లాఠీతో సాధికారతా?

4 Nov, 2017 02:02 IST|Sakshi

ఘనత వహించిన ఏలినవారూ! తెలుగు నేలపై నిరంతరం శ్రమిస్తున్న వారికంటే అందమైన ప్రజలెక్కడ ఉంటారు? తమర్ని కన్నతల్లికంటే బ్యూటీ క్వీన్‌ ఎవరు? ఈ దుర్మార్గాల్ని ఆపడానికి లాఠీ దెబ్బలు తిన్న వారికంటే సౌందర్యవంతులుంటారా?

మళ్లీ ఒక్కసారి బాబుగారి లాఠీ స్త్రీల రక్తం చవిచూసింది. వాళ్లు అంగన్‌వాడీ ఆశా వర్కర్ల మాదిరిగా జీతం పెంచమని అడిగితే కదా గుర్రాలతో తొక్కించేంత కోపం రావడానికి! ప్రభువు ప్రపంచబ్యాంకు కినుక వహించకుండా ఉండటానికి విద్యుత్‌ చార్జీల గురించి ఉద్యమకారుల గుండెల్లో తూటాలు నాటేంత వీరావేశం తెచ్చుకునే సందర్భం అయినా లేదు కదా! అభివృద్ధి పేరిట గుంజుకుంటున్న భూముల గురించి కడుపుకాలిన రైతన్నలపై వీరంగాలు చేస్తున్నటువంటి సమయం కూడా కాదు. వాళ్లేమడిగారు? స్త్రీల శరీరాల్ని అమ్మకపు సరుకుగా అంగట్లో పెట్టడం ఆపమని కోరారు. వ్యాపారస్తుల ప్రయోజనం కోసం అందాల పోటీలు పెడుతుంటే ఆడపడచుల కన్నీరు తుడిచే పాలకులారా.. ఈ అఘాయిత్యం ఆపమని కోరారు. నిరసన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. మరెందుకు మహిళా నాయకుల చీరలు చించేసి, రక్తాలు కారేట్టు కొట్టి ఈడ్చి పడేశారు?

ఏపీ విద్యాశాఖామాత్యులు ఫ్యూడల్‌ ప్రభువుల మాదిరిగా ఈ అందాల పోటీలు తిలకిస్తారట.. దీన్ని నిలదీశారనేనా మహిళా సంఘాలపై ఇంత ఆగ్రహం? స్త్రీల శరీరాల్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారాభివృద్ధి చేయాలనే మంత్రిగారి వ్యూహం వారి కార్పొరేట్‌ విధానాలకు సరిగ్గా సరిపోతుంది. స్త్రీల శరీరాలు ఎగుమతుల్లో కూడా చేర్చదలిచారా? అయితే ట్రాఫికింగ్‌ మాఫియాను చట్టబద్దం చేసేస్తే సరిపోతుందిగా!

మహిళా సంఘాలు అందాలపోటీలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? నేటి మహిళలు అన్నిరంగాల్లో సామర్థ్యం చూపుతూ దూసుకుపోతున్నారు. కానీ తమ శరీరం విషయంలో అమ్మమ్మలకున్నపాటి విశ్వాసం నేటివారికి లేకుండా పోయింది. గత 30 ఏళ్లుగా జరుగుతున్న అధ్యయనాలు వెల్లడిస్తున్న వాస్తవాలు కలవరపెడుతున్నాయి. సామర్థ్యం, తెలివి, చురుకుదనం, ఆకర్షణ, చదువు, ఉద్యోగం గల స్త్రీలు స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదించకుండా అడ్డుపడుతున్నది అందానికి సంబంధించిన ఈ భావజాలమే. స్వంత శరీరాకృతిపై అసంతృప్తి, దానిపై అనారోగ్యకరమైన ఆసక్తి. వయస్సు పైబడుతున్నదనే ఆందోళన. అందం లేకపోతే ఆదరణ కోల్పోతామనే భయం వంటివి స్త్రీల సుప్తచేతనలో ఉగ్రవాదపు మందుపాతరల్లా నాటుకున్నాయనేది ఈ పరిశోధనల సారాంశం.

రెండో ప్రపంచ యుద్ధానంతరం పెల్లుబుకుతున్న మహిళా చైతన్యానికి అడ్డుకట్ట వేసి సాధికారత స్థానంలో శారీరకతను ప్రవేశపెట్టి వారి లైంగికతను నియంత్రించేవే అందాలపోటీలు. స్త్రీలను అణిచిపెట్టడానికి పాతివ్రత్యం, మతం, కులగౌరవం, చివరికి మాతృత్వం కూడా ఇక పని చేయట్లేదని తేలాక శరీరాలనే కొలతలుగా కుదించుకున్న కొద్దిమంది అందాల రాణుల కొలబద్దలతో ప్రచారం హోరెత్తించి మిగిలిన స్త్రీల శరీరాలన్నీ అందవిహీనంగా లోపాలు గలవిగా ముద్రలేసి పారేశారు.

అందానికి నిర్వచనం లేదనీ, అది చూసేవారి చూపును బట్టి ఉంటుందనీ, అందానికి ఒక్కోప్రాంతం ఒక్కో నిర్వచనం చెబుతుంటుం దనీ, కోట్లరకాల మానవ శరీరాకృతుల నిర్మితిని ఒక మూసలో చేరిస్తే భూమిపై ‘అందం’ అంతరిస్తుందని ఎంత చెప్పినా ఉపయోగం ఉండటం లేదు. ఇది స్త్రీలను అవయవాలుగా కుదించివేస్తున్నదనీ, స్త్రీల విముక్తిని పక్కదారి పట్టిస్తుందనీ, ఇది ఒక రాజకీయ అణచివేతకు అస్త్రమనీ చేస్తున్న వాదనలకు ఎవరూ ప్రాధాన్యతనివ్వటం లేదు. దానికి బదులుగా స్త్రీత్వం, సౌందర్యం, తెలివి, ఆరోగ్యానికి నీరాజనం అందాలపోటీలు అనే ప్రచారం హోరెత్తిపోతోంది. వాస్తవానికి ఇవే ఆ స్త్రీలను మిగిలిన వారినుంచి దూరం చేసి, ఒంటరిని చేసి తొక్కిపెడతాయి. 

ఏడాదికి ప్రపంచంలో 274 బిలియన్‌ డాలర్లు, భారత్‌లో 4.6 బిలి యన్‌ డాలర్ల విలువైన కాస్మొటిక్స్‌ పరిశ్రమకు, 20 బిలియన్‌ డాలర్ల కాస్మొటిక్‌ సర్జరీకి, 174.94 బిలియన్‌ డాలర్ల బరువుతగ్గే పరిశ్రమకు, 97 బిలియన్‌ డాలర్ల డయిట్‌ (ఆహార నియంత్రణ) పరిశ్రమకూ ఈ అందాల శరీరాలే సేంద్రియ ఎరువులు. సగానికి సగంమంది అమ్మాయిలు కిశోర ప్రాయం ముందే డైటింగ్‌ ప్రారంభించడం, కడుపులు మాడ్చుకుని ముప్పాతిక శాతంమంది అమ్మాయిలు రక్తహీనతతో ఉండటం, పిల్లల్ని కన్నాక లావుగా ఉన్నామనో, పొత్తికడుపు ఎత్తుగా ఉందనో, భర్త వదిలేస్తాడనో నిరంతరం భయంతో బతకాల్సిన ఇల్లాళ్లు, చదువు..

కనీస అవసరాలపై వెచ్చించాల్సిన సొమ్మును సౌందర్యం కొనటానికి ఖర్చుచేస్తున్న కుటుంబాలు–తమ ముఖ కవళికలు, ఎత్తు, లావు, ఆకృతి గురించి అనేక అనుమానాలతో కుంగిపోతున్న కోట్లాది స్త్రీల కలతపైనేనా వ్యాపారం నడవాల్సింది? ధనం, అధికారం, హింస, కండలు ‘మగ’తనంగా, అందం, భయం, ఆధారపడటం స్త్రీత్వంగా రుద్దుతున్న ఈ మూసతనాలు మానవ సంబంధాల్ని ఛిద్రం చేస్తుంటే వ్యాపారాభివృద్ధి అని ప్రోత్సహించాలా? ఇదొక సామర్థ్య నిరూపణ అనుకుని తమ శరీరాల్ని మరుగుజ్జు వృక్షాల వేళ్లు కత్తిరించినట్టు ఫిట్‌నెస్‌ పేరిట ట్రిమ్మింగ్‌ చేసుకుంటూ, బిగుసుకుని కూర్చోవడం, కీ ఇచ్చిన బొమ్మల్లా కదలడం, ప్లాస్టిక్‌ నవ్వులు, మూస జవాబుల ట్రైనింగ్‌తో కొత్తగా ఆత్మ విశ్వాసం పొందే వెర్రి అమ్మాయిల వ్యక్తిగత ఎంపికగా దీన్ని వదిలేయాలా?

జూదం వ్యక్తిగత స్వేచ్ఛ కాదు కనుకనే బాబుగారి 24 గంటల కేసినోల ప్రతిపాదన ఎదురు తన్నింది. తాగడం వ్యక్తిగత ఇష్టం అంటూ బాబుగారు మాల్స్‌కు సరఫరా చేస్తుంటే మహిళలంతా ప్రభుత్వంపై విరుచుకుపడే పనిలో ఉన్నారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే పోటీలు మహిళలకు హాని అంటే అంత ఉలుకెందుకు? ఈ వ్యాపారం బినామీయా లేక వ్యాపారస్తులంతా అసమదీయులా! ఎన్నికలు రాబోతున్నాయి ఓట్లేసేది ఈ మహిళలే అని గుర్తుకు రావడం లేదా? లేక సదరు వ్యాపారస్తులందించిన ఫండ్స్‌తో చీరలు, బిందెలు పంచితే ఇది వాళ్లు మరిచిపోతారనుకుంటున్నారా? రక్తం మరకలు అంత తొందరగా మాసిపోవని 2004 అనుభవపాఠం నేర్పలేదా?

ఘనత వహించిన ఏలినవారూ! తెలుగు నేలపై నిరంతరం శ్రమిస్తున్న వారికంటే అందమైన ప్రజలెక్కడ ఉంటారు? తమర్ని కన్నతల్లికంటే బ్యూటీ క్వీన్‌ ఎవరు? ఈ దుర్మార్గాల్ని ఆపడానికి లాఠీ దెబ్బలు తిన్న వారికంటే సౌందర్యవంతులుంటారా? స్త్రీల జీవితాలూ, శరీరాలూ మీ వ్యాపారాలకు వేదికలు కావు. మీ కార్పొరేటు అభివృద్ధికి ఉత్ప్రేరకాలూ కానే కావు. కనీసపక్షం ఈ నేలపై మహిళా ఉద్యమం ఉనికిలో ఉన్నంతకాలం అది సాధ్యం కాదు. ఈ ఉద్యమాల ఉనికి లేకుండా చేయటం మీవల్ల కాదు. ప్రజల నైతిక న్యాయస్థానంలో, స్త్రీల శరీరాలపై తమరు ముద్రించిన గాయాల మచ్చలే చెరగని సాక్ష్యంగా నిలబడతాయి.
వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త


దేవి
వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త
ఈ–మెయిల్‌: pa-devi@rediffmail.com

మరిన్ని వార్తలు