కార్తీక వన రాజకీయాలు

17 Nov, 2018 00:45 IST|Sakshi

అక్షర తూణీరం

రాజకీయం ఏ అవకాశాన్నీ వదులుకోదు. అసలు రాజకీయం అంటేనే అది. ఈసారి మంచి తరుణంలో ఎన్నికలవేడి అందుకుంది. పాపం, మన పూర్వీకులు ఏదో సదుద్దేశంతో ఒక ఆచారం పెడతారు. తీరా, తరాలు గడిచేసరికి ఆ సదాచారం శీర్షాసనం ధరి స్తుంది. అర్థం పర్థంలేని కులాలు గోత్రాలు చెరిగి పోయి, అంతా ఓ చెట్టు నీడన సహబంతి భోజనాలు సాగించాలని తీర్మానించారు. కార్తీకమాసం అందుకు శ్రేష్ఠమని పురాణాల్లో చెప్పారు. అందుకు ఉపవాస దీక్షని జోడించారు. శివుడు కోరిన వరాలిస్తాడని పుణ్యం పుష్కలమని మంచి బ్రాండ్‌ వాల్యూ ఉన్న మహర్షుల మాటగా చెప్పారు. నెలరోజులు గడువు ఇచ్చారు. కార్తీక వన భోజనాలు బాగా క్లిక్‌ అయినాయి.

కాకపోతే ఇప్పుడిప్పుడు పిక్నిక్‌ కళ తెచ్చుకుంది. ఆర్థిక, సాంఘిక, కుల రాజకీయ వ్యవహార చర్చలకు వేదికగా మారింది. చివరికిప్పుడు కుల ప్రాతిపదికన ఈ వన సమారాధనలు నిరాటంకంగా జరుగుతున్నాయి. మనవాళ్లంతా రండి. మనవాళ్లని తీసుకురండి. మనోడు స్పాన్సర్‌ చేస్తున్నాడు. మనవాడి ఫాంహౌజ్‌లోనే... అంటూ సాదరంగా పిలుపులు వస్తున్నాయ్‌. ఇట్లు, మీవాడు అంటూ ఆహ్వానాలు పంపుతున్నారు. ఇలాంటప్పుడు కొత్త సమాచారం సేకరిస్తుంటారు కులపెద్దలు.

ఫలానా సెంట్రల్‌ మినిస్టర్‌ తీరా చూస్తే మనవాడేనని తేలింది. ఆయన ముత్తాతగారి పెత్తాత గోదావరి వాడంట. నువ్వుజీళ్లు తయారించి, అమ్ముకుని జీవించేవాడు. వరుసగా మూడేళ్లు భయంకరమైన కరువొస్తే తట్టుకోలేక పొట్టని, నువ్వుజీళ్ల ఫార్ములాని చేతపట్టుకుని పొగ ఓడలో బొంబాయి చేరుకున్నాట్ట. అక్కడ జీళ్ల కార్ఖానా రాజేశాడు. వెళ్లిన వేళా విశేషంవల్ల దశ తిరిగింది. ఇహ ఆ కొలిమి ఆరింది లేదు. శివాజీ మహరాజ్‌ జీళ్లకి అబ్బురపడి, ఫిరంగి గుళ్లు, తుపాకీ తూటాలు కూడా చేయించి వినియోగించారట. ‘ఈ దినుసేదో బావుంది. వినియోగం తర్వాత చీమలకి ఆహారం అవుతోంది భేష్‌’ అంటూ మెచ్చుకుని ప్రోత్సహించారు.

ఆ విధంగా పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. కాలక్రమాన ఆ వంశం ముంబాదేవి ఆశీస్సులతో అక్కడ స్థిరపడిపోయింది. వలస వచ్చాం అని చెప్పుకోవడం దేనికి లేనిపోని రొష్టని బొంబాయి జనజీవన స్రవంతిలో ఐక్యమైపోయారు. ‘ఆయన మనోడే. కావాల్సినన్ని రుజువులున్నాయ్‌. డీఎన్‌ఏలతో సహా పక్కా.. మనోడే’ అని కులపెద్దలు ఆనందంగా బయటపెట్టారు. ఆయన సమారాధన సభకి వస్తున్నట్టు ప్రకటించారు.
మీడియా భాషలో చెప్పాలంటే ఈ టైములో వనభోజనాలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. హాయిగా మనసువిప్పి కులం భాషలో మాట్లాడుకుంటున్నారు. పంట ఓట్లు తక్కువగానూ, పైఓట్లు ఎక్కువగానూ అవసరపడే అభ్యర్థులు చర్చించి రేట్లు ఖాయం చేసుకునే పనిలో ఉన్నారు.

తీరా ఆవేల్టికి రేట్లు మన చేతిలో ఉండవ్‌. ఇప్పుడైతే పచ్చని చెట్లకింద శివసాన్నిధ్యంలో ఓ మాట అనుకుంటే, పాపభీతికి జంకైనా మాటమీద నిలబడతారని నమ్మకం. తులసీ దళం మీద కొందరు, మారేడు దళం మీద మరికొందరు ఓటర్లతో∙ప్రమాణం చేయించుకుంటున్నారట.సర్వసిద్ధంగా ఉన్న అభ్యర్థులు షడ్రసోపేతమైన భోజనం పెట్టి, చివరకు మారేడాకు, తులసి ఆకో గుర్తువేసి ఇస్తున్నారట. తులసి ఆకు చూపిస్తే విష్ణాలయాల్లోనూ, మారేడైతే శివాలయంలోనూ దాన్ని రొఖ్ఖంలోకి మార్చుకోవచ్చు. ఈ విధంగా కార్తీక వన విందులు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయ్‌. మన సంప్రదాయాల వెనుక ఎప్పుడూ ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది. కారల్‌మార్క్స్‌ అన్నట్టు సమస్త సంబంధాలూ కడకు ఆర్థిక సంబంధాలకే దారి తీస్తాయ్‌.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు