జనం పాట పాడితివయ్యా..

7 May, 2019 01:42 IST|Sakshi

జనం పాట పాడితివయ్యా..
జనం పాట పాడితివి
జనం పోరుబాటల్లోనా
డప్పుకొట్టి ఆడితివి
జనం పాట ఆగిపోదురన్నా.. 
ప్రజలపాట మూగ
బోదురున్నా.. రామన్నా 

1. నక్సల్బరి వేకువలోన–
మేలుకుంటివోయన్నా
సిక్కోలు బాటలవెంటా 
సాగివస్తీవోయన్నా
పాణిగ్రాహి జముకైనావూ..
కానూరి రాగమైనావు
గుండె గొంతు
పాటయినావోయన్నా...
అరుణారుణ బాటయి
నావో
యన్నా... రామన్నా !!
అరుణోదయ!!  (జనం)

2. ఊరేదో తెలియదు
మాకు.. పేరేదో తెలియదు మాకు
రాగమే ఊరయినాది–
చిటికె కోల పేరయినాది
అరుణోదయ చిరునామా 
చెరిగిపోని వీలునామా
పాటకే పరవశిస్తామన్నా..
రామారావుకే జోహారందామన్నా 
– మాయన్నా ‘‘రామారావు‘‘

3. కత్తుల బోనులెన్నో –
బిగుసుకుంటున్నాయన్నా
నెత్తుటి సంగీతాలు –
నేలరాలుతున్నాయన్నా
కలిసి గళమిప్పే వేళా –
కనుమరుగవుతున్నావు
వేయిపడగలెదిరిద్దామోయన్నా..
వేనవేల రాగాలవుతామన్నో 
రామన్నా
‘‘వేన వేల‘‘

జనం పాటయింటావయ్యా
రణం బాటలుంటావయ్యా
రగిలె ఎర్ర జెండాలోన
రెపరెపలాడుతున్నావయ్యా
దండాలని నీకు పాడుతుమన్నా...
గండాలన్ని దాటివస్తామన్నా... 
రామన్నా

(అరుణోదయ రామారావుకు నివాళిగా)
– మిత్ర 

మరిన్ని వార్తలు