దిగుమతులతో కుదేలవుతున్న వ్యవసాయం

3 Nov, 2019 01:05 IST|Sakshi

సందర్భం 

సరళీకృత ఆర్థిక విధానాల అమలు ఫలితంగా భారత వ్యవసాయోత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీకి నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఆయా దేశాల వాతావరణాలను బట్టి పెట్టుబడి, ఎగుడు  దిగుడులుగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఉత్పత్తి అయిన దేశాలలోని వ్యవసాయోత్పత్తులను తక్కువ ధరలతో.. అధిక పెట్టుబడి అవసరమయ్యే దేశాలలోకి డంప్‌ చేయడం ద్వారా ఆ దేశాలలోని వ్యవసాయోత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయరు. ఫలితంగా ఆ దేశాలలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోతుంది. 1995 జనవరిన ఏర్పడిన ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ తన విధానాల అమలును 2005 నుండి ప్రారంభించడంతో అభివృద్ధి చెందుతున్న దేశాలలోని వ్యవసాయోత్పత్తులు అంతర్జాతీయ పోటీని తట్టుకోలేకపోతున్నాయి. 2015 డిసెంబర్‌ 19న నైరోబిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ, మంత్రివర్గ సమావేశంలో పత్తిపై ఎగుమతి సబ్సిడీలు ఇవ్వకూడదని నిర్ణయం చేశారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికాలో అగ్రిమెంటుపై సంతకాలు కూడా చేశారు. క్రమంగా ఎగుమతి సబ్సిడీలను అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు వర్తింపజేయడానికి  డబ్ల్యూటీవోలో ప్రయత్నం జరుగుతున్నది. దీనివల్ల మనదేశం నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయోత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. 

వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో దేశం స్వయం సమృద్ధం సాధించిన స్థితిలో కూడా దిగుమతులు పెద్దఎత్తున వస్తున్నాయి. మొదటిసారి పామాయిల్‌ దిగుమతి రావడంతో దేశంలోని నూనెగింజల పంటలు వేరుశనగ, నువ్వులు, ఆము దాలు, సన్‌ ఫ్లవర్‌ పంటలకు మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో వాటి విస్తీర్ణం తగ్గింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 60 లక్షల ఎకరాలకు పైగా వేసిన వేరుశనగ 35 లక్షల ఎకరాలకు తగ్గింది. మిగతా నూనె గింజల పంటల విస్తీర్ణం కూడా తగ్గింది. దాంతో ప్రస్తుతం 1.50 కోట్ల టన్నుల వంట నూనెలను రూ.74 వేల కోట్లు వెచ్చించి దిగుమతులు చేసుకుంటున్నాము. అదే సందర్భంలో దేశంలో 9 లక్షల ఎకరాలు సాగుభూమి బీళ్లుగా మారింది. బీళ్లుగా మారిన భూమిలో నూనెగింజలు, పప్పుధాన్యాలు, పత్తి ఉత్పత్తి చేశారు. గిట్టుబాటు ధర తగ్గడంతో భూములను బీళ్లుగా పెడుతున్నారు. తెలంగాణలో 1.63 కోట్ల ఎకరాల సాగుభూమి ఉండగా 53 లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 2 కోట్ల ఎకరాల సాగు భూమిలో 40 లక్షల ఎకరాలను బీళ్లుగా మార్చారు. ఆవిధంగా అనివార్యంగా దిగుమతులు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కోళ్ల ఉత్పత్తిలో ప్రధాన దేశంగా ఉన్న భారత దేశానికి కోడి కాళ్లు కేఎఫ్‌సీ, మెక్సికన్, ఫ్రైడ్‌ చికెన్‌ పేరుతో దిగుమతులు వస్తున్నాయి. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు అనేక రాయితీలను వ్యవసాయ రంగానికి కల్పిస్తున్నాయి. కానీ మనదేశంలో ఏనాడూ బడ్జెట్‌లో వ్యవసాయ సబ్సిడీ 1.8 శాతానికి మించలేదు. పంటల బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు. మన దేశంలో ఆ సౌకర్యాలు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం మిగిలిన దేశాలకు మించి పెరుగుతున్నది. 

రీజినల్, కాంప్రహెన్సివ్‌ ఎకనమిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (ఆర్‌సీఈపీ)పేరుతో పదిహేను దేశాలతో భారతదేశం దిగుమతి ఒప్పందం కుదుర్చుకుంటున్నది. భారత్‌ ఇప్పటివరకు 20 సమావేశాల్లో పాల్గొన్నది. ఆ దేశాలతో ద్వైపాక్షిక ఎగుమతి, దిగుమతి ఒప్పందాలు పెరిగాయి. చివరిగా 2019 నవంబర్‌ 4న బ్యాంకాక్‌లో తుది ఒప్పందం చేసుకోబోతున్నది. ఇప్పటికే చైనా, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సింగపూర్, మలేసియా, వియత్నాంలతో లోటు వ్యాపారంలో భారతదేశం ఉంది. సుమారుగా 10 బిలియన్‌ డాలర్ల లోటుతో కొనసాగుతున్నది. ఆర్సీఈపీ సంస్థలోని షరతులు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) షరతులకన్నా కఠినమైనవి. డబ్లూటీవో షరతుల్లో సుంకాల విధింపు, ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక సరుకుల దిగుమతి సుంకాలు, మేధోసంపత్తి పన్ను తదితర దిగుమతి సుంకాలను నిర్ణయించుకునే హక్కు ఉంది. కానీ ఆర్సీఈపీలో ఎలాంటి దిగుమతి సుంకాలూ నిర్ణయించరాదు. ప్రత్యేక రక్షణలు లేవు. పూర్తి దిగుమతి సుంకం ఎత్తివేయాలి. మేథోసంపత్తి అప్పులపై కూడా పన్నులు నిర్ణయించరాదు. పై షరతులు అమలు జరిగితే ఈ సంస్థలోని దేశాలకు వారి ఉత్పత్తులకు దిగుమతుల కేంద్రంగా భారతదేశం ఉంటుంది. భారతదేశంలోని వ్యవసాయ ఉత్పత్తులన్నీ అతి కొద్ది కాలంలో దెబ్బతింటాయి. 

2018–19లో మొత్తం దిగుమతులు 35.94 లక్షల కోట్లు కాగా భారతదేశం నుంచి మొత్తం ఎగుమతులు 23.07 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ మరియు నాన్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ తోపాటు రవాణా పరికరాలు కలిసి 4.30 లక్షల కోట్ల  దిగుమతులు అవుతున్నాయి. పై దిగుమతులను మన దేశంలో కుటీర పరిశ్రమల ద్వారా కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. అతి చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా దిగుమతులను తగ్గించుకోవచ్చు. 131 కోట్ల జనాభా ఉన్న అతి పెద్దదేశంలో కనీసం 20 శాతం మార్కెటింగ్‌ను విదేశాలు ఆక్రమించుకోగలిగితే వారి ఉత్పత్తులకు లాభదాయకత ఉంటుంది. ఇలా దిగుమతులు అధికంగా రావడంతో దేశంలో నిరుద్యోగం కూడా తీవ్రంగా పెరుగుతున్నది. చివరికి గ్రామీణ నిరుద్యోగం 20 శాతం నుంచి 30 శాతానికి చేరుకున్నది. వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు పెంచుకోవడం ద్వారా ఆస్తులు పెంచుకోవాలన్న లక్ష్యం వైపు ప్రభుత్వాలు విధానాలను అమలు చేయడం లేదు. దేశీయ గుత్త పెట్టుబడిదారులు కూడా విదేశీ బహుళజాతి కంపెనీలతో జతకట్టి వారి ద్వారానే లాభాలు గడించే ప్రయత్నం చేస్తున్నారు. 

మనకున్న మౌలిక వనరులను, మానవ శ్రమను, పెట్టుబడులను, సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ప్రపంచంలో ధనిక దేశంగా అభివృద్ధి చెందవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.5 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీని 5 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళతానని ప్రధాని మోదీ ప్రకటించడం అమలు కాని లక్ష్యంగా ఉంది. 2020–22 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మూడేళ్ల క్రితం ప్రకటించినా, గతంలో ఉన్న ఆదాయం తగ్గుతున్నదే తప్ప పెరగడం లేదు. అందువల్ల వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తుల పెంపుదలకు, మౌలిక వనరుల వినియోగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమమైన పథకాలు రూపొందించాలి.

వ్యాసకర్త : సారంపల్లి మల్లారెడ్డి
అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు ‘ 94900 98666

మరిన్ని వార్తలు