కావల్సింది నాలుగు మంచి మాటలు

25 Apr, 2020 02:01 IST|Sakshi

అక్షర తూణీరం

అనుకోని ఈ గత్తర ప్రపంచాన్ని వణికిస్తోంది. మన సంగతి సరేసరి. ఇంత జరుగుతున్నా మన లోని సంఘటిత శక్తి మేల్కొనలేదు. ఔను, మన దేశం ఎన్నడూ గొప్ప యుద్ధాన్ని చూడలేదు. ఒకనాడు మహోధృతంగా సాగిన విప్లవాల నైజాలు, నష్టాలు తెలియదు. మనలో దేశభక్తిపాలు చాలా తక్కువ. లేకుంటే ఈ సమయంలో రాజకీ యాలని మేల్కొలిపి జరుగుతున్న ప్రజాహిత కార్య క్రమాలకు అడ్డంపడుతూ ఆగం చేసుకుంటామా? వయసు, అనుభవం ఉంటే రాష్ట్ర ప్రజకి అవి అంకితం చేయండి. రండి! ప్రజని ఇలాంటప్పుడు క్రమశిక్షణతో నడపండి. అంతకంటే ఈ తరుణంలో గొప్ప దేశ సేవ మరొకటి ఉండదు. ఇక ఈ రాజ కీయాలు, ఆరోపణలూ ఎప్పుడైనా ఉంటాయ్‌. తర్వాత తీరిగ్గా చూసుకోవచ్చు. మనం ఎన్ని మాట్లాడినా మీడియా ఎన్ని ప్రచారాలు ప్రసారం చేసినా ప్రజల చెవులకి అమోఘమైన ఫిల్టర్‌లు ఉంటాయ్‌. దారిలో స్వచ్ఛమై తలకెక్కుతాయి. ఇది మాత్రం సత్యం.

చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని టన్నుల లెక్కన మనకి పదే పదే చెప్పి అందించారు. ఎలాంటి సందర్భం వచ్చినా తన విశేష ప్రజ్ఞా పాటవాలని సోదాహరణంగా చెప్పి బోరు కొట్టకుండా వదిలింది లేదు. ప్రపంచ ప్రఖ్యాత గణితవేత్త శ్రీనివాస రామానుజంకి చివరాఖరులో మూడు స్టెప్పులూ తనే సూచించా ననీ, ఆ లెక్కలే ఇప్పటికీ ఉపగ్రహాలు సక్రమంగా గమ్యం చేరడానికి వినియోగపడుతున్నాయని చెప్ప డానికి ఏమాత్రం సంకోచించని మనిషి. తెలుగు జాతికి కీర్తి కిరీటమై శోభిల్లిన మంగ ళంపల్లి బాలమురళీకృష్ణ కూర్చిన పలు కొత్త సంగ తుల వెనక చోదకశక్తి తానేనని నిర్భయంగా ప్రక టించి వేదికపై నిలబడగల సాహసి. అంతేనా?! తర్వాత తప్పనిసరిగా సమకూర్చవలసిన అంబే డ్కర్‌ రాజ్యాంగ సూత్రాలకి సవరణల్ని బాబూ సాహెబ్‌ మెదడులో కూచుని రాశాను అని నిస్సం కోచంగా ప్రకటించగల ధీశాలి. ఆయనిప్పుడు ఉత్త రకుమారుడై లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. పదవీ, బాధ్యత, జవాబుదారీ వగైరాలేవీ లేకుండా ఉచిత సలహాలు గుప్పించడం బహు తేలిక.

ప్రతివారికీ పదివేలు ఇవ్వాలి, కావల్సినవన్నీ ఇవ్వాలి, సేంద్రియ కూరలు, పళ్లు పంపిణీ చెయ్యాలి– ఇట్లా పది సూచనలతో ఒక డిమాండ్‌ ప్రభుత్వంపై విసరవచ్చు. మనం కూడా నిన్న మొన్నటిదాకా పవర్‌లో ఉన్నాంకదా! ఏమి నిర్వాకం చేశామని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలో చించాలి. అవతలివైపు ఉండి బాధ్యతాయుత పాత్ర పోషించడమంటే ఇది కాదనిపిస్తోంది. బాధ్యతగల ఒక రాష్ట్ర పౌరుడిగా ఇంతవరకు తమరు ఏమి చేశారో చెప్పండి. అందరిలాగే తెలుగుజాతి అతలా కుతలం అవుతుంటే– పోనీ, ఏ పత్రికాముఖంగా నైనా, నేనున్నాను నిబ్బరించండి, జాగ్రత్తలు పాటిం చండి, ప్రభుత్వాలకి సహకరించండని ఒక్క మంచి సూచన చేశారా? మనం గతంలో ఇలాంటివి ఎన్నో చూశాం. ఏమీ పర్వాలేదు. ఆధునిక మానవుణ్ణి తక్కువ అంచనా వేయకండి.

మహా ప్రళయాలకి అడ్డుకట్టలు వేసిన నేటి మనిషి మన కోసం అహ రహం తపిస్తూ శ్రమిస్తున్నాడు. అతని తపస్సు ఫలి స్తుంది. మన వేద భూమిలో సమస్త దేవి దేవతలు ఆ తపస్వికి సహకరిస్తారు. కావల్సిన బుద్ధిబలం వాళ్లంతా సమకూరుస్తారు. ఇలాంటి వ్యాధులు గోడలు దూకి పారిపోతాయ్‌ అంటూ ఒక సాటివాడికి, సామాన్యుడికి వెన్నుతట్టే నాలుగు మంచి ముక్కలు రాసిన పాపాన పోలేదు. మీరేనా జనానికి వెన్నుదన్ను. పవర్‌లో ఉండి పనిచేస్తున్న వారిమీద రాళ్లు, మట్టి విసరడం పెద్ద గొప్పేమీ కాదు. లోపా లోపాల్ని విమర్శించడానికి బోలెడు వ్యవధి ఉంది. అవకాశాలొస్తాయ్‌. మరీ తొట్రుపాటు తగదు. ఇప్పుడే పట్టాభిషేకానికి తొందరపడొద్దు. కాలం నిర్ణయిస్తుంది.

శ్రీరమణ 
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు