ఈ దూకుడే వర్తమాన వాస్తవమా?

2 Nov, 2019 01:04 IST|Sakshi

జాతిహితం

1972 నుంచి 2014 మధ్య భారత జాతీయవాదం విస్తృతంగా వేళ్లూనుకుని, భద్రంగా సౌఖ్యమైన స్థితికి చేరుకుంది. చూడటానికి ఇదెంత అద్భుతంగా ఉందంటే ఏకకాలంలో మనం రెండు గేమ్స్‌ ఆడుతున్నాం. ఒకచోట ఒక ప్రాంతం జెండాను దించి దాన్ని జాతీయ వేడుకగా జరుపుకుంటున్నాం. మరొకచోట తమ జెండా కావాలంటున్న నాగాల డిమాండ్‌ను తోసిపుచ్చుతూనే వారి సాంస్కృతిక ఆకాంక్షలను జాతీయ పరిమితుల్లోనే గుర్తిస్తున్నాం. ఇతరుల భయం లేకుండా నువ్వు రాజకీయాలను ఎలా నడుపుతావన్నదే ముఖ్యం. భారత్‌ నేడు ఆ స్థితికి చేరుకున్నదనే చెప్పాలి. ఇవాళ చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికపరంగా భారత్‌ అత్యంత సురక్షిత స్థానంలో నిలబడింది. భారత్‌ను ప్రపంచదేశాల దృష్టిలో బలోపేతం చేసిన ఈ అతిశయ జాతీయవాదాన్ని మరింతగా దృఢపరచాల్సిన అవసరం ఉంది.

నెపోలియన్‌ బతికి ఉంటే సింహాసనం అంటే ఏమిటి అనే ప్రశ్నను సంధించి దాన్ని తిరిగి ఎలా వదిలేసి ఉంటాడు అనే అంశానికి సంబంధించి గూగుల్‌ మరింత వైవిధ్యపూరితమైన ఊహను నాకు చెబుతోంది. 1970ల నాటి ప్రామాణిక నాటకం వాటర్లూ లో నటించిన రాడ్‌ సై్టగర్‌ ఈ ప్రశ్నకు చెప్పిన సమాధానం ఈ వారం నా మదిలో మెదులుతోంది. సింహాసనం అంటే ఏమిటి అనే ప్రశ్నకు రాడ్‌ చెప్పిన సింపుల్‌ సమాధానం ఇలా ఉంటుంది. అది ఫర్నిచర్‌కు చెల్లించిన అధికమొత్తం ధర మాత్రమే. 19వ శతాబ్దం మొదట్లో సింహాసనానికి ఇంకా ప్రాధాన్యత ఉండేది. అయితే ఆధునిక ప్రపంచంలో చాలాచోట్ల సింహాసనం ఇప్పుడు ఉనికిలో లేదు. ఇప్పుడు మన చైతన్యంలోంచి మరుగుపడిపోయిన జాతీయ రాజ్యం, సింహాసనాలు, కిరీటాలు, జాతీయ గీతాలు, జాతీయ పతాకాలు వంటి చిహ్నాలను నెపోలియన్‌ ఆలస్యంగానైనా సరే ఉపయోగించి అప్పట్లో జాతీయ స్ఫూర్తిని తిరిగి తీసుకొచ్చాడు. అయితే ఆ గత చరిత్రకు చెందిన చిహ్నాలు ఇప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదు. చాంపియన్‌షిప్‌ పోటీల సందర్భంగా మన క్రీడాకారులు జాతీయ చిహ్నాలకు చాలా ప్రాధాన్యమిస్తుం టారు. అయితే ఆధునిక జాతీయ రాజ్యం మరింత స్థిరంగా, సురక్షితంగా పాతుకుపోయింది కాబట్టి అలాంటి గత చిహ్నాలకున్న విలువ ఇప్పుడు ఒక పురాజ్ఞాపకంగా మాత్రమే కొనసాగుతోంది. 

కాలం మారుతోంది, ప్రజలు మారుతున్నారు, చిహ్నాలు కూడా మారుతున్నాయి. జెండా అంటే ఏమిటి అనే అస్పష్టమైన ప్రశ్నకు ఇప్పటికీ మనం విలువ ఇస్తున్నందుకు కారణం ఉంది. ఎందుకంటే భారతదేశంలో చిరకాలం నుంచి కొనసాగుతున్న రక్తప్లావిత తీవ్రవాదం కొనసాగుతున్న నాగాలాండ్‌లో కొనసాగుతున్న శాంతి చర్చలు చివరికి ముగింపుకొస్తున్న తరుణంలో జెండా అంటే ఏమిటి అనే ప్రశ్నను తిరిగి వేసుకోవలసి వస్తోంది. తాము గతంలో భయంకరమైన తప్పులు చేశానని అటు భారత ప్రభుత్వం, ఇటు నాగాలు ఇప్పుడు అంగీకరిస్తున్నారు. హింస ఇంకా ఎంతోకాలం పనిచేయదని కూడా గ్రహించారు. అయితే నాగాలు తమ సొంత జెండాను ఇప్పటికీ కోరుకుంటున్నారు. కానీ మోదీ ప్రభుత్వం దానికి ఇష్టపడటంలేదు.  అయితే ఇరుపక్షాల మధ్య చర్చలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, సాంస్కృతిక, జాతిపరమైన సందర్భాల్లో మీరు మీ జెండాను  పట్టుకోవచ్చని ప్రభుత్వం ఇప్పడు అంగీకరిస్తోంది. అలాగయితే తమ జెండాకు ఏ ఎన్జీవో అయినా పెట్టుకునే సాధారణ జెండా గుర్తింపు మాత్రమే ఉంటుందని నాగాలు వాదిస్తున్నారు.

అత్యుత్తమ చర్చ ఏదంటే రెండు పక్షాలు అతి తక్కువ అసంతృప్తితో మాత్రమే చర్చల బల్లనుంచి వెళ్లిపోగలగడమే. చర్చల ఫలి తంలో తమకు ప్రాధాన్యత లేనప్పటికీ ఇరు పక్షాలూ తాము ఏదో ఒకటి సాధించామని చెప్పుకోవడం అని దీనర్థం. కానీ ముయ్‌వా నాగాలకు జెండాను గుర్తించకుండా సంధిపై సంతకం చేయడమంటే పెద్ద అవమానంగా కనిపిస్తోంది. ఇక మోదీ ప్రభుత్వం ముందు ఉన్న చాయిస్‌ కూడా కఠినంగానే ఉంది. ఈ అక్టోబర్‌ 31 గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌ జెండాను దింపివేసి సర్దార్‌ పటేల్‌ జయంతి కూడా కలిసివస్తున్న సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ వేడుకలు జరుపుకుంది. భారతజాతీయ వాదం ఎన్నడూ లేనంత బలోపేతంగా మారిన నేపథ్యంలో కేవలం 30 లక్షల మంది ప్రజలను మాత్రమే కలిగి ఉన్న ఒక ఆదివాసీ రాజ్యం ముందు కేంద్రం ఎలా తలొగ్గి ఉంటుంది మరి? అయితే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దివంగత ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంతో పోల్చడానికి కూడా వీల్లేదు. రాజ్యాంగ పరిధిలోనే చర్చలు కొనసాగాలని భారత్‌ పట్టుబడితే  కశ్మీర్‌ వేర్పాటువాదులు ఎలా స్పందిస్తారు అని ప్రశ్నించినప్పుడు వాజ్‌పేయి తొణుకూ బెణుకూ లేకుండా సమాధానమిచ్చారు.. ‘మేం మానవత్వ పరామితులతో చర్చలు జరుపుకుంటాం’. కానీ మోదీ ప్రభుత్వం కాస్త కఠినవైఖరి వైపుకు మళ్లింది. పట్టువిడుపులు లేని దాని వైఖరికి మొరటు జాతీయవాదం కూడా కాస్త తోడైంది. అలాంటి జాతీయవాదం తన చిహ్నాల తొలగింపు పట్ల సుముఖత ప్రదర్శిం చదు. అందుకే ఒక రాష్ట్ర పతాకను దింపిపారవేసిన ఘటనకు గాను అది వేడుక చేసుకుంటోంది.

సుప్రీంకోర్టు తన ఆదేశాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ జాతీయ గీతాలాపనను నిలిపివేయడానికి దేశంలో ఏ సినిమా హాల్‌ కూడా ధైర్యం చేయడం లేదు. సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్రదర్శించినప్పుడు లేచి నిలబడకుంటే అలాంటివారిని మూకుమ్మడిగా వేధిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే నూతన తరం భారతీయులు తాము ఒట్టి దేశభక్తులం మాత్రమే కామని జాతీయ వాదులం కూడా అని నిరూపించుకుంటున్నట్లుగా ఉంది. భారతదేశం మొత్తంగా ఒకే రాజ్యాంగం, ఒకే చిహ్నం, ఒకే నేత ఉండాలనే తన సైద్ధాంతిక వ్యవస్థాపకుల దార్శనికతకు బీజేపీ చాలా సమీపంగా వచ్చినట్లు కనిపిస్తోంది. మీరు కూడా నాలాగే 1960లలో పుట్టిన వారే అయితే, ఆ దశాబ్దంలోకి వెళ్లి చూసినట్లయితే భారత్‌ నేడు చేరుకున్న స్థితి అసాధ్యం అనే భావించేవారు. 1961–71 మధ్య పదేళ్లలో మనం నాలుగు పూర్తి యుద్ధాలను చవిచూశాం. గత అయిదు దశాబ్దాలలో దేశం అన్ని తీవ్రవాద ఉద్యమాలను, వేర్పాటు రాజకీయ ఉద్యమాలను అణిచిపెట్టగలిగే స్థితికి చేరుకోగలుగుతుందని మనం అప్పట్లో ఊహించి ఉండేవారమా?

ఆ ప్రమాదకరమైన దశాబ్దంలో భారత్‌ నిలువునా చీలిపోగలదని అమెరికన్‌ స్కాలర్‌ సెలిజ్‌ హారిసన్‌ గతంలో అభిప్రాయపడ్డారు. కానీ ఇలాంటి మేధావుల అభిప్రాయాలు తప్పని భారత్‌ నిరూపించింది. ఇవాళ చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికపరంగా భారత్‌ అత్యంత సురక్షిత స్థానంలో నిలబడింది. 2003 కాలానికి వెనక్కు వెళ్లి ఫోక్రాన్‌ అనంతరం భారత్‌ అనుసరించిన కఠిన దౌత్య పరిస్థితుల్లోకి వెళ్లి చూడండి. ఇక్కడే భారతీయ వ్యవస్థ మూలమలుపు తిరిగింది. తర్వాత 15 ఏళ్లలో భారత్‌ అత్యంత సురక్షిత స్థానంలో నిలిచేటట్టుగా పరిణతితో వ్యవహరించింది. ఈ క్రమాన్ని వెనక్కు తిప్పడం అంత సులభంకాదు.

ఎవరినైనా పక్కకు నెట్టివేయగల శక్తి, ఏ భూభాగాన్నైనా ఆక్రమించుకునే బలం ఇప్పుడు భారత్‌కు ఉన్నాయి. ఈ భద్రతను భారతీయులమైన మనం అనుభవించడంతోపాటు, ఆ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తున్నాం. దీనికి భిన్నంగా మనం కొన్ని పాత అభద్రతా భావాలను లేవనెత్తుతున్నాం. మోదీ–షా నేతృత్వంలోని బీజేపీ రాజకీయాల్లో మీకు కారణాలు కనిపిస్తాయి. కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయం చేయడం, కొన్ని అనుకోని సంఘటనల ఆధారంగా విమర్శకులు ఈ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. ఇది వాస్తవం. కానీ, దీన్ని ఎదుర్కోడానికి తగి నంత బలం భారత్‌కు ఉంది.

ఆగస్టు 5న కశ్మీర్‌లో మౌలిక మార్పులు చేసి మూడు నెలలు గడుస్తున్నా, ఈ రోజు వరకూ ఎప్పుడూ విమర్శించే మూడు దేశాలు తప్ప ఏ ఇతర దేశం ఆ చర్యలను వెనక్కు తీసుకోమని భారత్‌ను కోరలేదు. అది భారతదేశపు అంతర్గత వ్యవహారంగా భావించే మిగిలిన దేశాలన్నీ మౌనం వహించాయి. అంతమాత్రాన, అది ఎప్పటికీ ఇలాగే కొనసాగదు. కశ్మీర్‌లో చాలా త్వరగానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అక్కడి రాజకీయ నాయకులను, ప్రముఖులను ఎంతో కాలం నిర్బంధంలో ఉంచరు. సమాచార నిర్బంధం కూడా తొలగిపోతుంది. లేకపోతే స్నేహపూరిత ప్రభుత్వాలు కూడా మనవైపు నిలిచే పరిస్థితి ఉండదు. సాధారణ స్థితి నెలకొంటే కశ్మీర్‌ కూడా జాతీయ వ్యవహారాల్లో బలమైన పాత్ర పోషిస్తుంది. 

నేడు కశ్మీర్‌ సమస్య అంటే పాక్‌ నుంచి ముప్పు, ఇస్లాం ఉగ్రవాదం, జిహాదీ తదితరాలు. ఇది జాతీయ భద్రతకు విచ్చిన్నపరిచే ప్రత్యక్ష ప్రమాదం. వీటిని దృఢంగా ఎదుర్కొంటున్న ఈ అతిశయిం చిన జాతీయవాదాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ కోణం నుంచి చూస్తే మనం చాలా బలంగా ఉన్నాం అని చెప్పడానికి ఎన్నికల శాతాలు అవసరం లేదు. ఎందుకంటే, అప్పుడు ఇతరుల భయం లేకుండా నువ్వు రాజకీయాలను ఎలా నడుపుతావన్నదే ముఖ్యం. 1972 నుంచి 2014 మధ్య భారత జాతీయవాదం విస్తృతంగా వేళ్లూనుకుని, భద్రంగా సౌఖ్యమైన స్థితికి చేరుకుంది. చూడటానికి ఇదెంత అద్భుతంగా ఉందంటే ఏకకాలంలో మనం రెండు గేమ్స్‌ ఆడుతున్నాం. ఒకచోట ఒక ప్రాంతం జెండాను దించి దాన్ని జాతీయ వేడుకగా చేసుకుంటున్నాం. మరో చోట తమ జెండా కావాలనే వారి ఆకాంక్షలను పరిమితుల్లోనే గుర్తిస్తున్నాం.


- శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా