దండగ నుంచి పండగ దిశగా వ్యవసాయం...

24 Jun, 2018 03:06 IST|Sakshi


తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులు దశలవారీగా పూర్తిచేస్తూ చెరువులను నింపడానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో పాలమూరు నుంచి వలస వెళ్లిన కుటుంబాలు పల్లెలకు తిరుగుముఖం పడుతున్నాయి. పంట పెట్టుబడి పథకం వల్ల ఈసారి వానాకాలంలో 10 నుంచి 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. పంటల ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశం ఉన్నది. రైతు బీమా పథకం రైతాంగంలొ కొత్త ధీమా నింపింది. ఉమ్మడి పాలనలో వ్యవసాయం అంటే అంటే దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం అంటే ‘పండగ’ అనే సరికొత్త ఆశల వైపు తెలంగాణ రైతాంగం అడుగులు వేస్తోంది.

కాకతీయ చక్రవర్తి  ప్రతాపరుద్రుడు ఓరుగల్లు కోటను విడిచి కర్నూలు సీమలో పర్యటించి, ఇప్పటికి కర్నూలు పట్టణానికి  10 నుంచి 15 మైళ్ళ దూరం ఆవలికి వెళ్లి నందికొట్కూరు పల్లెను నిర్మాణం చేసినట్లు నందికొట్కూరు శాససం, రాయలసీమలో లభించిన తామ్ర శాసనాల వల్ల తెలుస్తోంది. అక్కడ అడవులు నరికించి, చెరువులు, గ్రామ నిర్మాణం చేసినట్లు, నూతన గ్రామంలోకి  జన ప్రవేశం చేయించి, వారిని వ్యవసాయం వైపు మళ్లించటానికి  ప్రత్యేక సంస్కరణలు అమల్లోకి  తెచ్చినట్లు శాస నాల్లో లిఖించారు.

ప్రతాపరుద్రుడు పల్లె వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి అర్ధ సిరుల కౌలు విధానం నుంచి ‘దశబంధ ఇనాం’ అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అంటే పండించిన పంటలో కేవలం పదోవంతు రాజ్యానికి అప్పగించాలి. ఆరోజుల్లో ఇదో విప్లవాత్మకమైన మార్పు. కాకతీయుల అనంతరం దక్కన్‌ ప్రాంతాన్ని పాలిం చిన రాజవంశాల్లో కుతుబ్‌ షాహీలు, అసఫ్‌ జాహీలు, స్థానిక ప్రభువులు, సంస్థానాధీశులు అందరూ చెరువుల నిర్మాణాన్ని ప్రోత్సహించి కొనసాగించారు కానీ రైతన్న వెన్నుతట్టేంత స్థాయిలో రాయితీలు మాత్రం ఇవ్వలేకపోయారు. దక్కన్‌ ప్రాంతం ఇండియన్‌ యూనియల్‌లో కలిసిన తరువాత జరిగిన చెరువుల విధ్వంసం, గ్లోబలైజేషన్‌ పర్యవసానంతో వ్యవసాయ ఉత్పతనం మొదలై రైతన్నల ఆత్మహత్యలు రోజురోజుకు పెరు గుతూ వచ్చాయి.

ఒక్కసారి విత్తనం వేయాలంటే దుక్కిని సాలు, ఇరువాలు చేయాలే, అంటే  మూడుసార్లు దున్ని నాలుగోసారి గొర్రు కొట్టాలే. విత్తనం వేసిన దినం నుంచి  మొలక బయటికి వచ్చేంత వరకు భూమిని పచ్చి బాలింతను చూసినట్లు చూడాలే. ఆడికి ఆయిపోందా? కండ్లళ్ల కంటిపాపను చంపుకొని పొలానికి నీళ్లు పెట్టాలి. గడ్డీ గాదం కలుపు పడితే తీసేయాలి. ఎర్రబొమ్మిడి రోగం, పేను ముడత, కమ్మాకు రోగం పుట్టరోగం.. ఎప్పటి కప్పుడు కంటిలో ఒత్తులేసుకొని జూసుకుంటూ తగిన మందు కొట్టాలి. ఇవ్వన్ని చేశాక పొలం పండి కోతకొచ్చే ముందు తుఫాను వస్తే... కల్లంలో ధాన్యం తడిసిపోతే రైతు కష్టం.. ప్రాణం గంగ పాలైనట్లే. కాకతీయుల కాలం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో చంద్ర బాబు నాయుడు పాలన వరకు రైతులు పన్నులు కట్టకపోతే ఏ పాలకుడు ఊరుకోలేదు.

‘మేడారం రాజ్యంలో కరువు వచ్చి పంటలు లేక జనం అల్లాడుతున్నారు, ఈ ఒక్కసారి పన్నులు రద్దు చేయమన్నందుకు’ కాకతీయులు మేడారపు దండయాత్ర చేసి నట్లు  ‘సమ్మక్క–సారలమ్మ’  చరిత్ర చెబుతోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఏడేళ్ల వరుస కరువులో రైతాంగం అల్లాడిపోతున్న వేళ  కరెంటు బకాయిలు కట్టలేదని నాటి సీఎం చంద్రబాబు రైతులను జైళ్లో పెట్టించారు. ఇదీ చరిత్ర.నాలుగేళ్ల తెలంగాణ అవతరణ తరువాత రైతు ఆకాంక్షలకు పునాదులు పడుతున్నాయి. రైతే రాజు అయినప్పుడు ఆటువంటి పాలకుని ఆలోచనలు ఎప్పుడూ అన్న దాత పక్షంగానే ఉంటాయి. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రైతన్న ఆత్మవిశ్వాసానికి అద్దంపడుతాయి. బక్కచిక్కిన రైతన్నను బలోపేతం చేసి  అంపశయ్య మీద ఉన్న  వ్యవసాయానికి ఊపిర్లు ఊదిన ప్రయత్నంలోనే ‘రైతుబంధు, రైతు బీమా’ ‘మిషన్‌ కాక తీయ’ పథకాలు జనించాయి. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు సహా మొత్తం వ్యవసాయరంగాన్ని సమైక్య పాలకులు నిర్లక్ష్యం చేయడంతో లక్షలాది రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరు కుపోయాయి.

తెలంగాణ ఏర్పడిన తర్వాత 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయరంగాన్ని బాగు చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నరు. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, 45 వేల చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్తు, మార్కెటింగ్‌ గిడ్డంగుల నిర్మాణం, పాలీహౌజ్‌ సాగు, సబ్సిడీపై ట్రాక్టర్ల పంపిణీ, డ్రిప్‌ ఇరిగేషన్, సమయానికి ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం సహా ఎన్నో రైతు అనుకూల నిర్ణయాలను ప్రభుత్వం తీసుకొని ఆచరణలో పెడుతున్నది. ఈ క్రమంలోనే 17 వేల కోట్ల రుణాలను మాఫీచేసి రైతులకు అండగా నిలిచింది. ఇప్పుడు రైతుల నుంచి పన్నుల వసూళ్లు చేయటం మానేసి ఎదురు పెట్టుబడి పెట్టి అన్నదాతల  జీవితాలను ఎలాగైనా గట్టెక్కించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ఆలోచన చేశారు.

అదును మీద రైతును ఆదుకొని విత్తనం, ఎరువుల కోసం ఆర్థిక సహాయం అందిస్తే... రైతులకు ఆర్థిక భారం తప్పించటంతో పాటు అంతకు మించి వేలాది రెట్ల మానసిక  ధైర్యాన్ని రైతు లోకానికి కల్పించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయం సాధిం చారు.ఎకరానికి రూ.8 వేలు పంట పెట్టుబడి ఇవ్వడం కోసం బడ్జె ట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించి  తెలంగాణలోని సన్న చిన్న కారు కలిసి 58 లక్షల మంది రైతుబంధులకు ఆత్మ బంధువుగా నిలబడ్డారు. రాష్ట్రంలో రెండున్నర ఎకరాల్లోపు ఉన్న రైతులు 40,92,124 మంది, రెండున్నర నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 11,02,813 మంది, 5 నుంచి 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు 4,44,068 మంది, 10 నుంచి 25 ఎకరాల్లోపు ఉన్న రైతులు 94,551 మంది ఉన్నారు. ఒక  25 ఎకరాల పైబడి ఉన్న  భూస్వామ్య రైతులు 6,448 మంది (0.11 శాతం) మాత్రమే ఉన్న రు.  మొదటి దశ కింద ఎకరానికి  రూ.4 వేల చొప్పున రూ 6 వేల కోట్లు  రైతులకు పంచారు.

మా ప్రాంతం రైతులను పలకరిస్తే  కొండంత ధైర్యంతో ఉన్నారు. రైతులందరి మోముల్లో సంతోషం కనిపిస్తున్నది. గతంలో మాదిరిగా అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు తెచ్చుకునే బాధ తప్పింది. రైతులే నేరుగా వెళ్లి నాణ్యమైన విత్తనాల గురించి విచారించుకొని కొనుక్కుంటున్నరు.మిషన్‌ కాకతీయ కింద చెరు వులు నిండి  ఇన్నాళ్లూ బీడు పడి ఉన్న భూములు సైతం సాగు కళ సంతరించుకుంటున్నయి. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు దశల వారీగా పూర్తిచేస్తూ చెరువులను నింపడానికి ప్రాధాన్యం ఇస్తుండ టంతో పాలమూరు నుంచి వలస వెళ్లిన కుటుంబాలు పల్లెలకు తిరుగుముఖం పడుతున్నయి. పంట పెట్టుబడి పథకం వల్ల ఈసారి వానాకాలంలో 10 నుంచి 12  లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది.  పంటల ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశం ఉన్నది.  రైతు బీమా పథకం రైతాంగంలో కొత్త ధీమా నింపింది. ఉమ్మడి పాలనలో వ్యవసాయం అంటే దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం అంటే ‘పండగ’ సరికొత్త ఆశల వైపు తెలంగాణ రైతాంగం అడుగులు వేస్తోంది.

సోలిపేట రామలింగారెడ్డి  

వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు
మొబైల్‌ : 94403 80141

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు