అన్న–తమ్ముడు మరియు సింపతి

16 Mar, 2019 00:53 IST|Sakshi

అక్షర తూణీరం 

సార్వత్రిక ఎన్నికల పర్వంలో తొలి ఘట్టం రేపోమాపో ముగియ నుంది. దాని తర్వాత బుజ్జగింపులు, ఓదా ర్పులు, కొత్త ఆశలు ఉంటాయి. సర్వసాధార ణంగా ఏదో ఒక తాయి లం అభ్యర్థిని లొంగదీసుకుంటుంది. ఎందుకంటే మనం మనుషులం రుషులం కాదు. దేశభక్తుల వంశం అసలే కాదు. స్వతంత్రం వచ్చాక పదవి ఒక అలంకారం అయింది. కాలక్రమేణా ఉత్తి అలంకా రమే కాదు. కీర్తిప్రతిష్టలున్నాయని తెలిసొచ్చింది. ఆనక డివిడెండ్లున్నాయని అర్థమైంది. ధర్మార్థ కామ మోక్షాలకి పదవి రహదారి అని తెలిశాక ఏ పెద్ద మనిషి ఈ దారి వదులుతాడు? ‘ఇప్పుడు అయి పోతే, మళ్లీ ఎన్నికలు రావా? అయిదేళ్లు ఎన్నాళ్లు తిరిగొస్తాయండీ’ అనే ఆశావహులు కోకొల్లలు. వారే అసలైన తాత్వికులు. ‘నేను లీడర్లని, ఓటర్లని నమ్ముకోను. కాలాన్ని మాత్రమే నమ్ముకుంటాను అన్నాడొక పైకొస్తున్న రాజకీయ వేత్త. దానికి పలు దృష్టాంతరాలు సెలవిచ్చాడు.

ముందుసారి కాక ముందుసారి మా అన్నయ్య నామినేషన్‌ వేయడా నికి మేళతాళాలతో, ఏనుగు అంబారీ మీద వెళ్తుంటే ఏనుక్కి పిచ్చి రేగింది. నానా యాగీ చేసి అంబారీ మీది అన్నయ్యని తొండంతో విసిరికొట్టింది. అభ్యర్థి కోమాలోకి వెళ్లాడు. సూపర్‌ స్పెషాలిటీలో రాజ వైద్యం నడుస్తోంది. నామినేషన్లకి ఇంకొక్క రోజే గడువుంది. నియోజకవర్గమంతా రకరకాల వదం తులు. పైవాళ్లు అర్జంటుగా నన్ను తలంటోసుకుని కొత్త దుస్తులు ధరించమన్నారు. నేను కంటతడి పెట్టాను. అవి ఆనంద భాష్పాలో దుఃఖ భాష్పాల్లో నాకే అర్థం కాలేదు. ఆసుపత్రిలో క్రిటికల్‌ కేర్‌ అద్దాల గదికెళ్లి డాక్టర్లతో భోరుమన్నాను. మా అన్నయ్య.. అంటూ ఎక్కిళ్లు పెట్టాను. ఆసుపత్రి రాజవైద్యుడు, నువ్వు ఏడవద్దు.

మీ అన్నయ్య సంగతి మేం చూసుకుంటాం. ఇప్పటికే అవసరమైన అన్ని స్పేర్‌ పార్ట్‌లు సేకరించి పెట్టాం. బ్లడ్‌ గ్రూప్‌ రక్తం బోలెడు లీటర్లుంది. అయితే, అధిష్టానం సూచనల మేరకు నడుచుకోమని గట్టిగా చెప్పారు అని ఓ పిచ్చి చూపు చూశాడు. క్షణం కూడా వృథా చేయకుండా తమ్ముడి పేరు మీద బి ఫారం పుట్టించి, సకాలంలో నామి నేషన్‌ దాఖలు చేయించారు. మళ్లీ కోలాహలం. ఈసారి ఏనుగు లేదు. అసలు మనకి దేవుడి వాహనాలు వద్దంటే వద్దని మా పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కుంకంబొట్లు, భారీ దండలు, జిందాబాదుళ్లు తీవ్రంగా పడ్డాయ్‌. ఎన్నికలు దగ్గ రకు వస్తున్నాయ్‌. పై నించి ప్రచార సామగ్రి దిగింది. నా దగ్గర తంతే కోటి కూడా లేదు. అర్ధాంతరం నన్ను పాలిటిక్స్‌లో దింపేశారేంటని తమ్ముడు బావురుమన్నాడు. పైవాళ్లు నువ్వు మామూలోడివి కాదు. ఇంకా సాంతం గడిలోకి రాకుండానే మాకు గండి వేస్తున్నావ్‌ అనగానే తమ్ముడు వెర్రిమొహం పెట్టాడు. తమ్ముడూ నువ్‌ దేశముదురువి. నీకు నిండా దొరికాం అంటూ తలపండని మహా మాంత్రికులు నీరుకారి పోయారు.

మర్నాడు, ‘నాకీ రాజకీయాలు అస్సలు తెలి యవు. నాకు నా అన్న ప్రాణం ముఖ్యం’ అంటూ ఆసుపత్రిలో కుప్పకూలాడు తమ్ముడు. వైద్యం సరిగ్గా జరగడం లేదు. ఏదో ఉంది. ఇహ నాకు మీడియా తప్ప వేరే మార్గం లేదన్నాడు తమ్ముడు. హై కమాండ్‌ ఒక్కసారిగా ఖంగుతింది. పోలింగ్‌ తేదీ పది రోజుల్లోకి వచ్చింది. అంతా ఆసుపత్రి వర్గాల చేతుల్లో ఉంది. కావాలంటే వెంటిలేటర్స్‌ మీద పది రోజులు ఉంచగలరు, వద్దనుకుంటే పుణ్యతిథి చెబితే పైకి పంపించేగలరు రేపు లేదా ఎల్లుండి పోలింగ్‌ అనగా అన్నయ్య గుటుక్కుమ న్నాడు. వార్త ముందే తెలిసినంత పర్ఫెక్ట్‌గా గుప్పు మంది. క్షణాలమీద లీడర్స్‌ చార్టర్‌ ఫ్లయిట్స్‌లో, హెలికాప్టర్లలో, కార్లలో వచ్చి వాలారు. ఎన్ని దండలు, ఎన్ని కన్నీళ్లు? ఆయన ఆదర్శాల కోసం శేష జీవితాన్ని అంకితం చేస్తామని వాళ్లంతా గద్గద స్వరాలతో వక్కాణించారు. తమ్ముడు, బరిలో ఉన్న అభ్యర్థి అపస్మారక స్థితిలో ఉన్నాడని ఆసుపత్రి చెబుతోంది. సర్వత్రా సింపతీ కారుమేఘాల్లా అలు ముకుంది. ఫలితం గురించి వేరుగా చెప్పక్కర్లేదు. గెలుపులో పెద్ద పాత్ర ఆసుపత్రిది. సహజంగా నటించింది ఏనుగు ఒక్కటే!

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు