ఇంటి నుంచే పర్యావరణ ఉద్యమం

22 Apr, 2020 00:15 IST|Sakshi

ప్రపంచంలో చిట్టచివరి కరోనా కేసు కూడా నెగెటివ్‌ అని తేలిన తర్వాత? దాదాపు అన్ని దేశాలలో అమలవుతున్న లాక్‌ డౌన్‌ ఎత్తివేశాక? ఇక మళ్లీ ప్రపంచం గాడిన పడ్డట్టేనా? యథావిధిగా మన జీవితాలు కొనసాగినట్టేనా? అవునని అనుకుంటే మాత్రం ఇంత పెద్ద ఉత్పాతం నుంచి మనం ఏమీ నేర్చుకోనట్టే అంటున్నారు లియత్‌ ఓలెనిక్, అలెజాండ్రో దాల్‌ బాన్‌. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ ఆందోళనకారులు అమెరికా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ, మిగిలిన దేశాలు నడవాల్సిన దిశ ఏమిటో సూచిస్తున్నారు.

1970 ఏప్రిల్‌ 22న సుమారు రెండు కోట్ల మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి పర్యావరణ హిత సమాజం కోసం గొంతెత్తారు. అదే మొదటి ధరిత్రీ దినోత్సవం. దీని ఫలితమే అదే ఏడాది ఏర్పాటైన ఎన్విరాన్మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (ఈపీఏ). తర్వాత అమెరికన్‌ కాంగ్రెస్‌ స్వచ్ఛమైన గాలి చట్టం, స్వచ్ఛమైన నీటి చట్టం, అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవజాతుల సంరక్షణ చట్టం చేసింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్లోబల్‌ వార్మింగ్‌ను నిరాకరిస్తూ, పర్యావరణ హిత చట్టాలన్నీ బలహీనపడేలా వ్యవహరిస్తున్నాడు. ఉష్ణోగ్రతల పెరుగుదల, కారుచిచ్చులు, తుపాన్లు, వరద బీభత్సాల తర్వాత ఇప్పుడు కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను బలిగొంది, ఎంతోమంది ఉపాధిని పోగొట్టింది. ఇదే మేలుకొలుపుగా మన భవిష్యత్‌ ఏమిటో ప్రశ్నించుకోవాలి అంటున్నారు లియత్, అలెజాండ్రో.

కోవిడ్‌–19 అమెరికన్‌ సమాజంలో ఏళ్లుగా వేళ్ళూనుకుని ఉన్న అసమానతలను ఎత్తిచూపింది. హెల్త్‌ కేర్‌ లేనివాళ్లు, కలుషిత గాలిని పీలుస్తూ బతకాల్సిన వాళ్ళు, పత్రాలు లేని వలస జీవులు, ఖైదీలు, ఇంటి భద్రత లేనివాళ్ళు– ఎవరికి వారికి అందాల్సిన సాయం అందడం లేదు. దశాబ్దాలుగా అమలవుతున్న పర్యావరణ వివక్ష ఈ వర్గాలను తీవ్రంగా దెబ్బ కొట్టింది. పవర్‌ ప్లాంట్ల దగ్గర ఉన్న వాళ్ళలో ఉబ్బస బాధితులు ఎక్కువ. చమురు వెలికితీత ప్రదేశాల్లో కేన్సర్‌ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కరోనా వైరస్‌ వల్ల ఎక్కువగా నష్టపోయిన జనం వీళ్లే. న్యూయార్క్‌ నగరంలోని క్వీన్స్‌లోని వలసల ఆవాసాలు, బ్రాంక్స్‌ లోని అల్పాదాయ వర్గాల వాడలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. 

కోవిడ్‌–19 లాగే ఈ పర్యావరణ సంక్షోభం కూడా ప్రపంచాన్ని తీవ్రంగా అస్థిరపరుస్తుందనీ; ఇది మరెన్నో కొత్త విపత్తులను తేనుందనీ వేలాదిమంది పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ఎన్నో రకాల వ్యాధులు ఇందులో ఒకటి. తగిన చర్యలకు ఉపక్రమించకపోతే గనక పంటలు నాశనం కావడం, వరదలు, ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా 2050 నాటికి సుమారు 100 కోట్ల మంది తమ ఆవాసాలకు దూరం అవుతారని వీరు హెచ్చరిస్తున్నారు. 2030 నాటికి అమెరికా నూటికి నూరు శాతం పునర్వినియోగ ఇంధన వనరుల వైపు మారిపోవాలనీ, కరోనా సంక్షోభమే సాకుగా ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టేలా శిలాజ ఇంధన సంస్థలు ఉల్లంఘనలకు పాల్పడకుండా నిరోధించాలనీ వీరు కోరుతున్నారు.

పర్యావరణ నియంత్రణల మీద ఈపీఏ వెనక్కి తగ్గడం మార్చి 26నే మొదలైంది. ఉల్లంఘనలకు పరిహారం వసూలు చేయకపోగా, సంస్థలే ’స్వీయ పరిశీలన’ చేసుకోవాలని అనడం అంటే, ప్రజారోగ్యాన్ని మరింత ప్రమాదం వైపు నెట్టినట్టే. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటికే తన రెండు ట్రిలియన్‌ డాలర్ల బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీలో భాగంగా, కంపెనీల కోసం 500 బిలియన్లు ఖర్చు చేసింది. అట్లాంటిది పర్యావరణ హితం కోసం ఒక గ్రీన్‌ డీల్‌ కుదుర్చుకోవడానికి ఈ 50వ ధరిత్రీ దినోత్సవం ఒక సందర్భం ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు లియత్, అలెజాండ్రో.  ఈ సొమ్మును కార్మికులు, పునర్వినియోగ ఇంధన వనరుల పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ సంక్షోభం బారినపడే సముదాయాలకు బదలాయించాలని కోరుతున్నారు.

వ్యక్తులు, బ్యాంకులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు అన్నీ  అటవీ క్షయాన్ని అరికట్టేలా,  పర్యావరణానికి మేలు జరిగేలా తమ స్థాయిలో ప్రభావితం చేస్తామని ప్రతిన బూనాలి. 50 ఏళ్ల క్రితం ఇదే కారణంతో రెండు కోట్ల మంది వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. మనల్ని మనం కరోనా భారీ నుంచి కాపాడుకోవడానికి ప్రస్తుతం ఇళ్లకే పరిమితమై ఉన్నాం. ఇదే ఉత్సాహంతో ఈ భూగోళాన్ని కాపాడుకోవడానికీ, తద్వారా దాన్ని మరింత నివాసయోగ్యం చేసుకోవడానికీ ఇంటి నుంచే, ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభిద్దాం.
(ధరిత్రీ దినోత్సవానికి నేటితో 50 ఏళ్లు)
– పి. శివకుమార్‌

మరిన్ని వార్తలు