అమ్మో! పులులు పెరిగాయ్‌!?

3 Aug, 2019 01:23 IST|Sakshi

ఈ మధ్య రెండు మూడు రోజులుగా పులుల ప్రస్తావన ఎక్కు వైంది. ఎక్కడ విన్నా ఇదే టాపిక్‌ అయిపోయింది. పేపర్లలో పతాక శీర్షికలెక్కాయి పులులు. దేశంలో పులుల సంఖ్య అధికంగా మూడో వంతు పెరిగిందని, గ్రాఫ్‌ గీతలతో సహా చూపించారు. ఇదంతా మోదీ హయాంలోనే మోదీ అవిరళ కృషితోనే సాధ్యపడిందన్నట్టు తెగ వార్తలొచ్చాయ్‌. నాకసలు అనుమానం వచ్చింది. ఏమిటి నిజం పులుల గురించా, బీజేపీ పులుల గురించా అని సందేహం వచ్చింది. ఒక్కోసారి టెన్నిస్‌ ఆటగాళ్లని ‘టైగర్స్‌’ అంటుంటారు. ఆ ఉద్యమం నడిచినన్నాళ్లూ శ్రీలంకలో ‘తమిళ పులులు’గా వ్యవహరించేవారు. కిందటి ఎన్నికల్లో పెరిగిన సంఖ్యని దృష్టిలో పెట్టుకుని, పెరిగిన పులుల సంఖ్యగా చెబుతున్నారనుకున్నా. కొన్ని వేలమంది, కొన్ని వేల కెమెరాలు శ్రమించి పులుల సంఖ్యని నిర్ధారించారు. మోదీకి అసలు తను కిందటి జన్మలో బెంగాల్‌ టైగర్‌ అయి ఉండవచ్చని గట్టి విశ్వాసం. అందుకే ఆయనకి పులిమీద పిచ్చి ఇష్టమని కొందరంటుంటారు.

కనుకనే వాటి అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశా రని మరికొందరి నమ్మకం. పులి అంటే ధీమా. పులి అంటే పంజా. పులి అంటే చచ్చే భయం. సింహానికి ఠీవి ఎక్కువ. పులికి దూకుడెక్కువ. పులి ఏం తోస్తే అది వెనకా ముందూ చూడకుండా చేస్తుంది. తర్వాత సింగిల్‌గా గుహలో కూచుని బాధపడి, ఎవరికీ వినిపించకుండా చిన్నగా గాండ్రించి, పంజాతో వెన్ను తడుముకుని ముందుకి నడుస్తుంది. సింహం అలా కాదు. మధ్యమధ్య ఠీవిగా వెనక్కి తిరిగి చూసుకుంటుంది. అది తప్పైనా ఒప్పైనా. ఒక్కోసారి అదీ ఏనుగులద్దె తొక్కుతుంది. జూల్లో ఈగలు వాలి దాన్నీ చికాకు పెడతాయి. వాటిని దర్జాగానే సంబాళించుకుని, ‘లయనిజమ్‌’కి భంగం రాకుండా కాపాడుకుంటుంది. ఒక్కసారి జూలు విదిల్చుకుని ఠీవినొకసారి రీచార్జ్‌ చేసుకుని వెనక్కి తిరిగిచూసి అడవి దద్దరిల్లేలా గర్జిస్తుంది. దీన్నే సింహావలోకనం అంటారు. సమస్త జీవ రాశి ఆ గర్జనకి ఉలిక్కిపడుతుంది గానీ జూలులో ఆడుకుంటున్న ఈగలు మాత్రం నవ్వుకుంటాయ్‌.

పులి చర్మాన్ని తపోధనులు ఆసనంగా వాడతారు. తల, పులిగోళ్లు యథాతథంగా ఉండి తపస్సుకి ఓ నిండుతనం చేకూరుస్తాయ్‌. మోదీ కూడా యోగాసనాలు, పెద్ద నిర్ణయాలు పులి చర్మంమీద కూచునే తీసుకుంటారని కొంద రంటారు. పులి చర్మం సృష్టిలో ఒక విచిత్రం. భూమ్మీద ఏ రెండు చర్మాలూ ఒక్కలా ఉండవట. చుక్కలు, ఆ వైఖరి దేనికదే ప్రత్యేకం. విశ్వనాథ సత్యనారాయణకి పులి చాలా అభిమాన జంతువు. ఆకాశంలో ఇంద్రధనుస్సుని పులి తోకతో పోలుస్తారాయన. ‘పులిమ్రుగ్గు’ పేరుతో ఓ మంచి నవల రాశారు. నిజంగా ఇప్పుడు∙మోదీ పుణ్యమా అని పులుల సంఖ్య పెరిగిందంటే విశ్వనాథ ఆనందపడి మోదీని మధ్యాక్కరలతో మెచ్చుకొనేవారు. ప్చ్‌... ప్రాప్తం లేదు.

ఎంతైనా సింహానికున్న రుజువర్తన పులికి లేదంటారు. ఒక్కోసారి పులి నక్కలా ప్రవ ర్తిస్తుందని అడవి జీవితం తెలిసిన వాళ్లంటారు. పులిమీద బోలెడు లిటరేచర్‌ వచ్చింది. అనేక కథలు వచ్చాయ్‌. ఒక పులికి నిండుగా వృద్ధాప్యం వచ్చేసింది. పులులకి వృద్ధాశ్రమాలు ఉండవు కదా. చచ్చేదాకా దాని బతుకు అది బతకాల్సిందే. లేళ్ల గుంపుల్ని వేటాడిన పులి అడుగుల నడకే గగనంగా ఉంది. క్షుద్బాధ తీరేదెలా? కుందేళ్లు నోట్లోకి రావుకదా. ఇంతకుముందు రాజుగారిని తిన్నప్పుడు మిగిలిన బంగారు కడియం పులి పంజాకి ధరించి తిరుగుతోంది. చెరువు పక్కన ఓ చెట్టు నీడన కూర్చుంది. వచ్చే పోయే వారిని కేకలతో పలకరించేది. ‘రండి.. రండి! నరమాంసం తిని ఎంతో పాపం మూటగట్టాను. ఇదిగో ఈ వజ్రాలు పొదిగిన బంగారు కంకణం తీసుకుని నన్ను పునీతం చెయ్యండి. ఓయీ విప్రుడా నీవే ఇందుకు తగు’ అనగానే విప్రుడు ఆశపడ్డాడు. విప్రుని తినేసి తిరిగి కంకణాన్ని పంజాకి వేసుకుంది పులి. మోదీ పులుల లెక్క తిరిగి తిరిగి పులిహింస దగ్గర ఆగింది. మొత్తంమీద ఏదో రకంగా దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది!


వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

మరిన్ని వార్తలు