ఆంగ్ల శుభాకాంక్షలు

30 Dec, 2017 01:58 IST|Sakshi

అక్షర తూణీరం

ప్రత్యక్ష నారాయణుడు సూర్యదేవుడు ఇంగ్లిష్‌ కాలసూచినే అనుసరిస్తున్నాడు. ఏటా మకర సంక్రమణం ఆ తేదీనాడే చేస్తున్నాడు. ఆంగ్లంలో అధిక మాసాల బెడద లేదు.

రెండురోజుల్లో 2018 నూతన సంవత్సరం వస్తోంది. ఇక మనం నిత్యం పద్దెనిమిదిని స్మరిస్తూనే ఉంటాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పుకుంటున్నా. ఏటా ఒకసారి మాత్రమే వచ్చే పండుగ. కావలసినంత వినోదం, ఉల్లాసం, ఉత్సాహం, చిందులేసే సంబరాల సందర్భం. ప్రపంచమంతా ఒక్కసారి జాగృతమవుతుంది. డిసెంబర్‌ 31 అర్థరాత్రి కోసం జగమంతా జాగారం చేస్తుంది. పాత సంవత్సరపు చివరి సెకను దాటగానే అరుపులు, కేకలు, చప్పట్లు, అభినందనలు నురుగలు కక్కుతాయ్‌! కొత్త సంవత్సరపు నిర్ణయాలు తీసుకోవడం, మిత్రులు తీర్మానాలు చేయడం ప్రతి గదిలో జరుగుతాయ్‌. కొన్ని అమలవుతాయి, చాలాకొన్ని అమలు అవవ్‌ – ప్రభుత్వ పథకాల్లాగే. దానివల్ల ఏమీ ప్రమాదం ఉండదు.

భూమిపై భూమధ్య రేఖకు ఎగువన దిగువన ఈ ఒక్కరాత్రి కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తుంది. చాలా ప్రభుత్వ ప్రైవేట్‌ నిబంధనల అమలుకి డిసెంబర్‌ 31ని డెడ్‌లైన్‌గా నిర్ణయిస్తారు. చాలాసార్లు చూశాను చివరిక్షణంలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని. ఏమీ జరగలేదుగానీ 16 వెనక్కి తగ్గి 2017 ముందుకు వచ్చింది. నూతన సహస్రాబ్ది ఆవిర్భావ ఘడియలోనే ఏమీ సడీచప్పుడూ లేదు. కానీ సహస్రాబ్ది రెండువేలుగా మారడం వల్ల సాఫ్ట్‌వేర్‌ రంగంలో వై2కె పుణ్యమా అని ఎందరికో ఉపాధి దొరికింది. అది మరి ఆంగ్ల క్యాలెండర్‌ పెట్టిన భిక్షేకదా!

ఉన్నట్టుండి ఆంగ్ల సంవత్సరాది మీద కొందరు కన్నెర్ర చేస్తున్నారు. నాకు గ్రీటింగ్స్‌ చెబితే చెప్పిన వారితో గుంజీలు తీయించి శిక్ష వేస్తానని చిలుకూరు అర్చకస్వామి శ్రీముఖం ఇచ్చారు. హైందవాలయాలలో ప్రత్యేక పూజలు వద్దన్నారు. జనవరి 1న దేవుడి ముఖం చూడాలని లక్షలాది మంది పడిగాపులు పడతారు. మన పురాణాలు ఏమి చెప్పాయో పెద్దలు గుర్తు చేసుకోవాలి. ప్రహ్లాదుడు తింటూ, తాగుతూ ఎప్పుడైనా భగవన్నామ స్మరణ చేసుకోమన్నాడు. మనమంతా ఈ ఆంగ్ల క్యాలెండర్‌లో క్రీస్తుశకంలో పుట్టి పెరిగాం. పొద్దుటే రేడియో పెడితే శాలివాహన శకం వినిపిస్తుంది. ఇప్పుడైతే శుభలేఖల మీద తెలుగు తిథివారాలని మాత్రమే ప్రస్తావిద్దామా? మనం చాంద్రమానులం, మన పక్కనే సౌరమానులున్నారు. తెలుగు యువకుడు తమిళమ్మాయిని పెళ్లాడేటప్పుడు ఏ మానం అనుసరించాలని ధర్మ సందేహం. ముందసలు మన ఐయ్యేఎస్‌లతో ప్రభవ, విభవలు; చైత్ర వైశాఖాలు; పాడ్యమి విదియ తదియలు భట్టీయం వేయించాలి. ప్రత్యక్ష నారాయణుడు సూర్యదేవుడు ఇంగ్లిష్‌ కాలసూచినే అనుసరిస్తున్నాడు. ఏటా మకర సంక్రమణం ఆ తేదీనాడే చేస్తున్నాడు.

దేశంలో సమస్యలు గుట్టలుగా పడి ఉండగా, ఈ కొత్త సమస్యని తెర మీదకి తేవడం అవసరమా? తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికెళ్లిందని అచ్చ తెలుగు సామెత ఉంది. పత్రికల మీద డేట్‌లైన్లు పాడ్యమి, విదియలతో ఉండాలి. మిగుళ్లు తగుళ్లు చూసుకోవాలి. మధ్య మధ్య అధికమాసాలొస్తుంటాయి. అప్పుడు రెండు పుట్టిన్రోజులూ, రెండు ఆబ్దికాలూ తప్పదు. ఆంగ్లంలో అధిక మాసాల బెడద లేదు. ఆలోచించుకోండి!

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు