ఎవరా శివుడు?

31 Aug, 2019 01:24 IST|Sakshi

అక్షర తూణీరం

మనం మద్రాస్‌ నుంచి విడిపోయినపుడు, సర్దార్‌ పటేల్‌ పుణ్యమా అని చక్కటి మహా నగరం కాపిటల్‌గా అమి రింది. సుఖంగా వడ్డిం చిన విస్తరి ముందు కూచునే అవకాశం దొరి కింది. కాపిటల్‌ నిర్మాణం, కష్టనష్టాలు మనకి తెలియవు. అసెంబ్లీ నించి హైకోర్టు దాకా, లేక్‌ వ్యూ అతిథి గృహం దగ్గర్నించి దవాఖానాల్దాకా దక్కాయ్‌. ఏ ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కినా నైజాం నవాబు వైభవాలన్నింటినీ అందిపుచ్చు కుని అనుభవించాడు. అప్పట్నించీ పెద్దగా పేర్లు రిపేర్లు జోలికి పోకుండా బండి లాగించుకుంటూ వచ్చారు. అయిదారేళ్లనాడు మళ్లీ విడిపోయాం. 

తెలంగాణకి వడ్డించిన విస్తరి యథాతథంగా దక్కింది. రెండుగా విడగొట్టినప్పుడు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిని అన్నదమ్ములు స్వేచ్ఛగా వాడుకోండని వెసులుబాటు కల్పించారు. ఎవరి ‘ఇగో’ వాళ్లకుంటుంది. ఎవరి దర్జా వాళ్లది. కొద్ది నెలల వ్యవధిలోనే ఇద్దరికీ కాడి కలవ లేదు. ఎంతైనా కాపిటల్‌ జన్మహక్కు తెలంగాణ వారిదే గానీ ఆంధ్రోళ్లది కాబోదు కదా. రెండు సీఎం కాన్వా య్‌లు ఒకే రోడ్డు మీద పరుగులు పెట్టడం ఇబ్బందే కదా. అంతేకాదు ఆ సీఎం గారికున్న గుట్టుమట్టు ఆనవాళ్లు ఈ సీఎం గారికి ఉండవు కదా. కొన్నిసార్లు కుండబద్ధలై నానా సందడీ అయింది కూడా. 

అసలే తెలుగుదేశం అంటేనే ఆత్మగౌరవం. చంద్రబాబు ఎక్కడో తీవ్రంగా నొచ్చుకున్నారు. విశ్వవిఖ్యాత మహానగరాన్ని నిర్మిస్తా. కృష్ణా, గోదావరులు సంగమించే తావు ఈ నగరానికి ఒక హద్దుగా ఉంటే అమరలింగేశ్వరుడు రక్షగా ఉంటాడు అని రంగంలోకి దిగారు. మూడు పంటలు పండించే రైతులు తమ సుక్షేత్రాలను ల్యాండ్‌ పూలింగ్‌లో దత్తం చేశారు. అప్పట్లో కేసీఆర్‌ సైతం వాస్తు రీత్యా అమరావతి అద్భు తంగా ఉంటుందని చెప్పారని వినికిడి. అంతా సవ్యంగా సాగుతున్నంత సేపూ జాతక ప్రభగా వాస్తుదశ అనీ ధీమాగా ఉంటారు. ఎప్పుడో దశమారి, ప్రభ చల్లారితే ఇహ వాటి ప్రస్తావనే రాదు. ఇంతమంచి దిక్కులున్న కాపిటల్‌లో ఉండి పాలన సాగిస్తున్న చంద్రబాబు ఇంత ఘోర పరాజయాన్ని ఎందుకు చవిచూశారంటే ఎవరూ జవాబు చెప్పరు.

చంద్రబాబు ఏదో ఒక అద్భుతంతో ప్రపం చంలోనే ఆదర్శంగా నిలవాలని కాపిటల్‌ మహా సంకల్పంతో కరకట్టమీద నిలిచారు. మోదీ గంగ మట్టి గంగాజలం కానుకగా ప్రత్యేక విమానంలో తెచ్చి అమరావతిని త్రివేణిగా మార్చారు. ఆ తర్వాత అమరావతి అడుగు ముందుకు పడ లేదు. అయిదారేళ్లలో కొన్ని అశాశ్వత భవనాలు మాత్రం పైకి లేచాయి. ఇంతలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోయింది. విజ్ఞులు ముందునించీ చెబుతూనే ఉన్నారు. అమరావతి అనువైంది కాదని, ఆ ప్రాంతం పంటలకే తీరైనదిగానీ పరి పాలనా కోటలకి అనువైనది కానేకాదు.  సింగ పూర్‌ నించే వచ్చే ప్రమోటర్స్‌కి ఏ నేలైనా ఒక్కటే కదా. ఇప్పుడు కాపిటల్‌ మీద ఉన్నట్టుండి గందర గోళం నెలకొంది. దాన్ని పూర్తిగా మార్చకపో వచ్చు, వికేంద్రీకరణ జరుగుతుంది. కొన్నిచోట్ల కొన్ని కార్యాలయాలు, కొన్నిచోట్ల కోర్టులు అలా నెలకొంటాయ్‌. ప్రభుత్వ కార్యకలాపాలకి కావ ల్సినవి అమరావతిలోనే ఉంటాయ్‌. అప్పుడు ఎకరాలన్నింటినీ ఏం చేసుకుంటారో తెలియదు. ఈ లోపల ఈ సంకల్పంలో భారీ ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ కుట్ర జరిగిందని కొందరంటున్నారు. 

మా ఊళ్లో గుడి దగ్గర తరచూ ఏకాహాలు, సప్తాహాలు మైకుల్లో జరుగుతూ ఉంటాయ్‌. ఒక వైపు మైకులో పాహిమాం, రక్షమాంలు భక్తి భావంతో వినిపిస్తుంటే, మరోవైపు అత్తా కోడళ్ల చాడీలు, పాత గొడవల మీద తీర్మానాలు చెవుల్లో పడుతుంటాయ్‌. ఈ అమరావతి సందట్లో మొన్న ఎవరో– ‘క్యాపిటల్‌ ఐదు కోట్ల మందికి గాని కేవలం ఒక సామాజిక వర్గానికి కానే కాదు’ అనడం స్పష్టంగా వినిపించింది. ఇంతకీ అసలేం జరిగింది? అసలేం జరుగుతుంది? ఏం జరగ బోతోంది? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మరీ ముఖ్యంగా శివక్షేత్రం అమరావతిలో. ఇంతకీ ఆ శివుడెవరు?!


వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

మరిన్ని వార్తలు