బంగారు కల

30 Nov, 2019 00:46 IST|Sakshi

అక్షర తూణీరం

కేవలం 23 అసెంబ్లీ సీట్లతో టీడీపీని రాష్ట్రంలో తొలగించారు. బంపర్‌ మెజార్టీ ఇచ్చి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. ఈ యధార్థాన్ని చంద్రబాబు అన్నివేళలా గుర్తు పెట్టుకోవాలి. ఆయన రాజకీయ అనుభవాన్ని ఇలాంటప్పుడే మర్యాదగా వినియోగించుకోవాలి. సద్వినియోగం చేసుకుంటూ తెలుగుజాతికి మేలు చెయ్యాలి. అంతేగానీ కరకట్టమీద, వరదపై, ఇసుకపై రోజుకో సంగతిని తీసుకుని దాన్ని సమస్యని చేసి పాలించే ప్రభుత్వంపై బురదజల్లుతూ వినోదించకూడదు. మనం ముందే అనుకున్నట్లు ఓటర్లు ఒక్కమాటమీద నిలబడి చంద్రబాబుని వద్దనుకున్నారు. 

ప్రజల తీర్పుని గౌరవించాలి. తప్పులు, లోపాలు జరుగుతుంటే అపోజిషన్‌ లీడర్‌గా నిలదీయండి, ప్రశ్నించండి, ఎండగట్టండి. అంతేగానీ, రంధ్రాన్వేషణవల్ల ప్రయోజనం శూన్యం. జగన్‌ పాలనలోకి వచ్చాక దశలవారీ మద్యనిషేధం, బడి చదువుకి ప్రోత్సాహకాలు, అన్ని వర్గాలకు ఆర్థిక సాయం ఒక రకంగా సంస్కరణలే కదా! చంద్రబాబు ఒక సీని యర్‌ రాజకీయ వేత్తగా చిన్న నవ్వుతో హర్షం వ్యక్తపరిస్తే ఎంత బావుంటుంది? పాలసీల కంటే ఉత్తమ సంస్కారం గొప్పది. 

అమరావతిపై పెద్ద గందరగోళానికి చంద్ర బాబు తెర తీశారు. ఆయన మానస పుత్రిక అమరావతి నిర్మాణం వారి సొంత పాలన అయిదేళ్లలో ఎంత మందుకు వెళ్లింది? పోనీ ఎంత పైకి వెళ్లింది? జగన్‌ కుర్చీ ఎక్కగానే క్యాపిటల్‌ని ఒక భయంకరమైన సమస్యగా బయటకు తెచ్చారు. దాన్ని బంగారు గుడ్లు పెట్టే బాతుగా టీడీపీ వారు అభివర్ణిస్తున్నారు. అది ఎట్లా బంగారు గుడ్లు పెడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ముందా బాతుని సిద్ధం చేయడానికి కనీసం రెండు లక్షల కోట్లు (తరుగులతో కలుపుకుని) కావాలి. ఆ డబ్బుని వెచ్చించి కాగితం మీద ఉన్న మేడలు, గోడలు, సుందర సౌధాలు, సువిశాల వీధులు ఇంకా అన్నీ సిమెంటుతో పూర్తయితే దానికో ఆకర్షణ వస్తుంది. దేశ విదేశాల నించి వ్యాపార వేత్తలు డబ్బుతో వచ్చి ఇంకా బోలెడు సరదాలు చేరుస్తారు. 

అతి ఖరీదైన మాల్స్, ప్యారిస్‌ స్థాయి సెలూన్లు, విలాసవంతమైన బార్లు... చెప్పలేనన్ని దిగిపోతాయ్‌. ఎవరైనా సరే తమ కొత్త ఇంటికి అత్యుత్తమ విద్యుద్దీపాలు కావాలనుకుంటే మలేసియా, సింగపూర్‌ వెళ్లక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ అమరావతికి వస్తే చాలు. అన్నీ వివరంగా వర్ణించి చెప్పాలంటే ఒక మహా గ్రంథమే అవుతుంది. ఇహ అప్పుడు మనకు ఎంట్రీ టిక్కెట్టు ఉంటుంది. దాన్ని అప్పుడప్పుడు పెంచుకుని డబ్బు చేసుకోవచ్చు. ఇట్లాంటి బోలెడు ఐడియాలతో చంద్రబాబు పగలూ, రాత్రీ కలలు కంటూ కూర్చున్నారు. ఎన్నెన్నో రంగుల కలలు! ఇక ఇండియా అంటే అమరావతి అని ప్రపంచం అనుకోవడం ఖాయం. ఈ పనిమీద ప్రపంచమంతా స్వజనంతో సొంత విమానంలో చంద్రబాబు తిరిగారు. 
ఉత్తమజాతి గుర్రాలు క్యాపిటల్‌కి దిగాయి. 

బ్రహ్మాండమైన రేసు కోర్టుని ప్రపంచ ప్రసిద్ధమైన స్థాయిలో మొదటే సిద్ధం చేశారు. పెద్ద గుర్రాల సంత వెలిసింది. తెచ్చుకునేవారు తమ ఊరునించి విమా నంలో సొంత అశ్వాన్ని తెచ్చుకోవచ్చు. లేదంటే మన సంతలో కొనుక్కోవచ్చు. అన్నింటికీ షరతులు వర్తిస్తాయి. ప్రతి రేసులో రాష్ట్రం తరఫున పందెం కాస్తారు. రాష్ట్రం పేరున పరుగెత్తుతున్న గుర్రం జాక్‌ పాట్‌ కొట్టింది. కనక వర్షం కురిసింది. నోట్లు.. నోట్లు! ఎక్కడ చూసినా రేసు కోర్టు నిండా పచ్చటి ఆకుల్లా కరెన్సీ నోట్లు! చంద్రబాబు ఒక్కసారి ఉలిక్కిపడి లేచారు. కళ్లు నులుముకు చూస్తే అంతా భ్రమ! నిజంగానే ఇది భ్రమరావతి అనుకున్నారు. 

నిన్న మొన్న చంద్రబాబు అమరావతి పాదయాత్రకి వెళ్లడం చోద్యంగా ఉంది. వేలాది ఎకరాలు ఆరేళ్లుగా బీడు పెట్టిన ఘనత చంద్రబాబుదే. ఇప్పుడు పైకి లేచి కనిపిస్తున్న నాలుగు భవనాలు శాశ్వతాలు కావట. కొన్నాళ్ల తర్వాత తిప్పి కట్టాలట. ఇప్పటికే చాలామంది రాష్ట్ర ప్రజలు మనకంతటి వరల్డ్‌ క్లాస్‌ అమరావతి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అదేంటో ఒంటి నిండా వస్త్రాలు లేకుండా, తలమీద బంగారు కిరీటం ధరించినట్టు ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు   

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు