నిజమైన వారసులు

8 Mar, 2020 01:49 IST|Sakshi

అభిప్రాయం

‘నేను సమానత్వపు తరం. స్త్రీల హక్కులను గుర్తించాలి’ అని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది. అందరూ కోరుకుం టున్న సమానత్వం విరాజిల్లే ప్రపంచం నిర్మించడానికి వయస్సు, జాతి, వర్ణ, మత, లింగ తేడాల్లేకుండా అందరూ సమానత్వం వైపే సాగే చర్యలు చేపట్టాలని దాని సారాంశం. సమానత్వం భావన ఎంత వెనుకబడిన వారిలో కూడా ఇంతో అంతో చేరింది. మరెందుకు తాము సమానం అని భావించలేకపోతున్నారు. స్త్రీలే కాదు. వివక్షకు గురవుతున్న సమూహాలన్నీ తమనితాము వంచితులు గానే భావించడానికి కారణం ఏమిటో దేశాధినేతలు విధానకర్తలు ఒకసారి పరికించి చూడాల్సి ఉంది. బీజింగ్‌ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి 25 సంవత్సరాలు గడిచాక దానిపై సంతకం చేసిన దేశాలు.. సమానత్వ సూచికలో ఎక్కడుంటున్నారో సమీక్షించాలి. ఒకే పనికి ఒకే రకం అయిన వేతనం.. వేతనంలో తేడాను ఆపాలనే అతి చిన్న డిమాండ్‌ కూడా పూర్తికాలేదు. 34 శాతం మన దేశంలో వేతన వ్యత్యాసం ఇంకా కొనసాగుతున్నది. పైగా ఓట్ల రద్దు తరువాయి ఆర్థికమాంద్యం వలన కోల్పోయిన 3 కోట్ల 60 లక్షల ఉద్యోగాల్లో అత్యధికంగా మహిళలే ఉన్నారు. దాదాపు 50–60 శాతం వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వృత్తుల్లో ఉన్న మహిళలు దరిద్రంలోకినెట్టివేయబడుతున్నారు. మహిళల్ని రైతులుగా గుర్తించాలనే కోరిక కూడా ఎవరి చెవికీ ఎక్కడం లేదు.

చిన్న చిన్న పన్నెండు పనులు చేస్తే సమానత్వం వైపు సాగవచ్చని ఆశపడుతున్నది యూఎన్‌ మహిళ. దానిలో మొదటిది స్త్రీల పనిని.. ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం, వృద్ధుల సేవ వంటి గుర్తింపునోచని వేతనం లేని చాకిరీని పంచుకోమని సూచిస్తున్నది. ఇది ఇంట్లో వాళ్లు పంచుకుని చేయటం ఒక తాత్కాలిక పరిష్కారం కాని ఈ చాకిరీని సమాజపరం చేయటం దీర్ఘకాలిక పరిష్కారం. అంటే ఇంటి పనిని తేలిక చేసే పరికరాలు కొనుగోలు చేసే శక్తి కలిగిఉండటం, వంటపని, పని ప్రదేశాలకు తరలిం చడం (ఉదయం మధ్యాహ్న భోజనాలు పని దగ్గరే లభించేలా చేయటం) పిల్లలకు శిశు సంరక్షణా లయాలు (కేర్‌ సెంటర్లు) ఇంటి దగ్గర, పని ప్రదేశాల్లో అందుబాటులో ఉండటం...ఇక పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, అత్యాచారాల వ్యవహా రానికి వస్తే ‘మీ టూ’ వల్ల ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత అత్యాచారాలకు పాల్పడ్డాడని రుజువై, 25 సంవత్సరాల శిక్షకు సిద్ధ పడుతున్నాడు.

ఇంత కాలం ఎందుకు బాధితులు మౌనంగా ఉన్నారు.. అనే సవాలును కోర్టు కొట్టి పారేసింది. వారి ఉపాధి దెబ్బతింటుందనే భయంతోపాటు ఇతని బలం పట్టు సినీ పరిశ్రమపై ఉండటమే వారు ఫిర్యాదు చేయకపోవడానికి కారణంగా భావించింది. అయితే గుజరాత్‌లో ఒక కళాశాలలోని 63  మంది విద్యార్థినులను లోదుస్తులు విప్పించి వారు రుతుక్రమంలో ఉన్నారా లేదా అని పరీక్షిం చినవాళ్లు, నర్సు ఉద్యోగాల కోసం వెళ్లిన మహిళల్ని అమానుషమైన రెండు వేళ్ల పరీక్షతో కన్యత్వం, గర్భధారణ నిర్ధారించిన ప్రభుత్వ అధికారుల్ని మందలించిన దాఖలాలు లేవు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఉండాలనే నియమం తప్పనిసరి అనికూడా చాలామంది అధికారులకు తెలియదు. భాషలోగానీ, భావాల్లోగానీ వివక్ష తగ్గుతున్న దాఖలాలు మన దేశంలో పెద్దగా కనపడటం లేదు. జెండర్‌ సమానత్వ సూచికలో మొదటి స్థానంలో ఉన్న నార్వే మాత్రం మరో అడుగు ముందుకేసింది. భార్యాభర్తలిద్దరికీ 7 నెలల ప్రసూతి సెలవు పూర్తి జీతంతో సహా ఇచ్చేందుకు చట్టం చేసింది. మన దేశంలో ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలనే నియమం కూడా 13 నుండి 39 శాతం కేసుల్లో (రాష్ట్రాలవారీ తేడా ఉంది) జరగటం లేదు.

అమ్మా యిలకు వారి విలువ తెలియజేయాలనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. మహిళా ఉద్యమాలు, స్వచ్ఛంద సంస్థలు దీనిపై నిరంతరాయంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ 0–6 సంవత్సరాల వయస్సులో ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు 898 మందే సగటున ఉన్నప్పుడు అమ్మాయిల విలువను దేశం గుర్తించిందా అనే ప్రశ్న అవసరం అవుతుంది. ఇప్పటికీ 18 ఏళ్లలోపు జరుగుతున్న వివాహాలు 39 శాతం ఉంటే ‘బేటీ బచావో’ చట్టాలు ఎక్కడ ముక్కు మూసుకున్నాయో తెలియదు. కనీసపక్షంగా ప్రధాన మీడియాలో ‘మూస’ల్ని ప్రశ్నించడం కూడా లేదు. అదే ‘ఛాతీ లెక్కలు’ అవే గాజులు తొడిగించుకోలేదు అనే కించపరిచే పదాలు మగతనపు వైభవాన్ని, స్త్రీత్వపు బలహీనతల్ని చాటే చిత్రాలు, దృశ్యాలుగా మనోఫలకాలపై ముద్ర వేస్తుంటే అమ్మాయిల ఆత్మగౌరవం ఎలా పెరుగుతుంది. గతంకంటే చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది కానీ 2020కి పెరగాల్సిన మోతాదులో ఉందా? బడి, బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, కనీసపక్షంగా ఇల్లు అయినా అమ్మాయిలకు సురక్షిత ప్రదేశంగా భావించే స్థితి ఉందా?

తమ కనీస పౌరహక్కులు కలిగి ఉండటం తమ హక్కు అని పూర్తి శాంతియుతంగా రోడ్లపైకి వచ్చిన యువతరం, మహిళలు, మైనారిటీలు, దళితులు దేశద్రోహులయ్యారు. రాజ్యాంగంపట్ల, ప్రజాస్వామ్యంపట్ల ఏ మాత్రం గౌరవం లేని పాలన ప్రభుత్వ సంస్థల్ని, న్యాయాలయాల్ని, పోలీసు యంత్రాంగాన్ని విభజించిపడేసింది. ఈ మొత్తం కల్లోలాలకు మొదటి సమిధలు మళ్లీ స్త్రీలు, పిల్లలే. ఒక వర్గం స్త్రీలను అత్యాచారం చేయొచ్చు, చంపొచ్చు అనే భావన ఏర్పడేంతగా విద్వేష ప్రచారం నడుస్తున్నది. కానీ ఎంత విభజించినా ఈ దేశ మత సామరస్యపు అల్లిక ఇంకా మిగిలే ఉందని నిరూపించిన ఢిల్లీ దాడులు.. చట్టబద్ధమైన హక్కులు పార్లమెంటులో ప్రవేశం ఇవ్వకపోతే వీధుల్లోనయినా సాధిస్తాం అన్న షహీన్‌బాగ్‌లు, మతపెద్దల సంకెళ్లను బద్ధలుకొట్టిన మైనారిటీ మహిళలు, యువతరం బాధ్యతగానే కాదు, జాగరూకతగా ఉందని చాటి చెబుతున్న అసంఖ్యాక విద్యార్థినీ విద్యార్థులు.. సమానత్వం సైన్యంలో కూడా సాధిస్తాం అంటూ కోర్టుకీడ్చి గెల్చిన మిలటరీ మహిళలు.. వీళ్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నిజమైన వారసులు, స్ఫూర్తిప్రదాతలు.

దేవి
వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త

>
మరిన్ని వార్తలు