అణచివేతతో సాధించేది శూన్యం

27 Aug, 2019 00:44 IST|Sakshi

జాతిహితం

మితవాద జాతీయ శక్తుల దృఢమైన విశ్వాసాలు వాస్తవపరీక్షకు, హేతుబద్ధతకు నిలబడేవికాదు. కశ్మీర్‌ గడ్డలోని వైవిధ్యతను హత్తుకోవడమే అక్కడి ప్రజల హృదయాలనూ, మనసులనూ గెలవడానికి గల అత్యుత్తమ మార్గం. అందుకు వాజీపేయి విధానాలు అనుసరించడమే ఉత్తమం

ఇంతకు ముందు మనం  ఉదారవాదుల్లో జమ్మూ–కశ్మీర్‌పై గూడుకట్టుకున్న అయిదు ప్రధానమైన కల్పితాలను ప్రస్తావించాం. అసలైన కఠోర వాస్తవాలు ఏమిటో చెప్పాం. ఈసారి మనం మితవాద జాతీయ శక్తుల్లో పేరుకుపోయిన విశ్వాసాలేమిటో పరిశీలిద్దాం. నరేంద్ర మోదీ–బీజేపీలకుండే అసంఖ్యాకమైన వోటర్లను పరిగణనలోకి తీసుకుంటే దీన్నొక అతి పెద్ద సమూహంగా భావిం చాలి. ఈ సమూహానికి 370 అధికరణ,  కశ్మీరీ నేతల ద్రోహచింతన ప్రధాన సమస్య. ఆ రాష్ట్రానికి దేశ పాలనా వ్యవస్థ సమష్టిగా అన్యాయం చేసిందని తెగ బాధపడిపోయే ఉదారవాదుల భావన వంటిదే ఇది. బహుశా దానికన్నా ఒకింత ప్రబలమైనదనే చెప్పాలి.  క్షేత్రస్థాయి వాస్తవాలు, నిజానిజాలపై అవగాహనలేమి నుంచే మితవాద జాతీయ భావావేశం పుట్టుకొచ్చింది.  

మితవాద, వామపక్ష, మధ్యేవాద అపోహలు జాతీయ ప్రయోజనానికి లేదా కశ్మీరీ సమస్య పరిష్కారానికి ఏమాత్రం తోడ్పడవు. కనుకనే మనం వాస్తవాలు, హేతుబద్ధతలపై వెలుగును ప్రసరింప జేయాలి. నమ్మకాలు మనోహరంగానే ఉంటాయి. కానీ అవి వాస్తవాధారితాలు కాకపోతే ప్రమాదభరితమవుతాయి. అందుకే జాతీయవాదుల్లోని అయిదు ప్రధాన అపోహలేమిటో చూద్దాం. 

అందులో మొదటిది, కీలకమైనది 370 అధికరణ, దానిద్వారా కశ్మీర్‌కి దక్కిన స్వయంప్రతిపత్తి. వారి దృష్టిలో ఇదే సమస్యకు మూలం. సరే ఇప్పు డది ఎటూ ముగిసిపోయింది. కొత్త చరిత్రను సృష్టించారు. కానీ సమస్య కూడా అలా ముగిసిపోతుందా? కొత్త చరిత్ర సృష్టించినంత మాత్రాన పాతది తుచిపెట్టలేం. జాతి చేతనలోనూ, కశ్మీర్‌లోనూ 370 అధికరణ చాలా ఉద్వేగభరితమైనది. అలాగే గత 69 ఏళ్లుగా అది తాత్కాలికమైనదిగానే ఉండిపోయింది. చివరికది తన పూర్వపు రూపానికి ఒక నీడలా కూడా మిగలనంతగా నీరుగారింది. వీపీసింగ్‌ మినహా మన ప్రధానులంతా దాన్ని నీరుగార్చడానికే ప్రయత్నించారు. మోదీ ప్రభుత్వం ఈ నెల మొదట్లో రద్దు చేయడం లాంఛనప్రాయం మాత్రమే. 

కేవలం రక్షణ, విదేశీవ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్‌ వ్యవహారాల్లో మాత్రమే కేంద్రం ప్రమేయం ఉంటుందన్న నియమం కాస్తా ఇప్పుడు రద్దయి రాజ్యాంగంలోని 395 అధికరణల్లో 290 దానికి నేరుగా వర్తించేలా మారింది. కొన్ని ఇతర సమస్యలైతే ఉన్నాయి. వాటిల్లో స్థానికేతరులను పెళ్లాడే కశ్మీరీ మహిళలకు వారసత్వ హక్కు నిరాకరించడం, వారి పిల్లల్ని కశ్మీరీలుగా గుర్తించకపోవడం, తక్షణ తలాక్‌పై, స్వలింగసంపర్కుల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు వర్తింపజేయకపోవడంవంటి అంశాలపై వచ్చే డిమాండ్లు ఉదారవాద కోర్కెలే. పాక్‌ను దురాక్రమణదారుగా, అక్కడి అలజడికి ప్రధానకారకంగా భావించడం కూడా ఈ కేటగిరీలోని కాల్పనికతలే. 

రెండోది–1948 మొదలుకొని జాతీయవాద చర్చల్లో ఉన్నది మన సైన్యానికి సంబంధించింది. పాకిస్తానీలనుంచి గిల్గిట్‌–బాల్టిస్తాన్‌లతోసహా మన కశ్మీర్‌ భూభాగం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా నెహ్రూ మెతకగా వ్యవహరించి ఐక్యరాజ్యసమితి మెట్లెక్కారని, అదే గనుక సర్దార్‌ పటేల్‌కు అప్పగించి ఉంటేనా...అనేది  ఆ కాల్పనికత సారాంశం. కానీ వాస్తవం వేరు. అది మారదు. దాన్నెవరూ మార్చలేరు. 1947–48 మధ్య రెండు సీజన్‌లలో సాగిన యుద్ధానికి శీతాకాలంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాల సైన్యాలకు సంబంధించి మీకు అందుబాటులో ఉన్న మిలిటరీ పత్రాలు చూడండి. భౌగోళిక, క్షేత్రస్థాయి, సైనిక వ్యూహతంత్ర, శక్తిసామర్థ్యాలను గమనించండి. పురోగమనానికి ఇరుపక్షాలకు ఉండే అవరోధాలు అర్ధమవుతాయి. బహుశా తొలి దశ మొదట్లోనే...అంటే నవంబర్, డిసెంబర్‌ మధ్య ప్రయత్నిస్తే ఉడి వద్ద మన దళాలు పురోగమించి ముజఫరాబాద్‌లోనికి చొచ్చుకొని వెళ్లగలిగేవి. 

అయితే బనిహాల్‌ మార్గం మంచుతో కూరుకుపోతే తప్ప విమానాల ద్వారా లేదా రోడ్డు మార్గంలో దళాల తరలింపు సాధ్యం కాదు. ఇరు దేశాల్లో ప్రచారంలో ఉన్న భిన్న కథనాలు 1948లో అయితే సులభంగా విజయం చేజిక్కేదని చెబుతాయి. కానీ ఇవన్నీ పోటాపోటీ కల్పనలు. ఒక సంగతి గుర్తుంచుకోండి. ఈ యుద్ధ సమయానికి ఇరు దేశాల సేనలనూ బ్రిటిష్‌ చీఫ్‌లే నడిపించారు. విభజన తర్వాత సైన్యం కేటాయింపు సమంగా జరగలేదు. పాకిస్తాన్‌కు అవిభక్త సైన్యంలో మూడోవంతు, ఆర్థికంలో ఆరో వంతు దక్కింది.

ఈ పరిస్థితి దేశాన్ని దెబ్బతీసింది. 1947–48లో సైనికపరంగా ఉన్న ఆ అగాథంతో హిమవన్నగాలపై విజయకేతనం ఎగరేయడం అసాధ్యం. ఆ సంగతలా ఉంచి ఇప్పుడు ఆక్రమిత కశ్మీర్‌ నుంచి పాకిస్తాన్‌ను తరిమేయడం సాధ్యమేనా? అది కుదరని పని అని ఎంతో వినమ్రంగా చెబుతున్నాను. 1948 నుంచి మనం అనేక యుద్ధాలు, ఘర్షణలూ చూశాం. చివరికి మనం స్వాధీనం చేసుకున్నది సియాచిన్‌ మంచుపర్వతశ్రేణి. కొన్ని కమాండో–కామిక్‌ చానళ్లను కాస్సేపు పక్కనబెడితే పాకిస్తాన్‌ సైన్యాలు ఆత్మరక్షణలో దిట్ట అని మనం గుర్తుంచుకోవాలి. 1948లో కోల్పోయిన భూభాగం పునఃస్వాధీనమైనా,ఆక్రమిత కశ్మీర్‌ను జయించడమైనా అహేతుకమైన పుక్కిటి పురాణాలేనని తెలుసుకోవాలి.  

మూడోది–కశ్మీరీలు వినయవిధేయతలున్నవారు, శాంతస్వభావులు, దేశభక్తి మెండుగా ఉన్నవారు. కానీ పాకిస్తానీ ప్రచారంతో, మిలిటెంట్‌ ఇస్లాంతో సైద్ధాంతికంగా కలుషితమయ్యారు. కొన్నాళ్లక్రితం వరకూ అయితే మొదటిది సత్యం. ఈ మూడు దశాబ్దాల తిరుగుబాటు ఉద్యమాల తొలినాళ్లలో చాలామంది సాయుధులు పాకిస్తాన్‌కి చెందినవారే. 90వ దశకం మొదట్లో ఆఫ్రికా, అరబ్‌ దేశాలనుంచి ఐఎస్‌ఐ ప్రాపకంతో వచ్చిన జిహాదీలను కశ్మీరీలు ఛీత్కరించుకునేవారు. కానీ పదే ళ్లుగా ఈ తిరుగుబాట్లు దేశీయమయ్యాయి. కశ్మీరీ యువత ఆగ్రహంతో, అవమానభారంతో రగిలిపోతోంది. ఆయుధాలు పట్టడానికి సిద్ధపడుతోంది. మరణించిన లేదా పట్టుబడిన మిలిటెంట్ల నేపథ్యాలు చూస్తే ఇది ధ్రువపడుతుంది. మిలిటెం ట్లకు అవసరమైన ఆయుధాలు లోయలో విస్తారంగా ఉన్నాయి. మరిన్ని సరఫరా చేయడానికి పాకిస్తాన్‌కు లోటులేదు. కశ్మీర్‌ కేంద్రం పరిధిలోకి వెళ్లింది గనుక పోలీసులపై నియంత్రణ ఉంటుంది. కానీ అది ఉగ్రవాదానికి చరమగీతం పాడలేదు.  

నాలుగు–కశ్మీరీలకు పెట్టుబడులు,ఆర్థికాభివృద్ధి అవసరమనేది వాదన. దీన్ని నమ్మడమంటే మానవ మనస్తత్వాన్ని అడ్డగోలుగా అపార్థం చేసుకోవడమే. అక్కడి ప్రజల ఆగ్రహాన్ని, అవమానాలను, పరాయీకరణను పట్టించుకుని సరైన పరిష్కారం చూపకపోతే ఎంత ఆర్థికాభివృద్ధి అయినా, ఉదారత అయినా జన హృదయాలను మార్చలేవు. ఆస్తుల్ని కొనిపించడంద్వారా, బయటివారిని అక్కడ స్థిరపరచటం ద్వారా, అక్కడి మహిళలను పెళ్లాడటం ద్వారా... అసంబద్ధంగా, మొరటుగా జనాభా సమతూకాన్ని మార్చేస్తామంటే అది పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. జమ్మూ–కశ్మీర్‌ భారత్‌ భూభాగం. దాన్నెవరూ ౖకైవసం చేసుకోలేరు. కానీ లోయలోని ప్రజలు మీతో లేకుంటే దాన్ని మీరు మార్చలేరు. 

ఇక చివరిది, అయిదోది అత్యంత సున్నితమైన కాల్పనికత. ఇది స్వీయ వినాశనానికి చేరువచేసేంత ప్రమాదకరమైనది కూడా–అది జనాభా సమతూకాన్ని మార్చాలనుకోవడం. ఇజ్రాయెల్‌ గుణపాఠాలను, వాటి సారాంశాన్ని సరిగా గ్రహిస్తే మీరసలు ఆ పనికే పూనుకోరు. ఇక్కడ కశ్మీర్‌ భూభాగం మన స్వాధీనంలోనే ఉంది. పాకిస్తాన్, చైనాలు తప్ప ప్రపంచంలో అందరూ దీన్ని గుర్తించారు. కానీ ఇజ్రాయెల్‌కు అలా కాదు. అది యూదు దేశమైతే, మనది లౌకికవాద గణతంత్రం. కశ్మీర్‌లో అది సాధ్యపడాలంటే కోటిమంది హిందువులను అక్కడ స్థిరపరచాలి. అది చైనాలో సాధ్యమేమోగానీ ఇక్కడ కాదు. అలాంటి పని చేసి కూడా అది టిబెట్‌లోగానీ, జిన్‌జియాంగ్‌లోగానీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నది. అటు ఇజ్రాయెల్‌కు కూడా ఈ పని భద్రతను, సుస్థిరతను చేకూర్చలేకపోయింది.  

చైనా, ఇజ్రాయెల్‌ దేశాల కఠినత్వం మనల్ని విస్మయపరుస్తుంది. కానీ వీటికి లేని సామర్థ్యం మనకుంది. వైవిధ్యతను సులభంగా హత్తుకునే సామర్థ్యమది. కశ్మీర్‌కు చేరువ కావడానికి అదే అత్యుత్తమ విధానం. హృదయాలను, మనసులను గెలవడానికి అదే మార్గం. వారి ఆత్మగౌరవానికి, వారి ప్రతిష్టకూ, వారి విలక్షణతను పరిరక్షించడానికి పాకిస్తాన్‌ కన్నా మనం మెరుగైన ప్రతిపాదన చేయగలమా? ఇప్పుడు మనం వాజపేయి విధానాల ద్వారా నేర్చుకోవాలి తప్ప జీ జిన్‌పింగ్‌ విధానాలద్వారా కాదు.  


వ్యాసకర్త: శేఖర్‌ గుప్తా, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

>
మరిన్ని వార్తలు