కాకికీ ఓరోజు వస్తుంది

7 Dec, 2019 00:31 IST|Sakshi

అక్షర తూణీరం

ఒకవైపు మాతృభాషని పక్కన పెడుతున్నారని, మరోవైపు అమరావతి విశ్వవిఖ్యాత క్యాపిటల్‌ని కూల్చేస్తున్నారనీ తెలుగు దేశం పార్టీ యాగీ చేస్తోంది. బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపేస్తు న్నారని వాపోతున్నారు. అవసరాల్ని బట్టి భాషలు, పనులు అలవడతాయ్‌. ఒకప్పుడు బతుకుతెరువు కోసం రంగూన్‌ వలస వెళ్లేవారు. అక్కడ హార్బర్‌లో కొయ్యదుంగలు మోస్తూ, ఇంకా అనేక చిన్న చిన్న పనులు చేస్తూ తెలుగు ప్రాంతం నుంచి వెళ్లిన నిరక్షరాస్యులుండేవారు. చాలా శ్రమించేవారు. ఆదాయం తక్కువే ఉండేది. అయినా జాగ్రత్తగా బతికి, మిగిలిచ్చి ఇంటికి డబ్బు పంపేవారు.

కొన్ని సంవత్సరాలకిగానీ సొంత గూటికి వచ్చేవారు కాదు. వాళ్లంతా అక్కడి స్థానిక భాషలు నేర్చారు. బర్మీస్‌ స్థానిక యాసలతో సహా పొందిగ్గా మాట్లాడే వారు. ‘నేర్చుకోవాలి.. చచ్చినట్టు. లేకుంటే వ్యాపా రులు దళారులు మా నెత్తురు తాగేస్తారు’ అని వివరం చెప్పారు. భాష తెలియకపోతే ఇంకా మోసపోతామని చెప్పేవారు. మావూళ్లో బర్మీస్‌ అనర్గళంగా మాట్లాడగలిగినవాళ్లు పాతికమంది పైగా ఉండేవారు. ఇక్కడికి వచ్చాక వాళ్లకా భాషతో అస్సలు పని లేకుండా పోయింది.

దాని గురించి దిగులు పడాల్సిన పనేముంది? కాలమాన పరిస్థి తుల్ని బట్టి ఆధిక్యతలు మారిపోతూ ఉంటాయి. కరెంటు వచ్చాక కిరసనాయిల్‌ అవసరం తీరింది. ఒకనాటి నిత్యావసరం అది. అలాగే అనేకం. ‘మేం చిన్నప్పుడంతా గబ్బునూనె బుడ్డికిందే చదువు  కున్నాం. ఇంతవాళ్లం అయ్యాం. దాన్ని మర్చి పోకూడదు. వెలిగించండి లాంతర్లు’ అంటూ ఉద్య మించాల్సిన అవసరం లేదేమో?! ఇవన్నీ మన సంస్కృతిలో భాగం అనుకోకూడదు. దీపం బుడ్డి అనాగరికం మాత్రమే. 

కుక్కకి కూడా ఒకరోజు వస్తుందని సామెత. అలాగే కాకికి కూడా ఒక గౌరవం వస్తుందన్నది నిజం. మొన్న మొన్నటిదాకా ప్రకృతిలో చాలా నీచమైన, హేయమైన ప్రాణి కాకి. దాని రంగు బాగుండదు. దాని అరుపు, పిలుపు బాగుండవు. ఇనుపముక్కుతో వికారం నిలువెల్లా. శనేశ్వరుడి వాహనంగా అదొక అపఖ్యాతి. రకరకాల కారణాల వల్ల కాకి జాతి బాగా క్షీణించింది. నగరాల్లో వాటి ఉనికి అస్సలు లేదు. గ్రామాల్లో ఎక్కడైనా, ఎప్పు డైనా కాకి అరుపు వినిపిస్తోంది.

మనదసలే నమ్మ కాల నేల. పితృ కార్యాలప్పుడు పెద్దల్ని స్మరించి వికర పిండాలని కాకులకి అర్పించి కార్యకర్తలు తృప్తి పడతారు. ‘పియ్య తినెడి కాకి పితరుడె ట్లాయెరా’ అని ప్రజాకవి వేమన సూటిగా మన చాదస్తాన్ని ప్రశ్నించాడు. అయినా ఈ ఆచారం ఆగ లేదు. అన్నంలో ఘుమఘుమలాడే నెయ్యి పోసి చేతినిండా తీసుకుని ముద్ద చేసి వికర పిండాన్ని సిద్ధం చేస్తారు. కాకులకు కన్పించే రీతిలో దాన్ని ఎత్తుమీద పెట్టి వాటి రాక కోసం ఆశగా చూస్తుండే వారు.

ఎందుకో ఒక్కోసారి వచ్చేవి కావు. అమ్మో! పెద్దలు అలిగారని భావించి, బోలెడు వాగ్దానాలు చేస్తూ దణ్ణాలు పెట్టేవారు. ఫలానా పెళ్లి జరిపి స్తాం, ఆ పని చేయిస్తాం ఇలా బోలెడు అనుకున్న మాటల్ని పైకి చూస్తూ చెబుతారు. ఎప్పటికో ఒక కాకి వస్తుంది. దాని పిలుపుతో కాకిమూక దిగు  తుంది. మెతుకు లేకుండా తినేసి వెళ్తాయి. ‘అదీ ఆవిడకి లేదా ఆయనకి లోపల అనుమానం ఉంది. ఇప్పుడు తీరింది’ అనుకుంటూ లోపలికి వెళ్లేవారు. 

ఇప్పుడు కాకులకి మహర్దశ పట్టింది. మన నగరాల్లో పెంపుడు చిలకల్లా హాయిగా గారాబంగా పంజరాల్లో పూర్తి వెజిటేరియన్‌గా బతికేస్తున్నాయ్‌. ఒక అవసరంలోంచి ఆలోచనలు పుడతాయ్‌. అంత్యేష్ఠికి ఆబ్దికానికి కాకుల కొరత తీవ్రంగా ఉందని గ్రహించిన ఓ మేధావి కాకుల్ని చేర దీశాడు. ఫోన్‌ చేసినా, కబురు పెట్టినా కాకి పంజ రంతో సహా స్పాట్‌కి వస్తాడు. పితరుడి హోదాలో పిండం తినగానే దక్షిణ తీసుకుని యజమాని తన బండిమీద వెళ్లిపోతాడు.

 చేతిలో పది కాకులుంటే పదిమంది కాకి మనుషుల్ని బతికిస్తాడు. రేటెంత అంటే గిరాకీ, ఒత్తిడిని బట్టి అంటున్నారు. మునుపు నటించే కుక్క, కోతి, జింక, చిలక, పాము, ఉడుత లాంటి వాటికి భలే డిమాండ్‌ ఉండేది. ఇప్పుడీ విధంగా కాకికి ఒక రోజు వచ్చింది. అవసరాన్ని బట్టి అన్నీ వస్తాయ్‌. కనుక చంద్రబాబు దేని గురించీ అతిగా అలజడి పడా ల్సిన పన్లేదు.  


శ్రీరమణ  
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు