బొంగు బిర్యానీ?!

14 Jul, 2018 03:47 IST|Sakshi

అక్షర తూణీరం

ఆంధ్రప్రదేశ్‌ గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర అధికార వంటకంగా ‘బొంగు బిర్యానీ’ని ఖాయంచేశారు. చాలామంది నిర్ఘాంతపో యారు. అది విశాఖ ప్రాంతంలో కొండదొరల వంటకం. పచ్చి వెదురు గొట్టంలో లేత కోడిని సమస్త మసాలా దినుసులతో దట్టించి, దాన్ని బొంగులోకెక్కించి, మంటమీద కాలుస్తారు. కోడి వెదురు గొట్టంలో ఒక పదునులో ఉడికాక దాన్ని తింటారు. అదొక మహత్తర సందేశంగా ప్రతిధ్వనిస్తుంది. అసలు దాని వ్యవహార నామం ‘బొంగులో కోడి’. ఈ బొంగు బిర్యానీ పేరు డొల్లగా, బోలుగా ధ్వనిస్తూ మా చంద్రబాబు ప్రసంగంలాగే ఉందని కొందరు వ్యాఖ్యానించారు. ‘బొంగు భుజాన వేసుకుని పోయెద మెక్కడికైన...’ అని తిరుపతి వేంకట కవులు పద్యంలో కోప్పడ్డారు.

అసలు మనం ‘బిర్యానీ’ పదాన్ని వాడటమే శుద్ధ దండగ. అది మన సంప్రదాయం కాదు. తెలంగాణ నైజాం పాలనలో వారింటి వంటగా రకరకాల బిర్యా నీలు చెలరేగిపోయేవి. దాని రుచి, వైభవం విశ్వ వ్యాప్తమైంది. బిర్యానీ అంటే అది విశేషమైన నాన్‌ వెజ్‌ వంటకం. శాకాహారులు దాన్ని శాకపాకాలతో వండుకుని తృప్తి పడుతున్నారు. అటు ట్రైబల్స్‌ని ఆనందపరుద్దామని చంద్రబాబు ఆలోచన చేశా రేమో. అట్లా అనుకుంటే ‘నత్తముక్కల గోంగూర’ని రంగంలోకి దింపండి. అమరావతి అబ్బా అంటుంది. బడుగు బలహీన వర్గాలు గుంటూరు గోంగూరని, కొనకుండానే దొరికే నత్తముక్కల్ని కలిపి పొక్కిస్తారు. తిన్నవాళ్లకి అమరావతి కనిపిస్తుంది.

‘కొత్త రాష్ట్రం, కొత్త కాపిటల్, కొత్త ఆఫీసులు, ఆఫీసర్లు– ఇన్ని కొత్తల మధ్య ఈ బొంగు బిర్యానీ అవసరమా? నేటి అమరావతిని ఏలిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి పరంపర పొట్టేలు, కోడిపుంజు మాంసాలు విరివిగా తిని ధరణికోటకి పేరు తెచ్చారు. ఆ పునాదులమీద, ఆ పౌరుషాల పురిటిగడ్డమీద తిరిగి పునాదులెత్తాం. ఈ నేపథ్యంలో ‘ఈ బొంగు బిర్యానీ అవసరమా?’ అని అడుగుతు న్నారు తెలుగు తమ్ముళ్లు. కృష్ణా జిల్లా మంచి వంట లకు పుట్టినిల్లు.

కొన్ని వందల సంవత్సరాలపాటు ప్రసిద్ధి వహించిన ‘బ్రాహ్మల ఇంగువచారు’ కృష్ణా జిల్లాలో ఒక సామాజిక వర్గం ఇచ్చిన కౌంటర్‌తో గింగిరాలు తిరిగింది.ఆ కౌంటర్‌ పేరు ‘ఉలవచారు’. అది మహత్తరం, బలవత్తరం. వేడి అన్నం, ఉలవ చారు బాబు దృష్టికి రాలేదా? బొత్తిగా అభిరుచి లేని మనిషి అని కొందరన్నారు. ఇహ గోదావరి జిల్లాల కెళితే, ఎన్ని కూరలు, ఎంత వైవిధ్యం? రాజమం డ్రిలో కూర్చుంటే, ఈ దేవుడు ఇంకో వందేళ్లు, ఫిట్‌ మెంట్‌ పడేస్తే ఆయన సొమ్మేం పోయిందనిపిస్తుంది. ఈ వరదాకాలంలో గోదావరికి ఎదురొస్తుంది పులస! వాటి కోసం బడా బడా బెంజికార్లు తలు పులు తెరుచుకుని గోదావరి ఒడ్డున నిలబడతాయి. ఆ జిల్లాలో అన్ని చేపలూ గోదావరి నీళ్లు తాగి, గాలి పీల్చి తెగ నోరూరిస్తాయ్‌.

ఇహ పాలకొల్లు, అంత ర్వేది లాంటి చోట బెల్లపు జీళ్లు ఏవున్నావుంటాయ్‌. బెల్లాన్ని ముదురుపాకంలో దించి, దాన్ని కొండచిల వగా చేసి నున్నటి గుంజకి చుడతారు. ఇహ దాన్ని లాగి లాగి, పీకి బాబు ప్లీనరీ స్పీచ్‌ని తలపిస్తారు. చివరికి చప్పట్లు కొట్టినట్టు నువ్వులద్ది జీళ్లు తయారు చేస్తారు. అవి అనన్య సామాన్యంగా ఉంటాయి. కాకినాడ కోటైకాజా ఒక చిత్రం. మడత కాజా ఇంకో విచిత్రం. విశాఖపట్నం సముద్రపు చేప సామా న్యమా? పలాస జీడిపప్పు రచనలు, ద్రావిడ ప్రసి ద్ధం పనసబుట్టల్ని ఎప్పుడైనా తిన్నారా? నెల్లూరు సీమ పులి బొంగరాలు, కారం దోశెలు, ఆ దిగువన అల్లూరయ్య సమస్త పాకాలు, తెనాలి బెల్లం జిలేబి, అటేపు బొబ్బట్లు నాలిక్కి తగల్లేదా బాబూ! ఆత్రేయ పురం పూత రేకులు ఇంటర్నేషనల్‌ ఫేమ్‌.

ఇంకా రాయలసీమ రాగిముద్ద, పధ్నాలుగు సరసమైన కలు పులతో అనాదిగా విరాజిల్లుతున్నది. అసలు రాగి సంగటిని డిక్లేర్‌ చేస్తే ఇంకా ఐరన్‌ డెఫిషియన్సీ ఉండనే ఉండదు. అప్పుడు మనకి కడప ఇనుముతో పనే ఉండదు. చిత్తూరు జిల్లా పిట్ట మాంసాలన్నీ పూర్తిగా లోకల్‌. ఈ కొండ అడివి పిట్టల్ని తిన్నవారు అదో రకంగా ఉంటారని చెబుతారు. అయినా మనకి పులిహోర నించి పులగం దాని డజను చిత్రాన్నాలు న్నాయ్‌. ఎందుకసలు మన ముఖ్యమంత్రి రాష్ట్ర వంటకానికి పోటీ పెడితే, అద్భుతాలు చేయగల మన తెలుగింటి ఆడపడుచులు జిహ్వ కింపుగా ఓ ‘కొత్త’ వంటకం బంగారుపళ్లెంలో అంది స్తారు.

వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

మరిన్ని వార్తలు