-

కవిసమయాలూ–రాజకీయాలు

23 Feb, 2019 00:56 IST|Sakshi

అక్షర తూణీరం 

నిండు పౌర్ణమినాడు బ్రహ్మదేవుడు వెన్నెలని పారిజాతాల మీంచి పోగేసి, సరస్వతీ దేవి దోసిట నింపాడు. వెన్నెల దోసిలిని బ్రహ్మ సుతారంగా నొక్కి అచ్చుతీసి వెలికితీసిన పిట్ట ఆకతికి హంస అని పేరు పెట్టాడు. ఇది మామూలు హంస కాదు, రాజహంస అన్నది వాగ్దేవి. దానికి తగిన రెక్కలిచ్చి మానస సరోవరంలో వదిలాడు. అది పాడితే కిన్నెరులు చెవులు రిక్కిస్తారు. హంస ఆడితే అచ్చర కన్నెలు గువ్వల్లా ముడుచుకుంటారు. ఇవన్నీ కావ్యోక్తులు. నిజంగా హంసని విన్నవారేగానీ కన్నవారు లేరు. అయినా ఎవరూ హంసని జాబితాలోంచి తియ్యరు. ఇదొక విచిత్రం. చక్రవాకం అనే మరో పక్షి వినిపిస్తూ ఉంటుంది. పెద్దముక్కున్న నోరు, నిడివైన తోకతో వెన్నెల రాత్రుళ్లలో తేట మబ్బుల్ని చుడుతూ చక్కెర్లు కొడుతూ ఉంటుంది. దాని ఆహారం వెన్నెల. ‘చకోరంలా నిరీక్షించడం’ అని ప్రాచీన సాహిత్యం నించి ఆధునిక నవలల దాకా రాతగాళ్లు తెగ వాడుతూ ఉంటారు. కానీ చకోర పక్షిని చూసినవారుగానీ, దాంతో సెల్ఫీలు దిగినవారుగానీ లేరు. అయినా చకోరికి బోలెడు కీర్తి. ఇంతటి కీర్తి ప్రతిష్టలూ స్వాతి చినుకుకి ఉన్నాయ్‌. ముత్యపు చిప్పల్లో స్వాతి లగ్గంలో పడిన చినుకు మంచి ముత్యంగా ఆవిర్భవిస్తుంది. అది తుల లేనిది వెల లేనిదిగా భాసిస్తుంది. రాయంచ, చకోరం, స్వాతిముత్యం అవన్నీ ఎవరికంటా పడకపోయినా గొప్ప ప్రాచుర్యం పొందాయ్‌. ఇంతటి గొప్ప అంశాలను కొట్టి పారేయడం దేనికని, ప్రాజ్ఞులు వీటిని కవిసమయాలుగా తీర్మానించి వీటికి గౌరవప్రదమైన స్థానం కల్పించారు. 

ఇంకా ఐరావతం అంటే తెల్ల ఏనుగు ఒక ఊహ. చాలా అన్యోన్యమైన జంటగా చిలకాగోరింకల్ని చెబుతారు. ఇది కవిగారి పైత్యమే గానీ నిజం లేదు. రెండు చిలకలు, రెండు గోరింకలు జత కడతాయి గానీ వర్ణ సంకరానికి చచ్చినా పాల్పడవు. అప్సర కన్యలు మనుషుల తీయటి కల. ఆ మధుర స్వప్నంలో శతాబ్దాలుగా కవులు జనాన్ని ఓలలాడిస్తున్నారు. మన రాజకీయ నాయకులు అరచేత చూపించే కలల బొమ్మలు కూడా ఇలాంటివే. రాజకీయవాది ఎప్పుడూ నిరాశ చెందడు. అధైర్యపడడు. సరికొత్త కలల్ని భుజాన వేసుకుని జనం ముందుకు వస్తాడు. అవినీతి అనే మాటని నేనొచ్చాక మీ నిఘంటువులలో తొలగించాల్సి ఉంటుంది. ఆశ్రిత పక్ష పాతం ఇప్పటికే సగంపైగా చెరిగిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా సేవచేస్తూ మన రాష్ట్ర సగటు ఆయుర్దాయాన్ని గణనీయంగా పెంచాయ్‌.

ప్రభుత్వ బళ్లలో చదువులకు ప్రజలంతా నీరాజనాలెత్తుతున్నారు. నేతి బీరకాయ చందం, పెరుగు తోటకూర వైనం– ఇవన్నీ సామెతలుగా వాడుతున్నాం. మన అపోజిషన్‌ వారికి ఒక ప్రణాళిక ఉండదు. గడచిన మూడు నాలుగేళ్లలో సీఎం నించి చిన్నా పెద్దా మంత్రులు వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలు చాలావరకు దొరుకుతాయ్‌. వాటిలోంచి ఆణిముత్యాలు ఏరి ఒక్కొక్కరి అధిక ప్రసం గాన్ని ఓ గంటకి కుదించి చానల్స్‌లో ప్రసారం చెయ్యాలి. ఎన్నెన్ని అతిశయోక్తులు, ఎన్ని కవి సమయాలు– అందరం విని దుఃఖపడతాం. ఏడాది క్రితమే పోలవరంలో నీళ్లు పారడం ప్రజలు చూశారు. ఆయకట్టు కింద బంగారు పంటలు పండటం చూశారు. అమరావతి రాజధాని సరేసరి. అదిగో అసెంబ్లీ ముందున్న ఉద్యానవన తోటలో హంసల దండు ముచ్చట్లాడుకుంటూ ముగ్ధమనోహరంగా ఈదులాడుతున్నాయ్‌. చకోరాలు కాలుష్య శూన్యంగా కన్పించిన ఏకైక ప్రదేశంగా గుర్తించి గుంటూరు–బెజవాడ మధ్య వెన్నెల తింటూ తిరుగుతున్నాయ్‌. ఇక్కడ మురుగు కాలవలే ఇంత శుద్ధమా అని నివ్వెరపోతూ, కాలుజారి స్వాతి చినుకులు ముత్యపు చిప్పల్లో పడుతున్నాయ్‌. దాంతో గుంటూరు ఊరి కాలువల్లోనే మంచి ముత్యాలు పుష్కలంగా పండుతున్నాయ్‌. ‘రామరాజ్యం ఇంతకంటే విశేషంగా ఉండేది కాదని నా భావన’ అని ఓ కవి స్పష్టం చేశాడు.

‘తెలుగు భాష అందరిదీ. అభిప్రాయాలు వారి సొంతం. వాగుడు మీద జీఎస్టీ లేదు’ అన్నాడు విన్న శ్రోత ముక్తసరిగా. ‘చంద్రబాబుకి కులగజ్జి ఉందంటే... ఇహ ధర్మదేవత లేదను కోవాల్సిందే’ అని ఇద్దరు సీనియర్‌ మంత్రులు వాపోయారు. మరికొందరు మౌనంగా రోదించారు. ఇంకొందరు సైగలతో వివరిస్తూ బాధపడ్డారు. ‘బాబు కాపులకు కాపు. ఏపీకి పెదకాపు’ అని ఆ సైగకి అర్థంట. ‘పుట్టుకచే కమ్మబాలుడు, ఎదిగినకొద్దీ జగమెరిగిన బ్రాంభడు’ అన్నాడొకాయన జంధ్యం తిప్పుతూ. బేరసారాలలో వైశ్యుడు. చేతి ఎముక పుట్టుక నించి గట్టిపడలేదు. ఠీవి యందు రాజు. బాబు అక్షరమాలలో లకేత్వం, దకి కొమ్ము లేదు. చాకిరీ సేవా భావంలో దళిత తత్వం, శ్రమించడంలో ఆదివాసీ. మైనారిటీలకి దేవుడిచ్చిన మేజర్‌... ఈ ధోరణిని అడ్డుకుంటూ ఓ పెద్దాయన అస హనంగా ‘అబ్బో! చాలా కవి సమయాలు చెప్పావురా’ అంటూ ముగింపు పలికాడు.

వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు
 

మరిన్ని వార్తలు