కమలం ఓడినా.. హిందుత్వదే గెలుపు

30 Nov, 2019 00:43 IST|Sakshi

జాతిహితం

ఇందిరతో పోలిస్తే నరేంద్రమోదీ ప్రాభవం లోక్‌సభ ఎన్నికలకే పరిమితమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అనేక రాష్టాల్లో గత రెండేళ్లలో బీజేపీ ప్రభావం 71 నుంచి 41 శాతానికి పడిపోయింది. అయినా సరే లోక్‌ సభ ఎన్నికల్లో మెజారిటీ ప్రాతిపదికన బీజేపీ దేశవ్యాప్తంగా తన ప్రభావం చూపుతూనే ఉంది.  చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంతో సమాఖ్యతత్వం నిజమైన అర్థంలో అమలువుతున్నట్లు ప్రస్తుతం కనిపిస్తున్నా హిందుత్వకు జాతీయ స్థాయిలో సమర్థన లభిస్తోంది. ఆరెస్సెస్‌/బీజేపీల గుత్త హక్కుగా కనిపించిన ఆర్టికల్‌ 370, రామాలయ వివాదం, ఉమ్మడి పౌరస్మృతి వంటివాటిపట్ల దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం సాధ్యమవుతోంది. ఇది భావజాలపరంగా ఆరెస్సెస్‌ విజయమే. అందుకే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పుట్టి మునుగుతున్నా, హిందుత్వ మాత్రం నేటికీ గెలుస్తూనే ఉంది.

అటు నిరాశావాదం.. ఇటు ఆశావాదం.. అనే పాత సామెత ప్రకారం, 2017 నుంచి ఇప్పటిదాకా భారత రాజకీయ పటంలో కాషాయ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోందని గ్రాఫిక్స్‌ ఆధారిత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ప్రకారం గత రెండేళ్లలో భారతీయ రాష్ట్రాలలో బీజేపీ పాలన 71 నుంచి 40 శాతానికి పడిపోయింది.  కాషాయపార్టీ ప్రజాదరణ శిఖరస్థాయికి చేరిందని, నరేంద్రమోదీ ఆధిపత్యం తిరుగులేనిదని అందరూ భావిస్తున్న సమయంలోనే బీజేపీ పరిస్థితి ఇలా దిగజారిపోవడం గమనార్హం. అయితే ఇది నిరాశావాదం దృక్పథానికి సంబంధించింది. ఆశావాద దృక్పథంతో చూసినట్లయితే ఈ సంవత్సరం మే నెలలో లోక్‌సభ ఎన్నికల తర్వాత చూస్తే బీజేపీ ఒక బలమైన రాజకీయ వాస్తవంగా కనిపిస్తుంది.  తూర్పున హిందీ ప్రాబల్య ప్రాంతం నుంచీ ఈశాన్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో, పశ్చిమ తీర ప్రాంతాల్లో బీజేపీ పాలన అప్రతిహతంగా సాగుతోంది. ఇప్పటికిప్పుడు తాజాగా ఎన్నికలు జరిగినా 2019 మేలో వెల్లడయిన ఫలితాలకు భిన్నంగా రాకపోవచ్చు. మరి మోదీ విమర్శకులు ఇప్పుడెందుకు పండుగ చేసుకుంటున్నట్లో?

అయితే, రాజకీయ వాస్తవం సంక్లిష్టమైంది. కాషాయ పార్టీకి చెందిన అనేక ఛాయలను ఇది ప్రతిబింబిస్తుంది. వీటిలో కొన్నింటిని చూద్దాం. నరేంద్రమోదీ ఎంత మహామూర్తిమత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆయన ఇందిరాగాంధీ కాదు. ఇందిర శకం నుంచి భారతీయ వోటర్‌ పరిణితి చెందుతూ వచ్చాడు. లోక్‌సభ, విధాన సభకు మధ్య వోటింగ్‌ ఎంపికల గురించి ఆమె స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రదర్శించేవారు. ఇందిరాగాంధీకిలాగే మోదీ కూడా లోక్‌సభ ఎన్నికల సందర్భంలో అనామకుడికి సీటు ఇచ్చినా గెలిపించుకునే స్థితిలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. కానీ ఇందిరాగాంధీకి మల్లే రాష్ట్లాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించినప్పుడు మోదీ ఈ మ్యాజిక్‌ను పునరావృతం చేయలేరు. దీనికి స్పష్టమైన ఉదాహరణగా మహారాష్ట్రను చూపవచ్చు. అలాగే హరియాణా కూడా. లోక్‌సభ ఎన్నికలు ముగి సిన అయిదు నెలలలోపే ఈ రాష్ట్రంలో బీజేపీ ఓటు దాదాపు 22 శాతం పాయింట్లను పోగొట్టుకుంది. అంటే 58 నుంచి 36 శాతానికి పడిపోయింది. హరియాణాలో విజయదుందుభిని మోగిస్తామని పార్టీ పూర్తిగా అంచనా వేసుకున్న చోట మెజారిటీకి కాస్త దూరంలో నిలిచిపోయింది. ఆర్టికల్‌ 370ని రద్దుచేసిన 11 వారాల్లోపు బీజేపీకి హరియాణాలో ఇంత గట్టిదెబ్బ తగిలింది.

2014లో ఘనవిజయం సాధించిన తర్వాత కూడా మోదీ ఒక నిర్దిష్ట రాష్ట్రంలో గెలుపు సాధించలేదు. 2017లో ఉత్తరప్రదేశ్, హరి యాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, అసోం వంటి కొన్ని చిన్న రాష్ట్రాలు దీనికి మినహాయింపు. ఇక్కడ కూడా 2015లో ఢిల్లీలో ఘోర పరాజయం చవిచూశారు. తర్వాత పంజాబ్‌లోను అదే జరి గింది. ఇక 2017లో ఘనవిజయం తప్పదని భావించిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీస విజయం వద్దే ఆగిపోయారు. దానికి సైతం మోదీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్‌పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, బళ్లారి బ్రదర్స్‌తో అసాధారణ స్థాయిలో రాజీలు కుదుర్చుకున్నప్పటికీ బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించలేకపోయింది. తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర్‌లాల్లో ఏకంగా ఓటమినే చవిచూసింది.

ఇప్పుడు ఈ సంఖ్యలను కాస్త తిరగేయండి. పంజాబ్‌ మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపి అధికారం కోల్పోయింది లేక నిర్ణయాత్మక విజయం సాధించడంలో విఫలమైంది. అయితే ఇదే రాష్ట్రాల్లో లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఇక ఢిల్లీలో, రాజస్తాన్‌లో, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ఆప్, కాంగ్రస్‌ చేతుల్లో ఓడిపోయింది. ఈ ఫలితాలను మదింపు చేస్తే, ఒకేపార్టీ ఆధిపత్యం రాజ్యమేలిన ఇందిరాగాంధీ శకంలోలాగా కాకుండా, నేడు భారత్‌ మరింత ఎక్కువగా సమాఖ్య దేశంగా పరిణమించింది. లోక్‌సభ, శాసససభల ఎన్నికల్లో ఓటరు పూర్తి వ్యత్యాసం ప్రదర్శించినట్లయితే, బీజేపీ పట్ల శత్రుభావం కలిగి ఉండని పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో తమ పట్టు సాధించుకున్నాయి. నవీన్‌ పట్నాయక్, కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, బహుశా డీఎంకే కూడా ఈ కోవకు చెందుతారు.

ఈ పరిణామం అరవింద్‌ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి ప్రత్యర్థులకు సంతోషం కలిగించింది. లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా ఘర్షణ పడిన మమతా ఆరునెలల్లోపే ఈవారంలో జరిగిన మూడు ఉపఎన్నికల్లో విజయ కేతనం ఎగరేశారు. మరీ రెండు స్థానాల్లో అఖండ విజయం సాధించారు. ఇక్కడ కూడా ఓటర్‌ ప్రదర్శించిన వ్యత్యాసం కనబడుతుంది. ఇక నవ్వులు చిందిస్తున్న మూడో రకం ప్రాంతీయ నేత నితీశ్‌ కుమార్‌. ఈయన స్వయానా బీజేపీ భాగస్వామి. బిహార్‌ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇక అసోంలో జాతీయ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకత తెలుపుతున్న ప్రపుల్ల కుమార్‌ మహంతా తన స్థానాన్ని పునరుద్ధరించుకోవచ్చు.

ప్రస్తుతం బీజేపీ చేతిలో 17 రాష్ట్రాలు ఉంటున్నప్పటికీ దీన్ని అర్ధసత్యంగానే చెప్పాలి. వీటిలో బిహార్, హరియాణాల్లో కాషాయపార్టీకి పూర్తి భిన్నమైన సైద్ధాంతిక దృక్పథం ఉన్న మిత్రపక్షాలతో బీజేపీ భాగస్వామ్యం పంచుకుంది. ఇక మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్‌ వంటి రాష్ట్రాలు ఎల్లప్పుడూ రాజకీయ బేరసారాలకు లోనై స్థానాలు మార్చుకుంటుంటాయి. సిక్కిం, మిజోరంలు ఎన్డీయేలో ఉంటున్నాయి తప్పితే అవి బీజేపీ పాలనలో లేవు. మరోవైపున బీజేపి ఇంతవరకు ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అనే మూడు ప్రధాన రాష్ట్రాల్లోను మాత్రమే తన చేతిలో పెట్టుకుని ఉంది. చివరిదైన కర్ణాటకలో అస్థిరత్వమే కొనసాగుతోంది.

మోదీ–షా వైభవం ప్రభవిస్తున్నందున, బీజేపీ ఒకే ఒక సులభమైన ఫార్ములాను అనుసరించింది. హిందూ ప్రాబల్య ప్రాంతాన్ని, రెండు పశ్చిమ భారత రాష్ట్రాలను చుట్టేయడం. వీటిలో కీలక విజయం ద్వారా మాత్రమే బీజేపీ ఇతరప్రాంతాల్లో చిన్నా చితకా విజ యాలు సాధిస్తూ భారతదేశాన్ని ఏలుతోంది. రాష్ట్రాల్లో ఇది ప్రతిఫలించకపోతే మీరు తప్పకుండా సమానత్వానికి కట్టుబడి ఉండవచ్చు. దీనర్థం ఏమిటంటే, రాష్ట్రాల సీఎంలతో బీజేపీ చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక మమతా వంటి ముఖ్యమంత్రులయితే మీరు ప్రవేశపెట్టే ఆయుష్మాన్‌ భారత్‌ వంటి మంచి, భారీ ప్రణాళికలను ముందుకు తీసుకుపోవడానికి కూడా తిరస్కరించవచ్చు.

ఇలాంటివారు మీ ఆదేశాలకు ఇకపై తలొగ్గరు. మీరు వారిపట్ల గౌరవం ప్రదర్శించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వారిని సమానులుగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధాని పదే పదే చెబుతున్న సహకారాత్మక సమాఖ్య తత్వం అనేది ఇక మాటలలో కాక చేతల్లో చూపాల్సి ఉంటుంది. ఉదాహరణకు మహారాష్ట్రను తీసుకోండి. ఎన్సీపీ, కాంగ్రెస్‌లు శివసేనతో ఎందుకు కలిశాయి. తొలి రెండు పార్టీలు అక్కడ ఉనికి, అధికారాలకోసం పోట్లాడుతున్నాయి. కానీ శివసేన ఎందుకు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు? సైద్ధాంతికంగా తమకు పట్టున్న చోట బీజేపీ వేగంగా విస్తరిస్తోంది. ఏకైక పార్టీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా శివసేన నేరుగా ప్రదర్శించిన స్వీయరక్షణా ప్రతిస్పందనగానే దీన్ని చూడాలి. భావసారూప్యం కూడా ఇక్కడ పనిచేయలేదు.

ఇక కేంద్ర–రాష్ట్రాల సమీకరణాలు 1989–2014కి సంబంధించి 25 సంవత్సరాల చరిత్రకు మళ్లీ దగ్గరవుతోంది. దీనికి సంబంధించి మహారాష్ట్రలో వస్తున్న సవ్వడి ప్రత్యేకమైనది. ప్రధాని మానస పుత్రిక అయిన బుల్లెట్‌ రైలును వీరు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా, ఆర్టికల్‌ 370, అయోధ్య ఆలయ సమస్యవంటివి భారత రాజకీయాలనే విడదీస్తూ బీజేపీ/ఆరెస్సెస్‌కు అనుకూలతను సృష్టిం చేవి. కానీ ఇప్పుడు కశ్మీర్, రామాలయం, ఉమ్మడి పౌరస్మృతి వంటివి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయాన్ని కూడగడుతున్నాయి.

కేరళలో వామపక్ష ప్రభుత్వం కూడా శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేకపోతోంది. రాహుల్‌ గాంధీ  తరచుగా ఆలయాలను సందర్శిస్తూ, తన బ్రాహ్మణ గోత్రాన్ని చెప్పుకోవలసి వస్తోంది. భారత రాజకీయ చిత్రపటంపై ఎలాంటి రాజకీయ క్రీనీడలు కనిపిస్తున్నప్పటికీ, ఆరెస్సెస్‌/బీజేపీ భావాలకు సంబంధించినంతవరకు అది కాషాయ రంగును పులుముకుంది. ఆరెస్సెస్‌ కానీ, బీజేపీ కానీ ఇప్పుడు సులభంగా విజయాన్ని ప్రకటించవచ్చు. హెగ్డేవార్, గోల్వాల్కర్, సావర్కార్‌ వంటివారు దీనికి అంగీకరిస్తారు కూడా.

వ్యాసకర్త: శేఖర్‌ గుప్తా,
ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా