ఆ చట్టాలతో మూలవాసులకు ఆ కాస్త చోటూ కరువే!

5 Jan, 2020 00:41 IST|Sakshi

సందర్భం

జాతీయ జనాభా పట్టిక (ఎన్నార్సీ) అనేది అధికారంలో ఉన్న పార్టీ తన హిందుత్వ సిద్ధాంతానికి అనువుగా ఏర్పాటు చేసుకున్న సంకుచిత వ్యవస్థ. ఇది అతి క్రూరమైన వైపరీత్యం. లౌకిక స్వభావాన్ని విధ్వంసం చేసే అసమాన ప్రక్రియ. ఇది అంపశయ్య మీదున్న ఆదివాసుల మనుగడను ఇంకా ప్రమాదపు అంచుకు నెట్టివేస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఆటవిక చట్టాలతో అటు అడవికి, ఇటు మైదానానికి కాకుండా పోతున్న మూలవాసులను పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్నార్సీ) కలిసి భూమ్మీదే చోటు లేకుండా చేయబోతున్నాయి. 

యురేనియం అన్వేషణ, వజ్రాల తవ్వకాలు, పులుల సంరక్షణ కేంద్రాలకు అడవి ప్రాంతాన్ని విభజన చేసుకొని ఆయా ప్రాంతాల పరిధిలోకి వచ్చే గిరిజన గూడేలకు గుర్తింపులు రద్దు చేసి అడవి నుంచి బలవంతంగా బయటికి నెట్టివేయాలని చూస్తున్న కేంద్ర పాలకులకు జాతీయ జనాభా పట్టిక మరింత బలాన్ని ఇవ్వబోతోంది. అడవిలో ఆధారంలేక, అనువుగాని మైదానంలో గుర్తింపులేక గిరిజనులు పుట్టి పెరిగిన చోటనే అక్రమ వలసదారులు కాబోతున్నారు. దేశం మొత్తమ్మీద ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్‌షిప్‌’ (ఎన్నార్సీ) అమలు చేస్తే... తాము గిరిజనులమని గిరిజనులే రుజువు చేసుకోవాలి. రుజువు చేసుకోలేకపోతే... పుట్టి పెరిగిన నేలకు పరాయివాళ్లు అవుతారు. అడవిలోకి అక్రమంగా చొరబడిన విదేశీ యులు అవుతారు.

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు జాతులు, తూర్పు కనుమల్లోని సహ్యాద్రి కొండల్లో నివసించే కోయ, గోండు, కోలాన్, విశాఖ మన్యంలోని కోయ, కొండరెడ్లు తదితర గిరిజన జాతుల మీద అటవీ అధికారులు దాడులు చేసి వెళ్లగొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్న వేళ ఎన్నార్సీ చట్టం ముచ్చెమటలు పోయిస్తోంది.

అడవిలోని గూడెలను అధికారికంగా రద్దు చేసి, రేషన్, ఇతర సంక్షేమ పథకాలు అందకుండా చేసి అడవి నుంచి బలవంతంగా బయటికి తీసుకువచ్చి మైదాన ప్రాంతంలో ఏదో ఒక చోట వారిని కట్టడి చేస్తారు. తమది కాని కొత్త ప్రాంతంలో తాము అడవి బిడ్డలమని రుజువు చేసుకుంటే భారతీయ పౌరసత్వం ఉంటుంది. లేకుంటే ఆక్రమణదారులుగా గుర్తించే ప్రమాదం ఉంది.

ఇక ఈశాన్య రాష్ట్రాలలోని ఆదివాసుల పరి స్థితి మరీ అన్యాయం కానుంది. అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు ప్రధానంగా నాగా, అంగమి, ఆవో, రెంగ్మా, జిలాంగ్, శంతల, సౌర, గ్వాండియ, ఖాసీలు సంతాల్‌ తదితర ఆదివాసీ తెగలతో తమదైన ప్రత్యేక జాతుల అస్తిత్వం కలిగి ఉంది. పౌరసత్వ సవరణ చట్టం స్థానిక గిరిజన జాతుల సంస్కృతిపై దాడి చేయనుంది. కొత్త పౌరసత్వ సవరణ చట్టం వల్ల బెంగాలీ హిందువులకు చట్టబద్ధత వస్తుంది. 

బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి స్థిరపడిన అసంఖ్యాక హిందువులకు చట్టబద్ధ పౌరసత్వం లభిస్తే రాష్ట్ర జనాభాలో వారి ఆధిక్యత నెలకొంటుంది. ఈశాన్య భారతం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. క్రైస్తవులు అధికంగా ఉన్న మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్లలో మతపరంగా జనాభాలో పెనుమార్పులు రానున్నాయి. చివరగా చేరిన సిక్కింతో కలిపి ఈశాన్య భారతంలో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లో (అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌) ఆదివాసీ జనాభా ఎక్కువ. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో 20 నుంచి 30 శాతం ఆదివాసీ జనాభా ఉంది. ఆరవ షెడ్యూల్‌ లోని జాబితా ఆదివాసీ జాతుల మీద తీవ్ర ప్రభావం చూపించనుంది.

జాతీయ పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం 2014 కన్నా ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ నుండి భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందూ, బుద్ధిస్ట్, సిక్కు జైన, పార్సీ, క్రైస్తవ మతాలకు చెందిన వారికి భారత పౌరసత్వం వస్తుంది. దీనిని జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ (సిఎబి) రూపంలో ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోకసభ, రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొంది దీని మీద రాష్ట్రపతి కూడా సంతకం చేశారు. అందువల్ల ఇది చట్ట రూపం పొంది, సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌గా (సీఏఏ) అమలుకు సిద్ధంగా ఉంది. ఈ చట్టం ముస్లింలకు తప్ప అన్ని మతాలకు చెందిన వలస ప్రజలకు మన దేశ పౌరసత్వం ఇస్తుంది. ఇలా మత ప్రాతిపదికన హక్కులు కల్పించడం భారతదేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధం.

బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌ నుంచి వలసవచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారుల నిర్వచనం నుంచి మినహాయించింది. ఈ మూడు ముస్లిం దేశాల్లో మైనారిటీలు (అన్యమతస్థులు) వేధింపులకు గురవుతున్నందువల్ల వారికి ఆశ్రయం కల్పించి పౌరసత్వం ఇవ్వాలన్న ఆలోచనే హిందూ మత మార్పిడిలకు ప్రోత్సాహకంగా ఉంది. ఇలా మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం ఇజ్రాయెల్‌లో తప్పితే ప్రపంచంలో మరెక్కడా ఉన్న దాఖలాలు లేవు.
దేశంలో స్థాయికి మించి పెరిగిపోయిన నిరుద్యోగం, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ, రైతుల ఆత్మహత్యలు, పర్యావరణ విధ్వంసం వంటి తీవ్రమైన సమస్యల వలయం నుంచి యువత, ప్రజల దృష్టి మరల్చి అధికార పీఠాన్ని పదిలపరుచుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అమలుచేస్తోంది. ఇది రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం. బలమైన హిందుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటంలో భాగమిది. కర్ర పెత్తనం చేసి రాష్ట్రాల్లో బలవంతంగా అమలు చేయచూస్తోంది. ఈ ఉపద్రవాన్ని ఆదిలోనే తుంచివేయాలి. దేశంలోని బీజేపీ ప్రభుత్వేతర రాష్ట్రాలు ఏకమై ఫెడరల్‌ ఫ్రంట్‌ స్ఫూర్తితో ముందుకు రావాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ధర్మ యుద్ధం చేయాలి.

వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి , సీనియర్‌ జర్నలిస్టు, శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ ఛైర్మన్‌ 
మొబైల్‌ : 94403 80141

>
మరిన్ని వార్తలు