పంచతంత్రం

28 Jul, 2018 01:12 IST|Sakshi

అక్షర తూణీరం 

మహానుభావుడు ఏ మధుర క్షణాల్లో సృష్టించా డోగానీ పంచతంత్రం ఒక విలక్షణమైన వేదం. ఎప్ప టికీ మాసిపోదు. ఎన్నటికీ డాగు పడదు. సృష్టిలో మనిషి ఉన్నంతకాలం పంచతంత్రం ఉంటుంది. అది ఏమాత్రం విలువలు మారని గణిత శాస్త్రం. ‘కాకి–రత్నాలహారం’ ఎంత గొప్ప కథ. ఒక అల్ప జీవికి రాజభటులను సమకూర్చిన సన్నివేశం అది. ఒక చీమ నీళ్లలో కొట్టుకుపోతుంటే పావురం పండు టాకుని అందించి ఒడ్డుకు చేరుస్తుంది. తర్వాత బోయ ఆ పావురానికి బాణం ఎక్కుపెట్టినపుడు చీమ వాడిని కుట్టి గురి తప్పిస్తుంది.

మిత్రుడు ఎంతటి చిన్నవాడైనా, మనసుంటే రక్షించగలడు. ఇదే మిత్ర లాభం. ఇవన్నీ జంతువులమీదో, పక్షులమీదో పెట్టి చెప్పినా, అవన్నీ మన కోసం చెప్పినవే. మిత్రలాభం, భేదం, సంధి, విగ్రహం, అసంప్రేక్షకారిత్వం అనే అయిదు తంత్రాలను మనం జీర్ణించుకుని, జీవితా నికి అన్వయించుకోగలిగితే తిరుగుండదు. ఇది ఏ రంగంలో ఉన్నవారికైనా వర్తిస్తుంది. ఇక జాగ్రత్తపడా ల్సింది విజయానంతరం ఆవహించే అహంకారం గురించి. మృగరాజుగా పేరొందిన సింహం ఒక కుందేలు దెబ్బకి జలసమాధి అయిన ఉదంతం మనకో నీతి నేర్పుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు నిత్యం వీటిని పఠించుకోవాలి. అందులో ఆ సందర్భంలో తను ఏ జీవికి పోలతాడో సరిగ్గా అంచనా వేసుకోవాలి. దాన్నిబట్టి అడుగు ముందుకో వెనక్కో వెయ్యాలి.

ఈ మధ్య రాజకీయాల్ని గమనిస్తుంటే– ఇక ఎన్నికలు.. ఎన్నికలు మరియు ఎన్నికలు తప్ప ఏమీ వినిపించడం లేదు. ప్రజకి నైరాశ్యం వచ్చేసింది. చాలా నిరాసక్తంగా ఉన్నారు. ఓటర్లు చాలా ఉదాసీ నంగా ఉన్నారు. నాయకులు బాణాలు ఎవరిమీద ఎక్కుపెడుతున్నారో, ఎందుకు పెడుతున్నారో తెలి యదు. చూస్తుంటే నిత్యం ఒక పద్మవ్యూహం, ఒక ఊబి, ఒక ఉచ్చు పరస్పరం పన్నుకుంటున్నట్టని పిస్తుంది. చివరికి ఎవరికెవరు వలవేస్తున్నారో, ఇంకె వరు ఉరి వేస్తున్నారో బోధపడదు.

నేను ఈ చిక్కుల ముగ్గులోంచి బయటపడలేక, అనుభవం పండిన ఓ రాజకీయ నేతని కలిసి బావురు మన్నాను. ఆయన చిత్రంగా నవ్వి ‘‘మేం మాత్రం ఏం చెబుతాం. ఒక సాంప్రదాయం, ఒక నడక, ఒక నడత ఉంటే స్థితిగతులు విశ్లేషణకి అందుతాయి గానీ, ఈ ఇసుక తుఫానులో ఏమి అంచనా కట్ట గలం’’ అన్నాడు. ఒక్కసారి శ్వాస పీల్చుకుని ‘‘చద రంగం ఆడేటప్పుడు బలాలు ఓ పద్ధతి ప్రకారం ప్రవర్తిస్తాయ్‌. పులి జూదంలో పందెం ప్రకారం అవి నడుస్తాయ్‌. పందెపుగవ్వల ఆజ్ఞ ప్రకారం పావులు చచ్చినట్టు నడుస్తాయ్‌. ఆ పావులు పాము నోట్లో పడచ్చు, నిచ్చెనెక్కచ్చు’’ అని నావంక చూసి మళ్లీ ప్రారంభించాడు.ఏమాత్రం నాగరికత యెరగని అడవిలో కూడా ‘జంగిల్‌ లా’ ఒకటుంటుంది. సింహం బక్క ప్రాణుల్ని ముట్టదు.

అది ఆకలితో అలమటిస్తున్నా ఆపదలో ఉన్నా దాని నైజం మార్చుకోదు. చచ్చినా దిగజారదు. మరి నక్క ఉందంటే దానికో జీవలక్షణం ఉంటుంది. అదలాగే బతికేస్తుంది. ఆత్మరక్షణకి కొమ్ములతో పొడిచేవి కొమ్ములతోనే పొడుస్తాయి. పంజా విసిరేవి, కాళ్లతో తన్నేవి, కోరలతో పీకేవి ఉంటాయి. అవి సదా అలాగే చేస్తాయి. ఎటొచ్చీ కోతులు మాత్రం మనకు అందుతాయ్‌. చాలా దగ్గర లక్షణాలుంటాయ్‌. నిశ్చలంగా ఉన్నా, చెరువు నిర్మ లంగా వున్నా కోతులు సహించ లేవు. ఒక రాయి విసిరి చెదరగొట్టి ఆనందిస్తుంది కోతి. అలాగే ఇప్పుడు మనం ఉండేది కూడా అడవే కదా. రాజకీయాలకి వస్తే ఇదంతా డబ్బుమీద నడిచింది, నడుస్తోంది, నడు స్తుంది. కుల బలం పదవిని కట్టపెట్టదు. కావల్సింది ధన బలం. చాలా మంది డబ్బేం చేసుకుంటారు. వెళ్తూ కట్టుకెళ్తారా అంటారు. దేన్నీ కట్టుకెళ్లం. చదువుని, కీర్తిని, పొగడ్తల్ని ఇక్కడే పారేసి వెళ్తాం. అందు కని డబ్బుని ‘‘వేదాంతీ’కరించకూడదు. దేవుడు ఓ తిక్కలో ఉండగా మనిషిని చేశాడు. అందుకే అవ యవాలుగానీ, మెదడుగానీ ఏదీ సక్రమంగా కుద ర్లేదు. ఇలాంటి మెదడుకి రాజకీయం కలిస్తే ఇహ చెప్పేదేముంది?! ఇక్కడ నీతి నియమాలుండవు. అనుభవం అస్సలు వర్కవుట్‌ కాదు. ఎప్పటికప్పుడు కొత్తనీరు వస్తూ ఉంటుంది. పాత అనుభవాలకి అస్సలు విలువలేదు’’ అని పెద్దాయన ముగించాడు.


శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు