ఎవరి మేళం వారిది!

26 Jan, 2019 00:48 IST|Sakshi

అక్షర తూణీరం

మా ఊళ్లో పోలేరమ్మ గుడి ఉంది. ఏటా ఆ గ్రామ దేవతకి జాతర జరుగుతుంది. ఎవరి పద్ధతిలో వాళ్లు పూజలు చేస్తారు. మొక్కులు తీరుస్తారు. పోటాపోటీగా జాతర నిర్వహిస్తారు. గ్రామ దేవతకి ఊళ్లో వాద్య కళాకారులంతా తమతమ వాద్యగోష్ఠితో సంగీత నివేదన చేస్తారు. డప్పులు వాయించే కళాకారులు, డోలు వాయిద్యాలు, బాకాలూదేవారు, బ్యాండ్‌ సెట్‌లో ఇత్తడి బూరాలు వాయించే వాళ్లు ఇలా రకరకాల వాళ్లు అమ్మవారి గుడిచుట్టూ చేరి తమ భక్తిని అపారంగా ప్రదర్శిస్తారు. మా ఊళ్లో రెండు వర్గాలుంటాయ్‌ హీనపక్షంగా. రెండో వర్గం డప్పులు, బ్యాండ్లు మంచి సెగలో వేడెక్కించి అమ్మోరి గుడిచుట్టూ మోహరించేది. తాషా మరపాలు, రామ డోళ్లు, ఇంకా రకరకాల తోలు వాయిద్యాలు వాటి శ్రుతుల్లో అవి మోగిపోతూ ఉంటాయ్‌. నాదస్వరం, క్లారినెట్లు, మెడకి వేసుకున్న హార్మణీ పెట్టెలు వాటికొచ్చిన సంగీతాన్ని అవి సొంత బాణీల్లో వినిపిస్తూ ఉంటాయ్‌. వాద్యకారులందరికీ పోలేరమ్మమీద భక్తే. ఏ ఒక్కరినీ శంకిం చలేం. మధ్యమధ్య ఊదుడు శంఖాలున్న జంగందేవర్లు శంఖనాదాలు చేస్తుంటారు. ఇంకా బోలెడు సందళ్లు. 

వీటన్నింటినీ ఏకకాలంలో మూకుమ్మడిగా గంటల తరబడి వినడమంటే ఇహ ఆలోచించండి. పైగా వర్గపోటీలో రెచ్చిపోయి వాయిస్తూ ఉంటారు. వాళ్లని ఎవ్వరూ అదుపులో పెట్టలేరు. ఆ.. వూ... అనలేరు. వింటూ చచ్చినట్టు ఆ శిక్ష అందరూ అనుభవించాల్సిందే. ఆ కారణంగా కుర్రతనంలో నాకు మొదటిసారి దేవుడు లేడేమోనని సందేహం వచ్చింది. నిజంగా ఉంటే జాతరలో భక్తులు చేస్తున్న ఈ రణ గొణ ధ్వనులను ఏ అమ్మవారైనా, ఏ అయ్యోరైనా ఎందుకు వారించరు? గుడ్లురిమి ఎందుకు భయపెట్టరు? వారి మనస్సుల్లో ప్రవేశించి, గ్రామానికి శాంతి ఏల ప్రసాదించరు? ఇలా పరిపరి విధాల అనుకుంటూ దేవుడి ఉనికిని శంకించేవాణ్ణి. ఆ ముక్క చెబితే, మా నాయనమ్మ గుంజీలు తీయించి, చెంపలు వేయించి, నా చేత తలస్నానం చేయించేది. ఆ తర్వాత మళ్లీ పోలేరమ్మ మీద నమ్మకం కుదిరేది.
 
ఈ మహా కూటముల తిరనాళ్లు చూస్తుంటే మా వూరి జాతర మేళం గుర్తొస్తుంది. అందరి లక్ష్యమూ ఒక్కటే. ఉన్నవాళ్లని ఇప్పుడు కుర్చీలోంచి దింపాలి. వీళ్లు పవర్‌లోకి రావాలి. ఇప్పుడు ఉన్నాయన ప్రజ లకు చాలా అన్యాయం చేస్తున్నారు, మేం మిమ్మల్ని రక్షిస్తాం–అనే ఉమ్మడి నినాదంతో ఇంటింటికీ వస్తారు. ర్యాలీలు, భారీ సభలు నిర్వహిస్తారు. ఓటర్లు మరొక్కసారి బోనులో పడకపోతారా అని కూటమి పిచ్చి నమ్మకంతో ఉంది. ఈ జగత్తు యావత్తూ ఒక పెద్ద వల. తెల్లారిన దగ్గర్నించి జీవిని జీవి వలలో వేసుకోవడమే లక్ష్యం. పురుగుని కప్ప, కప్పని పాము, పాముని డేగ, డేగని వేటగాడు ఇలా ఒక వలయం చుట్టూ వేట సాగు తుంది. నిద్ర లేవకుండానే, సాలెపురుగు వల అల్లడం మొదలుపెడుతుంది. జింక కోసం పులి పొంచి ఉంటుంది. నోటి సైజులని బట్టి చేపలు చేపల కోసం పరుగులు పెడుతుంటాయ్‌. కొంగ ఒంటికాలి మీద జపంలో నుంచుంటుంది.

ఏ జీవి లక్ష్యమైనా కావల్సిన ఆహారం సంపాయించుకోవడమే. నాయకుడికి కావల్సిన మేత ఓట్లు. పవర్‌ చేతికొస్తే మనదేశంలో కామధేనువుని పాకలో కట్టేసుకున్నట్టే. కల్పతరువుని పెరట్లో నాటినట్టే. పవ రుంటే సర్వభోగాలు ఉన్నట్టే. వారికి వారి నియర్‌ అండ్‌ డియర్‌కి చట్టాలు వర్తించవు. అవసరమైతే ఒక్కోసారి తెగించి వాళ్లు ప్రజాసేవ కూడా చెయ్యొచ్చు. మిగతాప్పుడు ఎలా ఉన్నా ఈ గణతంత్ర దినోత్సవం రోజు భారత జాతి గర్వంగా, తలెత్తి జాతీయ పతాకానికి శాల్యూట్‌ కొడుతుంది. మూడు సింహాల మొహర్‌ చాలా శౌర్యాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలున్నట్టు, మనది నాలుగుసింహాల ముద్ర. వెనకపడిన నాలుగో సింహం ఏ మాత్రం చైతన్యవంతంగా లేదన్నది మాత్రం నిజం. అందుకే నాలుగో సింహానికి కూడా శాల్యూట్‌ కొడదాం!
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ 

మరిన్ని వార్తలు