-

ఆరోగ్య సంస్థపై ఎందుకీ ఆగ్రహం?

9 Jul, 2020 01:39 IST|Sakshi

ఒక చరిత్రాత్మకమైన సంస్థ ఆవిర్ఘావానికి కారణమైన అమెరికాతో పాటు బ్రెజిల్‌ వంటి ఇతర సభ్య దేశాలు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థను హెచ్చరిస్తూ వస్తున్నాయి. సంస్థ పనితీరు నచ్చకపోతే దాన్ని మరింత మెరుగుపర్చేదిశగా కృషి చేయాలే తప్ప పనిగట్టుకుని దెబ్బతీయకూడదు. పైగా సంస్థకు మరింతగా నిధులు సమకూర్చినప్పుడే అది చైనాపై ఆధారపడటం తగ్గుతుంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌ఓకు నిధులను ఉపసంహరించడం ద్వారా దాన్ని సమతూకంగా ఉంచే అవకాశాన్ని అమెరికా  కోల్పోతోందనే చెప్పాలి. వైరస్‌ వ్యాప్తి సమయంలో అది కొన్ని తప్పటడుగులు వేసినప్పటికీ దాని సంస్థాగత బలంతో వైరస్‌ నిరోధానికి గణనీయంగా కృషి చేసింది. ట్రంప్‌ ఆరోపించారనే కారణంతో, ఆరోగ్య సంస్థలో ఏ లోపాలూ లేవని చెప్పడం కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థను కాపాడుకోవడం ఇప్పుడు అందరి లక్ష్యం కావాలి.

ఈ మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగే ప్రక్రియను లాంఛనప్రాయంగా మొదలెట్టారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో చైనా ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థపై ముందునుంచి ట్రంప్‌ఆరోపణలు గుప్పిస్తుండటం తెలిసిందే. అయితే డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అమెరికా ఉపసంహరణ ప్రక్రియ 2021 జూలై నాటికి కానీ అమల్లోకి రాదు. ఏదేమైనా అత్యంత అధికంగా విరాళమిచ్చే సభ్యదేశాన్ని పోగొట్టుకోవడం ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెనుదెబ్బే అవుతుంది.

పైగా గాలిద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ఓ వెలువరించిన మార్గదర్శక సూత్రాలు కాలం చెల్లినవిగా 39 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రకటించిన 24 గంటల తర్వాత అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగే ప్రక్రియను చేపట్టడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్‌ చేసిన విమర్శ న్యాయమైందీ, నిష్పాక్షికమైనదీ కాకపోవచ్చు కానీ, పలువురు ప్రజారోగ్య నిపుణులు, జర్నలిస్టులు మాత్రం ట్రంప్‌ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారవేయలేమని చెబుతున్నారు. కోవిడ్‌–19 వైరస్‌ గురించిన అంశాలను బహిర్గతం చేయడంలో, వైరస్‌ను అవి ఎలా నిరోధిస్తాయని చెప్పడంలో డబ్లు్యహెచ్‌ఓ ప్రకటనలలో లోటుపాట్ల లోతు ఎంత? 

రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో అమెరికన్‌ శతాబ్దం అనీ, పాక్స్‌ అమెరికానా అని కొందరు అభివర్ణించిన కాలంలో ఐక్యరాజ్యసమితిలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడింది. ఆ యుగంలో అంతర్జాతీయ సహకారంపై పెరిగిన విశ్వాసానికి ప్రతిరూపంగా పుట్టుకొచ్చిన డబ్లు్యహెచ్‌ఓ ప్రారంభ లక్ష్యం ఏమిటంటే, ప్రజలందరికీ అత్యంత సాధ్యమైనంత స్థాయిలో ఆరోగ్యాన్ని సాధించడమే. ఆచరణలో, సంస్థ పెట్టుకున్న పై విస్తృత స్థాయి లక్ష్యం క్రమేణా, ప్రజారోగ్యానికి ప్రమాదం కలిగించే అంశాలపై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడం, వ్యాధుల వ్యాప్తిని నిరోధించడం, విశ్వజనీన ఆరోగ్య సంరక్షణ విధానాన్ని తలకెత్తుకోవడంగా మారిపోయింది. 

కరోనా వైరస్‌ వంటి అత్యవసర పరిస్థితుల్లో,  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సమన్వయ విభాగంగా వ్యవహరిస్తోంది. ప్రపంచమంతటా 150 కార్యాలయాల్లో నియమించిన 7 వేలమంది ఉద్యోగులు ఆరోగ్య సమస్యల పట్ల విశ్వవ్యాప్త స్పందనను ఆర్గనైజ్‌ చేయడం, వ్యాధులను అరికట్టడంలో మార్గనిర్దేశనం చేయడం,  వైద్యపరంగా అత్యవసరపరిస్థితులను ప్రకటించడం, సభ్య దేశాల్లో సహకారానికి సంబంధించి ప్రతిపాదనలు చేయడం వంటి లక్ష్యాలతో పనిచేస్తున్నారు.

కరోనా వైరస్‌కి సంబంధించి వ్యాక్సిన్‌ కనిపెట్టడం జరిగితే, దాని పంపిణీనీ, వ్యాక్సిన్‌ ధరను ప్రభావితం చేయడంలో డబ్లు్యహెచ్‌ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అయితే ఈ సంస్థ తన సభ్యదేశాలపై ఎన్నడూ ప్రత్యక్ష అధికారాన్ని చలాయించలేదు. అందుకే దాని లక్ష్యం దాని సామర్థ్యాలను మించి ఉంటోంది.  పైగా ఏ ప్రభుత్వ విభాగంలోనైనా జరుగుతున్నట్లే, డబ్ల్యూహెచ్‌ఓ కూడా బడ్జెట్, రాజకీయపరమైన ఒత్తిళ్లకు గురవుతోంది. ప్రధానంగా అమెరికా, చైనా వంటి శక్తివంతమైన దేశాల నుంచి, గేట్స్‌ ఫౌండేషన్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలనుంచి సంస్థకు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. 

అత్యవసర పరిస్థితుల పట్ల స్పందించడంలో డబ్లు్యహెచ్‌ఓ ట్రాక్‌ రికార్డు అసమానంగానే ఉంది. ఒకవైపున మశూచిని నిర్మూలించడంలో, పోలియోను దాదాపుగా నిర్మూలించడంలో, ఎబోలా వైరస్‌కు వ్యాక్సిన్‌ను వృద్ధి చేయడంలో, స్వల్పఆదాయాలు ఉన్న దేశాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను భారీగా విస్తరింపజేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అసాధారణమైన విజయాలు సాధించింది. అదే సమయంలో సంస్థాగతమైన పక్షవాతంతో ఈ సంస్థ కొట్టుమిట్టులాడుతోంది. పశ్చిమాఫ్రికాలో 2014లో చెలరేగిన ఎబోలా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మందకొడిగా స్పందించడంతో ఈ వైరస్‌ తీవ్రరూపం దాల్చి రెండేళ్లలో 11 వేలమంది మరణానికి కారణమైంది. 

అప్పట్లో సంస్థ నిర్వాకం పట్ల ఒబామా పాలనాయంత్రాంగం తీవ్ర అసంతృప్తిని ప్రకటించమే కాకుండా, ఇతరదేశాలతో ఎబోలా వైరస్‌ నిరోధం విషయంలో సమన్వయం చేసే ప్రక్రియలో డబ్ల్యూహెచ్‌ఓని పూర్తిగా పక్కనబెట్టేసింది. ప్రారంభం నుంచి లక్షణాలను బయటపెట్టకుండానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని గుర్తించడంలో సంస్థ ప్రదర్సించిన మందకొడితనం కారణంగానే వైరస్‌ వ్యాప్తికి కారణమైంది. పైగా కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి అది చెబుతూ వచ్చిన భావనలు ఘోరంగా వ్యవస్థలను పక్కదారి పట్టించాయని జర్నలిస్టు అమీ డేవిడ్‌సన్‌ సోర్కిన్‌ చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం విషయంలో మాస్క్‌ల సమర్థత గురించి తొలినుంచి రుజువులు లభిస్తున్నప్పటికీ పారంభంలో ఈ మాస్కుల వినియోగాన్ని ప్రోత్సహించడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించింది. శాస్త్రజ్ఞులు, ప్రభుత్వాలు మాస్కుల వినియోగం గురించి చెబుతూ వచ్చిన నెలల అనంతరం అంటే జూన్‌లో మాత్రమే డబ్ల్యూహెచ్‌ఓ మాస్కులును వాడాలంటూ సిఫార్సు చేసింది. 

పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజకీయ వివాదాలలో చిక్కుకుంటూ వస్తోంది. ప్రస్తుతం చైనా ప్రభుత్వంతో విభేదించడం కూడా వివాదాల్లోకి నెట్టింది. కరోనా వైరస్‌ మనిషి నుంచి మనిషికి విస్తృతంగా వ్యాపించనుందని గత డిసెంబర్‌ లోనే చైనా వైద్యులు హెచ్చరిస్తూ వచ్చారు. కానీ జనవరి మధ్యనాటికీ కూడా ఈ వైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకదని చెబుతున్న చైనా ప్రభుత్వ అధికారుల ప్రకటననే డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదిస్తూ వచ్చింది. తర్వాత 2020 జనవరిలో కరోనా వైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకే ప్రమాదముందని చైనా అధికారులు బహిరంగంగా అంగీకరించిన సమయానికి వైరస్‌ చైనాలోని ప్రముఖ నగరాలకు వ్యాపించడమే కాదు వాషింగ్టన్‌కు కూడా చేరుకుంది. ఆ తర్వాత 10 రోజులకు కూడా డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ ఆరోగ్య అత్యవసరపరిస్థితిని ప్రకటించలేకపోయింది. ఈ పదిరోజుల్లోనే వైరస్‌ అమెరికా మొత్తంగా వ్యాపించిపోయింది. 

కరోనా వైరస్‌ అసాధారణంగా వ్యాప్తి చెందిన కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దాంతో వ్యవహరించిన తీరుకు ప్రాధాన్యత ఉంది. ఒక వారం లేదా రెండు వారాలకు ముందుగా వైరస్‌ విషయంలో జాగ్రత్త వహించి ఉంటే న్యూయార్క్‌లో కేసులు 50 నుంచి 80 శాతం వరకు తగ్గించగలిగి ఉండేవాళ్లమని పరిశోధకులు అంచనావేశారు. ఇలాంటి మహమ్మారి మరోసారి తలెత్తకూడదంటే డబ్ల్యూహెచ్‌ఓని కచ్చితంగా సంస్కరించాల్సిందేనని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌  సంపాదక మండలి వాదించడం గమనార్హం.

ఇప్పటికీ ప్రపంచ ఆశాకిరణమే!
ఈ తీవ్రలోపాలు ఉన్నప్పటికీ, తన 72 సంవత్సరాల ఉనికిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గణనీయ ఫలితాలను సాధించిందనే చెప్పాలి. అదేసమయంలో కేవలం 4.8 బిలియన్‌ డాలర్ల వార్షిక బడ్జెట్‌తో సంస్థ వనరులు దాని లక్ష్యసాధనకు ఏమాత్రం సరిపోవన్నది స్పష్టమే. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫల యంత్రాంగం కాదని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, ప్రివెన్షన్‌ మాజీ డైరెక్టర్‌ విలియం ఫోగ్‌ అభిప్రాయం. ప్రతి సంవత్సరం డబ్ల్యూహెచ్‌ఓ కార్యాలయాలకు వెళ్లి వారి పనితీరును చూసినట్లయితే ప్రపంచం మొత్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో తలపడుతున్న సంస్థ వనరులు అమెరికాలోని వైద్య సంస్థల బడ్జెట్‌ కంటే చాలా తక్కువ అని అర్థమవుతుందని ఫోగ్‌ చెప్పారు.

ఈ సమస్యకు సమాధానం ఒక్కటే.. డబ్ల్యూహెచ్‌ఓకు మరింత అధికారాన్ని, మరిన్ని నిధులను కల్పించడమే. సంస్థ ఆవిర్ఘావానికి కారణమైన దేశంతో పాటు బ్రెజిల్‌ వంటి ఇతర సభ్య దేశాలు కూడా ఆరోగ్య సంస్థను హెచ్చరిస్తూ వస్తున్నాయి. సంస్థ పనితీరు నచ్చకపోతే దాన్ని మరింత మెరుగుపర్చేదిశగా కృషి చేయాలే తప్ప పనిగట్టుకుని దెబ్బతీయకూడదు. పైగా సంస్థకు మరింతగా నిధులు సమకూర్చినప్పుడే అది చైనాపై ఆధారపడటం తగ్గుతుంది. బీజింగ్‌ ప్రభావం ప్రాథమికంగా ఆర్థికం కాదు. సంస్థలోపల సంకీర్ణాలను నిర్మించడంలో చైనా రాటుదేలిపోయింది.

దీంతో సంస్థ నిర్ణయాలను అది విశేషంగా ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం సంస్థకు నిధులను ఉపసంహరించడం ద్వారా దాన్ని సమతుల్యంగా ఉంచే అవకాశాన్ని అమెరికా మరింతగా కోల్పోతోందనే చెప్పాలి. వైరస్‌ వ్యాప్తి సమయంలో ఆరోగ్య సంస్థ కొన్ని తప్పటడుగులు వేసినప్పటికీ దాని సంస్థాగత బలంతో వైరస్‌ నిరోధానికి గణనీయంగా కృషి చేసింది. ట్రంప్‌ ఆరోపించారనే కారణంతో, ఆరోగ్య సంస్థలో ఏ లోపాలూ లేవని చెప్పడం కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థను కాపాడుకోవడం ఇప్పుడు అందరి లక్ష్యం కావాలి.

వ్యాసకర్త: స్పెన్సర్‌ బొకాట్‌ లిండెల్, సీనియర్‌ పాత్రికేయుడు

మరిన్ని వార్తలు