సృష్టియొక్క నాటకరంగంలో నీవు ఒక పాత్రవు, నేను ఒక పాత్రను

27 Nov, 2017 02:07 IST|Sakshi

పొట్లపల్లి రామారావు ప్రత్యేక సంచిక

పొట్లపల్లి రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పాలపిట్ట ప్రత్యేక సంచిక వెలువరించింది. ఇందులో పొట్లపల్లి సాహిత్యాన్నీ, వ్యక్తిత్వాన్నీ తెలియబరిచే 22 వ్యాసాలున్నాయి.

‘పేరు తెచ్చుకోవాలనుకునే రచయితకు ఒక పథకం వుంటుంది. తన మనసు చెప్పినట్లు రాసుకుంటూ పోయిన రామారావుకు అట్లాంటి పథకం ఏదీలేదు. కనుక అన్ని ప్రక్రియలను, ఏ ప్రక్రియలోకి చేర్చాలో తెలియని పద్ధతి రచనలు కూడా రాసుకుంటూ పోయారు’ అని పొట్లపల్లి ఏ విధంగా ప్రత్యేకమైన రచయితో విశ్లేషించారు అమ్మంగి వేణుగోపాల్‌. రామారావు కాంగ్రెస్‌ స్వాతంత్య్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. జైలుక్కూడా వెళ్లారు. కానీ ఆ ప్రచారానికి ప్రాముఖ్యత ఇవ్వని మనిషని టి.శ్రీరంగస్వామి అంటారు. పొట్లపల్లి రాసిన సర్‌ బరాహి, పగ, పాదధూళి, న్యాయం నాలుగు నాటికల్లోనూ ‘వస్తువైవిధ్యం, చెప్పడంలో డొంకతిరుగుడులేని సూటిదనం ప్రస్ఫుటంగా కనిపిస్తా’యని తాటికొండల నరసింహారావు వివరించారు.
‘నా జీవన సహచరీ! ఈ సృష్టి ఏనాడు ఏర్పడ్డదో
ఆనాడే నీవు నేను ఈ భూమిపై జన్మించాము.
స్త్రీ ధర్మం నిర్వహిస్తూవున్నా నీవు స్త్రీవి కావు
పురుషధర్మం నిర్వహిస్తూవున్నా నేను పురుషుడినీ కాను.
సృష్టియొక్క నాటకరంగంలో నీవు ఒక పాత్రవు, నేను ఒక పాత్రను’...
ఇలా స్ట్రే రైటింగ్స్, మ్యూజింగ్స్‌లా కనబడే ‘చుక్కలు’– ‘పసుపురాసిన గడపకు కుంకుమబొట్ల నద్దినట్లు భావార్థ శబలతతో, తాత్విక గాఢతతో శోభాయమానంగా’ ప్రజ్వలిస్తాయని థింసా విశ్లేషించారు.
ఉర్దూ కవిత్వం తనను వయసు పైబడ్డాక వరించిందని చమత్కరించిన పొట్లపల్లి ‘జవానీ గుజర్‌ గయీ మేరీ సరాఫా బుఢాపా ఆగయా హై’ని ఉదాహరించారు నాగిళ్ల రామశాస్త్రి. ‘పట్టు పాగపై మరియొక పట్టు పాగ
చుట్టినట్టుగా నీ పేరు తట్టునోయి’ అని తన పేరును గురించి చెప్పిన పద్యాన్ని గుర్తుచేసుకున్నారు దేవరాజు మహారాజు.
వర్కింగ్‌ ఎడిటర్‌: కె.పి.అశోక్‌ కుమార్‌; పేజీలు: 82(ఏ4 సైజ్‌); వెల: 30; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, ఫ్లాట్‌ నం. 2, బ్లాక్‌ –6, ఏపీహెచ్, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌–44. ఫోన్‌: 040–27678430

మరిన్ని వార్తలు