కరోనా కట్టడిలో ఉదాసీనత

16 Jul, 2020 01:19 IST|Sakshi

సందర్భం

‘తుమ్మితే ఊడే ముక్కు’ అన్న సామెతను మార్చి, ‘తుమ్మితే పోయే ప్రాణం’ అన్న చందంగా మారింది తెలంగాణ పరిస్థితి. ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో అర్థం కాని దుస్థితి. ఎవరికైనా కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలినా, వారిని వెంటనే ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించ కుండా హోమ్‌ క్వారంటైన్‌ పేరుతో ఇంటికి పంపిం చేసి మరింత మందికి కరోనా సోకేలా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో పాటు అనుమానితులందరికి కరోనా పరీక్షలు జర పకపోవడం కూడా నేటి ఈ దుస్థితికి కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్లక్ష్య ధోరణిని ఎత్తిచూపిన ప్రతిపక్షాలు, నాయకులపై ప్రభుత్వ పెద్దల ఎదురుదాడి శోచనీయం.

ఐ.సి.ఎం.ఆర్‌. నిబంధనల ప్రకారమే నడుచు కుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల్లో లక్షలాది మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐ.సి.ఎం.ఆర్‌. నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లా? ఆ ప్రభుత్వాలు అంత జాగ్ర త్తగా ఉంటున్నా కరోనా విజృంభిస్తుండగా పరీక్షలు అంతగా చేయకుండానే తెలంగాణలో కరోనాను కట్టడి ఎలా చేయాలనుకుంటున్నారో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే తెలియాలి. దేశంలో అతి తక్కువ పరీక్షలు చేసిన రాష్ట్రం తెలంగాణ కావడం బాధా కరం. ఒకవైపు ప్రజలంతా కరోనా భయంతో అల్లా డుతుంటే, సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టాలని కేసీఆర్‌ ఉబలాటపడడం ‘రోమ్‌ నగరం తగలబడు తుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చు న్నట్లు’గా ఉంది.

ఇంత భయానకమైన పరిస్థితి నెలకొంది కాబట్టే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి ఇటీవల హైద్రాబాద్‌లో జరిగిన వర్చువల్‌ ర్యాలీలో మాట్లాడుతూ, ‘హైదరాబాద్‌ ఎప్పుడైనా పేలి పోవచ్చు’ అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే కేంద్ర ప్రభుత్వం కోటిమంది ఆడపడుచుల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ. 521 కోట్లు జమ చేసిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం రూ. 127 కోట్లు, వృద్ధులు, విక లాంగులు, వితంతువులయిన సుమారు 7 లక్షల మంది ఖాతాల్లో రూ. 166 కోట్లు, ఉద్యోగుల కోసం పి.ఎఫ్‌. ఖాతాలో రూ. 470 కోట్లు, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ కింద వలస కార్మికుల రైల్వే ప్రయాణం, భోజనం, ఇతర సౌక ర్యాల కోసం రూ. 224 కోట్లు, కోవిడ్‌ అసిస్టెన్స్‌ కింద రూ. 217 కోట్లు హెల్త్‌ డిపా ర్ట్‌మెంట్‌ ద్వారా రిక్రూట్‌మెంట్‌ ఇతర సౌకర్యాల కల్పనకు మంజూరు చేసిందని ఆయన వివరిం చారు. వైద్య సిబ్బంది రక్షణ కోసం సుమారు 6 లక్షల 20 వేల ఎన్‌–95 మాస్కులు, డాక్టర్ల కోసం సుమారు రెండున్నర లక్షల పి.పి.ఇ. కిట్లు, ఇంకా పలు రకాలుగా కేంద్రం సహాయసహకారాలు అందిస్తుందన్నారు. కేంద్రం ఇంత చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్ల యజమానులు అద్దెల విషయంలో ఎవ రిపై ఒత్తిడి చేయరాదని నీతులు చెప్పిన ప్రభుత్వం, ఆదాయం లేక నానాఅవస్థలు పడుతున్న పేదలు, మధ్య తరగతి ప్రజల నుంచి 3 నెలల బిల్లుల వసూ లుకు పూనుకోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవు తోంది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీతో పాటు ముగ్గురు ఎంఎల్‌ఏలు సైతం కరోనా బారిన పడటం రాష్ట్రంలోని దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. చివరికి ప్రజలు, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం ‘చేతులు కాలాక ఆకులు పట్టిన’ చందంగా కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో పరీక్ష లకు, కొన్ని ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతులి చ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని ఆసుప త్రులు, ల్యాబ్‌ల యజమానులు స్వార్థంతో డబ్బుల సంపాదనే ధ్యేయంగా శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని బాధితులు విమర్శిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రతివిషయంలో ఎదురుదాడి సరైన విధానం అని పించుకోదు. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రతి క్షణం ఏం జరుగుతున్నదో మీడియా, సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. తమ నిర్ల క్ష్యాన్ని కప్పిపుచ్చుకునే పరిస్థితి లేదు. తమ తప్పు లకి కేంద్రం లేదా ఇతర ప్రతిపక్షాలపైకి తోసేయా లనుకోవడం భావ్యం కాదు. ప్రాజెక్టుల కంటే ప్రజల ప్రాణాల రక్షణకే రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తుందని ఆశిద్దాం. 

వ్యాసకర్త
శ్యామ్‌ సుందర్‌ వరయోగి 

కో–కన్వీనర్,
బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ, ఫౌండర్, మేనేజింగ్‌ ట్రస్టీ,
రాఘవ్స్‌ ఫౌండేషన్, హైదరాబాద్

మరిన్ని వార్తలు