ఇప్పటికీ ‘ఇందిరమ్మ’ పాలనే!

18 Nov, 2017 01:23 IST|Sakshi

జాతిహితం

ఇందిర, చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగంలో ‘సామ్యవాదం’ చేర్చారు. దేశం మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతున్నా, ఏ ఒక్క నేతా దాన్ని తొలగించాలనడం లేదు.  బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ తగు ఆధిక్యతను సాధించినా లౌకికవాదం పోతుందే తప్ప, సామ్యవాదం పోదు. మోదీ అర్థశాస్త్రానికి ప్రేరణ ఇందిరా గాంధీ. మరి రాజకీయాలో? ఇందిర పద్ధతి ‘çపరిపూర్ణ రాజకీయం’. మొత్తం దేశాన్ని తమ పార్టీనే పాలించాలి. ప్రతిపక్ష ముక్త్‌ భారత్‌ను ఆమె కోరుకున్నారు. ఈ మాట సుపరిచితమైనదిగా వినిపిస్తోందా?

 

నాకు నా పాత్రికేయ వృత్తి అంటే మహా ఇష్టం. కథలు చెప్పడమన్నా నాకు ఇష్టం కావడం కూడా అందుకు ఒక కారణం. అందువల్ల, ఇందిరా గాంధీ శత జయంతి సందర్భంగా రాస్తున్న ‘జాతిహితం’లో చెప్పడానికి తగినన్ని కథలు లేనందుకు విచారంగా ఉంది. ఆమె మరణించే నాటికి నాకు 27 ఏళ్లు. అయినా, నేను ఆమెకు సన్నిహితంగా ఉన్న రెండు సందర్భాల్లోనూ ఆమెకు ఉండే వీవీఐపీ భద్రత ఎంత పరిమితంగా ఉండేదో నాకు గుర్తుంది. ఆమె అధికారంలో లేని రోజుల్లో, 1979 వేసవిలో ఆమె ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు విమానంలో వెళుతుండగా తొలిసారి ఆమెను కలిసే అవకాశం కొద్దిసేపు దొరి కింది. ఆ ప్రయాణంలో  చండీగఢ్‌లో కొన్ని నిమిషాలపాటు ఆగారు. అప్పుడు నేనెలాగో తంటాలు పడి ఆమెను కొన్ని ప్రశ్నలడగగలిగేంత దగ్గరకు చేరగలి గాను. ఆ కథనం కంటే కూడా ఎక్కువగా ఆ జ్ఞాపకము, జ్ఞానీ జైల్‌సింగ్, వీఎన్‌ తివారీతో జరిపిన ఆ చిన్న భేటీలో ఆమె చెప్పేదాన్ని మహా శ్రద్ధగా వింటున్న నలుపు తెలుపు ఫొటో మాత్రం మిగిలిపోయాయి.

ఆమె తీరే వేరు
ఆ తర్వాత నాలుగేళ్లకు అస్సాంలో అత్యంత అప్రతిష్టాకరమైన ఎన్నికలు జరు గుతుండగా 1983 ఫిబ్రవరి 18న గువాహటికి 120 కిలోమీటర్ల దూరంలో నెల్లి మహా మారణకాండ జరిగింది. 3,000 మందికిపైగా ముస్లింలను ఊచకోత కోశారు. ఆ మరుసటి రోజున ఆమె ఘటనాస్థలిని సందర్శించారు. ఆ సందర్భంగానే ఆమెను గురించి లోతుగా తెలుసుకునే అవకాశం దొరికింది. హెలికాప్టర్‌ రెక్కలు తిరగడం ఆగీ ఆగడంతోనే ఆమె కిందికి దిగి, గబాగబా వచ్చేశారు. ఇసుక దుమారం చుట్టబెట్టేస్తుండగా ఆమె చీర కొంగును ముక్కుకు అడ్డుపెట్టుకున్నారు. అయినా అది ఆమె ఆగ్రహాన్ని దాచలేక పోయింది. ‘‘మూడు వేల మంది ముస్లింలు చనిపోయారు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, మీరా?’’ అంటూ ఆమె ఆర్‌వీ సుబ్రహ్మణ్యంను మంద లించారు. అప్పుడాయన రాష్ట్రపతి పాలనలో ఉన్న అస్సాంకు ప్రధాన పరి పాలనాధికారి (గవర్నర్‌ ప్రధాన సలహాదారు). ఆ తర్వాత ఆమెకు ఐజీపీ (లా అండ్‌ ఆర్డర్‌)గా ఉన్న కేపీఎస్‌ గిల్‌ కనిపించారు. ‘‘మీరంతా నిద్రపోతు న్నారా?’’ అన్నారు. ఇద్దరూ తప్పు చేసిన బడిపిల్లల్లా మౌనంగా నిలబడ్డారు.

అప్పుడామె కొంగుతో మొహం తుడుచుకుని ‘‘హూ, ఏం మాయదారి దుమ్ము!’’ అన్నారు.

సత్యజిత్‌ రే, నిత్య జీవితంలో ఇందిరా గాంధీ పేరిట ఓ డాక్యుమెంటరీని నిర్మిస్తూ ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ స్ఫురణకు వచ్చింది. ఆ సందర్భంగా ఆమె తన గదిలోని  కుర్చీని సర్దుతూ లేదా గోడల మీది చిత్రాలను మారుస్తూ రోజువారీ పనులను చేçసుకుంటూ లేదా చేస్తున్నట్టు నటిస్తూ కనిపించారు. దుమ్ముకొట్టుకున్న ఫ్రేమ్‌కట్టిన తండ్రి ఫొటోను తీసి ఆమె తుడవబోతున్న ట్టుగా దాన్ని చూశారు. మీరు మీ చీర కొంగుతో దాన్ని తుడవండి, అది గొప్ప దృశ్యం (షాట్‌) అవుతుంది అని రే సూచించారు. ఇందిర, వద్దు అన్నారు.  

ఎందుకు వద్దండీ శ్రీమతి గాంధీ గారూ? మీ తండ్రిగారి పట్ల మీకు సెంటిమెంట్లేమీ లేవా? అని రే అడిగినట్టుంది. ‘‘ఉన్నాయి, కానీ దుమ్ము పట్ల సెంటిమెంట్లేమీ లేవు’’ అని సమాధానం ఇచ్చారు.  

బ్రహ్మపుత్ర లోయలో ఆమె కొద్దిసేపు గడిపిన ఆ విషాదకరమైన ఉదయం ఇందిర జీవితంలోని మంచి ఘట్టం కాదు. కానీ అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె జీవితంలో కెల్లా అతి కటువైన నిర్ణయాలలో ఒక టిగా లెక్కకు వస్తుంది. అప్పుడు అస్సాంలో నాలుగేళ్లుగా ‘‘విదేశీయులకు వ్యతిరేకంగా’’ గొప్ప ప్రజా ఉద్యమం శాంతియుతంగా చెలరేగుతోంది. అక్కడి చమురు క్షేత్రాల నుంచి ముడి చమురు సరఫరాను సైతం దిగ్బం ధింపజేసేంత ప్రబలమైనదిగా అది సాగుతోంది. పరిస్థితిపై ప్రభుత్వానికి ఎలాంటి అదుపూ లేదు. ప్రజలలో అత్యధికులు బహిష్కరిస్తున్నా బలవం తంగా జరిపిన ఆ ఎన్నికలు అధికారాన్ని తిరిగి నెలకొల్పడానికి ఇందిర ప్రయోగించిన శైలిని తెలుపుతుంది. నా అంచనా ప్రకారం ఆ ఎన్నికల కోసం పదిహేను రోజుల్లోనే 7,000 మంది ప్రాణాలను మూల్యంగా చెల్లించు కోవాల్సి వచ్చింది.

ఈ నిర్ణయానికిగానూ చరిత్ర ఆమెను ఎలా అంచనా కడుతుంది? అలా ఆమె అధికారాన్ని ప్రయోగించిన తీరు పాశవికమైనది, క్రూరమైనది, హింసాత్మకమైనది. చాలా నియోజకవర్గాల్లో కశ్మీర్‌ లోయలో కంటే కూడా తక్కువ పోలింగ్‌ జరిగినా గానీ, ఆమె అక్కడ ఎన్నికైన ప్రభుత్వాన్ని నిలప గలిగారు. ఓ మంత్రికి అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో 100 శాతం ఓట్లు దక్కాయి. నిరసన ప్రదర్శనల కారణంగా ఆయన ప్రత్యర్థికి ఓటు వేసే అవకాశం కూడా కలుగలేదు. ఆమె అందుకు ఆందోళనచెందే బాపతు కారు.
ఆ నిర్దాక్షిణ్యమైన  వైఖరే మేలు చేసింది

ఆమె వ్యక్తిత్వంలోని ఈ నిర్దాక్షిణ్య పార్శ్వం, ఆమె ‘‘గుంగి గుడియా’’గా (మూగ బొమ్మ, రామ్‌మనోహర్‌ లోహియా ఆమెను అప్రతిష్టాకరంగా చేసిన అభివర్ణన) పార్లమెంటులో తడబడుతూ మాట్లాడే రోజుల్లో సైతం కనిపిస్తుం డేది. చాలా వరకు తన కుమారుడి(రాజీవ్‌గాంధీ)లాగే, ఆమె కూడా ఒక  హఠాన్మరణంతో... లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణంతో... ఒక్కసారిగా ప్రధాన మంత్రి పదవిలోకి వచ్చి పడ్డారు. కుంగదీసే యుద్ధాలకు(1962–65), ఆహార కొరతలు తోడై ఏర్పడిన దుర్భర పరిస్థితుల నుంచి దేశం అప్పుడప్పుడే కోలు కుంటుండగా ఆమె అధికారంలోకి వచ్చారు. ఆమె ప్రధాని అయిన కొన్ని వారాలకే మిజో తిరుగుబాటుదారులు మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రెజరీని, అస్సాం రైఫిల్స్‌ ఆయుధాగారాన్ని కొల్ల గట్టబోతున్నారు. ఆ పరిస్థితిలో ఆమె ఎవరూ అంతకు ముందు చేసి ఉండని లేదా ఆ తర్వాత చేయని పనిచేశారు. ఐజ్వాల్‌పై దాడికి భారత వైమానిక దళాన్ని ఉపయోగించారు. ఆ చర్య ఇప్పుడు విమర్శలకు గురవు తోంది. కానీ అదే ఆ రోజున మనల్ని కాపాడింది.

ఐజ్వాల్‌పై వైమానికి దాడి నుంచి బంగ్లాదేశ్‌ యుద్ధం, 1983 అస్సాం ఎన్నికలు, ఆపరేషన్‌ బ్లూస్టార్‌ వరకు అమె అదే నిర్దాక్షిణ్యమైన వైఖరితో అధి కారాన్ని ప్రయోగించారు. రాజ్యం ఆధిక్యతలో ఆమెకున్న విశ్వాసమే ఆమె అధికార శైలిని నిర్వచించింది. వీటిలో ప్రతి చర్యా ఆ గాయాల మచ్చలను మిగిల్చింది. అయితే ఆమె దేశానికి ఉన్న పెను ముప్పును శాశ్వతంగా తొలగించారు. పాకి,స్తాన్‌ ఇక ఎన్నటికీ రెండు వేపుల నుంచి పొంచి ఉన్న ముప్పు కాలేదు. బంగ్లాదేశ్‌ నమ్మకమైన మిత్రదేశం కాగలుగుతుంది. మిజో రాం ఇప్పుడు అత్యంత శాంతియుతంగా ఉన్న ఈశాన్య ఆదివాసి రాష్ట్రం. అస్సాంలో ఒకప్పుడు చమురు సరఫరాలను, 1983 ఎన్నికలను అడ్డుకున్న ప్రజా నేతలు ఆమె కుమారునితో ఒప్పందం కుదుర్చుకుని, ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు అధికారంలోకి వచ్చాక, ఓడిపోయారు. వారిలో మిగిలిన చిన్నా చితగా ఇప్పుడు బీజేపీ కూటమిలో చిన్న భాగస్వాములుగా ఉన్నారు. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ వల్ల ఆమె హత్యకు గురైనా, పంజాబ్‌లో 25 ఏళ్లపాటూ సాధారణ రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి.

ఆమె చేసే చికిత్స శస్త్రచికిత్సా నిపుణుడు మృదువుగా కత్తితో పెట్టే గాట్ల లాంటివి కాదు, గొడ్డలితో వేసిన వేటులాంటివి.  అవి ఆ గాయాల మచ్చలను మిగిల్చాయి. ఇవి అమెకు కొత్త ప్రతిపక్షాన్ని(అందులో చాలావరకు ఆమె సొంత పార్టీవారే), నేటి కాంగ్రెసేతర నాయకత్వాన్ని కూడా సృష్టించాయి.

ఆమె ఆర్థిక, రాజకీయ విధానాలకే పట్టం
జాతీయ భద్రతకు పెనుసవాళ్లు ఎదురవుతున్న కాలంలో ఆమె ఆ విష యంలో అద్భుతంగా పనిచేశారు అయితే, రెండు పెద్ద వైఫల్యాలు కూడా ఉన్నాయి. మతపరమైన శాంతిని నెలకొల్పడంలోని ఆమె వైఫల్యం, లౌకిక వాదిగా చెప్పుకోవడమే కాదు, నిజంగానే దానికి కట్టుబడిన ఏ వ్యక్తికైనా ఇబ్బందికరమైనదే. ఆమె అధికారంలో ఉండగా దేశంలోని అత్యంత ఘోర మైన మతకల్లోలాలు కొన్ని జరిగాయి.

రెండవది, ఆమె ఆర్థిక వ్యవస్థకు చేసిన నష్టం. నెహ్రూ సామ్యవాదం మృదువైనది. ఆయనలోని వామపక్షవాద వైఖరులు ఆ కాలపు ఆదర్శవాదా నికి అద్దంపట్టేవి. ఇందిర సామ్యవాదం మొరటుది. ఆమె ప్రచ్ఛన్న యుద్ధ యోధురాలే తప్ప, ఉదారవాద ప్రేమికురాలు కాదు. పార్టీని చీల్చడానికి ఆమె సామ్యవాదాన్ని వాడుకున్నారు. బ్యాంకులు, బొగ్గు, పెట్రోలియం, బీమా ఇలా ఒకొదాని తర్వాత మరో పరిశ్రమను జాతీయం చేసేశారు. దేన్నీ వద ల్లేదు. 1973లో అమె, వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభానికి బెంబే లెత్తిపోయి పక్కా కమ్యూనిస్టు శైలిలో ఆహారధాన్యాల వర్తకాన్ని జాతీయం చేసి ఘోర తప్పిదం చేశారు. అలా ఆమె బెంబేలెత్తినది ఆ ఒక్కసారే.

మన రాజ్యాంగానికి ఆమె చేసిన నష్టంలో కొంత శాశ్వతమైనది. రాజ్యాంగపు అవతారికలో ఆమె ‘‘సామ్యవాద’’ అనే పదాన్ని చేర్చారు. చట్టా నికి, రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమైన పార్లమెంటు (అత్యవసర పరిస్థి తులో పదవీకాలాన్ని ఆరేళ్లకు పొడిగించినది) చేసిన సవరణ అది. 1991 నుంచి దేశం మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతోంది. అయినా ఏ ఒక్క నాయకుడూ రాజ్యాంగంలో చట్టవిరుద్ధంగా చేర్చినదాన్ని తొలగించాలనడం వినలేదు. బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ ఏదో ఒక రోజు అంత పెద్ద మెజారిటీని సాధిం చినా, లౌకికవాదం పోతుందే తప్ప, సామ్యవాదం అలాగే నిలుస్తుంది. అందుకు ఆధారాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం, బ్యాంకుల జాతీయకరణను వెనక్కు మరల్చడానికి బదులుగా, వాటి ‘‘పునరుద్ధరణ’’కు రూ. 2.11 లక్షల కోట్లను సమర్పించుకున్నారు. మోదీ రాజకీయ అర్థశాస్త్రానికి వాజ్‌పేయి కంటే, ఇందిరా గాంధీయే ప్రేరణ.

మరి రాజకీయాలో? ఇందిరాగాంధీ పూర్తి పట్టు సాధించిన పద్ధతి ‘‘çపరి పూర్ణ రాజకీయం.’’ మొత్తం దేశాన్ని ఆమె పార్టీనే జయించాలి, ప్రతిపక్షాన్ని నాశనం చేయాలి. జనాకర్షక పథకాలు, కూటములు కటై్టనా, బెదిరించైనా బుజ్జగించైనా, ఆర్టికల్‌ 356ను ప్రయోగించైనా ఆ పని చేయాల్సిందే. ఆమె దుమ్ము దులపడం కోసం ఎంత సమయం కేటాయించేవారో అంతే సమ యాన్ని ప్రతిపక్షాల కోసం కూడా కేటాయించేవారు. కాబట్టి ఆమె కోరు కున్నది ప్రతిపక్ష ముక్త్‌ భారత్‌. ఈ మాట సుపరిచితమైనదిగా వినిపిస్తోందా?


- శేఖర్‌ గుప్తా

వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు