దోపిడీదారులు

7 Mar, 2020 00:54 IST|Sakshi

అక్షర తూణీరం 

క్షణానికి వచ్చేది తెలియ దంటారు. ఆది శంకరుడు అంతా మిథ్య అన్నాడు. అయితే రోల్స్‌ రాయిస్‌ కారు, ఫైవ్‌స్టార్‌ రిసార్టు, అందలి సుఖాలు మాయం టావా? మిథ్యంటావా? నా ముద్దుల వేదాంతీ అని శ్రీశ్రీ సూటిగా ప్రశ్నించాడు. మనల్ని కొన్ని వైరాగ్యాలు ఆవహిస్తూ ఉంటాయ్‌. గొప్ప జీవితం గడిపి ఆఖరికి గుప్పెడు బూడిద అయినప్పుడు చూపరు లకు శ్మశాన వైరాగ్యం ఆవరిస్తుంది. విపరీతంగా ప్రసవ వేదన అనుభవించిన తల్లికి ప్రసూతి వైరాగ్యం పూనుతుంది. మంచి పౌరాణికుడు ప్రవ చనం ఆర్ద్రంగా వినిపించినపుడు ఇంటికి వెళ్లేదాకా పురాణ వైరాగ్యం మనసుని వేధిస్తుంది.

కరోనా వైరస్‌ మొన్న ప్రపంచాన్ని చుట్టుముట్టి నపుడు మనిషికి వైరాగ్యం కూడా వైరస్‌లా అంటు కుంది. చూశారా నిరంకుశ పాలన సాగేచోట కరోనా తీవ్రంగా ఉందని కొందరు విశ్లేషించారు. దేవుణ్ణి బొత్తిగా నమ్మనిచోట కరోనా విజృంభిస్తోందనీ మరికొందరన్నారు. ఇండియాలో దేవీదేవతలనైనా, పెద్దవారినైనా చేతులు చోడించి వినమ్రంగా పలక రిస్తాం. ఇది మన సంప్రదాయం. ఇదే కరోనాకి శ్రీరామ రక్ష అంటున్నారు శాస్త్రవేత్తలు. షేర్‌ మార్కెట్‌ చిగురుటాకులాంటిది. ఎండకాస్తే, నాలుగు చినుకులు పడితే షేర్‌ మార్కెట్‌ చలించి పోతుంది.

ఇక కరోనా లాంటి మందులేని జాఢ్యం ఆవరించినపుడు చెప్పేదేముంది. భారతదేశం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. చిల్లర రాళ్లని మొక్కే దేశం. అప్పుడొకసారి అంతరిక్షం నించి లాబొరేటరీ గింగిరాలు తిరుగుతూ వచ్చి పడుతోందని ఒక వార్త పుట్టింది. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎక్కడ పడుతుందో తెలియదు. అప్పుడు మన తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లాయి. కొందరు ఉన్న స్థిర చరాస్తులు అమ్మేసి సామూహికంగా తాగేసి ఆందోళన నుంచి బయటపడ్డారు. తర్వాత అదె క్కడో సముద్రంలో పడిందని తెలిసి కొందరు ఊపిరి వదిలారు. కొందరు ఊపిరి పీల్చుకున్నారు.

మనకి కాసేపు వైరాగ్యం ఆవరించి తర్వాత అదే దోపిడీగా మారుతుంది. కరోనా పుణ్యమా అని మాస్క్‌లకి రెక్కలొచ్చాయ్‌. అదేదో వైరస్‌ రాగానే బొప్పాయికి ఎక్కడలేని డిమాండ్‌ వస్తుంది. డబ్బులు దాటి పెద్ద పెద్ద సిఫార్సులు పడితేగానీ ఒక బొప్పాయి దొరకదు. మాస్క్‌ కోసం క్యూలు కట్టడం, వాటి ధర వేలంపాట పాడి కొనుక్కో వలసిన అగత్యం రావడం చూశాం. రూపాయి పావలా ఉండే మాస్క్‌ చివరకు ఇరవై ముప్ఫై దాటి చుక్కలు చూడటం చూస్తున్నాం. ఇక మళ్లీ మళ్లీ అవకాశం రాదన్నట్టు అమ్మకందారులు ఆశని నియంత్రించుకోలేరు. మనవాళ్లు ఎంతటి వైరాగ్య జీవులో అంతకుమించిన స్వార్థపరులు. జీవితం బుద్భుదప్రాయమనీ మరీ ఈ కరోనా తర్వాత మరీ బుడగన్నర బుడగ అని అనుకుంటూనే మాస్క్‌ల మీద ఏ మాత్రం లాభాలు చేసుకోగలం అనే దూరాలోచనలో మునకలు వేస్తూ ఉంటారు. 

పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ఎక్కడో పుట్టి మరెక్కడో పెరగదు. అకాల వర్షం వస్తుంది. ఎంతకీ ఆగదు. గొడుగులు, టోపీలు రోడ్డుమీద అమ్మకా నికి వస్తాయ్‌. సరసమైన ధరలన్నీ విరసంగా మారతాయ్‌. అవసరం అలాంటిది. బేరాలు చేస్తూ నిలబడితే తడిసిపోతాం. చినుకు చినుకుకీ ధర పెరిగే అవకాశమూ ఉంది. కరోనాకి హోమియోలో ఉంటుందండీ మంచి మందు. ఒక్క డోస్‌తో పక్కింటి వాళ్లకి కూడా ఠక్కున కడుతుందని ఒకళ్లిద్దరు అన్నారు.

ఆ మాటకొస్తే ఆయుర్వేదం మన వేదం. ఉండే ఉంటుంది. ఎటొచ్చీ తెలుసు కోవాలి అంతే. ఇట్లాగే మనం ఎన్ని విద్యలు నాశనం చేసుకున్నామో! చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం అంటూ ఓ పెద్దాయన వాపోయాడు. మన దేశంలో అంటే బోలెడుమంది దేవుళ్లున్నారు. పిలిస్తే పలు కుతారు. వాళ్లకి ఆ గోడవతల వాళ్లకి దేవుడే లేడు. ఇక వారినెవరు రక్షిస్తారు? అందుకే నేనెప్పుడూ దేవుణ్ణి నమ్ముకోమని అందరికీ చెబుతుంటానని ఓ గాంధేయవాది బాధపడ్డాడు. ‘ఉంటారండీ, ఈ వైరస్‌లన్నింటినీ తొక్కి నారతీసే వాడెవడో ఉంటాడు. ఆ బీజాక్షరాలు తెలుసుకుని మంత్రోక్త హోమం చేస్తే ఈ కరోనా ఉక్కిరిబిక్కిరి అయి పోదుటండీ’ అని నమ్మ కంగా సాగదీశాడు ఓ మోదీ అభిమాని.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు