దక్షిణాసియాలో విస్తరిస్తున్న ఉగ్రవాదం

23 May, 2019 02:40 IST|Sakshi

సందర్భం

అంతర్జాతీయ న్యాయశాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రస్తుతం సంభవిస్తున్న మార్పులను క్రమబద్ధీకరిస్తూ దేశాలమధ్య నెలకొన్న సామాజిక, ఆర్థిక, భద్రతాపరమైన సమస్యలకు అంతర్జాతీయ న్యాయశాస్త్రం పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ముఖ్యంగా యుద్ధ సమయంలో పాటించాల్సిన నియమాలను, యుద్ధ పరిస్థితులలో శాంతిని నెలకొల్పే సూచనలను, దౌత్యపరమైన సంప్రదింపులను, దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య లావాదేవీల సంబంధిత అంశాల గురించి, అంతరిక్ష న్యాయ విషయాలపై, మానవ హక్కులు.

అంతర్జాతీయ సంస్థల విధులు, బాధ్యతలపై ఇది విస్తృతంగా చర్చిస్తుంది. దేశసరిహద్దుల భద్రతా విషయాలపై, ఉగ్రవాద నిర్మూలనపై, దేశసార్వభౌమత్వ అధికారాలు, ప్రకృతి పర్యావరణ సమతుల్యత, పైరసీ, గగన అంతరిక్ష సంబంధిత విషయాలు, సముద్ర న్యాయాలు, విమాన హైజాకింగ్, అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య పరిష్కార మార్గాలు, మానవహక్కులు వంటివన్నీ కూడా అంతర్జాతీయ న్యాయశాస్త్ర పరిధిలోవే.

దక్షిణాసియా 48 ఏళ్లుగా టెర్రరిస్టు హబ్‌గా మారుతోంది. శ్రీలంకలో తాజా ఉగ్రవాద దాడి సౌత్‌ ఆసియాలో టెర్రరిజం పెరుగుదలకు సూచిక. 2017లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో 31 శాతం దక్షిణాసియాలో నమోదైనవే. వీటిల్లో మరణించిన వారిలో 29 శాతం మంది ఇక్కడివారే. శ్రీలంకలో జరిగిన దాడి గత 15 ఏళ్లలో అతిపెద్దది. 290 మంది చనిపోగా.. 500 మందికిపైగా గాయపడ్డారు. 2008లో ముంబై దాడుల్లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2014లో పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆర్మీస్కూల్‌పై జరిగిన దాడిలో 150 మందికి పైగా స్కూలు పిల్లలు బలైపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికులు చనిపోయారు. ఇవేకాదు దక్షిణా సియాలో తరచుగా జరుగుతున్న దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. 

గ్లోబల్‌ టెర్రర్‌ డేటాబేస్‌(జీటీడీ) గణాంకాల ప్రకారం.. 1970 నుంచి 2017 వరకూ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులను పరిశీలించినట్లయితే ఎక్కువ దాడులు జరిగిన ప్రాంతాల్లో దక్షిణాసియా రెండో స్థానంలో ఉంది. 1970లో 651 ఉగ్రవాద దాడులు జరిగితే.. 2014లో 17 వేల ఉగ్ర దాడులు నమోదయ్యాయి. 2002 నుంచి 2017 మధ్యకాలంలో దక్షిణాసియాలో 31,959 దాడులు జరిగితే 59,229 మంది చనిపోయారు. ఎంఈఎన్‌ ఈ విషయంలో ముందుంది. ఆ ప్రాంతంలో 33,126 దాడుల్లో 91,311 మంది మృతి చెందారు. 

ఐక్యరాజ్యసమితితో ఫలించిన భారత్‌ దౌత్యం: జైషే మహమ్మద్‌ సంస్థ అధినేత, పుల్వామా దాడి సూత్రధారి సయ్యద్‌ మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్యసమితి 1–5–2019 నాడు అంతర్జాతీయ  ఉగ్రవాదిగా ప్రకటించడం శుభపరిణామం. సుదీర్ఘకాలంగా భారత్, తదితర దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని తాత్సారం చేస్తూ వచ్చిన చైనా తుదకు అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గి తన అభ్యంతరాలను ఉపసంహరించుకుంది. ఐక్యరాజ్య సమితి తీసుకున్న ఈ కీలక నిర్ణయం వలన ఉగ్రవాదుల ఆర్థిక వనరులపై, ఆయుధాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం కలగనుంది. తీవ్రవాదం ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న విషయాల చుట్టూ తిరుగుతున్నది. 1. జాతీయవాద ఉగ్రవాదం 2. మతపరమైన ఉగ్రవాదం 3. దేశాలు ప్రోత్సహిస్తున్న కుడి, ఎడమ  విభాగాలకు సంబంధించిన తీవ్రవాదం.

ఐక్యరాజ్యసమితి, ఇంటర్‌ పోల్,  సీఐఏ, ఎఫ్‌బీఐ, రా లాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ తీవ్రవాద మూలాలు ఇప్పటికీ ఎందుకు నిర్వీర్యం కావడం లేదో సమగ్ర విశ్లేషణ చేసుకోవాల్సిన తరుణమిది. మూడు దశాబ్దాల కిందట బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఏర్పాటైన 8 సభ్య దేశాలతో కూడిన దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్‌ తీవ్రవాద దురాగతాలపై ఎన్నోసార్లు చర్చించినప్పటికీ ఇంకా ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు దక్షిణాసియాలో జరగటం దిగ్భ్రాంతికరం. 

తీవ్రవాదం కట్టడికి భద్రతాపరమైన చర్యలు: దక్షిణాసియా దేశాలు పరస్పర సహాయ సహకారంతో, సమన్వయంతో ప్రాంతీయ భద్రత పేరిట రూపొందించుకున్న చట్టాలను, నియమాలను ఉల్లంఘించకుండా పాటిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలి. విమానాశ్రయాలలో భద్రతాపరమైన పరిశీలనలను పటిష్ట పరచాలి. నైతిక విద్యను ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయిదాకా అన్ని కోర్సులలో ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టి, పర్యవేక్షించే బాధ్యత ఉపాధ్యాయులు, అధ్యాపకులపై ఎంతగానో ఉంది.

వ్యాసకర్త: కె. శివచరణ్‌, న్యాయశాస్త్ర పరిశోధకులు, నల్సార్‌ విశ్వవిద్యాలయం
మొబైల్‌ : 95158 90088
 

మరిన్ని వార్తలు