లో ఆయుధాల తయారీకి మనం ప్రైవేట్‌ రంగాన్ని అనుమతించం. అదే సమ యంలో ప్రపంచ ప్రైవేట్‌ రంగం నుంచి అవే ఆయు ధాలను కొనడానికి వెంపర్లాడతాం. యూపీఏ హయాంలో నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ ఆయుధాల కొనుగోళ్లకు ప్రయత్నించడానికే భయపడిపోయారు. ప్రపంచంలోని ప్రతి ప్రధాన ఆయుధ ఉత్పత్తిదారుల సంస్థలనూ నిషేధించడం లోనే ఆయన కాలం గడిపేశారు. మోదీ ప్రభుత్వం  ప్రైవేట్‌ రంగాన్ని ముందుకు తీసుకురావడానికి సిగ్గుపడలేదు. కానీ రిలయన్స్‌–అడాగ్స్‌తో ఇన్నింగ్స్‌ మొదలెట్టమని దానికి ఎవరు చెప్పినట్లు? పారదర్శ కత, సత్యం అనేవి ఉత్తమ ఆత్మరక్షణ పద్ధతులు కాగా అహంకారం, లెక్కలేనితనంలో ప్రభుత్వం ఎందుకు మునిగి తేలుతున్నట్లు?

శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

మరిన్ని వార్తలు