మాటసాయం

9 Dec, 2017 04:30 IST|Sakshi

అక్షర తూణీరం

రాజకీయ నాయకులక్కూడా స్టయిల్‌ షీట్‌ ఉండాలి. కాకలు తీరిన నేత, రాజకీయాల్లో క్షుణ్ణంగా నలిగిన నేత ఇలా పేలడమేమిటి? అది బూమరాంగ్‌ అయింది.

అందుకే అంటారు– కాలు జారితే తీసుకోవచ్చు గాని నోరు జారితే తీసుకోలేమని. గుజరాత్‌లో అసలే టగ్గాపోరుగా ఉంటే మణిశంకర్‌ అయ్యరు మాట తూలాడు. వాక్‌స్థానంలో శనిగాడుంటే మాటలిలాగే జారతాయ్‌! ఒక్కోసారి చిన్న పలుకైనా మంగలంలో పేలపు గింజల్లా పేలి పువ్వులా తేల్తుంది. కొన్ని మాటలు పెనం మీది నీటిబొట్టులా చప్పున ఇగిరిపోతాయ్‌. ఇసకలో పడ్డ చందంగా కొన్ని చుక్కలు ఇంకిపోతాయ్‌. ఇప్పుడీ అయ్యర్‌ మాట మోదీ పాలిట ముత్యపుచిప్పలో పడ్డ మంచి ముత్యమైంది. ఇప్పుడా మాటను మోదీ నిండు మనసుతో స్వీకరించారు. ఆ ముత్యాన్ని పూర్తిగా సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అనుకోకుండా వరంలా ఈ తరుణంలో లభించిన ముత్యానికి నగిషీలు చెక్కుతున్నారు. ఇప్పుడు చూడండి, అధికార పక్షానికి ఒక్కసారి బరువు దిగింది. అభివృద్ధి పనులు ఏకరువు పెట్టాల్సిన పనిలేదు. గుజరాత్‌ యువతకు కొత్త ఆశలు పెట్టి మనసు మళ్లించాల్సిన అగత్యం లేదు. ఎజెండాలో లేనివి కూడా సభల్లో వల్లించి బెల్లించాల్సిన కంఠశోష లేదు. ఆ జారిన ముక్కని పల్లకీలో ఊరేగించడమే తక్షణ కర్తవ్యం. ప్రస్తుతం ‘నీచ్‌’శబ్దం మీద క్యాంపైన్‌ ఉధృతంగా నడుస్తోంది. ‘‘ఔను, నేను నీచుణ్ణే’’అనే మకుటం మీద ఓ శతకం రచించి జనం మీదకి వదుల్తారు. ‘‘జనహితం, దేశక్షేమం కోరడంలో నేనెంతకైనా దిగజారతా! ఎంత నీచానికైనా పాల్పడతా. నల్ల ధనవంతులు, అవినీతిపరులు, పన్ను ఎగవేతదారులు, దేశద్రోహులు, ఉగ్రవాదులు నన్ను నీచుడన్నా సరే! వారిని వదిలి పెట్టను’’అంటూ దానికి బహుముఖాలుగా పదును పెడతారు.

రాజకీయ నాయకులక్కూడా స్టయిల్‌ షీట్‌ ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోవడానికి టాబ్లెట్లు కావాలి. కాకలు తీరిన నేత, రాజకీయాల్లో క్షుణ్ణంగా నలిగిన నేత ఇలా పేలడమేమిటి? బహుశా నెహ్రూ కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతుందని కౌంటర్‌ ధాటిగా ఇచ్చి ఉండాలి. అది బూమరాంగ్‌ అయింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం పోయింది. అంటే కూకటివేళ్లతో పార్టీ నుంచి పెకలించినట్టు. ఇంతకు ముందు కూడా అయ్యర్‌ ‘చాయ్‌ వాలా’ అని మోదీకి సాయపడ్డారు.

ఎన్నికల వేడి తీవ్రంగా ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఊరికే చీకట్లో రాళ్లేసినట్లు విసరకూడదు. ఇప్పుడీ రెండక్షరాల మాటని ఓట్లలోకి మారిస్తే, హీనపక్షం పది లక్షలంటున్నారు. మణిశంకర్‌ మాటని చెరిపెయ్యడానికి క్షమాపణలతో సహా అన్ని చర్యలు కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంది. కానీ అవతలివైపు బాగా రాజు కుంటోంది. ఆ మాత్రం దొరికితే వదుల్తారా! మా ఊరి రచ్చబండ మీద రెండ్రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. ‘‘మంచి సమయంలో ఇంతటి మాట సాయం చేసిన అయ్యర్‌ని ఊరికే వదలరు. కొంచెం ఆగి బీజేపీలోకి లాక్కుంటారు’’ అనేది ఒక వెర్షన్‌.


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు