పరిశుభ్రతే పరమధర్మం

21 Mar, 2020 00:54 IST|Sakshi

అక్షర తూణీరం

ఒక ఉలికిపాటు. ఒక విపత్తు. ఎప్పుడూ లేదు. ఒకప్పుడు ఇలాంటి ఎదు రుచూడని వైపరీత్యాలు జరిగి ఉండచ్చు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో సమాచారాన్ని విశ్వమంతా చేరవేయగల సాంకేతిక పరిజ్ఞానం మనిషి వేళ్ల కొసమీద ఉంది. కొద్ది గంటల్లో నేలమీద ఏ మూల నుంచి ఏ మూలకైనా చేరగల సౌకర్య సామర్థ్యాలను మనిషి సాధించాడు. అదే ఇప్పుడు ఈ పెనుముప్పుకి దోహదమైంది. కరోనా అంటువ్యాధి విమానాలెక్కి సముద్రాలు దాటి ఖండాంతరాలను వచ్చి చేరింది. 

నూతన సంవత్సరం 2020 ఈ విపత్తులో ప్రారంభం కావడం మొత్తం మానవాళిని అల్ల కల్లోలం చేస్తోంది. ఇంతవరకు కరోనా నైజం ఎవరికీ అంతుబట్టలేదు. శాస్త్రవేత్తలు అవిశ్రాం తంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి తెలిసిందే మంటే వ్యక్తిగత మరియు సమష్టి పరిశుభ్రత మాత్రమే దీనికి విరుగుడుగా నిర్ధారించారు. వయ సుమళ్లినవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. మాటిమా టికీ చేతులు శుభ్రం చేసుకోవాలని హెచ్చరి స్తున్నారు.

పరిశుభ్రతలోనే పరమేశ్వరుడున్నాడని అనా దిగా మనం విశ్వసిస్తున్నాం. పాటిస్తున్నాం. రోజూ కనీసం మూడుసార్లు నదీ స్నానం, దైవ ధ్యానం, అగ్నిహోత్ర ఆరాధన లాంటి నియమాలను మన ఋషులు శాస్త్రోక్తంగా ఆచరించి మరీ ఉద్బోధిం చారు. రోజులు మారాయి. ఎవరికీ తీరిక ఓపికలు లేవు. రోజూ ఒక స్నానానికి కూడా వ్యవధి లేదు. ప్రపంచీకరణ తర్వాత అవకాశమున్న అన్ని వెసులు బాట్లని మనం దినచర్యలోకి అలవాటుగా తెచ్చు కుని, అదే నాగరికత అనుకుంటున్నాం. ఒక నాటి ముతక ఖద్దరు వస్త్రాలు, వాటిని రోజూ ఉతికి ఆరేసి ధరించడం అనాగరికం అయింది. ఇప్పుడు మనం ధరించే చాలా రకాల దుస్తులు ఉతికే పనిలేదు. ఒంటిమీదే పుట్టి ఒంటిమీదే చిరి గిపోతాయ్‌. ఇంటికి ఎలాంటి పరాయి మనిషి వచ్చినా, అతిథి వచ్చినా కాళ్లకి నీళ్లివ్వడం మన ఆచారం. అదిప్పుడు అనాచారం. మరీ పసిపిల్ల లున్న ఇళ్లలోకి ఈ శుభ్రత పాటించకుండా ఎవరూ గడపలోకి అడుగుపెట్టేవారు కాదు. మళ్లీ ఇన్నాళ్లకి ఆచారాలు గుర్తుకొస్తున్నాయ్‌.

స్వచ్ఛభారత్‌ ఒక శుభారంభం. కానీ మన ప్రజల ఉదాసీనత, తరాలుగా ఉన్న అశ్రద్ధ, అవ గాహనా రాహిత్యంతో ఆ ఉద్యమం చేరాల్సిన స్థాయికి చేరలేదు. మన రైలు బోగీలు, మన ప్రయాణికుల బస్సులు, ఆయా స్టేషన్లు ఇన్నాళ్లూ శాని టైజేషన్‌ని చూడలేదు. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అవన్నీ నడుస్తున్నాయి. మనకి చెత్త చెదారం ఇంకా చిమ్మేసినవన్నీ తీసి గోడవతల వెయ్యడం మనకో అలవాటు. మనకి సూర్యుడు రక్షాకరుడు. రోజులో పది నించి పన్నెండు గంటలు రకరకాల కిరణాలను భూమికి పంపుతూ అనేకానేక సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తున్నాడు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడుగా పూజ లందుకుంటున్నాడు. సూర్యభగవానుడు నిజానికి మన జెండా మీద ఉండాలి. మనకి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అలవాటే. కరోనాకి అవగాహనే ప్రస్తుతానికి మందు. ప్రపంచ దేశా లన్నీ ముందు జాగ్రత్తకీ, తర్వాత వైద్యానికి మందుల పరిశోధనతో తలమునకలవుతు న్నాయ్‌. త్వరలోనే పరిష్కారం వస్తుందన్నది నిస్సంశయం.

ప్రధాని మోదీ జాతికి సందేశమిస్తూ, రేపు వచ్చే ఆదివారం ఐచ్ఛికంగా దేశమంతా కర్ఫ్యూ పాటించాలని చెప్పారు. పన్నెండు గంటలు నిరో ధిస్తే వైరస్‌ చనిపోతుందని కూడా చెప్పారు. ఈ చిన్న అభ్యర్థనని అందరం పాటిద్దాం. నిర్మా నుష్యమైన చారిత్రక ప్రదేశాల్లో అరుదైన ఫొటోలు తీద్దామని, సెల్ఫీలు దిగుదామని కూడా బయ టకు రావద్దు. ఇలాంటి ప్రయత్నాలని ఎవరూ హర్షించరు. అది గర్వకారణం కూడా కాదు. దేశభకి,్త సమాజ భక్తి ఉంటే అంతా తలా పది మందికి చెప్పి, నచ్చజెప్పి కరోనా వ్యాప్తిని అరి కట్టేందుకు యథాశక్తి దోహదపడండి. సర్వే జనా సుఖినోభవంతు.


వ్యాసకర్త : శ్రీరమణ
ప్రముఖ కథకుడు

మరిన్ని వార్తలు