పిల్లల పాలిట ‘యమకూపం’

10 Aug, 2018 01:38 IST|Sakshi

అభం శుభం ఎరుగని పసిపిల్లలపై మర్యాదస్తులు, పెద్ద మనుషులుగా సమాజంలో చెలామణీ అయ్యేవారు పెట్టే చిత్రహింసలు చెప్పనలవి కాని రీతిలో ఉంటున్నాయి. ఈ పిల్లలు అనుభవించే హింస, వర్ణనాతీతమైన కష్టాలు చూస్తే రాళ్లు సైతం విలపిస్తాయి. ఇంతటి ఘోరాలు పసి వాళ్లపై జరుగుతున్నా చలించని ప్రభుత్వాలుంటే అవి అమలు చేయాల్సిన చట్టాలు ఏం చేయగలవు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనుషులను వేధించాల్సిన సమయం వచ్చింది. ఇంత క్రూరత్వం అనుభవించిన పసివాళ్ల బాధ, మనో వేదన నిరంతరం పచ్చిపుండే. ఈ దేశ అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రేక్షక పాత్ర వహిస్తున్న సమాజం–ఇలా అందరూ ఈ బిడ్డల విషయంలో దోషులే.

‘‘మనిషిగా తలెత్తి బతక లేను మానవత లేని లోకాన్ని స్తుతించలేను’’ అంటారు ప్రసిద్ధ తెలుగు కవి దేవరకొండ బాల గంగాధర తిలక్‌. నాలుగు సంవత్సరాల పాప లేత చేతులపై వాతలు. ఏడేళ్ల బిడ్డలపై... మరిగే నీళ్లు పోయడం, వాతలు పెట్టడం, కొట్టడం... తిట్టడం.. ఇలాంటివి చెప్పనక్కర లేదు. ఈ ఆడపిల్లలకు ఈడు రాలేదు! పాపం... కోరికంటే తెలియదు. బలవం తంగా చేసిన ఇంజెక్షన్‌ల కారణంగా ఈ పిల్లలు ‘పెద్ద వాళ్లయ్యారు’. అంతేకాదు, ఎందరి చేతుల్లోనో నలిగి పోయారు. ఎందుకంటే, ఈ చిన్న ఆడపిల్లలకే డిమాండ్‌. విటుల వికృత కోర్కెలకు వారు బలైపో తున్నారు. ఎంత చిన్న అమ్మాయి అయితే అంత ఎక్కువ రేటు. ఇలాంటి కోర్కెలున్న వాళ్లు నిజంగా మనుషులేనా? ప్రత్యేక జాతా?

ఎవరీ పిల్లలు? ఎక్కడి నుంచి వచ్చారు?
ఎవరీ కూనలు? ఎక్కడి నుంచి ఈ నరకానికి చేరారు? ఎక్కడ దొరికితే అక్కడ ఎత్తుకు వచ్చిన వాళ్లు. ఆడుకుంటూ అమాయకంగా చాక్లెట్ల కోసం వచ్చి జీవితాలు కోల్పోయినవాళ్లే ఈ ఆడపిల్లలు. ప్రధానంగా పేదల పిల్లలు. వలస కూలీల పిల్లలు. వారి అమ్మానాన్నలకు పనికి వెళ్లక తప్పదు. ఇలాంటి కూలీల బిడ్డలకు కేర్‌ సెంటర్లు ఉండవు. రోడ్ల మీదే అలా తిరుగుతుంటారు. దుర్మార్గులకు దొరికిపో తారు. అయినా వారి విషయం ఎవరూ పట్టించు కోరు. పోలీసులతో సహా.. వీళ్లేమైనా ధనవంతుల బిడ్డలా? అధికారం ఉన్న వారి కడుపున పుట్టారా? గ్లామర్‌ ఉన్న ప్రముఖుల పిల్లలా? వారి ‘అదృశ్యం’ సంచలన వార్త అవుతుందా? కాదు గదా! చూద్దాంలే అంటారు చట్టాలు అమలు చేయాల్సినవాళ్లు. రోజూ 194 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు భారతదే శంలో. అందులో జాడ దొరికేది సగం మంది మాత్రమే. ఈ ముక్కుపచ్చలారని పిల్లల్లో 51 శాతం మంది అపహరణకుగురయినవారే. ఈ పిల్లలందరినీ వేరే దేశాల వ్యభిచార గృహాలకు, మన దేశంలోని వ్యభిచార కూపాలకు, బూతు సినిమాలు తీయడా నికి, వెట్టి చాకిరి చేయడానికి దుండగులు తరలిస్తు న్నారు. ఇలా మాయమవుతూ దుర్భర జీవితం గడుపుతున్న పిల్లల గురించి సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు ప్రభుత్వాలు సహా ఎవరూ పట్టించు కున్న దాఖలాలు లేవు. 

ఫోన్లు, వాట్సాప్‌ ద్వారానే మొత్తం వ్యాపారం!
ఈ అమాయక ఆడపిల్లలను ఎత్తుకొచ్చినవాళ్లు, మధ్య దళారులు, వారిని కొనేవాళ్లు–వీరందరూ చాలా తెలివిగా వ్యవహారం నడుపుతుంటారు. మొత్తం వ్యాపారం ఇప్పుడు ఫోను సంభాషణలు, వాట్సాప్‌ ఫొటోలతో నడుస్తోంది. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పిల్ల వయసు ఎంత? ఇప్పటికి ఎంత వ్యాపారం చేయడానికి ఉపయోగప డింది? ఇలా అన్నింటికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు వారితో వ్యాపారం చేసేవారి దగ్గర ఉంటాయి. ఈ ఆడపిల్లలతో వ్యాపారం చేసే అసలు సూత్రధారులు ఇలాంటి వివరాలతోనే బేరాలు కుదుర్చుకుంటారు.

గత సంవత్సరం లక్షా పదకొండు వేల మందికి పైగా పిల్లలు కనపడకుండా పోయారు. ఇరుగు పొరుగు దేశాల నుంచి ఏటా 50 వేల మంది స్త్రీలు, పిల్లలు భారతదేశంలోకి అక్రమ రవాణా అవుతు న్నారు. దేశంలో ఈ వృత్తిలో ఉన్న రెండు కోట్ల మందిలో కోటీ అరవై లక్షల మంది అక్రమ రవాణా ద్వారా ఇతరుల బలవంతంతో వచ్చినవాళ్లే. అంటే ఎనభై శాతం మంది మహిళలు ఇలా వ్యభిచారకూపా లకు అక్రమ రవాణా కారణంగా చేరుకున్నవారే. భారీ ప్రభుత్వ వ్యవస్థ ఉన్న ఈ దేశంలో బాలల అక్రమ రవాణా అరికట్టడానికి ఇంత వరకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయలేదు.

నిర్ణీత కాంట్రాక్టు పద్ధతిలో పిల్లల తరలింపు
కాంట్రాక్టు పద్ధతిలో పిల్లలను వ్యభిచార గృహాలకు ఇవ్వడం, ముందే నిర్ణయించిన గడువు తీరగానే మళ్లీ మరో ప్రదేశానికి తరలించడం చాలా ఏళ్లుగా జరుగు తోంది. ఇలా పిల్లలను అనేక చోట్లకు తరలించడం వల్ల వారి జాడ తెలుసుకోవడం చాలా కష్టమౌతోంది. ఇలా తీసుకొచ్చిన పిల్లలను బడి పిల్లల్లాగే తయారు చేశాక అపార్ట్‌మెంట్లలో నివాసాల మధ్య ఈ దుర్మా ర్గపు వృత్తి చేయిస్తున్నారు. అవసరాన్ని బట్టి వారిని నేలమాళిగల్లో దాచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ పిల్లలపై మర్యాదస్తులు, పెద్ద మనుషులుగా సమా జంలో చెలామణీ అయ్యేవారు పెట్టే చిత్రహింసలు చెప్పనలవి కాని రీతిలో ఉంటున్నాయి. ఈ అక్రమ సెక్స్‌ వ్యాపారంలో ఆడపిల్లలతోపాటు మగపిల్లలకు కూడా గిరాకీ పెరిగిపోతున్నది.

ఈ పిల్లలతో ఇలా ప్రవర్తించడానికి కారణాలేంటి? అసహజమైన బూతు దృశ్యాలు విపరీతంగా చూసి రెచ్చిపోవడం, వయసు మీరుతున్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మా యిలు దొరకకపోవడం మాత్రమే కారణాలా? లేక ఎవరూ తాకని పసి కన్యలు కావాలనే మోజా? ఇలాంటి పిల్లలతో శారీరక సంబంధం పెట్టుకుంటే అప్పటికే ఉన్న రోగాలు పోతాయనే మూఢనమ్మ కమా? ముక్కుపచ్చలారని ఈ పిల్లలను ఎంతగా హింసించినా, ఎలాంటి వికృత లైంగిక చర్యలకు పాల్పడినా వారు అడ్డుచెప్పలేరనే నమ్మకమా? నిస్స హాయ స్థితిలో ఉండే అమ్మాయిలపై కామం పేరుతో శాడిజానికి పాల్పడి ఆనందించే రాక్షస లక్షణమా? ఇంకే కారణాలు మనుషులను మృగాలను మించి పోయేలా చేస్తున్నాయి? ఈ పిల్లలు అనుభవించే హింస, వర్ణనా తీతమైన కష్టాలు చూస్తే రాళ్లు సైతం విలపిస్తాయి. ఇంతటి ఘోరాలు పసివాళ్లపై జరుగు తున్నా చలించని ప్రభుత్వాలుంటే అవి అమలు చేయాల్సిన చట్టాలు ఏం చేయగలవు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనుషులను వేధించాల్సిన సమ యం వచ్చింది.

బిహార్‌ అనాథ గృహాల కథనాలు దారుణం
ఉత్తరాది రాష్ట్రమైన బిహార్‌లోని అనాథ గృహాల కథ నాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఆయన రాజ కీయ నాయకుడు. మూడు పత్రికల యజమాని. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కూడా. ఆయన ఏడేళ్ల మూగ చెవిటి అమ్మాయిని కూడా వదల్లేదు. 34 మంది చిన్న బిడ్డలకు మత్తుమందులు ఇచ్చి అత్యాచారాలు చేసిన ఘటనలు ఇక్కడే జరుగుతున్నాయి. బిహార్‌ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మంజూ వర్మ (ఈమె బుధ వారం పదవికి రాజీనామా చేశారు) భర్త ముజఫర్‌ పూర్‌ అనాథ బాలికల గృహంలో అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవడమేగాక తానే స్వయంగా అత్యాచారం చేశాడు. అనాథ గృహంలోని ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలపై ఎవరో ఇచ్చిన నివేదిక ఎనిమిది నెలలపాటు అతీగతీ లేకుండా మంత్రి ఆఫీసులో పడి ఉంది.

ఈ పిల్లల ఆక్రందనలు ఎవరూ వినలేదు. బయటకు ఈ పిల్లల అరుపులు, ఏడుపులు వినపడుతున్నా, బాలికలను జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతున్నా చుట్టూ ఉన్న జనం మాట్లాడలేదు. ఎందుకంటే వారికి భయం. ఈ దుర్మార్గాలకు సూత్రధారి అయిన బ్రజేష్‌ ఠాకూర్‌ తనను అరెస్ట్‌ చేశాక భయపడలేదు. పోలీసులు తీసు కుపోతున్నప్పుడు అతను నవ్వుకుంటూ ‘ఇదంతా రాజకీయ కుట్ర’ అని మీడియాకు ధైర్యంగా చెప్పా డంటే, అతనికి రాజకీయంపై ఎంత నమ్మకం?  అతని నమ్మకం వమ్ముకాలేదు. జైలు ఆస్పత్రిలో ఠాకూర్‌కు రాజభోగాలందుతున్నాయి. అనాథ పిల్ల లంతా మానసిక, శారీరక గాయాలతో కునారి ల్లుతున్నారు. బ్రజేష్‌ ఠాకూర్‌ నడిపే మరో అనాథగృ హంలో  11 మంది పిల్లల ఆచూకీ లేదు.

గువాహటీ మసాజ్‌ సెంటర్‌లో...
ఇలాంటి అక్రమాలకే నిలయమైన గువాహటీ మసాజ్‌ సెంటర్‌ గురించి స్థానికులు ఫిర్యాదు చేసినా చాలా కాలం పట్టించుకోలేదు. తీవ్ర ఒత్తిడి తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు 110 మంది అమ్మా యిలను రక్షించారు. ఇక ఉత్తర్‌ ప్రదేశ్‌లో బ్లాక్‌ లిస్టులో ఉండి, అనుమతి లేని షెల్టర్‌ హోమ్‌కు పోలీ సులు అమ్మాయిలను ఇస్తూనే ఉన్నారు. ఈ అనాథ కేంద్రాల నుంచి రోజూ వ్యాన్లలో మైనారిటీ తీరని అమ్మాయిలను విటుల దగ్గరకు పంపడం పోలీసు లకు తెలుసు. మరి ఈ విటులు అధికారులా? రాజ కీయ నాయకులా? అనే విషయంపై పోలీసులు ఆరా తీయడం లేదు. విటులందరిపైనా పోక్సో చట్టం కింద కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? ఈ ఘటనలన్నింటికీ అక్రమ రవాణా చట్టం, వ్యభిచార నిరోధక చట్టంతోపాటు పోక్సో చట్టం కూడా వర్తి స్తుంది. వ్యభిచార కూపాల్లో మాదిరే ఈ గృహాలకు చేరిన పిల్లలు వాటి నిర్వాహకుల దయాదాక్షిణ్యాలపై బతకాల్సిందే. ఈ హోమ్‌ల యజమానులకు రాజ కీయ పార్టీలు, అధికారుల అండదండలున్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా అక్రమ రవాణా బాధి తులను ఈ పునరావాస కేంద్రాలకు తరలిస్తూనే ఉన్నారు. వీటిలో పునరావాసం కల్పించేవి ఎన్ని? వ్యాపారం నడిపేవి ఎన్ని? ఎక్కడా పర్యవేక్షణ లేదు.  

ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు కూడా  జవా బుదారీతనం లేదు. వేటిపైనా నిఘా లేదు. ‘పునరా వాసం’ మంచి లాభదాయక వ్యాపారంగా మారింది. అందుకే సుప్రీంకోర్టు ‘‘పసి పిల్లలపై అకృత్యాలు చేయడానికి ప్రభుత్వం నిధులు ఇస్తున్నదా? ఎందుకు సరైన తనిఖీ లేదు’’ అని ప్రభుత్వాన్ని నిల దీసింది. కనీసం అత్యాచార బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్నయినా ఎందుకు ఇవ్వలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇంత క్రూరత్వం అనుభవించిన పసివాళ్ల బాధ, మనోవేదన నిరంతరం పచ్చిపుండే. ఈ పిల్లలు మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు భరోసా ఇవ్వాలని ఎవరూ అనుకోవడం లేదు. వారి మానసిక కల్లోలం సమసిపోవడానికి చికిత్స అందిం చాల్సిన బాధ్యత మనపై ఉందని ఎవరూ భావిం చడం లేదు. ఒక గృహంలో అకృత్యాలు జరిగినట్టు తేలితే పిల్లలను మరో గృహానికి తరలించి అధికా రులు చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ దేశ అధి కార వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రేక్షకపాత్ర వహిస్తున్న సమాజం–ఇలా అందరూ ఈ బిడ్డల విష యంలో దోషులే. నిర్లజ్జగా, బాధ్యత తీసుకోకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు అసలు నేరస్తులు.

వ్యాసకర్త : పి. దేవి, సాంస్కృతిక కార్యకర్త
ఈ–మెయిల్‌ : pa_devi@rediffmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు