పట్టు కలవాలి!

24 Nov, 2018 02:01 IST|Sakshi

అక్షర తూణీరం

పూర్వం సిండికేట్‌ అనే వారు. ఇప్పుడు తెలుగులో మహాకూటమి, ప్రజాకూ టమి అనే పేర్లతో వ్యవహ రిస్తున్నారు. ‘ఇదొక కాక్‌ టైల్‌ కూటమి, ఇదో క్లబ్‌ పార్టీ’ అన్నాడొక నాగరి కుడు. నాయకుల్ని ఏకం చేయగలిగింది పదవీ వ్యామోహం ఒక్కటేనని ఓ పెద్దాయన తీర్మానించాడు.

‘ఈ మాత్రం ఐకమత్యం దేశ సమస్యలప్పుడుం టేనా... రాష్ట్రాలన్నీ చిన్న చిన్న రామరాజ్యాలైపో తాయ్‌’ ఒక పెద్దావిడ నిట్టూర్చింది. ‘ఈ మహా కూటమిలో కట్టు కట్టిన వారంతా మహానుభావులు. గొప్ప గొప్ప ఆలోచనలున్నవారు. సొంత ఫిలాసఫీ, ఎజెండాలున్నవాళ్లు. వీళ్లు చివరికి ఎట్లా కలుస్తారండీ. నూకలు, మైదాపిండి, గులక రాళ్లు, నీళ్లు కలిపినట్టు అవుతుందండీ. మీకేమనిపిస్తోంది’ అని సూటిగా నిలదీశాడు. ‘ఇదివరకు ఇలా చాలా కూటములు వెలి శాయండీ. బలం కూడదీసుకోడానికి ఇదొక మార్గం’ అని నీళ్లు నమిలాను. 

చంద్రబాబు అన్నిస్థాయిల్లో కూటములు తయారు చేసేట్టున్నాడు. మోదీని చిత్తుచేసి దేశ రాజ్యాంగాన్ని నిలిపే ఉద్యమంలో తిరుగుతున్నాడు. ప్రయోగాత్మకంగా తెలంగాణలో కూటమిలో చేరిపో యారు. ఏ మాత్రం సంకోచించకుండా కాంగ్రెస్‌తో సైతం కరచాలనం చేసేశారు. చాలామంది ‘ఔరా’ అనుకుంటూ ముక్కున వేలేసుకుంటే, ఆ చర్య మూసీ ప్రభావంవల్లగానీ మా చర్యవల్ల కాదని చంద్రబాబు సమర్థించుకుంటున్నారు.
ప్రతి కూటమి వెనక స్వార్థం ఉంటుంది. గొప్ప సేవాభావం అయితే ఉండదు. సరైన కొలతలు లేని ఒక చిత్రమైన ఆకృతిలో జంతువు తయారవుతుంది. అయిదుకాళ్లు, రెండు తోకలు, చిన్న తొండంతో ఉంటుంది. భావసారూప్యత లేక నాలుగుకాళ్లు నాలుగు పొడుగుల్లో ఉంటాయి. గిట్టలు, పాదాలు ఇలా రకరకాలు. పాపం, అది అడుగు ముందుకు వెయ్యాలంటేనే పెద్ద ప్రయత్నం చెయ్యాలి. అదింకా జాతిని పరుగులెలా పెట్టిస్తుందో తెలియదు.
 
పాత జానపద కథ ఒకటుంది. రాజరికాలు నడిచే రోజుల్లో కూడా సింహాసనం కోసం ఎప్పుడూ ఓ యుద్ధం నిశ్శబ్దంగా సాగుతూ ఉండేది. యుద్ధ మంటే అవతలివారి ఆశ. బలమైన కోరిక. తమ శక్తియుక్తులన్నీ ప్రయోగించి నిరంతరం ప్రయత్నాలు సాగిస్తూ ఉండేవారు. కథ ఏంటంటే– ఒక అడవిలో ఒక బండినిండా ధాన్యం ఉంది. కానీ బండి లాగడానికి ఎడ్లు లేవు. అది గమనించిన ఒక గద్దకి ఆలోచన వచ్చింది. మరో నలుగురితో జతకట్టి, ఆ బండిని వేరే చోటికి చేర్చి, హాయిగా పంచుకు తినాలని ఆలోచన చేసింది. గద్ద దగ్గర్లో ఉన్న సొర చేపని, ఎండ్రకాయని సంప్రదించ బోయింది. అవి గద్ద రెక్కల చప్పుడు వినగానే బొరి యలోకి, నదిలోకి పోయి దాక్కున్నాయి. ఎట్లాగో నచ్చచెప్పి, సంగతి వివరించి ఒప్పించింది. గబ్బి లంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. బండి కాడికి అటూఇటూ సొర చేపను, ఎండ్రకాయను కట్టింది. కాడిని మధ్యలో తనే ఎత్తిపట్టింది. గబ్బిలం వెనకాల తలక్రిందులుగా వేలాడుతూ ఆలోచన చేస్తోంది.

కాడిని గద్ద బలంగా పైకి లేపింది. ఎంత సేప టికీ సొరచేప నీళ్లవైపు లాగుతోంది. రెండోవైపు ఎండ్రకాయ దాని సహజమైన అడ్డధోరణిలో పక్కకి పెడలాగుతోంది. గబ్బిలం తలక్రిందు ఆలోచనలతో తపస్సు చేస్తోంది. బండి ఎటూ కదలడం లేదు. ముందుకీ కదలడం లేదు. పక్కకి అసలే లేదు. బండి సక్రమంగా ముందుకు వెళ్లాలంటే పట్టు కలవాలి. అది ఏకోన్ముఖంగా సక్రమంగా ఉండాలి. అదీ కథ.

వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు

మరిన్ని వార్తలు