అర్ధరాత్రి శపథాలు

28 Dec, 2019 01:08 IST|Sakshi

అక్షర తూణీరం

రెండు రోజుల్లో పాత సంవత్సరం వెళ్లిపోయి, ఘల్లుఘల్లుమని బంగరు గజ్జెల చప్పుళ్లతో కొత్త సంవత్సరం విశ్వమంతా అడుగు పెట్టనుంది. ఈ నవ వత్సర శుభవేళ అంద రికీ శుభాకాంక్షలు. డిసెం బర్‌ 31 అర్ధరాత్రి దాకా మేలుకుని గడచిన సంవ త్సరానికి వీడ్కోలు చెబుతూ, ఆ వెంటనే వచ్చే కొత్త వత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకుంటారు. ఆశావాదులు 2020 అన్ని విధాలా లాభసాటిగా ఉంటుందని బోలెడు నమ్మ కాలతో పాత సంవత్సరపు చివరి రాత్రిని గడు పుతారు. 

నిరాశావాదులు చప్పరింతలతో ‘ఏం తేడా ఉంటుంది. అంతా మన భ్రమ తప్ప’ అంటూ సందేశాలు ఇస్తుంటారు. అసలు పాత కొత్త అనే తేడా లేనే లేదు. కాలం అనేది పెద్ద దారపు బంతి అయితే, అందులో ప్రతి జానెడు నిడివి ఒక ఏడాది అంటే క్రీస్తు శకంలో 2019 జానలు అయిపోయి, తర్వాతి జాన మొదలైనట్టు అన్నమాట. ఆస్తికులు ఆ జాన సాక్షాత్తూ దేవుడిదని నమ్ముతారు. నాస్తికులు నమ్మరు. హేతువాదులు అసలు కాలాన్ని ఇంకో విధంగా నిర్వచిస్తారు. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రోజులు, సూర్యుడి చుట్టూ తిరగడంవల్ల సంవత్సరాలు లెక్కకు వస్తున్నాయంటారు. ప్రాణం ఉన్నప్పుడే కాలం గణనకి వస్తుంది. రాయికి, రప్పకి కాల ప్రభావం, ఆయుర్దాయం ఉండవు. 

ఇలా హేతు వాదంతో అప్లయిడ్‌ ఫిజిక్స్‌లోకి, సాలిడ్‌ స్టేట్‌ కెమి స్ట్రీలోకి తీసికెళ్లి చివరకు ఎన్‌సైక్లోపీడియా ఇరవై రెండో వాల్యూమ్‌లో మనల్ని నించోబెట్టి వాళ్లదా రిన వాళ్లు వెళ్లిపోతారు. అందుకే హేతువాదుల వెంట నడిచేటప్పుడు ఆచితూచి అడుగులు వెయ్యండి. ఆ మధ్య కరడుగట్టిన ఓ హేతువాది బారినపడ్డా. ‘మీ తాతగారు నిజంగా మీ తాత గారని గ్యారంటీ లేదు. అదొక నమ్మకం మాత్రమే. పాక్షిక సత్యం. డీఎన్‌ఏలు చూసి నిర్ధారించిన పూర్ణసత్యాలు కావు’ అంటూ సశాస్త్రీయ తర్కంలోకి దిగాడు. నాకు మా తాతగారి మీద డౌట్‌ వచ్చింది. మా నాయనమ్మని అడిగా. ఆవిడ నవ్వేసి ఎవడ్రా నీకు చెప్పిన అంట్లవెధవ అని అడిగింది. మీ తాత ఛండాలపు బుద్ధులన్నీ అమర్చినట్టు నీకు వచ్చి పడ్డాయ్‌. ఇంతకంటే రుజువేం కావాలి’ అంటూ తాతగారిని తలచుకుంటూ కంటతడి పెట్టింది.

ఈ సంధి కాలంలో, పాత కొత్తల బేసందులో అందరం ఎన్నెన్ని తీర్మానాలు చేసుకుంటామో.. ఆలోచిస్తే గుండె చెరువైపోతుంది. ‘ఏ అమృత ఘడియల్లో సిగరెట్లు తాగడం అంటుకుందోగానీ నన్నది వదలడం లేదు. ఈసారి వదిలేస్తా. అదేం పెద్ద కష్టం కాదు’ అంటూ శపథం చేశాడొక మిత్రుడు. ‘ఏడేళ్లుగా ఈ మాటమీదే ఉన్నావ్‌ మిత్రమా’ అంటే ‘ఇన్నేళ్లు సీరియస్‌గా తీసుకో లేదు. ఇప్పుడు ఖాయం’ అన్నాడు. చూడాలి. ముచ్చటగా మూడ్రోజులు ఆగితే జాతకం తెలిసి పోతుంది. కొందరు కొన్ని అలవాట్లని ‘వ్యస నం’గా తీర్మానించారు. అది చాలా తప్పు. 

‘ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఓ క్రమశిక్షణతో నమ్ముకున్న అలవాటుని పద్ధతిగా ఆచరించడం వ్యసనం ఎట్లా అవుతుంది. అదొక కమిట్‌మెంట్‌’ అని ఓ మహా కవి జాతికి సందేశం ఇచ్చారు. ‘సిగరెట్లు మానె య్యడం కష్టమేమీ కాదు. నేను చాలాసార్లు మానే శాను’ అంటూ భరోసా ఇచ్చేవారు ఆరుద్ర. ‘మీరు పైపు కాలుస్తారా... ఎందుకండీ’ అని విస్తుపోతూ అడిగిన తన అభిమానికి – ‘మరి పైపులున్నది కాల్చడానికే కదండీ’ అని జవాబిచ్చారు. ‘నేను కూడనివన్నీ మానేస్తా. కానీ జనవరి ఒకటిన కాదు. ఎప్పుడో ఇంకోప్పుడు....’ అని నిర్ణయించుకు న్నారు వెంకటరమణ. 

ఇంకోప్పుడంటే ఎప్పుడండీ అని అడిగితే, అది వ్యక్తిగత విషయం కదా అని భయపెట్టేవారు. పాత సంవత్సరంలో విశేషమైన అరిష్టం పోయి, నవ శకం ఆరంభమైందని ఎక్కువ మంది సంతోషపడుతున్నారు. అనేకానేక భరోసా పథకాలు జగన్‌ పాలనతో పేదముంగిళ్లకి వచ్చాయ్‌. పల్లెల్లో ఉద్యోగాలు విస్తృతంగా మొలక లెత్తాయి. ఇంగ్లిష్‌ మాటలు వినిపిస్తున్నాయ్‌. అప్పట్లో వాస్తు రీత్యా అమరావతి క్యాపిటల్‌ పర మాద్భుతం అన్నారు. మరి వాస్తు అంత ప్రశస్తంగా ఉంటే ముందుకు నడవాలి కదా, ఇట్లా గుంట పూలు పూస్తూ పునాదుల్లోనే ఆగడం ఏమిటి? 2020 శుభాకాంక్షలు.
వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు

మరిన్ని వార్తలు