అన్నం పెట్టే భాషకే అగ్ర తాంబూలం

16 Nov, 2019 01:14 IST|Sakshi

అక్షర తూణీరం 

మాతృభాష చాలా గొప్పది. బువ్వపెట్టే భాష అంతకంటే గొప్పది. అమెజాన్, సెల్‌ ఫోన్‌ లాంటి సంస్థల్లో సాదాసీదా బరు వులు మోసే ఉద్యోగికి కూడా ఇంగ్లిష్‌లో వర్కింగ్‌ జ్ఞానాన్ని తప్పనిసరిగా అడుగుతు న్నారు. పెద్ద హోటల్స్‌లో చిరు సేవలకు, కారు డ్రైవర్‌ ఉద్యోగానికి ఎబీసీడీలు ముఖ్యం. జగన్‌మోహన్‌ రెడ్డి ఏది కొత్తగా ప్రవేశపెట్టినా చంద్రబాబు వర్గం దానికి వక్రభాష్యం చెప్పి, రాష్ట్రం నాశనం అయిపోతోందని ప్రచారం సాగిస్తారు. ఎవరూ నిజాల్ని నిజాలుగా ఆలోచించరు. ‘జగన్‌ ఇంగ్లిష్‌ని ఆరో క్లాసుదాకా కంప ల్సరీ చేసి, ఇన్నేళ్లుగా సాగుతున్న ఒక జలతారు ముసుగుని తొలగిం చారని’ ఒక మేధావి తేల్చి చెప్పాడు.

ప్రతి చిన్న పల్లె నించి నిత్యం ఒకటి రెండు బస్సులు దగ్గరి బస్తీలకు చిన్న పిల్లలతో బయలుదేరి వెళ్తాయ్‌. అక్కడ కాన్వెంట్‌ స్కూల్స్‌ ఉంటాయ్‌. పిల్లలకు యూని ఫామ్స్‌ ఉంటే తల్లిదండ్రులు గొప్పగా భావిస్తారు. పిల్లలు మమ్మీ, డాడీతోబాటు ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌స్టార్‌ నేర్చుకుంటారు. కాలా నికి తగినట్టు మార్పులు తప్పవు. ఒకప్పుడు సంస్కృతం మన దేశ భాష. ఘంటం పట్టేదాకా తెలుగు నిండిన కావ్యం రానేలేదు. ప్రపం చీకరణ తర్వాత ఇంగ్లిష్‌ ఆధిక్యత పెరిగింది. దేశం వదలి వెళ్లక పోయినా వ్యవహార వ్యాపార లావాదేవీలన్నీ ఆంగ్లంలోనే సాగు తాయి. కనుక ఇంగ్లిష్‌ తప్పనిసరి. స్థానిక సొంత భాషని నమ్ము కున్న చైనా, జపాన్‌ దేశాలు తమ మనసువిప్పి మాట్లాడలేక ఇబ్బంది పడ్డాయ్‌. ఇటీవల కాలంలో వాళ్లు ఇంగ్లిష్‌లోకి మారారు. వారి పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. మాతృభాషని కూడా పదిలంగా మనసులో ఉంచుకుంటున్నారు. విద్య బతుకు తెరువు కోసమేనని రూఢీ అయ్యాక అన్నం పెట్టే భాషకే అగ్ర తాంబూలం!

ఎన్టీఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రి కాగానే ఒక మంచి ఆలోచన చేశారు. పల్లెటూరి పిల్లలకు బస్తీ పిల్లలకు అబ్బే నాణ్యమైన చదువు అబ్బడం లేదు. సరైన బోధనా పరికరాలు గ్రామ పాఠశా లల్లో ఉండవు. దృశ్య శ్రవణ బోధన గ్రామీణ పిల్లలకు అందించాలని సంక ల్పించారు. ముప్ఫై నలభై ఏళ్ల నాడు వచ్చిన సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగిస్తూ వీడియోలలో స్కూలు పిల్లలకు పాఠాలు రూపొందించాలని యోచన చేశారు. అప్పటికే చలనచిత్ర రంగంలో గణనీయమైన ప్రవేశం ఉన్న జంట బాపూ రమణలను రావించి పాఠాల పని అప్ప గించారు. నాలుగేళ్లకు పైగా శ్రమించి, వారి శక్తియుక్తులన్నీ వినియోగించి ఒకటి రెండు మూడు తరగతుల పాఠాల్ని తెరకెక్కించారు. దేశంలో సుప్రసిద్ధులైన సాంకేతిక నిపు ణులను ఆయా శాఖల్లో వినియోగించుకున్నారు. గ్రాఫిక్స్, యానిమే షన్‌ పంథా పాఠాలను పిల్లలకు అత్యంత ఆకర్షణీయంగా తీర్చిది ద్దారు. ప్రఖ్యాత సంగీతజ్ఞుడు ఏఆర్‌ రెహ్మాన్‌ మొత్తం పాఠాలకి సొంపైన సంగీతం సమకూర్చారు. వాటిలో ప్రతి అంగుళం ప్రతి అక్షరం ఎన్టీఆర్‌ చూశారు. వారు ఆశించిన దానికి మించి వచ్చా యని అభినందించారు. పథకం ఆరంభంలో తొలి విడతగా కృష్ణా, చిత్తూరు, నల్గొండ జిల్లాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ప్రతి స్కూలుకి కలర్‌ టీవీ, వీసీపీ (వీడియో క్యాసెట్‌ ప్లేయర్‌) పాఠాల క్యాసెట్లు అందజేశారు. వాటిని ఎలా నడపాలో, ఎలా వినియోగిం చాలో అక్కడ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. పిల్లలకు సినిమా చూసి చదువు నేర్చినంత ఉత్సాహంగా ఉంది. బళ్లలో డ్రాప్‌ అవుట్స్‌ గణనీయంగా తగ్గాయి. ఎన్టీఆర్‌ అంతకుముందే గ్రామాధికారులు కరణం, మున్సబులను తొలగించారు. ఇప్పుడీ విద్యాబోధన ద్వారా ఉపాధ్యాయులను తీసేస్తారని ఒక వదంతి ప్రచారంలోకి వచ్చింది. దానికితోడు భయంకరమైన పవర్‌కట్‌. పగలు కరెంట్‌ ఉండటం గగనం. పులిమీద పుట్రలా అప్పుడే చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీని స్వయంగా స్వీకరించారు. దాంతో బంగారంలాంటి ఈ పథకం అటకెక్కింది. ఆనాడు ఎన్టీఆర్‌ కూడా పల్లెపిల్లల బాగు గురించే ఆలోచన చేశారు. లోకల్‌ లాంగ్వేజ్‌ పరిధి వేరు.. ఆంగ్ల భాషా విస్తృతి వేరు.

ఇవ్వాళ వ్యవసాయ వృత్తిలో కూడా ఆంగ్ల భాష తప్పనిసరి అవుతోంది. ఒకనాటి నాగలి కనుమరుగైంది. ట్రాక్టర్‌ వచ్చింది. కరెంట్‌ మోటార్లు, ఆయిల్‌ ఇంజిన్లు, హార్వెస్టర్లు వచ్చే శాయి. ఇంగ్లిష్‌ ఉంటే తప్ప బండి నడవదు. బ్యాంకింగ్‌ వ్యవస్థ పల్లెలకు విస్తరించింది. మొత్తం ఆ భాష, యాస రైతులు నేర్చారు. పల్లెల్లో సెల్‌ఫోన్‌ విరివిగా వాడుతున్నారు. దానికి సంబంధించిన ఇంగ్లిష్‌ మాటలు సెల్‌ వాడకం దార్లకు బాగా తెలుసు. టీవీ పుణ్యమా అని ఇంగ్లిష్‌ వాడుక భాషని గుమ్మంలో గుమ్మ  రించింది. మాతృభాష పరిపాలనలోగానీ, కోర్టు తీర్పుల్లోగానీ, సైన్‌ బోర్డుల్లోగానీ, ఇంకాగానీ.. ఇంకాగానీ వాడింది లేదు. మాతృ భాషని ఒక ఉద్యమంగా బతికించుకోవల్సిన అగత్యం ఏర్పడిం దంటే– దానితో అవసరం తగ్గిందని అర్థం.

ఒక లంబాడీ తండాలో వారి మాతృభాషని రుద్దేస్తామంటే కుదరదు. ఇతర ప్రాచుర్యం ఉన్న భాషలు రావాలి. అప్పుడే వారు తండా దాటి సుఖంగా మనగలుగుతారు. ఊరంతా మాట్లాడుకునే, తెలుగు భాష పిల్లలకు చిన్న వయసులో రానే వస్తుంది. ఇప్పుడు బళ్లో ఎటూ ఉంది. రాత నేర్చుకుంటారు. ఎవరూ కంగారు పడక్క ర్లేదు. దేశభక్తి గురించి, తెలుగు భాష గురించి మాట్లాడటంలో మన అపోజీషన్‌ నేతలకు దూకుడెక్కువ. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్‌ ఉంది. అందులో ఒక తెలుగు పార్ట్‌ లేదు. హ్యాండిలు, బెల్లు, సీటు, మడ్‌ గార్డు, టైరు, ట్యూబు, స్టోక్సు, చైను, పెడల్సు, హబ్బు– ఏమైందిప్పుడు, సైకిల్‌ నడవటం లేదా? బాబుగారూ! ముందు సైకిల్‌ని తెలుగీకరించండి.


శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు