గెలుపు మత్తులో పాలన చిత్తు

14 Oct, 2017 01:37 IST|Sakshi

జాతిహితం

మొదటి ప్రేమయాత్ర దశలో రాజకీయ పలుకుబడి తారస్థాయిలో ఉన్నా, తరువాత క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. చాలా క్లిష్టమైన నిర్ణయాలన్నింటినీ ప్రజా మద్దతు అత్యంత పటిష్టంగా ఉన్న కాలంలోనే తీసుకోవాలి. నీ కృషి ఇచ్చిన ఫలితాలను కూడా చూడగలగాలి. గెలుపు యావలో మునిగిపోయిన మోదీ ప్రభుత్వం అలాంటి అమూల్యమైన అవకాశాన్ని జారవిడుచుకుంది. కఠిన నిర్ణయాలను, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోకుండా విడిచిపెట్టింది. దాని ఫలితమే ఇవాళ్టి సంక్షోభం.

విజేతలలో రెండురకాల వారు ఉంటారని చరిత్ర చెబుతుంది. ఒక రకం విజేతలు విజయం సాధించిన తరువాత పరిపాలనను సుస్థిరం చేసుకుంటారు. సామ్రాజ్యానికి పరిమితమై ప్రజల పరిస్థితిని మెరుగుపరుస్తారు. ఇంకో రకం విజేతలు ఉంటారు. వీరు నిరంతర రణ కండూతితో ఉంటారు. విజయం వీరి పాలిట ఒక యావ. మొగలాయి వంశీకులైన అక్బర్, ఔరంగజేబులను చరిత్ర ఏ విధంగా వ్యాఖ్యానించిందన్న అంశాన్ని, వారి వారసత్వం ఎలాంటిదన్న అంశాన్ని తులనాత్మకంగా చెప్పాలని ఒక పక్క మనసు ఉవ్విళ్లూరుతున్నా, ఆ ఉదాహరణలు చెప్పాలంటే మాత్రం కొంచెం ఇరకాటమే. అంతకంటే మౌర్య చక్రవర్తి అశోకుడి జీవితం నుంచి ఉదాహరణలు తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. పైగా అశోక చక్రవర్తి జీవితంలో ఆ ఇద్దరు మొగలు పాలకులకు సంబంధించిన జాడలు సచిత్రంగా దర్శనమిస్తాయి.

అశోకుడు రాజ్యాధికారం చేపట్టిన తొలి దశలో ఆయన ఒక విజేత. కానీ కళింగ యుద్ధం జరిగిన తరువాత, అంటే ఆయన పాలన మలిదశలో, శాంతికాముకుడయ్యాడు. సంస్కరణలు చేపట్టిన పాలకునిగా అవతరించాడు. చరిత్ర మీద ఒక చెరగని ముద్రను మిగిల్చినది ఈ దశలోనే. ఆధునిక పాలనా వ్యవస్థకు సంబంధించిన సూత్రాలు రూపొందడానికి ఆ సమయంలోనే పునాదులు పడినాయి. కొన్ని సహస్రాబ్దుల పాటు భారత్‌ పటిష్టంగా ఉండడానికి కావలసిన పునాదులు పడింది కూడా అశోకుని శాంతియుత పాలనాకాలంలోనే. అశోకుడు తన పాలన మలిదశలో సాధించిన ఘనత ఇదే. ఆయన కాలానికి సంబంధించిన చిహ్నాలనే మనం జాతీయ పతాకం మీద అలంకరించుకున్నాం కూడా.

సమీక్షకు ఈ కాలపరిమితి చాలు
అయితే ఒకటి. సైనిక దురాక్రమణల యుగం ఏనాడో అంతరించింది. ఇవాళ్టి నేతలు ఎన్నికల ద్వారా, పొత్తుల ద్వారా లేదంటే కుయుక్తుల ద్వారా కూడా కావచ్చు, రాజకీయాధికారం సాధించడం కోసం ప్రచార యుద్ధం చేస్తారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోదీ నమోదు చేసిన రాజకీయపరమైన విజయం భారతదేశ చరిత్రలో అనన్య సామాన్యమైనది. ఇప్పుడు మోదీ గెలిచిన స్థానాలకు మించి గతంలో గాంధీ, నెహ్రూ వంశం చాలా అధికంగానే విజయాలను సాధించి ఉండవచ్చు. కానీ అధికారంలో ఉన్నవారు ఇంత దారుణమైన ఓటమిని చవిచూసిన సందర్భం, అది కూడా ఒక బయటవాని చేతిలో చూసినది, ఎప్పుడూ లేదు. మోదీ అధికారంలో ఉండబోయే కాలంలో మూడింట రెండువంతుల కాలాన్ని బట్టి ఆయన ఇంతవరకు ఎలాంటి పాలనను అందించారో సమీక్షించడానికి అది చాలినంత సమయమే అవుతుంది. నిజాయితీగా ప్రతిబింబించే ఒక అంశం ఉంది. దానిని మోదీ కూడా అంగీకరించవచ్చు. ఆయన, ఆయన కీలక అనుచరులు వారి స్కంధావారాలకు ఏనాడూ విశ్రాంతిని ఇవ్వలేదు. వారంతా ఎడతెరిపి లేని ఒక ప్రచార యుద్ధంలో తలమునకలై ఉండిపోయారు.

ఇదొకటే కాదు, మోదీ ప్రభుత్వం, పార్టీ కూడా ఎన్నికలలో విజయం సాధించడమనే ఏకైక పరమావధి కలిగిన యంత్రాలుగా మారారు. దీనితో పాటు, నిఘా సంస్థల ద్వారా ప్రత్యర్థులను లక్ష్యం చేసుకోవడం, బీజేపీ నామమాత్రంగా ఉన్న సుదూర రాష్ట్రాలలో, అంటే క్షాత్రపుల వంటి ప్రాంతీయ పాలకులు పాలించే రాష్ట్రాలలో కొత్త కూటములకు చోటు కల్పించడం వంటి పనులూ ఉన్నాయి. ఇవన్నీ కలసి మొత్తానికి ఎంతో విసుగు కలిగించే, సహనంతో కాని సాధ్యం పడని, కొరుకుడు పడని పరిపాలనా వ్యవహారాల పట్ల వారిని పరధ్యానం వహించేటట్టు చేసేశాయి. దీని ఫలితమే ఇవాళ్టి మందకొడితనం.
పైగా ఎలాంటి సమయంలో ఈ సంకట స్థితి ఎదురైందంటే, సరైన దిశా నిర్దేశం చేసుకోవడానికి గానీ, పోయిన వైభవాన్ని తిరిగి సాధించడానికి గానీ అవసరమైన సమయం బొత్తిగా లేని వేళలో వచ్చింది. ఏదో చేద్దామనుకున్నప్పుడల్లా ఆరేసి మాసాలకు ఒకసారి రాష్ట్రాలకు ఎన్నికలు వచ్చేవి. ఆ ప్రతి ఎన్నిక రాబోయే 18 మాసాలలో జరగబోయే మరో కీలక ఎన్నికను నిర్దేశించేదే.

అజేయుడైన ఏ నాయకుడైనా కూడా గతంలో తాను సాధించిన వాటితోనే సంతృప్తి పడి ఉండిపోడు. ఇక్కడ మన ఉద్దేశం కూడా మోదీ తన రాజకీయ ప్రభను కుదించుకోవాలని కాదు. ప్రతి గొప్ప నాయకుడు కూడా తన కాలం, ఆలోచనల ప్రాధామ్యాలను గుర్తించడానికి తగినంత నైపుణ్యం, ఓరిమి కలిగి ఉంటాడు. వీటన్నింటికీ మించినది ఒకటి ఉంది. అది, వారి రాజకీయ పలుకుబడి. మొదటి ప్రేమయాత్ర దశలో ఆ పలుకుబడి తారస్థాయిలో ఉన్నా, తరువాత క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. చాలా క్లిష్టమైన నిర్ణయాలన్నింటినీ ప్రజా మద్దతు అత్యంత పటిష్టంగా ఉన్న కాలంలోనే తీసుకోవాలి. నీ కృషి ఇచ్చిన ఫలితాలను కూడా చూడగలగాలి. ప్రచారయావలో మునిగిపోయిన మోదీ ప్రభుత్వం అలాంటి అమూల్యమైన అవకాశాన్ని జారవిడుచుకుంది. కఠిన నిర్ణయాలను, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోకుండా విడిచిపెట్టింది. దాని ఫలితమే ఇవాళ్టి సంక్షోభం.

2014 సంవత్సరం నాటి ఎన్నికలలో బీజేపీ/మోదీ చేసిన అద్భుత ప్రచారంలో మూడు కోణాలు ముఖ్యంగా కనిపిస్తాయి. అవి: అచ్ఛే దిన్‌ (మంచి రోజులు), దృఢమైన జాతీయ భద్రతా విధానం, అవినీతి వ్యతిరేక పోరాటం. ఇందులో చివరి కోణానికి అసాధారణమైన ప్రచారాన్ని తీసుకువచ్చారు. విదేశాలకు తరలిన లక్షల కోట్ల రూపాయలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, అలా తిరిగి తెచ్చిన సొమ్మును రూ. 15 లక్షల మేరకు చెక్కు రూపంలో ప్రతి భారతీయునికి పంపుతామని, అవినీతిపరులైన పెద్దమనుషులను అరెస్టు చేసి ప్రాసిక్యూట్‌ చేస్తామని చేసిన వాగ్దానం భారీ స్థాయిలో ప్రచారాన్ని సంతరించుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యానికి చేర్చిన తరువాత తెలివైన ఏ నాయకుడైనా దిగి వెళ్లిపోయే గుర్రం అంటే ఇదే. కానీ మోదీ ప్రభుత్వం ఆ గుర్రంతో ప్రేమలో పడింది. పాలన 42 మాసాల కాలంలో చూస్తే బ్యాలెన్స్‌ షీట్‌లో ఉన్నది చాలా తక్కువ. ఓడిపోయిన ప్రత్యర్థుల మీద తనిఖీల దాడులు, కొన్ని కేసులు, భీతాహమైన కొత్త పన్నుల యుగం, స్వాధీనం చేసుకున్న కొద్దిపాటి సంపద ఇవే అందులో కనిపిస్తాయి. ఇంకా ఏమైనా ఉన్నాయంటే, విజయ్‌ మాల్యా వంటి ఆశ్రిత పెట్టుబడిదారుడైన అవినీతిపరుడు భారతదేశం నుంచి పలాయనం చిత్తగించడమే కాకుండా, బ్రిటన్‌ నుంచి అతి పైశాచికంగా భారతదేశం కంటిలో కారం కొడుతున్నాడు. ఇక పెద్ద పథకం ప్రకారం సాహసోపేతంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నల్లడబ్బును వెలికి తేవడంలో దారుణంగా విఫలమైందని ఇప్పుడు రుజవైంది. ఇది అసంఘటిత రంగాన్నీ, సరఫరా వ్యవస్థలనీ కకావికలు చేసింది. అసలే మందగించిన ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసింది. జీఎస్‌టీ విజయావకాశాలను కూడా ఇది దారుణంగా దెబ్బతీసింది.

ఆలస్యం అమృతం విషం
రాజకీయంగా విస్తరించడమే నిత్యకృత్యంగా ఉన్న ప్రభుత్వం ప్రధాన విధానాలపై నిర్ణయాలను నిరీక్షణలో ఉంచింది. బుల్లెట్‌ రైలు ఇందుకు ఒక ఉదాహరణ. దీని నిర్మాణానికి ఐదేళ్లు కాలం పడుతుందనుకుంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ఆ పనిని ఆరంభించడం తెలివైన చర్య అవుతుంది. దీనితో ప్రభుత్వ కాలపరిమితి పూర్తయ్యే సమయానికి అందుకు సంబంధించిన సత్పలితాలు ప్రస్ఫుటమయ్యేవి. కానీ ఇప్పటికే ఇది చాలా ఆలస్యమైంది. బుల్లెట్‌ రైలు ఇచ్చే ఫలితాలను చూడడానికి వచ్చే 18 మాసాల కాలం ఏమాత్రం సరిపోయేది కాదు. దీనితో ఒక మంచి ఆలోచన గురించి కూడా ఆర్థికంగా భారమంటూ విపక్షం చులకన చేయడానికి అవకాశం కల్పించినట్టయింది. బ్యాంకులను బాగు చేయడం, ముంబై కోస్టల్‌ రోడ్, కొత్త విమానాశ్రయం వంటి భారీ మౌలిక వసతి కల్పనా పథకాలు కూడా అలాంటివే. వీటికి ఇంతవరకు పునాది కూడా పడలేదు.

ముంబై దగ్గరే సముద్ర జలాలలో తలపెట్టిన శివాజీ స్మారక నిర్మాణం పని ఇంతవరకు ఆరంభం కాకపోవడం పథకాలు చేపట్టడంలో ఘనాపాటి అని చెప్పుకునే ప్రభుత్వానికి ఇరకాటం కలిగించేదే. భారీ స్థాయిలో ఆలోచించిన మేక్‌ ఇన్‌ ఇండియా పథకం నిలిచిపోయింది. రాఫెల్‌ల ఆర్డరు మినహా రక్షణ పరికరాల సేకరణ వ్యవహరంలో కూడా ఎలాంటి పురోగతి సాధించలేదు. భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకున్న ప్రభుత్వమిది. అందుకే ఒక విషయం చెప్పాలి. ఈ మూడు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం సేకరించుకున్న రక్షణ సామగ్రి ఏదైనా ఉన్నదీ అంటే, అది యూపీఏ ప్రభుత్వం ఆర్డరు ఇచ్చిన సామగ్రిని దిగుమతి చేసుకోవడం మాత్రమే. సైనిక వ్యవస్థకు సంబంధించిన సామగ్రిని సేకరించడానికి ఎక్కువ సమయమే తీసుకుంటుంది. కానీ సైన్యం దాడిలో ఉపయోగించే తుపాకీలపై నిర్ణయం తీసుకోవడానికి, ఇలాంటి ఒక మౌలిక నిర్ణయం తీసుకోవడానికి మూడున్నర సంవత్సరాలు నాన్చడం మాత్రం దారుణం.

మితిమీరిన విశ్వాసం
బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణల నుంచి ఆర్థిక వ్యవస్థ పునర్వ్యస్థీకరణ వరకు, బుల్లెట్‌ రైలు మొదలు నవీ ముంబై విమానాశ్రయం వరకు, మధ్య తరహా యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేయడం గురించి ఆలోచించడంతోనే ఎన్డీయే సమయమంతా గడిచిపోయింది. నరేంద్ర మోదీ వంటి శక్తిమంతుడైన, నిశిత బుద్ధికలిగిన నాయకుడు ఇలాంటి నిర్ణయాలను ఎందుకు ఆలస్యం చేసినట్టు? ఇందుకు సంబంధించి ఇక్కడో సూత్రీకరణ ఉంది. 2014 లోను, ఆ తరువాత రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలోను బీజేపీ సాధించిన విజయం, రెండో పర్యాయం కూడా ఖాయంగా అధికారంలోకి తీసుకువస్తుందన్న నమ్మకాన్ని కలిగించింది. దీనితోనే మొదటి దశలో రాజకీయ దండయాత్రకు, జాతీయ స్థాయిలో లేదా ప్రాంతీయ స్థాయిలో విపక్షాన్ని నాశనం చేయడానికి బీజేపీ సమయం కేటాయించింది. పాలన వంటి కఠినమైన పనులు చేయడానికి రెండో ఇన్నింగ్స్‌ను ఎంచుకుంది. కానీ క్రికెట్‌ అంటే అద్భుతమైన అనిశ్చిత క్రీడ మాత్రమే కాదు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే రాజకీయాలు నిర్లక్ష్యాన్ని సహించవు. మోదీ ప్రభుత్వ వైభవం క్షీణిం చడం వెనుక ఉన్న వివరణలలో ఇదొకటి.

వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
శేఖర్‌ గుప్తా
twitter@shekargupta

మరిన్ని వార్తలు