జీవించే హక్కుకు దిక్కెవరు?

25 Jan, 2018 01:00 IST|Sakshi

దేశ సేవంటే పేదరికాన్నీ, నిరక్షరాస్యతనూ, ఆరోగ్య నిర్భాగ్యాన్నీ, ఆర్థిక అసమానతలనూ రూపుమాపటమేనని నెహ్రూ అభిప్రాయపడ్డారు. ముందుతరాలు రాజ్యాంగ వైఫల్యాన్ని ఎత్తిచూపితే అందుకు కారణం రాజ్యాంగం కాదనీ, దాని అమలుకై గద్దెనెక్కిన శక్తులేననీ అంబేడ్కర్‌ హెచ్చరించారు. ఒక గొప్ప వ్యవస్థను రూపొందించుకుని, మనకు మనం సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగం దశాబ్దాలు గడచినా సజావైన అమలుకు నోచుకోక పోవటం బాధాకరం.

మరో గణతంత్ర దినోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. ఎర్రకోట సాక్షిగా మాటలు కోటలు దాటి జనాన్ని ముంచెత్తుతాయి. అద్భుతాలు జరుగుతాయని అరవయ్యేళ్లుగా ఎదురుచూస్తున్న జనం తమవి పగటి కలలేనని మరోమారు పెదవి విరుస్తారు. ప్రజలు నిర్లిప్తంగా, నిస్తేజంగా జీవించేందుకేనా ఒక మహత్తర రాజ్యాంగం నిర్మితమైంది? రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులతో తమ తలరాతలు మారిపోతాయని ఆశించే ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీ కాదా? మానవ హక్కుల, ప్రాథమిక హక్కుల పరిరక్షణలే ప్రాతిపదికగా మన గణతంత్ర వ్యవస్థలో రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు తమ పాత్రను ఏ మేరకు అర్థవంతంగా పోషిస్తున్నాయి? ఓట్లు వేసి ఏలికలనెన్నుకునే ఓటున్న మారాజులు ప్రభుత్వాల పనితీరుని సమీక్షించుకోవలసిన అవసరముంది కదా!

1948 నాటి విశ్వజనీన సమాన హక్కుల పత్రం మనిషి జన్మతః స్వేచ్ఛాప్రియుడనీ, సమభావన, సమానావకాశాలతో ఎదగడానికి వ్యక్తి స్వేచ్ఛను సభ్యదేశాలు కాపు కాయాలనీ పేర్కొనగా, ఇదే పత్రం అనేకానేక పౌర, రాజ కీయ హక్కులను మానవ హక్కులుగా నిర్ధారించింది. భారత రాజ్యాంగం సైతం దాదాపు మానవ హక్కులన్నింటినీ ప్రాథమిక హక్కులనే పేరిట పౌరులకు హామీ ఇచ్చి, వీటి అమలుకు ప్రభుత్వాన్నే జవాబుదారీ చేసింది. జనమంతటికీ కూడూ, గూడూ కల్పించడం జీవించే హక్కుకు పునాది కాగా ఈ హక్కు కల్పనతో సర్కారీ వైఫల్యాలు మనలని నివ్వెరపరుస్తున్నాయి. మానవ హక్కులను కాలరాసి జనం తలరాతలని తారుమారు చేసే ఏలికల గుణగణాలను ఈ సందర్భంగా తర్కించుకోవాలి. శాంతి స్టార్‌ బిల్డర్స్‌ కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం కూడూ గూడూ ప్రజలకు ఇవ్వలేని ప్రభుత్వ పాలనలో రాజ్యాంగం విఫలమైనట్టేనని వ్యాఖ్యానించింది. ఈ తీర్పు తరువాత పదిహేడేళ్ల కాలంలో పరిస్థితి ఎలా ఉంది? 

దారిద్య్ర రేఖ దిగువ దృశ్యం
ప్రపంచంలోని 119 ఆకలి పీడిత దేశాల జాబితాలో భారత్‌ నూరవ స్థానంలో ఉంది. అన్నపూర్ణ వంటి మన దేశంలో 194 మిలియన్ల ప్రజలు పస్తుల పాలవుతున్నారు. అంతర్జాతీయ పేదరిక సూచీ (2013)లో భారత్‌ స్థానం ప్రముఖంగానే ఉంది. జనాభాలో 30 శాతం దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. సవరించిన ప్రమాణాల ప్రాతిపదికగానే 2012 నాటికి జనాభాలో 20.6 శాతం దారిద్య్ర రేఖకు కింద ఉన్న వారితో చేరారు. 2011–2012 నాటికి జనాభా పద్దులో 12.4 శాతం దరిద్ర నారాయణులే. 2013 అంతానికి గూడు కరువైన భారతీయులు 78 మిలియన్లు. 11 మిలియన్లు జనం రోడ్లు, ప్లాట్‌ఫారాల మీద బతుకులు వెళ్లదీస్తున్నారు. 10.78 మిలియన్ల నివాస గృహాల కొరత ఉందని కేంద్రమే తేల్చింది. ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని నిరుద్యోగం 8.3 శాతం (1983) నుంచి 3.46 శాతానికి (2016) తగ్గినట్టు కాకి లెక్కలు వేసినా ఇదంతా వాపేననీ, బలుపు కాదనీ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలతో మూతపడుతున్న పరిశ్రమలు ఉపాధికి గండికొట్టాయనీ, 2016లో 17.7 మిలియన్లుగా ఉన్న ఉద్యోగ భద్రత లేని చిరుద్యోగులు, వచ్చే రెండేళ్లలో 18 మిలియన్లు దాటిపోతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ జోస్యం చెప్పింది. ఏతావాతా ప్రైవేటు, పారిశ్రామిక రంగాలలో ఉపాధి పొందుతున్న 475 మిలియన్ల బడుగుజీవులకు గాను 400 మిలియన్లకు ఉద్యోగ భద్రత నాస్తి. ఇదిలా ఉండగా ప్రపంచ ఆహార భద్రతా నివేదిక ప్రకారం (2017) దేశంలో 190.7 మిలియన్ల ప్రజలకు పోషకాహార సరఫరా లేదు. 51.4 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుండగా, 30 శాతం నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఎదిగే బాలలు పౌష్టికాహార లేమి కారణంగా రోజూ 3,000 మంది అసువులు బాస్తున్నారు. 65 మిలియన్ల జనం మురికివాడలలో మగ్గుతుంటే వీరిలో 17 శాతం దాకా పట్టణాలలో జీవిస్తున్నారు. కేటాయించిన సబ్సిడీ ఆహారంలో సగం పైగా అర్హులకు చేరడం లేదు. 410 మిలియన్ల బతుకులు ఒక్కపూట, అరకొర తిండితో గడుస్తున్నాయి. ఆకలిచావులు సాధారణమైపోయాయి. 

ఇదీ వర్తమాన భారతం. ‘వెలిగిపోతోంద’ని నమ్మబలికిన మన దేశంలో కోట్లాది ఓటర్ల జీవించే హక్కు పట్టపగలు దోపిడీకి గురవుతుండగా మానవ హక్కులను రక్షిస్తున్నామని మనకి మనం కితాబిచ్చుకుంటామా? వేల కోట్లు గుమ్మరించి ఎన్నికల ప్రక్రియ ద్వారా మనం ఏలికలనెన్నుకోవడం ఎవరి ప్రయోజనం కోసం? కనీస అవసరాలు తీర్చమని ప్రభుత్వాన్ని అడుక్కోవలసిన దుస్థితి ఎందుకు దాపురిస్తోంది?

ఆ చురకలు అవమానం కాదా?
ప్రభుత్వ పరంగా మానవహక్కుల చట్టం, ఆ చట్టం అమలు కోసం దేశ వ్యాప్తంగా హక్కుల కమిషన్, ఉపా«ధి హామీ కోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం, విద్యా హక్కు చట్టం వంటివి అమలులోకి తెచ్చినా, ఈ చట్టాలూ, ఈ పథకాల అమలు తీరుతెన్నుల మీద నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా దేశ న్యాయవ్యవస్థ అనేక సందర్భాలలో ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం మీద చురకలు వేయడం, సజావైన ప్రజా పాలన కోసం కోర్టులు సూచనలు ఇవ్వడం ప్రభుత్వానికి తలవంపులు కాదా? బతికే హక్కు అర్థవంతంగా ఉండాలనీ, ‘మృగజీవనం’ కారాదనీ జస్టిస్‌ భగవతి ఫ్రాన్సిస్‌ కొరాలీ కేసులో స్పష్టం చేశారు. రాజ్యాంగపు 21వ అధికరణాన్ని విశ్వజనీన మానవహక్కు పత్రంలోని 5వ ఆర్టికల్‌ తోనూ, అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల అవగాహనలోని 7వ ఆర్టికల్‌తోనూ అనుసంధానించి జీవించే ప్రాథమిక హక్కును నిర్వచించిన 80వ దశకపు ఫ్రాన్సిస్‌ కొరాలీ తీర్పు తర్వాతి కాలంలో రాజ్యాంగ ధర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మహిళలూ, బాలల రక్షణ, సంక్షేమం ప్రభుత్వ విధిగా పేర్కొన్న హుస్సేనీరా ఖాటూన్‌ తీర్పు తర్వాత కూడా విచారణ ఖైదీల అంశంలో సరైన సంస్కరణలు చేపట్టలేదు. దేశంలోని 1,387 జైళ్లలో 68 శాతం అండర్‌ట్రయల్‌ ఖైదీలే. వీరిలో 40 శాతం ఆర్నెల్లకు పైబడి బందీలుగా కాలం గడిపేశారు. వీరిలో సగంపైగా జామీనుదార్లను సమర్పించుకోలేని నిస్సహా యులే. వీరందరి జీవించే హక్కును చట్టం సాక్షిగా చట్టుబండలు చేయడం ప్రాథమిక హక్కులకు పాతర వేయడమే కదా!

చదువుకోవటం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం అందరికీ విద్యావకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు 1992లో మోహినీజైన్‌ కేసులో ప్రకటించింది. ఏళ్లూ పూళ్లూ గడిపి చట్టం తెచ్చినప్పటికీ అమలులో మాత్రం ప్రభుత్వం నీరసిం చింది. 2011 జనాభా లెక్కల రీత్యా 78 లక్షలమంది బాలలు బతుకుతెరువుకోసం బరువులెత్తుతుంటే, 8.4 కోట్లమంది చిన్నారులు స్కూళ్లకు వెళ్లలేని దురదృష్టవంతులు. ఉపాధి కోసం శ్రమించే చిట్టితల్లులు 43 శాతమైతే, బాలురు 57 శాతం. 2016 వార్షిక విద్యా సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ భారతంలో 11–14 ఏళ్ల లోపు 3.5 శాతం, 15–16 ఏళ్లలోపు 13.5 శాతం బాలలున్నారు. వీరిలో 25 శాతం పాఠశాల చదువుకు అర్ధాంతరంగా మంగళం పాడేస్తున్నారు. 

14 ఏళ్లలోపు చిన్నారులను శ్రమకు గురిచేయడం వారి బాల్యాన్ని దోపిడీ చేయడమవుతుందని ఇటు భారత రాజ్యాంగమూ, అటు పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రైట్స్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తున్నప్పటికీ, బాలల హక్కులను దోపిడీకి గురిచేయడం, రాజ్యాంగ వ్యవస్థ మన్నుతిన్న పాములా మిన్నకుండిపోవటం తన వైఫల్యం కాదని ప్రభుత్వం దబాయించగలదా? ‘బాండెడ్‌ లేబర్‌’అరాచకత్వాన్ని రూపుమాపాలని బంధు ముక్తి మోర్చా కేసు (1983)లో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి తాఖీదునిచ్చింది. అయితే 1978–2015 మధ్యకాలంలో కట్టు బానిసల పునరావాసానికై విడుదల చేసిన రూ. 81.826 కోట్లలో సగంపైగా నిధుల్ని రాష్ట్రాలు వాపసు చేసినట్లు మే 2016లో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ నివేదిక వెల్లడించింది. ఇదీ మన అధికార యంత్రాంగపు నిర్వాకం.

మరణశయ్య మీద ఆరోగ్యం
ఇక ఆరోగ్య హక్కు అనారోగ్యం పాలై మరణశయ్య ఎక్కింది. ఆరోగ్య హామీకి ప్రభుత్వం పూచీకత్తు నివ్వకపోవటం మానవ హక్కులకు గండి కొట్టటమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అభిప్రాయం. సుప్రీంకోర్టు సైతం ఈ దిశలో కొన్ని తీర్పులిచ్చింది. విన్సెంట్‌–పనికుర్లంగార కేసు (1987)లో జస్టిస్‌ రంగనాథ మిశ్రా ఆరోగ్యం మహా భాగ్యాన్ని ప్రాథమిక హక్కుగా ప్రస్తావిం చగా, మహీందర్‌ సింగ్‌ చావ్లా కేసులో (1996) జస్టిస్‌ రామస్వామి, పట్నాయక్‌ల ధర్మాసనం, ఈ హక్కును పటిష్టంగా ప్రభుత్వం అమలు చేయాలని వక్కాణించింది. అయితే 2000–01లో జీడీపీలో ఒక్క శాతం కూడా ఆరోగ్య హక్కు కోసం కేటాయింపు చేయలేని కేంద్రం 2009–10కి ఈ పద్దుకింద ఖర్చు అంచనాను 1.45 శాతంగా నిర్ధారించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం 1999–2002 కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ, ప్రాదేశిక పాలనా సంస్థలూ జీడీపీలో కేవలం 1.3 శాతమే ఆరోగ్యం కోసం వెచ్చించాయని వెల్ల డించింది. పేద దేశాలుగా పేరొందిన ఆఫ్రికా దేశాల్లోనే జీడీపీలో 3 శాతంపైన ఆరోగ్యం ఖాతాలో ఖర్చు రాయడం విశేషం. కేంద్రం ఇటీవల వెలువరించిన 2017 నాటి జాతీయ ఆరోగ్య పాలసీలో జీడీపీలో 2.5 శాతం మొత్తాన్ని ప్రజారోగ్యం పద్దుకు కేటాయించాలని సంకల్పించింది. దీంతో దేశం ఆరోగ్యకరమైన జనాభాతో కిక్కిరిసిపోతుందని మురిసిపోతోంది. దేశంలోని 12,760 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా మంచాలే లేవు. పెరిగే రోగులకు ఆసుపత్రులూ, వైద్యులూ, వైద్య నిపుణులూ, సహాయ సిబ్బంది, పరికరాల లేమీ కొట్టొచ్చినట్లున్న దుస్థితిలో నిధుల లేమి మాయదారి రోగంగా సంతరించుకోవటం ఆరోగ్య దౌర్భాగ్యానికి  నిలువెత్తు నిదర్శనం.

దేశ సేవంటే పేదరికాన్నీ, నిరక్షరాస్యతనూ, ఆరోగ్య నిర్భాగ్యాన్నీ, ఆర్థిక అసమానతలనూ రూపుమాపటమేనని నెహ్రూ అభిప్రాయపడ్డారు. ముందుతరాలు రాజ్యాంగ వైఫల్యాన్ని ఎత్తిచూపితే అందుకు కారణం రాజ్యాంగం కాదనీ, దాని అమలుకై గద్దెనెక్కిన శక్తులేననీ అంబేడ్కర్‌ హెచ్చరించారు. ఒక గొప్ప వ్యవస్థను రూపొందించుకుని, మనకు మనం సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగం దశాబ్దాలు గడచినా సజావైన అమలుకు నోచుకోకపోవటం బాధాకరం. వెలుగులు విరజిమ్మే భారత్‌ను ఆవిష్కరించడం కోసం రాజ్యాంగ సందేశాల్ని తు.చ. తప్పకుండా అమలు చేయాలనీ మరోసారి నేతలూ, ప్రజలూ గుర్తు చేసుకోవాలి.
(రేపు గణతంత్ర దినోత్సవం)

వేదాంతం సీతారామావధాని
వ్యాసకర్త భారత సుప్రీంకోర్టు మాజీ సెక్రటరీ జనరల్‌
ఈ–మెయిల్‌ : sitharam.avadhani@gmail.com 

మరిన్ని వార్తలు