మోసపోకండి!

20 Oct, 2018 00:25 IST|Sakshi

అక్షర తూణీరం

మనకి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ‘ఎన్ని కల వాగ్దానాలకి’ ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. ఆ వాగ్దానాలు కార్య రూపం దాల్చడానికి ఎంత అవకాశం ఉంటుందో, కాక పోవడానికి అంతకు మూడు రెట్లు అవకాశం ఉంటుంది. స్వతంత్రం వచ్చీ రాకుండానే నెహ్రూ ప్రతిపాదించిన పంచవర్ష ప్రణాళికలు హాస్యాస్పదంగానూ, ఓ సామెతగానూ మిగిలాయి.
శంకుస్థాపన శిలాఫలకాల మీద బోలెడు సెటైర్లు, కావల్సినన్ని కార్టూన్లు వస్తుండేవి. అమలు కాని వాగ్దానాలు, శుష్కప్రియాలు, తీపి కబుర్లు– ఇలాంటివన్నీ కలిసిపోయి ఎజెండాలైనాయి. అవే రంగు మార్చుకుని మానిఫెస్టోలు అయినాయి. ఇందిరాగాంధీ ‘గరీబీహటావో’ దేశాన్ని పదేళ్లపాటు నిరాటంకంగా పాలించింది. తర్వాత ఎవరెవరో ఎన్నెన్నో ఏకపద, ద్విపద నినాదాలు రచించారు. కానీ అవి జనానికి ఎక్కలేదు.
ఇది కూడా వ్యాపార ప్రకటనల్లాంటివే. రూల ర్‌కి, ఓటర్‌కి నడుమ వారధిలా ఉండాలి. ఆ రెండు ముక్కలూ మంత్రాక్షరిలా పనిచేయాలి. ‘ఓన్లీ విమల్‌’ అనే రెండు మాటలు కస్టమర్లని పట్టేసింది. తెగ చుట్టేసింది.
‘ఐ లవ్‌ యూ రస్నా’ పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా నోరూరిస్తుంది. ఒక ఫోమ్‌ పరుపుల కంపెనీ మీకు అత్యంత నమ్మకమైన స్లీపింగ్‌ పార్టనర్‌ అనే విశేషం తగిలించి జనాన్ని తెగ ఆకర్షించింది.
ఈ రాజకీయ వార్తావరణంలో నిత్యం సంగ తులు వింటుంటే సగటు ఓటర్లకి హాస్యాస్పదంగా తోస్తోంది. జన సామాన్యానికి ఏమేమి ఆశలు పెడితే ఓట్లు రాలుతాయో అంతుపట్టడం లేదు. ధనిక వర్గాన్ని పడగొట్టడం మాటలు కాదు. పేద, బలహీన వర్గాలను మాటల్తో హిప్నటైజ్‌ చేయడం తేలికేనని రాజకీయ పార్టీలన్నీ గట్టిగా నమ్మతాయ్‌. పాపం, వేరే దిక్కులేక ఆ వర్గాలు పదే పదే నమ్మేసి నాలిక్క రుచుకుంటూ ఉంటాయి. ఎలుగుబంటి, నక్క కథలో లాగా అన్నిసార్లూ నక్కే లాభం పొందినట్టు రాజకీయమే చివరకు నెగ్గుతూ ఉంటుంది.
ఎలుగు, నక్క ఉమ్మడి వ్యవసాయానికి దిగు తాయి. పై పంట నాది, మధ్య మొదటి పంటలు నువ్‌ తీసుకో అంది నక్క. ఆ సంవత్సరం వరి పంట వేస్తే ఎలుగుకి గడ్డి మిగిలింది. నక్కకి ధాన్యం దక్కింది. ఎలుగు మరు సంవత్సరం తెలివిగా ఈసారి పై పంట నాది అన్నది. సరేనని ఆ ఏడు వేరుశనగ వేస్తే, మళ్లీ నక్క పంటే పండింది. మూడో ఏడు కోరుకునే చాన్సు నక్కకి వచ్చింది. మధ్యపంట నాకిచ్చి, తుది మొదలు నువ్వు తీసుకోమంది. ఆ సంవత్సరం చెరకుతోట వేసింది. ఎలుగుకి ఆకులు వేర్లు దక్కాయి.
మన లీడర్లు బహిరంగంగానే ఏ మాటలతో ఓట్లు రాల్తాయో ఆలోచన చేస్తుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. పైగా ‘మేం చేస్తాం, మేం ఇస్తాం’ అని వాగ్దానాలు చేస్తుంటే మరీ అగ్గెత్తుకొస్తుంది. వాళ్ల సొంతసొత్తు తీసి పంచుతామన్నట్టు మాట్లాడ తారు. జనం డబ్బు, జనం కోసం ఖర్చు చేయడం కూడా మహా త్యాగంలా చెబుతారు. పైగా రాబడికి పోబడికి మధ్య ఎన్నివేల కోట్లు తరుగు పోతుందో ఒక్కసారి సామాన్యులు సుమారుగా లెక్కవేసినా గుండె పగిలిపోతుంది.
ఈ దేశభక్తికి ప్రజాసేవకి ఎందుకింత డిమాండు ఉందో తేటతెల్లం అవుతుంది. ఇటీవల నినాదాలు వింటుంటే కనీసం మాటల్లోనైనా కొత్త ఐడియాలు అస్సలు లేవు. ‘‘చానల్‌ లోగో కప్పేస్తే అన్ని తెరలూ ఒకేలా ఉంటున్నాయ్‌. పత్రికల పైతల కొట్టేస్తే అన్ని డైలీలు ఒకటే’’నని ఓ పెద్దమనిషి చిరాకుపడ్డాడు.
నాకు గుర్తొస్తోంది, చాలా రోజుల క్రితం ఒక పత్రికలో పెద్దక్షరాలతో ఒక వ్యాపార ప్రకటన వచ్చింది. ‘మిగిలిన పత్రికలు చదివి మోసపోకండి! మా పత్రికనే చదవండి!’ అని. జనం ఔరా అని ముక్కున వేలేసుకున్నారు.
మీరు ఇంతవరకూ నష్టపోయింది చాలు. డబ్బు వీజీగా రాదని ఓ శ్రేయోభిలాషి మనల్ని నిమిషా నికోసారి దిగులు పడేట్టు చేస్తుంటాడు. పార్టీ నినా దాలు కూడా సినిమా పల్లవుల్లా ‘క్యాచీ’గా ఉండాలి. ప్రస్తుతం మన రాజకీయ నేతలందరూ భావదా రిద్య్ర రేఖకి దిగువన కొట్టుమిట్టాడుతున్నారు. పాపం! వారిని ఉద్ధరించండి!

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు