మరో స్వాతంత్య్ర సమరం

2 May, 2020 00:38 IST|Sakshi

అక్షర తూణీరం

ఊరట కోసం అబద్ధాలు రాయనక్కర్లేదు. వార్తల్లో ఉండ టంకోసం సంచలనాలు సృష్టించి, పతాక శీర్షికలకు ఎక్కించపన్లేదు. లక్ష తుపాకులకన్నా ఒక వార్తా పత్రిక మిక్కిలి శక్తివంతమైనదని అతి ప్రాచీన నానుడి. ఎందుకంటే పత్రికల్ని అంతో ఇంతో నమ్ముతాం. అసలు అచ్చులో అక్షరాన్ని చూడగానే విశ్వసిస్తాం. అవన్నీ మనం రాసి మనం కూర్చినవే కావచ్చు. అయినా కనుబొమ్మలెగరేస్తాం. కొంచెం నమ్మేస్తాం. ఈ కరోనా విపత్కాలంలో సోషల్‌ మీడియాలో లేనిపోని వదంతులు తిరుగు తున్నాయి గానీ, పత్రికలు పెద్దరికంగా బాధ్య  తాయుతంగా ప్రవర్తిస్తున్నాయ్‌. అయితే, ప్రతి దానికీ ఒక మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు దీనికీ ఉంది.

ఇప్పటికే ప్రజలు పూర్తిగా డస్సిపోయి ఉన్నారు. ఇంకా భయభ్రాంతులకు గురి చేయ కండి. సొంత తెలివి ఉపయోగించి అసత్యాలు రాయక్కర్లేదు. నెల రోజులు దాటినా మాన వత్వం ఉదారంగా అన్నపురాశులుగా వాడవా డలా పరిమళిస్తూనే ఉంది. స్వచ్ఛంద సంస్థలు తమకు తామే జాగృతమై సేవలు అందిస్తు న్నాయి. గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతా లకు ఏ వేళకు ఆ వేళ మూడు నాలుగు ఆదరు వులతో వేలాదిమందికి భోజనాలు అందిస్తు న్నారు. ఇప్పటికే మంచి పేరున్న ‘అమ్మ పౌండేషన్‌ నిస్వార్థ సంస్థ’ వేలాదిమందికి ఆకలి తీరుస్తోంది. డబ్బులివ్వడం వేరు. దాన్ని భోజ నంలోకి మార్చి వడ్డించిన విస్తరిగా అందించ డానికి మరింత ఔదార్యం కావాలి. వెనకాల ఎందరో వదా న్యులు ఉండి ఉండవచ్చు. కానీ, క్రమశిక్షణ కార్యదీక్షతో ఈ మహా క్రతువుని సాగించడం అసలైన పూజ.

నిజమైన దేశభక్తి మన తారలు కొందరు ప్రజాహితం కోరుతూ, ‘ఇంట్లోనే ఉండండి! అదొక్కటే రక్ష!’ అంటూ సూచిస్తున్నారు. కొందరు కథానాయకులు ఇళ్లల్లో ఉండి వాళ్లు స్వయంగా చేస్తున్న ఇంటి పనులన్నింటిని మంచి పేరున్న శిల్పితో వీడి యోల కెక్కించి చానల్స్‌కిచ్చి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. కొందరి జీవితాలు సౌందర్య సాధనాల్లాంటివి ఎప్పుడూ మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ ఉండకపోతే జనం మర్చి పోతారు. అందుకని స్మరింపజేస్తూ ఉండాలి. ఒకనాడు ఫోర్డ్‌ కారు ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది. ప్రతివారూ దాన్ని కలిగి ఉండాలని తహతహలాడేవారు. కానీ అంత తేలిగ్గా ఫోర్డ్‌ కారు లభించేది కాదు. అయినా ఫోర్డ్‌ సంస్థ ఆ కారు విశిష్టతల గురించి ఖరీదైన వ్యాపార ప్రకటనలు లక్ష లాది డాలర్లు వెచ్చించి విడుదల చేస్తుండేది. ఒక పెద్ద మనిషి ఫోర్డ్‌ని సూటిగా అడిగాడు. ‘మీ కారు కొనాలంటే దొరకదు. మళ్లీ అద నంగా కొనమని ఈ వ్యాపార ప్రకటనలొకటి’ అన్నాడు నిష్టూరంగా. అందుకు ఫోర్డ్‌ గారు నవ్వి, ‘దేనికదే.. విమానం గాలిలో జోరుగా ఎగురుతోంది కదా అని ఇంజన్‌ ఆపేస్తామా’ అని ఎదురుప్రశ్న వేసి నోటికి తాళం వేయిం చాడట! మనవాళ్లు ఆ అమెరికన్‌ కాపిటలిస్ట్‌ అడుగుజాడల్లో నడుస్తారు.

మీడియా ఇలాంటి దిక్కుతోచని స్థితిలో సామాన్య ప్రజలకు ఏమి చెబితే ధైర్యస్థైర్యాలొస్తాయో అవి చెప్పాలి. జాగ్రత్తలు చెప్పండి. ఉపాయాలు చెప్పండి. ప్రపంచ దేశాల్లో సాగు తున్న పరిశోధనల గురించి చెప్పండి. తప్ప కుండా ఒక మంచి మందు శక్తివంతమైన టీకా వస్తుందని ధైర్యం ఇవ్వండి. మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా మరీ కరోనా గురించి ఎక్కువ భయపెట్టకండని మీడియా మిత్రులకు చెప్పారు. మానవజాతి కరోనాతో కలిసి జీవించడానికి అలవాటుపడాలన్నారు. ఆ తర్వాత ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ కూడా ఈ మాటే ధ్రువపరి చారు. కుళ్లు కుతంత్రం, అసూయ ద్వేషం లాంటి ఎన్నో అవగుణాలతో జీవితాన్ని సాగి స్తున్నాం. వాటిముందు ఈ వైరస్‌ అంత నీచ మైందేమీ కాదు. దేశ స్వాతంత్య్ర సమరం తర్వాత మనలో సమైక్యతాభావం తిరిగి ఇన్నా ళ్లకు కనిపిస్తోంది. కాసేపు రాజకీయాలను పక్క నపెట్టి మానవసేవవైపు దృష్టి సారిస్తే పుణ్యం పురుషార్థం బయట ఏ స్వార్థమూ లేనివారు రకరకాల త్యాగాలు చేస్తున్నారు. సేవలు అంది స్తున్నారు. అంతా తమవంతు సాయం అందిం చండి. జీవితాన్ని ధన్యం చేసుకోండి.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు) 

మరిన్ని వార్తలు