భూమి గుండ్రంగా ఉంది?

7 Oct, 2017 01:58 IST|Sakshi

అక్షర తూణీరం
సముద్ర తీరాన నిలబడి వచ్చే ఓడని గమనిస్తే– మొదట జెండా క్రమంగా పై భాగం మధ్య భాగం కనిపిస్తాయి. దీన్ని బట్టి భూమి గుండ్రంగా ఉందని నమ్మాలి. అసలు దేశానికి పెద్ద అనర్థమేమంటే– ప్రభుత్వం పార్టీ పేరు మీద కాకుండా ముఖ్యనేత పేరుమీద నడవడం. ఉదాహరణకి ‘మోదీ గవర్నమెంట్‌’ అని వ్యవహరిం చడం. ప్రజాస్వామ్య పునాదులు ఇక్కడే కదిలిపోతాయ్‌. ఒక్కసారి మోదీ గద్దెక్కాక సామాన్యుడికి ఒరిగిందేమిటో చూద్దాం. చిన్నతరహా పరిశ్రమలుగానీ, వ్యవసాయ రంగంగానీ హాయిగా ఊపిరి పీల్చుకున్నది లేదు. మన దేశంలో చిన్న పరిశ్రమ రెక్కలు ముక్కలు చేసుకుని ఉత్పత్తి చేస్తుందిగానీ ఫలితాన్ని దళారీ రాబందులు తన్నుకుపోతాయి. కనీసం వాడకందారుకి చేరేలోపు మూడు రకాల దళారీ వ్యవస్థలు లాభాల్నీ కొరికేస్తాయి.

ఇక ఉత్పత్తిదారుడికి మిగిలేది చాకిరీ మాత్రమే. చేనేత పరిశ్రమ ఇందుకు మిన హాయింపు కాదు. ఇక వ్యవసాయం మరీ దారుణం. రైతు ఆశాజీవి. ప్రభుత్వాలు రుణాలు ఎరవేసి రైతుల్ని ప్రలోభ పెడుతున్నారు. రుణాలివ్వడం, వాటిని మాఫీ చేస్తామని ఓట్ల కోసం ఆశ పెట్టడం పరిపాటి అయింది. ఇప్పటికీ కూడా మన రైతులకు వ్యవసాయ శాఖ నించి సరైన సలహాలు, సూచనలు అందవు. ఇప్పటికీ నకిలీ విత్తనాలపై ఆంక్షలు లేవు. నూతన పరిశోధనలు రైతులకు అందనే అందవు. కేవలం వార్తల్లో మాత్రం అధిక దిగుబడుల వంగడాల మాటలు విని పిస్తాయి. అధునాతన పరిజ్ఞానం గ్రామాలకు చేరనే చేరదు. అన్నీ సక్రమంగా ఉన్నా పంట అయ్యేనాటికి అడివి అవుతోంది.

ఇక విద్య, వైద్యం కార్పొరేట్‌ కోరల్లోంచి బయ టకు రాకపోగా మరింత సుఖంగా చిక్కుకు పోయింది. ప్రజలు ఎన్ని రకాల పన్నులు కడుతు న్నారో తెలియకుండా మభ్య పెడుతున్నారు. అన్నీ భాగ స్వామ్య వసతులే. అన్ని రహదారులకూ టోల్‌ పేరిట ప్రతి ట్రిప్పుకీ పన్ను చెల్లిం చాలి. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, ఎయిర్‌ పోర్టులూ పార్కింగ్‌ నుంచి పాయ ఖానా దాకా డబ్బు గుంజు తున్నాయి. డబ్బున్నవాడు నాలుగు వంతెనలు, రెండు ఫ్లై ఓవర్‌లూ కట్టుకుంటే చాలు. వాటిమీద సుఖంగా బతికేయచ్చు. జన్‌ధన్‌ ఖాతాలన్నారు. ఆధార్‌తో భార తీయుల పంచప్రాణాలు, నవరంధ్రాలు అనుసంధానం చేస్తేగానీ దేశం ముందు కెళ్లదన్నారు. పెద్ద నోట్లు రద్దు అన్నారు. మీ జాతకాలు తిరగబడతాయన్నారు.

అసలు పవర్‌లోకి రాకముందే స్విస్‌ బ్యాంకు ఖాతాల్లోంచి నల్లధనం దింపుతాం, అందరూ ఐకమత్యంగా పంచుకోండన్నారు. ఆ ఓడలు ఎక్కడున్నాయో తెలియదు. మోదీ ప్రభుత్వంలో అవినీతి లేదు, స్కాములు లేవు, అంతా కడిగిన అద్దం అన్నారు. క్యాబినెట్‌ వరకు కావచ్చు. అలవాటుపడిన అధికార యంత్రాంగం మాత్రం ధరలు నాలుగు రెట్లు పెంచిన మాట నిజం. అవినీతి తగ్గడమంటే వేళ్ల దాకా తగ్గాలి. చిన్నప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి, సముద్ర తీరాన నిలబడి వచ్చే ఓడని గమనిస్తే– మొదటి జెండా క్రమంగా పై భాగం మధ్య భాగం కనిపిస్తాయి. దీన్ని బట్టి భూమి గుండ్రంగా ఉందని నమ్మాలి. మోదీ సర్కార్‌ని కూడా అలాగే నమ్మాలి. వేరే దారి లేదు.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

>
మరిన్ని వార్తలు