క్రిస్మస్‌

23 Dec, 2017 01:16 IST|Sakshi

ప్రపంచంలోని వివిధ దేశాల్లో బాలయేసుని పూజించే సంప్రదాయాల్లో కొన్ని దేశాల్లో 12 రోజుల ముందు, మరికొన్ని దేశాల్లో నెల రోజుల ముందుగానే జరుపుకోవటం జరుగుతుంది. క్రిస్మస్‌ పండుగ రోజు లలో బహుమతులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవటం, బహుమతుల ప్రదానం చేయడం, సంగీతాసునా దాలతో గృహాలను దర్శించడం, దీపాలంకరణతో చర్చ్‌లు అలంకరించటం, సాయంకాలం ధ్యానాలు, అర్ధరాత్రి క్రిస్మస్‌ పండుగ ముందురోజు చర్చ్‌లలో సహోదరుల సమూహమంతా ధ్యానంలో పాల్గొని బాలయేసుని ఆరాధించడం జరుగుతుంది.

సాయంకాల ధ్యానంలో కొవ్వొత్తులతో వెలుగుల కాంతిని చర్చి లోపల వెలిగించి భక్తులందరూ కలసి ధ్యానిస్తారు. క్రిస్మస్‌ పండుగ ముందు అర్ధరాత్రుల సమయాల్లో చర్చ్‌లలో ప్రార్థనలు జరుపుకోవడం, వృద్ధుల సౌకర్యార్థం అర్ధరాత్రి ధ్యానంలో హాజరు కావడం అసాధ్యమనే ఉద్దేశంతో ఉదయం వేళ ధ్యానించటం నిమిత్తం ఆయా చర్చిల సమయాల్లో తిరిగి ప్రార్థన కార్యక్రమం జరుగుతుంది. గృహాలంక రణ చేయటం, నక్షత్రాల ఆకారంతో తయారు చేసిన దీపాలను ఇంటిముందు అలంకరించటం చేస్తారు.

తూర్పు దిక్కున ఉదయించిన నక్షత్రం తూర్పు దేశాల జ్ఞానులకు ప్రత్యక్షమయినందున నక్షత్రాన్ని వెతుక్కుంటూ, ఆ నక్షత్రం చూపిన బాటలో బెత్లెహే ముకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడు న్నాడని, ఆయనను మేము పూజించడానికి వచ్చామన్న వార్త విన్న హేరోదు రాజు అతనితో కూడా ఉన్న యెరూషలేము నివాసులు కలవరపడ్డారు. ఎందు కంటే పూర్వం యెరూషలేము దావీదు పట్టణాన్ని యూదా దావీదు వంశీయులు బహుకాలం పాలిం చారు. యేసు దావీసు వంశ పుత్రుడుగా, గోత్రీకుడుగా జన్మించినందున తిరిగి యూదా దేశ రాజ్య స్థాపన కోసం ఈయన ఆ వంశములో జన్మించాడనే ఉద్దేశమే వారి కలవరానికి కారణం. కానీ సర్వోత్తముడైన తండ్రి సంకల్పం మాత్రం కరడు కట్టిన మనసులను, మనుష్యులను పరివర్తన చెందించ డానికి మాత్రమే. మత స్థాపన, రాజ్య స్థాపన నిమిత్తం కాదు.

క్రిస్మస్‌ పదంలోని క్రిస్‌ అనగా క్రీస్తు మాస్‌ అనగా ధ్యానము అని అర్థం. అంటే క్రీస్తు ఆరాధన దినోత్సవం లేక క్రీస్తు ధ్యానించు దినం అని అర్థం. గాబ్రియేలు దేవదూత పరలోకం నుంచి ప్రత్యక్షమై మేరీ మాతతో అన్న మాటలివి. దయాప్రాప్తులారా! నీకు శుభం. నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు. అతడు మహో న్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ఆ విధంగానే రక్షకుడైన యేసు బెత్ల హేములో జన్మించిన నేల మనందరినీ దీవిస్తూ ఉంటుంది. ‘‘సుకన్యో పుత్రా, నమోస్తుతే’’ అని ఆరాధించు క్రిస్మస్‌ పండుగ క్రీస్తు (ధ్యానముతో) ప్రార్థనతో మనందరినీ దీవిస్తుంది.

– పి. పుష్పావతి

మరిన్ని వార్తలు